• facebook
  • whatsapp
  • telegram

కోర్సులు.. కొలువులపై సలహాలే వృత్తిగా..!

ఎడ్యుకేషన్‌/ కెరియర్‌ కౌన్సెలర్‌గా రాణించాలంటే!

జాతీయ నూతన విద్యావిధానం - 2020 పూర్తిగా అమలైతే వివిధ విద్యాసంస్థల్లో ఎడ్యుకేషన్‌/ కెరియర్‌ కౌన్సెలర్‌ల అవసరం బాగా పెరుగుతుంది. ఇప్పటికే చాలా ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు కౌన్సెలర్‌లను నియమించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ రంగంలో కొంత అనుభవం గడించాక సొంతంగా ఎడ్యుకేషన్‌/ కెరియర్‌ కౌన్సెలింగ్‌ సంస్థను ప్రారంభించి మెరుగైన కెరియర్‌ను నిర్మించుకోవచ్చు. కౌన్సెలింగ్‌ను ఒక అభిరుచిగా ప్రారంభించి ప్రవృత్తిగా, వృత్తిగా మార్చుకోవచ్చు. లాభాపేక్షతో కాకుండా సేవా దృక్పథంతో చేస్తే కౌన్సెలింగ్‌లో సత్ఫలితాలు వస్తాయి! 

‘భవిష్యత్తులో ఏ కోర్సు చదవాలో తెలియట్లేదు’  

‘ఫలానా కోర్సు చదువుతున్నాను. ఈ చదువుతో ఎలాంటి ఉద్యోగాలను పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నాను’

‘డిగ్రీలో అన్ని సబ్జెక్ట్లులూ ఇష్టంగా ఉన్నాయి. ఏ సబ్జెక్టులో పీజీ చేయాలో అర్థం కావట్లేదు. ఏ కోర్సు చేస్తే ఎక్కువ ఉపాధి అవకాశాలుంటాయి?’

‘చేరి రెండేళ్ళయింది. కానీ ఈ కోర్సును ఇష్టంగా చదవలేకపోతున్నాను. నాకిప్పుడు వేరే కోర్సులోకి మారే అవకాశం ఉందా?’ 

‘ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేస్తున్నా. పని అనుభవం కూడా ఉంది. నా నైపుణ్యాలూ, అనుభవాలను దృష్టిలో పెట్టుకొని నాకు ఉపయోగపడే కొత్త కెరియర్‌ తెలుసుకోవాలనుకొంటున్నా’ 

‘చాలా యూనివర్సిటీల్లో పీజీ ప్రవేశ పరీక్షలు రాశా. ఎక్కడా సీటు రాలేదు. నా విద్యాసంవత్సరం వృథా కాకుండా ఉండాలంటే..?’

‘మా అబ్బాయి ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇంజినీరింగ్‌ పుస్తకాలు తప్ప వేరే అన్ని పుస్తకాలూ ఇష్టంగా చదువుతుంటాడు. తన భవిష్యత్తు గురించి ఆందోళనగా ఉంది’

‘ఫ్యాషన్‌ టెక్నాలజీ అంటే ఇష్టం. కానీ ఇంట్లో వాళ్లు మెడిసిన్‌ చదవమంటున్నారు. నాకేం చేయాలో తెలియడం లేదు’ 

‘దూరవిద్యలో డిగ్రీ చేశాను. ప్రభుత్వ ఉద్యోగాలకు నేను అర్హుడినేనా?’  

పైన చెప్పిన వాటిలో కనీసం ఏదో ఒక సమస్యతో చాలామంది తల్లిదండ్రులు, విద్యార్థులూ సతమతమవుతుంటారు. భవిష్యత్‌ విద్యా/వృత్తి ప్రణాళికల పట్ల ఆందోళనకు గురవుతూ కెరియర్‌ సందేహాలకు సమాధానాలు చెప్పి, సరైన సలహాలు ఇచ్చేవారి గురించి వెతుకుతూ ఉంటారు. ఇలాంటి సందేహాలను నివృత్తి చేసే విభాగాలు మనదేశంలోని విద్యాసంస్థల్లో దాదాపుగా లేవనే చెప్పవచ్చు. ఒకవేళ నామమాత్రంగా ఉన్నప్పటికీ వాటి పనితీరు అంత ఆశాజనకంగా లేదు.  

ప్రముఖ ప్రొఫెషనల్‌ కళాశాలల్లో ఉన్న చాలా ప్లేస్‌మెంట్‌ విభాగాలు కూడా నియామక సంస్థలకూ, విద్యాసంస్థలకూ వారధిగా పనిచేస్తూ ప్లేస్‌మెంట్‌ శాతాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయే కానీ, కెరియర్‌ గైడెన్స్‌ను పట్టించుకొంటున్న దాఖలాలు అంతగా ఉండట్లేదు. మార్కెట్‌లో కొన్ని ప్రత్యేక ప్రైవేటు కౌన్సెలింగ్‌ సంస్థలున్నప్పటికీ ఫీజు ఎక్కువగా ఉన్నందున అవి అందరికీ అందుబాటులో లేవు. అలాంటి సంస్థలు అందించే కౌన్సెలింగ్‌ సేవల పరిధి కూడా తక్కువగా ఉంది. చాలా విద్యాసంస్థలకు పూర్తి స్థాయి కౌన్సెలింగ్‌ సెంటర్‌ ప్రారంభించాలనే ఉద్దేశాలు ఉన్నా, కౌన్సెలింగ్‌లో విషయపరిజ్ఞానం ఉన్న నిపుణుల కొరత ఎక్కువగా ఉంది. ఈ నిపుణులే... ఎడ్యుకేషన్‌ కౌన్సెలర్స్‌ / కెరియర్‌ కౌన్సెలర్స్‌! 

విద్యాపరంగా...

ప్రధానంగా ఎడ్యుకేషనల్‌ కౌన్సెలింగ్‌ విద్యార్ధులకు విద్యా ప్రణాళికలు, కెరియర్‌ ఆకాంక్షలు, కోర్సులు, స్పెషలైజేషన్‌ల ఎంపిక లాంటి అంశాల్లో మార్గదర్శకత్వం అందిస్తుంది. వారి వారి అభిరుచులు, ప్రాధాన్యాల ప్రకారం కళాశాలలు, విశ్వవిద్యాలయాల్ని ఎంపిక చేసుకోవడంలో సహాయపడుతుంది. కోర్సులను ఎంచుకోవడంలో, చదువులో వెనుకబడుతున్నప్పుడు ప్రత్యామ్నాయ కోర్సులపై సలహాలు అందించడంలో ఎడ్యుకేషన్‌ కౌన్సెలర్‌లు కీలక పాత్ర పోషిస్తారు. వీరు ప్రాథమిక విద్యాసంస్థలు మొదలుకొని యూనివర్సిటీ స్థాయి వరకు వివిధరకాల బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ కౌన్సెలర్ల బాధ్యతల్లో కౌన్సెలింగ్‌ రికార్డుల నిర్వహణ చాలా ముఖ్యమైంది. విద్యార్ధుల వ్యక్తిగత ఎదుగుదల, విద్యాభివృద్ధి రెండింటిని సమన్వయం చేస్తూ గ్రేడ్‌ల గురించీ, భవిష్యత్తు గురించీ ఉన్న భయాలూ అపోహలను తొలగిస్తూ, భవిష్యత్తులో వారు చదవబోయే కోర్సుల గురించీ అవగాహన కల్పిస్తారు. ఇవే కాకుండా- తరగతి గది ఒత్తిళ్ళు, మానసిక ఆందోళనలను అధిగమించడంలోనూ విద్యార్థులకు సహాయపడతారు.

కెరియర్‌ పరంగా...

కెరియర్‌ కౌన్సెలింగ్‌ను కెరియర్‌ గైడెన్స్‌ అని కూడా అంటారు. ఇది కెరియర్‌ను ఎంచుకోవడం, మార్చడం, వదిలివేయడంలో సహాయపడుతుంది. కెరియర్‌ కౌన్సెలింగ్‌ అనేది వృత్తి, విద్య, జీవిత నిర్ణయాలను తీసుకోవడానికీ, ఉద్యోగ విధులను తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి సహాయపడే ప్రక్రియ. ఒక వ్యక్తి అభిరుచులు, సామర్థ్యాలు, విలువలు, వ్యక్తిత్వం, నేపథ్యం, పరిస్థితులు కెరియర్‌ను ప్రభావితం చేస్తాయి. చదువు పూర్తయ్యాక ఉద్యోగాలు వెతుక్కొనే క్రమంలో విద్యార్థులు ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటారు. ఫలానా ఉద్యోగం పొందాలంటే, ఏ పరీక్షలు రాయాలి, ఎలాంటి నైపుణ్యాలు కావాలి అనే అంశాల్లో సందేహాలుంటాయి. కెరియర్‌ కౌన్సెలర్‌ ముఖ్యమైన కర్తవ్యం... విద్యార్థులు నిర్ణయాలు తీసుకోవడంలో సహాయం చేయడమే కాకుండా, భవిష్యత్తులో కెరియర్‌ నిర్ణయాలను తీసుకోవడానికి అవసరమైన తోడ్పాటు అందించడం. విద్యార్హతలు, నైపుణ్యాలు, ఉద్యోగ అనుభవం, ఆసక్తులు, బలాలు, బలహీనతలను తెలుసుకొని, జీవితంలో ఎలా స్థిరపడాలని కోరుకుంటున్నారో గుర్తించి దానికి అనుగుణమైన కెరియర్‌ గురించి సలహాలు అందిస్తారు. అర్హతలకు తగిన ఉద్యోగాల సమాచారం, ఆ ఉద్యోగానికి సంబంధించిన అన్ని అంశాల్లో సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. 

ఏ లక్షణాలు ఉండాలి?

ఉద్దేశపూర్వక సంభాషణ ద్వారా వ్యక్తిగత సమస్యలను తెలుసుకొని, పరిష్కారాలను సూచించడానికి సహాయం చేసే ప్రక్రియే కౌన్సెలింగ్‌. సమస్యలను ఎదుర్కొనే క్రమంలో ఉన్న కష్టమైన అంశాలను చర్చించి, మెరుగైన ప్రణాళికని సూచించి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో కౌన్సెలింగ్‌ దోహదపడుతుంది. 

కౌన్సెలర్లకు ఉండవలసిన లక్షణాల్లో- నిష్పాక్షికత, సహానుభూతి, విషయాన్ని పూర్తిగా వినగలిగే ఓపిక, భావప్రకటన సామర్థ్యం, మానవ సంబంధాల పట్ల అవగాహన ప్రధానమైనవి. 

విద్యార్థి/ ఉద్యోగార్థి మెరుగైన సలహా కోసం సంప్రదించినపుడు కౌన్సెలర్‌ వారి సమస్యని పూర్తిగా విని, విశ్లేషించి, వివిధ రకాల పరిష్కారమార్గాల్ని సూచించాలి. నిర్ణయాన్ని మాత్రం వారికే వదిలేయాలి. 

కొన్నిసార్లు కెరియర్‌ కౌన్సెలర్లు తమ క్లయింట్లకు వివిధ పరీక్షలు పెట్టి వారి తెలివితేటలూ, అభిరుచి, వ్యక్తిత్వాల గురించి ఒక అవగాహనకొస్తారు. 

ఏ విద్యార్హతలు అవసరం? 

పాఠశాల స్థాయిలో ఎడ్యుకేషన్‌ కౌన్సెలర్‌లు కనీసం డిగ్రీ చదివి ఉండాలి. డిగ్రీలో ఒక సబ్జెక్టుగా సైకాలజీని చదివి ఉండటం లేదా డిగ్రీతో పాటు బీఈడీ చేయడం అదనపు అర్హత. డిగ్రీతో పాటు సైకాలజికల్‌ కౌన్సెలింగ్‌లో డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సులు చేయడం వల్ల మెలకువలు నేర్చుకొనే అవకాశం ఉంది. 

కళాశాల, విశ్వవిద్యాలయాల స్థాయిలో పనిచేసే ఎడ్యుకేషన్‌/ కెరియర్‌ కౌన్సెలర్‌లు ఏదైనా పీజీ డిగ్రీతో పాటు, పైన పేర్కొన్న కోర్సులు చేయడం ప్రయోజనకరం. 

కనీసం రెండు రకాల సబ్జెక్టుల్లో డిగ్రీ/ డిప్లొమాలతో పాటు ప్రభుత్వ/ ప్రైవేటు సంస్థల్లో కొంత పని అనుభవం ఉన్నట్లయితే వారి ఆలోచనా పరిధి విస్తృతమవుతుంది. 

ఇవే కాకుండా ఎడ్యుకేషన్‌ / కెరియర్‌ కౌన్సెలింగ్‌ల్లో ప్రత్యేకమైన డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సులు చేస్తే ప్రొఫెషనల్‌ కౌన్సెలర్‌గా గుర్తింపు లభిస్తుంది. 

కొన్ని సంస్థలు నిర్వహించే ప్రత్యేకమైన కౌన్సెలింగ్‌ కార్యశాలల్లో పాల్గొనవచ్చు. 

కొన్ని యూనివర్సిటీలు కౌన్సెలింగ్‌లో పీజీ డిప్లొమా/ డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సులను దూరవిద్య ద్వారా అందిస్తున్నాయి. 

‘కోర్స్‌ఎరా’, ‘యుడెమి’, ‘స్వయం’లలో ఆన్‌లైన్‌ కోర్సులు కూడా చేయవచ్చు.  

సీనియర్‌ కౌన్సెలర్‌/ కౌన్సెలింగ్‌ సంస్థలో కొంతకాలం శిక్షణ పొందితే మంచి అనుభవాన్ని గడించవచ్చు.

వీటితో పాటు...

డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికెట్‌ కోర్సులతో పాటు వార్తాపత్రికలను ప్రతిరోజూ చదవడం, వివిధ రకాల ఉద్యోగ ప్రకటనలూ, వాటికి సంబంధించిన విద్యార్హతలను గమనించడం, నిపుణులతో మాట్లాడటం, వ్యాపార పత్రికలను చదవడం, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల నియామక పద్దతులను నిరంతరం అనుసరిస్తుండటం అవసరం. విదేశీ యూనివర్సిటీల ప్రవేశ పద్ధతులు, అక్కడి ఉద్యోగ నియామక పద్దతుల గురించీ తెలుసుకోవాలి. ఉన్నతవిద్యలో సంస్కరణలు, యూజీసీ, ఏఐసీటీఈ, ఎసీఐ, ఎన్‌సీటీఈ, బార్‌ కౌన్సిల్‌ లాంటి రెగ్యులేటరీ సంస్థలు, వివిధ ఎడ్యుకేషన్‌ పాలసీలపై అవగాహన పెంచుకోవాలి. 

గేట్, క్యాట్, జేఈఈ, నీట్, నిమ్‌సెట్, సీయూ సెట్, ఎంసెట్, ఐసెట్, ఎడ్‌సెట్‌ లాంటి ప్రవేశ పరీక్షల గురించి పూర్తి విషయాలు తెలిసివుండాలి. ప్రభుత్వ/ ప్రైవేటు/ డీమ్డ్‌ టు బి/ ఓపెన్‌ యూనివర్సిటీలూ, దూరవిద్య, ఆన్‌లైన్‌ విద్యల గురించీ, గ్రేడింగ్, క్రెడిట్‌ల గురించీ తెలుసుకొనివుంటే కౌన్సెలింగ్‌లో రాణించటం సాధ్యమవుతుంది. విద్యార్థులను నిరుత్సాహపరచకుండా, ఓపిగ్గా వారి సందేహాలను వింటూ, వాటిని నివృత్తి చేస్తూ మెరుగైన సలహాలు, సూచనలు అందచేయాలి. 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ 2022లో టాప్‌ ఉద్యోగాలు ఇవే!

‣ కార్పొరేట్‌ ఉద్యోగాలకు కొన్ని నైపుణ్యాలు

‣ మెరుగైన స్కోరుకు మేలైన వ్యూహం!

‣ నిరాశ పడొద్దు.. వెనకడుగు అసలేవద్దు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 25-01-2022


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌