• facebook
  • twitter
  • whatsapp
  • telegram

‘స్మార్ట్‌’గానూ చదవొచ్చు!

పరీక్షల సన్నద్ధతకు సూచనలు


కష్టపడి జీవితంలో రాణించాలనే ఉద్దేశంతో కొందరు విద్యార్థులు అర్ధరాత్రి వరకూ చదువుతుంటారు. మళ్లీ ఉదయాన్నే మేల్కొంటున్నారు కూడా. ఇలా గంటలకొద్దీ చదివినా కొందరు ఆశించిన ఫలితాన్ని మాత్రం పొందలేకపోతుంటారు. ఏం చేయాలో తెలియక మధనపడుతుంటారు.  


నవ్య సమయాన్ని ఏమాత్రం వృథా చేయదు. ఎప్పుడూ చూసినా కష్టపడి చదువుతూనే ఉంటుంది. అయినాసరే అనుకున్న మార్కులు సంపాదించలేకపోతోంది. శ్రావ్య చదువుకుంటూనే ట్యూషన్లూ చెబుతుంది. తన ఖర్చులకు డబ్బు సంపాదించుకుంటూనే మంచి మార్కులనూ సాధిస్తోంది. దానికి కారణం ‘స్మార్ట్‌’గా చదవడమేనంటోంది. ఇంతకూ తనేం చేస్తోందో మనమూ తెలుసుకుందామా..


‣ విద్యార్థులందరి చదివే విధానం ఒకేవిధంగా ఉండదు. ముందుగా మీరు చదివే పద్ధతి గురించి ఒకసారి ఆలోచించాలి. అవసరమైన మార్పులూ, చేర్పులూ చేసుకోవాలి. పాఠ్యాంశాన్ని అర్థంచేసుకుని అవగాహన పెంచుకోవాలి. చదివేటప్పుడే నోట్‌బుక్‌ను దగ్గర పెట్టుకుని ముఖ్యాంశాలను రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇక్కడో విషయాన్ని గుర్తుంచుకోవాలి.. స్మార్ట్‌గా చదవడమంటే ఎక్కువ గంటలపాటు చదవడం కాదు. ముఖ్యాంశాలపై దృష్టి కేంద్రీకరించి చదవటం. 


సాధారణంగా మనం చదివే విధానం సరైందా కాదా అనేదాని గురించి ఎప్పుడూ ఆలోచించం. పాత పద్ధతుల్లోనే అలా చదువుకుంటూ వెళ్లిపోతుంటాం. చదివిన అంశాలనే మళ్లీ మళ్లీ చదువుతుంటాం. అలాగే రోజంతా ఒకే సబ్జెక్టును చదువుతుంటాం. ఈ రెండు పద్ధతులూ సరికావు.  


చదివిన తర్వాత పాఠంలోని ముఖ్యాంశాలను ఒకసారి మననం చేసుకోవాలి. క్విజ్‌ పెట్టుకుని రకరకాలుగా ప్రశ్నలు వేసుకుని వాటికి సమాధానాలు చెప్పుకుంటూ ఉండాలి. ఈ రెండు పనులూ చేయడం వల్ల త్వరగా మరిచిపోయే అవకాశం ఉండదు. అవగాహన పెరగడంతోపాటు చదివింది ఎక్కువకాలం గుర్తుంటుంది కూడా. 


ఉదాహరణకు మేథమెటిక్స్‌ సబ్జెక్టునే తీసుకుంటే.. దాంట్లో ఒక చాప్టర్‌ను చదివిన తర్వాత దానికి సంబంధించిన లెక్కలనే చేసుకుంటూ కూర్చోకూడదు. ఒకసారి చదవడానికి కూర్చున్నప్పుడు ఒకే ఛాప్టర్‌ కాకుండా వివిధ ఛాప్టర్లలోని సమస్యలను పరిష్కరించాలి. 


దీన్ని మరో విధంగానూ ప్రయత్నించొచ్చు. పాత ప్రశ్నపత్రాల్లోని లెక్కలు చేయొచ్చు. వీటిల్లో వివిధ ఛాప్టర్లకు సంబంధించిన లెక్కలు ఉంటాయి. వీటిని సాధన చేయడం వల్ల ఒకేసారి వివిధ అంశాలపై అవగాహన పెరుగుతుంది. 


కొంతమంది ఒక సబ్జెక్టుకు వరుసగా రెండు, మూడు రోజులు కేటాయిస్తారు. ఇలా ఒకే సబ్జెక్టు చదవడం విసుగనిపించవచ్చు. దీంతో వాయిదా వేసే అవకాశమూ లేకపోలేదు. అలాకాకుండా రెండు సబ్జెక్టులు ఎంచుకుంటే ఒకదాని మీద ఏకాగ్రత కుదరనప్పుడు మరోదాన్ని చదవడం   మొదలుపెట్టొచ్చు. 


కాస్త కష్టంగా అనిపించిన సబ్జెక్టుకు కొంతమంది విద్యార్థులు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వరు. కావాల్సినంత సమయాన్నీ కేటాయించరు. కఠినంగా అనిపించిన దాన్ని ఇలా వాయిదా వేస్తూ వెళ్లడం వల్ల పరీక్షల సమయానికి ఒత్తిడి పెరుగుతుంది. 


ఒక సబ్జెక్టులోని పాఠ్యాంశాన్ని చదివిన తర్వాత మర్నాడు దాన్ని పునశ్చరణ చేసుకోవాలి. రెండోసారి వెంటనే కాకుండా రెండు, మూడు రోజుల తర్వాత చేయాలి. మూడోసారి మాత్రం కనీసం వారం రోజుల వ్యవధి ఇవ్వాలి. చదివిన దాన్ని వెంటనే సమీక్షించుకుంటే సాధారణంగా గుర్తుంటుంది. ఇలా పునశ్చరణ వ్యవధిని క్రమంగా పెంచుకుంటూ వెళ్తే విషయం మెరుగ్గా అర్థమవటంతో పాటు ఎక్కువ కాలం గుర్తుంటుంది.  


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రభుత్వ బ్యాంకుల్లో 4,451 పీవో, ఎస్‌వో కొలువులు

‣ కెరియర్‌ కౌన్సెలింగ్‌కు ఉచిత సలహాలివిగో..

‣ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీలో 342 ఉద్యోగాలు

‣ కోర్సు ఎంపికకు.. కౌన్సెలింగ్‌ ముఖ్యం

‣ భాషలపై పట్టు.. అవకాశాలు మెండు

‣ అగ్నివీరులకు వాయుసేన ఆహ్వానం

Posted Date : 02-08-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌