• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పోటీలో ఉండాలి ఇలా..

* కెరియర్‌ సక్సెస్‌కు సూచనలు


 

కాలేజీలో అయినా, ఉద్యోగంలో అయినా.. ప్రపంచం మొత్తం పోటీనే! ఎంత పరుగెడుతున్నా మనకంటే ముందుండాలని ప్రయత్నించే వారుంటారు. ముఖ్యంగా బృందంగా పనిచేసేటప్పుడైతే ఇది మరీ ఎక్కువ. అయితే ఇలాంటప్పుడే ఆ పోటీ ఆరోగ్యకరంగా ఉండటం ముఖ్యం. పోటీ ఎప్పుడూ మనల్ని మరింత ప్రోత్సహించేలా ఉండాలే తప్ప నిరాశకు లోనయ్యేలా, ఈర్ష్యాద్వేషాలకు గురిచేసేలా ఉండకూడదు. ఈ విషయంలో అవతలివారు ఎలా ఉంటున్నారనేది మనం నిర్ణయించలేకపోయినా.. మన ఆలోచనలను మన అదుపులో ఉంచుకోగలం. మరి ఈ ఆరోగ్యకరమైన పోటీ ఎలా?

 ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒకే అంశంపై అందరూ ఒకేలా ప్రదర్శన చూపకపోవచ్చు. మనం ఒక విషయంలో ఉత్తమంగా ఉన్నట్లే ఎదుటివారు కూడా వేరే అంశాల్లో అలా ఉంటారనే విషయాన్ని అంగీకరించాలి. అన్నింటిలోనూ మనమే ముందుండాలని భావించడం అధిక ఒత్తిడికి గురిచేస్తుంది. అలా జరగదని తెలిసినప్పుడు ఎదుటివారి మీద కోపాన్ని రాజేస్తుంది. అందుకే మన బలాలను ఉపయోగించుకుంటూనే బలహీనతలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. 

 విజయం ఎవరిదైనా సంతోషించగలగాలి. ఎదుటివారి విజయాల పట్ల బాధపడటం, పోల్చుకుని కుంగిపోవడం సరైన పద్ధతి కాదు. ఇది ఆరోగ్యకరమైన పోటీకి దోహదం చేయదు. ఒకరి విజయాలను మరొకరు సెలబ్రేట్‌ చేసుకోవడం, అదే సమయంలో అందరూ విజయవంతమయ్యేలా ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం చాలా ముఖ్యం.  

 పోటీలో ఎదుటివారి గురించి అధికంగా ఆలోచిస్తే మన గురించి ఆలోచించే అవకాశాన్ని కోల్పోతాం. ‘ఎలా అయినా నేనే గెలవాలి’ అనే తాపత్రయం సరైన దిశగా ప్రయాణానికి సంకేతం కాదు. పోటీలో ఎప్పుడూ ముందుండటం మంచిదే. కానీ గెలుపు ఓటములకు అతీతంగా పోటీని ఆస్వాదించడం అవసరం. గమ్యం కంటే దాన్ని చేరుకునే ప్రయాణం ముఖ్యమనే విషయాన్ని గుర్తించాలి. అధికంగా పోల్చుకోవడం అంత మంచిది కాదు. 

 ఆరోగ్యకరమైన పోటీ ఎప్పుడూ మనకు ప్రేరణ ఇవ్వడమే కాదు, స్థాయికి మించి కష్టపడేలా స్ఫూర్తినివ్వాలి. వెనకపడినా విశ్వాసం కోల్పోకుండా ఉండటం, తిరిగి పూర్తిస్థాయిలో ప్రయత్నించడం అలవాటు చేయాలి. పాజిటివ్‌గా ఉండటం, ఆలోచించడం  నేర్పించాలి.

 ఎప్పుడూ ‘మీకు మీరే పోటీ’ అనే విషయాన్ని  గమనించాలి. రోజురోజుకూ మనలో కనిపించే ఉన్నతి మీద దృష్టి పెట్టాలి. సొంతంగా లక్ష్యాలు నిర్దేశించుకోవడం, వాటిని అందుకోవడానికి ప్రయత్నించడం ముఖ్యం. సీరియస్‌గా కష్టపడుతూనే సరదాగా తీసుకోవడం సాధన చేస్తే.. పోటీ ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తుంది!


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఇంటర్‌తో ఉద్యోగాలెన్నో!

‣ ప్రాంప్ట్‌ ఇంజినీర్‌.. కోట్లలో ప్యాకేజీ!

‣ 'క్యాట్‌ 2023' సన్నద్ధత ఇలా..

‣ 'పది' మార్కులతో ప్రభుత్వ ఉద్యోగం

‣ తండ్రి కష్టం.. తనయ విజయం

‣ ఇంటర్‌తో కేంద్ర కొలువులు

‣ 'నాసా' మెచ్చిన కుర్రాడు!

Posted Date : 11-08-2023 .

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

విద్యా ఉద్యోగ సమాచారం