• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పేదింటి బిడ్డలు.. ‘ఎస్సై’లుగా కొలువు దీరారు!

మనీష, తారకల సక్సెస్‌ స్టోరీ


కష్టాలు, కన్నీళ్లు.. ఆకలి, అవమానాలతో రాటుతేలిన లక్ష్యాలు వీళ్లవి. అమ్మానాన్నలు దినసరి కూలీలుగా.. పారిశుద్ధ్య కార్మికులుగా కష్టపడుతుంటే వాళ్లని ఆ కష్టాల నుంచి బయటపడేయాలని కసితో చదువుకున్నారు. సివిల్‌ ఎస్సై పోస్టులు సాధించి, ఎంతోమంది ఆడపిల్లలకు స్ఫూర్తిగా నిలిచారు ఖమ్మం జిల్లాకు చెందిన మిడిదొడ్డి మనీష, మహబూబ్‌నగర్‌ జిల్లాకి చెందిన బందిగొల్ల తారక. వారితో వసుంధర మాట్లాడింది.. 


అమ్మ పాచిపని చేసేది..

మాది నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని అమ్మనబోలు గ్రామం. అక్కడ బతుకుదెరువు లేక 23 ఏళ్ల క్రితం ఖమ్మానికి వలస వచ్చాం. నాన్న రాజయ్య హమాలి, అమ్మ ఆండాళు ఫంక్షన్‌ హాళ్లలో, ఇళ్లలో పాచి పనిచేస్తుంది. నాకో తమ్ముడు. ఎండైనా, వానైనా ఒక్క గదిలోనే మా కుటుంబమంతా సర్దుకుంటాం. నాన్న హమాలి పని చేసి వచ్చి ఒళ్లంతా నొప్పులతో బాధపడేవాడు. అమ్మ వేరేవాళ్ల ఇంట్లో పనిచేయడానికి వెళితే మమ్మల్ని అందరూ హేళనగా చూసేవారు. చాలా బాధనిపించేది. బాగా చదువుకొని.. మంచి ఉద్యోగం సాధించి అమ్మానాన్నలతో ఈ పనులు మాన్పించాలనుకునేదాన్ని. పదో తరగతి వరకూ ఖమ్మంలోనే చదువుకున్నా. ఇంటర్‌లో టీఎస్‌ఆర్‌జేసీ రావడంతో వరంగల్‌లో చదివా. డిగ్రీ హైదరాబాద్‌లోని కోఠిలో చదివా. పీజీ నిజాం కాలేజీలో చదువుతున్నప్పుడే.. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌కి దరఖాస్తు చేసుకున్నా. భద్రాద్రి జోన్‌లో సివిల్‌ ఎస్సై 50 పోస్టులు మాత్రమే ఉండటంతో నాకు వస్తుందో రాదో అని భయపడ్డా. మా కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగులు లేరు. నాకైనా వస్తే హోదాతోపాటు నా కుటుంబానికి సమాజంలో మంచి గౌరవం దక్కుతుందని అనుకున్నా. అందుకోసమే కసిగా చదివా. కోచింగ్‌ సమయంలో ఏ రోజు చెప్పిన సబ్జెక్ట్‌ను ఆరోజే రాత్రి రెండైనా సరే పూర్తిచేసి పడుకొనేదాన్ని. గ్రాండ్‌ టెస్ట్‌లు, వారాంతపు టెస్టులు, క్రమం తప్పకుండా రాసేదాన్ని. అందులో వచ్చిన మార్కుల ఆధారంగా, నేను ఏ సబ్జెక్ట్‌లో బలహీనంగా ఉన్నానో దానిపై దృష్టి సారించేదాన్ని. మొదటి ప్రయత్నంలోనే ఓపెన్‌ కేటగిరీలో ఉద్యోగం సాధించినందుకు సంతోషంగా ఉంది. డిగ్రీ అయ్యాక అందరి ఆడపిల్లల్లాగే నాకూ పెళ్లి చేసుకోమని ఇంట్లో ఒత్తిడి చేశారు. కానీ ఏదైనా సాధించిన తర్వాతే చేసుకుంటానని చెప్పా. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి చేరి, ప్రజలకు చేతనైనంత సేవ చేయాలన్న లక్ష్యంతో మరింత ఉత్సాహంగా కష్టపడతాను.


నాన్న పారిశుద్ధ్య కార్మికుడు..

మాది మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అడ్డాకుల మండలంలోని బలీదుపల్లి గ్రామం. అమ్మ వెంకటేశ్వరమ్మ రోజుకూలి. నాన్న వెంకటేష్‌ గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడు. మా సొంతూరులో బతుకుదెరువు లేక 18 సంవత్సరాల క్రితం మహబూబ్‌నగర్‌ వచ్చాం. అమ్మానాన్నలు కష్టపడి నన్ను చదివించేవారు. నాకో అన్నయ్య. చిన్నప్పట్నుంచి అమ్మానాన్నల కష్టాలను చూస్తూ పెరగడంతో ఎలాగైనా మంచి ఉద్యోగం సాధించాలనే తపనతో ఉండేదాన్ని. డిగ్రీ అయ్యాక చదివించింది చాల్లే పెళ్లిచేయండని చాలామంది మా అమ్మానాన్నలకు చెప్పేవాళ్లు. కొవిడ్‌ సమయంలో ఆ ఒత్తిడి మరీ ఎక్కువయ్యింది. కానీ ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పెళ్లిని వాయిదా వేశా. అప్పుడే పోలీస్‌ ఉద్యోగాలు పడటంతో.. కోచింగ్‌ సెంటర్‌లో చేరా. అక్కడ గ్రాండ్‌ టెస్టులు రాస్తున్నపుడు మొదట్లో మార్కులు చాలా తక్కువవచ్చేవి. దానికితోడు జోగులాంబ జోన్‌లో సివిల్‌ ఎస్సై పోస్టులు తక్కువ ఉన్నాయి. ‘ఈ మార్కులకి మొదటి ప్రయత్నంలో నీకేం వస్తుందిలే’ అంటూ చాలామంది నిరాశపరిచేవారు. అలాంటి పరిస్థితుల్లో నేనూ నావల్ల కాదేమో అనుకొనేదాన్ని. అప్పుడు అమ్మ ‘ఎవరి మాటలు పట్టించుకోవద్దు. నీ ప్రయత్నం నువ్వు చేయమని’ ధైర్యం చెప్పేది. అమ్మానాన్నలు ఇచ్చిన ప్రోత్సాహంతో కసిగా చదివి, సాధించా. జోగులాంబ జోన్‌లో సివిల్‌ ఎస్సై సాధించడంతో ఇప్పుడు అమ్మానాన్నలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇన్ని రోజులూ వాళ్లు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని సంతోషంగా ఉన్నా.


- బుడత చంద్రశేఖర్‌, ఈనాడు జర్నలిజం స్కూల్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఉన్నత విద్య.. ఉద్యోగానికి ‘గేట్‌’

‣ ఉద్యోగార్థులూ.. కొత్త పరీక్షలకు సిద్ధమేనా!

‣ ఇంటర్‌తో ఉద్యోగాలెన్నో!

‣ పోటీలో ఉండాలి ఇలా..

‣ ప్రాంప్ట్‌ ఇంజినీర్‌.. కోట్లలో ప్యాకేజీ!

‣ బీటెక్‌తో హెచ్‌ఏఎల్‌లో ఉద్యోగాలు

‣ 'క్యాట్‌ 2023' సన్నద్ధత ఇలా..

Posted Date : 16-08-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.