• facebook
  • whatsapp
  • telegram

ఆన్‌లైన్‌ దరఖాస్తు చాలు.. 15 రోజుల్లో విద్యారుణం!

* డిగ్రీ చదువుకు ‘విద్యా లక్ష్మి’ సహకారం


 

బ్యాంకు నుంచి విద్యా రుణం తీసుకోవడమంటే మాటలా! అవసరమైన పత్రాలెన్నో   సమర్పించాలి. మంజూరవటం కోసం ఎన్ని రోజులు ఎదురుచూడాలో తెలియదు. ఇంత కష్టపడ్డా చివరికి విద్యారుణం వస్తుందో రాదో కూడా తెలియదు. ఇలాంటి సమస్యలు మీకూ అనుభవమా? మరి బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా.. దరఖాస్తు చేసిన పదిహేను రోజుల్లోనే తక్కువ వడ్డీతో రుణం మంజూరయ్యే వీలుంటే? అద్భుతంగా ఉంటుంది కదా? అయితే  ‘విద్యాలక్ష్మి’ వివరాలను తెలుసుకోవాల్సిందే! 

డాక్టర్‌ కావాలనేది సమత చిరకాల లక్ష్యం. ఇంటర్‌ బైపీసీలో మంచి మార్కులూ, నీట్‌లో మేటి ర్యాంకునూ సాధించింది. కానీ ఆర్థిక సమస్యల కారణంగా ఎంబీబీఎస్‌లో సీటు సాధించడం ఇక అసాధ్యమనే అనుకుంది. సరిగ్గా ఆ సమయంలో ‘విద్యాలక్ష్మి’ రుణం గురించి చెప్పారెవరో. ఆ తర్వాత దానికి దరఖాస్తు చేయడం కలల కోర్సులో చేరిపోవడం వెంటవెంటనే జరిగిపోయాయి. 

ఐఐటీలో ఇంజినీరింగ్‌ చదవాలని ఆశపడ్డాడు చైతన్య. అందుకు తగ్గట్టే కష్టపడీ చదివాడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధించినా.. ఆర్థిక సమస్యల వల్ల తన అభిలాషను సాకారం చేసుకోవడం సాధ్యం కాదని నిరాశపడ్డాడు. అప్పుడే అధ్యాపకుల ద్వారా విద్యాలక్ష్మి పథకం గురించి తెలుసుకుని వెంటనే దరఖాస్తు చేసుకున్నాడు. ఐఐటీలో ఇంజినీరింగ్‌ సీటు సంపాదించాడు. ఇలా ఎంతోమంది విద్యార్థుల లక్ష్యసాధనకు తానున్నానంటూ తోడ్పడుతోంది విద్యాలక్ష్మి పథకం. 

మూడు రకాలు...

 విద్యార్థులకు సులువుగా, అతి తక్కువ వడ్డీతో.. ఎలాంటి హామీ అవసరం లేకుండా.. విద్యా రుణం అందించాలనే ఆలోచనతో కేంద్రప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ 2015-16 ఆర్థిక సంవత్సరంలో ‘విద్యాలక్ష్మి పోర్టల్‌’ను ప్రారంభించింది. విద్యారుణం కావాలంటే సాధారణంగా అభ్యర్థే బ్యాంకుకు వెళ్లాలి. కానీ ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే... అభ్యర్థి బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరమే ఉండదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే సరిపోతుంది. ఒక్కసారి దరఖాస్తు చేస్తే.. మూడు బ్యాంకుల్లో మూడు రకాల విద్యారుణాలకు దరఖాస్తు చేసుకున్నట్టే. 

ఈ రుణాల్లో మూడు రకాలుంటాయి. 

 రూ.4 లక్షలలోపు

‣ రూ.4 లక్షల నుంచి రూ. 7.5 లక్షల లోపు 

రూ.7.5 లక్షలపైన.

వీటిపై వడ్డీ కూడా మిగతా విద్యా రుణాలతో పోలిస్తే తక్కువ. పైగా ఎలాంటి హామీ లేకుండా రుణం సౌకర్యం పొందొచ్చు. రూ.7.50 లక్షల రుణం వరకూ హామీ అవసరం ఉండదు. అయితే ఈ హామీరహిత రుణాన్ని పొందడానికి విద్యార్థి కుటుంబ వార్షికాదాయం రూ.4.50 లక్షల లోపు ఉండాలి. 


ఏ సర్టిఫికెట్లు అవసరం? 

విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు. ఉదా: పదోతరగతి, ఇంటర్, డిగ్రీ.

చివరిసారిగా చదివిన కోర్సుకు చెందిన ఉత్తీర్ణత పత్రం.

చేరబోయే కోర్సుకు సంబంధించిన అడ్మిషన్‌ పత్రాలు.

కుటుంబ వార్షికాదాయ ధ్రువీకరణ పత్రం.

ఈ సర్టిఫికెట్లు అన్నింటినీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. అలాగే ఫస్ట్‌క్లాస్‌లో పాసైనవాళ్లు లేదా నిర్ణీత శాతం మార్కులు సాధించినవాళ్లే దరఖాస్తు చేయాలనే నియమం ఏదీ లేదు. రుణానికి దరఖాస్తు చేయడానికి ముందు ఏడాది చదివిన కోర్సు పాసైతే చాలు. అలాగే దరఖాస్తుకు గడువు తేదీ కూడా లేదు. విద్యార్థుల అవసరాలను బట్టి ఏడాది పొడవునా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 


దరఖాస్తు ఎలా?

ముందుగా వెబ్‌సైట్‌ లింకులోకి వెళ్లి.. పేరు, మొబైల్‌ నంబర్, ఈమెయిల్‌ ఐడీ, చిరునామా.. లాంటి వివరాలతో రిజిష్టర్‌ చేసుకోవాలి. తర్వాత కామన్‌ ఎడ్యుకేషన్‌ లోన్‌ అప్లికేషన్‌ ఫామ్‌ (సీఈఎల్‌ఏఎఫ్‌)ను పూర్తిచేయాలి. అన్ని రకాల విద్యారుణాలకూ ఇది సరిపోతుంది. తర్వాత అవసరమైన సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలి. 

ఒక విద్యార్థి ఒక్క దరఖాస్తును మాత్రమే పంపాలి. 

అప్లికేషన్‌ స్టేటస్‌ను విద్యాలక్ష్మి పోర్టల్‌లో బ్యాంక్‌ అప్‌డేట్‌ చేస్తుంది. 

రుణం మంజూరైందీ లేనిదీ పదిహేను రోజుల్లోనే తెలిసిపోతుంది. 

ఒక్కోసారి దరఖాస్తును ‘ఆన్‌ హోల్డ్‌’లో పెడతారు. అలాంటప్పుడు అవసరమైన అదనపు సమాచారాన్నీ లేదా సర్టిఫికెట్లను అభ్యర్థి అప్‌లోడ్‌ చేయాలి. ఈ విషయాన్ని పోర్టల్‌లోని డాష్‌బోర్డ్‌లో చూసి విద్యార్థి తెలుసుకోవచ్చు. 

రుణం మంజూరైన విషయాన్నీ ఇదేవిధంగా పోర్టల్‌లోని డాష్‌బోర్డ్‌లో తెలియజేస్తారు. 

రుణం మొత్తాన్ని నేరుగా విద్యార్థి బ్యాంకు అకౌంట్‌లోనే జమ చేస్తారు. 

వెబ్‌సైట్‌: https://www.vidyalakshmi.co.in


ముఖ్యమైన రుణాలు

వివిధ రకాల రుణాలు అందుబాటులో ఉన్నప్పటికీ వీటిలో ఐదు ముఖ్యమైనవి. 

1. టెక్నికల్‌ కోర్సెస్‌ లోన్‌: ఇంజినీరింగ్‌ లాంటి టెక్నికల్‌ కోర్సులు చదివేవారికి. 

2. ఒకేషనల్‌ కోర్సెస్‌ లోన్‌: వృత్తివిద్యా సంబంధమైన కోర్సులు చదివేవారికి.

3. ప్రొషెషనల్‌ డిగ్రీస్‌ లోన్‌: ఎంబీబీఎస్, ఆర్కిటెక్చర్, లా, ఛార్టర్డ్‌ అకౌంటెన్సీ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులు చేసేవారికి.

4. డిగ్రీ ప్రోగ్రామ్స్‌ లోన్‌: అండర్‌ గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ కోర్సుల విద్యార్థులకు.

5. స్టడీస్‌ అబ్రాడ్‌ లోన్‌: విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునేవారికి. 

  మంజూరు చేసే రుణంలో చదువుకోవడానికి అయ్యే ఖర్చులు మాత్రమే కాకుండా ట్యూషన్‌ ఫీజు, వసతి, రవాణా ఖర్చులన్నింటినీ కలుపుతారు. రుణాలను మంజూరు చేయడానికి సాధారణంగా ప్రాసెసింగ్‌ ఛార్జీలు అవసరమవుతుంటాయి. కానీ ఇక్కడ దరఖాస్తు ఫీజు, ప్రాసెసింగ్‌ ఛార్జీలు ఏమీ ఉండవు. అంతా పారదర్శకంగానే ఉంటుంది. 

వడ్డీ రేటు తక్కువ. అయితే ఈ రేటు అన్ని బ్యాంకులకూ ఒకే విధంగా ఉండదు. స్కీములు, బ్యాంకులను బట్టి వడ్డీ రేటులో తేడా ఉంటుంది. 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఐఐటీల్లో ఉన్నత చదువులకు మార్గం 'జామ్'

‣ హెచ్‌పీసీఎల్‌లో 276 కొలువుల భర్తీ

‣ ఒకే వ్యూహంతో రెండు పరీక్షలు!

‣ ఓటమిని తట్టుకున్నారు.. విజేతగా నిలిచారు

Posted Date: 23-08-2023


 

తాజా కథనాలు

మరిన్ని