• facebook
  • whatsapp
  • telegram

దివ్యాంగులకు కేంద్రం ఆర్థిక సాయం

వివిధ సెంట్రల్‌ స్కాలర్‌షిప్‌ వివరాలు



దివ్యాంగుల చదువులకు.. ఆర్థిక పరిస్థితులతోపాటు, శరీరం సహకరించకపోవడం పెద్ద అవరోధాలవుతున్నాయి. వీరు శారీరక లోపం వల్ల కలిగిన వ్యథను అధిగమించి, జీవనం సాగించేందుకు సాయపడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వివిధ స్కాలర్‌షిప్పులను ప్రత్యేకంగా అందిస్తోంది. దివ్యాంగులు నిరాటంకంగా చదువుకుని వృత్తి, ఉద్యోగ జీవితంలో స్థిరపడటానికి ఇవెంతగానో తోడ్పడతాయి. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ వీటికి అవసరమైన నిధులు సమకూరుస్తుంది. తొమ్మిదో తరగతి నుంచి పీహెచ్‌డీ వరకూ వివిధ కోర్సులు చదువుతోన్నవారు, విదేశీ విద్య ప్రయత్నాల్లో ఉన్నవారు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే దివ్యాంగులు నేషనల్‌ స్కాలర్‌షిప్పు పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. 


కేంద్రం ఆధ్వర్యంలో 6 రకాల ఉపకార వేతనాలను దివ్యాంగుల కోసం అందిస్తున్నారు. అవి.. ప్రీ-మెట్రిక్, పోస్టు మెట్రిక్, టాప్‌ క్లాస్‌ ఎడ్యుకేషన్, నేషనల్‌ ఓవర్సీస్, నేషనల్‌ ఫెలోషిప్, ఫ్రీ కోచింగ్‌. 40 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న ఎవరైనా ఈ ఉపకార వేతనాలకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉపకార వేతనాలు పొందనివారు వీటికి అర్హులు. ఎంపికలో కుటుంబ వార్షిక ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ప్రీ-మెట్రిక్, పోస్ట్‌ మెట్రిక్, టాప్‌ క్లాస్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్పులకు రాష్ట్రాల వారీ కేటాయింపులు ఉంటాయి. 


ఆంధ్రప్రదేశ్‌లో ప్రీ-మెట్రిక్‌ 910, పోస్ట్‌ మెట్రిక్‌ 773, టాప్‌ క్లాస్‌ ఎడ్యుకేషన్‌ 14 స్లాట్స్‌ ఉన్నాయి. తెలంగాణలో ప్రీ-మెట్రిక్‌ 781, పోస్ట్‌ మెట్రిక్‌ 664, టాప్‌ క్లాస్‌ ఎడ్యుకేషన్‌ 12 స్లాట్స్‌ లభిస్తాయి. దివ్యాంగ విద్యార్థినులకు వీటిలో 50 శాతం కేటాయించారు. నేషనల్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్పుల్లో 30 శాతం మహిళలకు దక్కుతాయి. కేటాయించిన రాష్ట్రాల్లో తగినంత మంది అభ్యర్థులు లేకపోతే ఇతర రాష్ట్రాల దివ్యాంగ విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు.   



ఏఐసీటీఈ సాక్షం

సాక్షమ్‌ పేరుతో ఏఐసీటీఈ ఏటా దివ్యాంగ విద్యార్థులకు స్కాలర్‌షిప్పులను అందిస్తోంది. దివ్యాంగులు ఉన్నత చదువులకు దూరం కాకుండా చేయడానికి, వారికి ఆర్థికంగా అండగా ఉండాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేశారు. నిర్దేశిత అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ స్కాలర్‌షిప్పులు దక్కుతాయి. ఇలా ఎంపికైనవారికి ఏడాదికి రూ.యాభై వేల చొప్పున చెల్లిస్తారు. వీటిని డిప్లొమా విద్యార్థులకు మూడేళ్లు, ఇంజినీరింగ్‌ వారికి నాలుగేళ్లపాటు అందజేస్తారు. ఒకవేళ లేటరల్‌ ఎంట్రీ విధానంలో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌లో చేరినట్లయితే డిప్లొమాలో రెండేళ్లు, ఇంజినీరింగ్‌లో మూడేళ్ల పాటు ప్రోత్సాహం దక్కుతుంది. ఈ స్కాలర్‌షిప్పులను పుస్తకాలు, ఫీజు, వసతి, కంప్యూటర్, ఇతర ఖర్చుల నిమిత్తం ఉపయోగించుకోవచ్చు. ఏటా అభ్యర్థుల బ్యాంకు ఖాతాలోకి నేరుగా సొమ్ము జమచేస్తారు. ఇందుకోసం బ్యాంకు అకౌంటు, ఆధార్‌ కార్డు తప్పనిసరి. 


అర్హతలు: డిప్లొమా లేదా డిగ్రీ (ఇంజినీరింగ్‌) ప్రథమ సంవత్సరం కోర్సుల్లో చేరినవారై ఉండాలి లేదా లేటరల్‌ ఎంట్రీ విధానంలో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారై ఉండాలి. 

తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.8 లక్షల కంటే తక్కువగా ఉండాలి. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని జతచేయాలి. వైకల్యం కనీసం 40 శాతం లేదా అంతకుమించి ఉండాలి. ఈ ప్రోత్సాహం ఆశించేవారు ఇతర ఏ స్కాలర్‌షిప్పులనూ పొందనివారై ఉండాలి. 

పదో తరగతి తర్వాత డిప్లొమాలో చేరడానికి; ఇంటర్‌/ డిప్లొమా తర్వాత ఇంజినీరింగ్‌కు మధ్య ఖాళీ వ్యవధి రెండేళ్లకు మించరాదు. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన సంస్థల్లో చదవడం తప్పనిసరి. 


ప్రీ-మెట్రిక్‌..

ప్రతి నెలా డే స్కాలర్స్‌కు రూ.500, హాస్టల్‌లో ఉండేవారికి రూ.800 చొప్పున ఇస్తారు. వీటితోపాటు బుక్‌ గ్రాంట్‌ కింది ఏటా రూ.1000, డిజేబిలిటీ అలవెన్స్‌ నిమిత్తం రూ.2000 నుంచి రూ.4000 వరకు ప్రోత్సాహకంగా అందిస్తారు. 

ఎంపిక: విద్యార్థి అకడమిక్‌ ప్రతిభ, వయసు ఆధారంగా ఎంపిక చేస్తారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలకు మించకూడదు. 

ఎవరి కోసం: తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు

స్కాలర్‌షిప్పుల సంఖ్య: 25,000.


పోస్ట్‌ మెట్రిక్‌..

మొత్తం విద్యార్థులను నాలుగు గ్రూపులుగా విభజించారు.

గ్రూప్‌-1లో: మెడిసిన్, ఇంజినీరింగ్‌/టెక్నాలజీ, ప్లానింగ్‌/ఆర్కిటెక్చర్, ఫ్యాషన్‌ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, బిజినెస్‌/ఫైనాన్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ తదితరాల్లో డిగ్రీ, పీజీ విద్యార్థులకు.. డేస్కాలర్స్‌ అయితే రూ.750, హాస్టలర్స్‌కు రూ.1600 చొప్పున ప్రతి నెలా ఇస్తారు.

గ్రూప్‌-2లో: డిగ్రీ/ డిప్లొమా, ఫార్మసీ, ఎల్‌ఎల్‌బీ, పారా మెడికల్‌ బ్రాంచీలు తదితరాల్లో చదువుతున్న డేస్కాలర్స్‌కు నెలకు రూ.700, హాస్టలర్స్‌కు రూ.1100 చెల్లిస్తారు.

గ్రూప్‌-3లో: బీఏ/ బీఎస్సీ/ బీకాం విద్యార్థులకు డేస్కాలర్స్‌కు నెలకు రూ.650, హాస్టలర్స్‌కు రూ.950 చొప్పున అందిస్తారు. 

గ్రూప్‌-4లో: ఐటీఐ / ఒకేషనల్‌ / పాలిటెక్నిక్‌ కోర్సులు చదివే విద్యార్థులకు డేస్కాలర్స్‌కు నెలకు రూ.550, హాస్టలర్స్‌కు రూ.900 చొప్పున ఇస్తారు. వీటితోపాటు బుక్‌ అలవెన్స్‌ కింద సంవత్సరానికి రూ.1500, డిజేెబిలిటీ అలవెన్స్‌ ఏడాదికి రూ.2000 నుంచి రూ.4000 వరకు అందిస్తారు. 

ఎంపిక: విద్యార్థి అకడమిక్‌ ప్రతిభ, వయసు ఆధారంగా. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలకు మించకూడదు. 

ఎవరి కోసం: ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ విద్యార్థులు 

స్కాలర్‌షిప్పుల సంఖ్య: 17,000



టాప్‌ క్లాస్‌ ఎడ్యుకేషన్‌ 

కళాశాల ట్యూషన్‌ ఫీజు రూ.2 లక్షల వరకు రీఇంబర్స్‌మెంట్‌ ఉంటుంది. దైనందిన ఖర్చుల నిమిత్తం నెలకు డేస్కాలర్స్‌కు రూ.1500, హాస్టలర్స్‌కు రూ.3000 చొప్పున అందిస్తారు. స్పెషల్‌ అలవెన్స్‌ నెలకు రూ.2000, బుక్స్, స్టేషనరీ నిమిత్తం ఏడాదికి రూ.5000, రీఇంబర్స్‌మెంట్‌ ద్వారా కంప్యూటర్‌ కొనుక్కోవడానికి రూ.45 వేలను మొత్తం కోర్సులో ఒకేసారి గ్రాంటు రూపంలో ఇస్తారు. దివ్యాంగులకు సహాయపడే పరికరాలు కొనుగోలుకు రీఇంబర్స్‌మెంట్‌ రూపంలో రూ.30 వేలను మొత్తం కోర్సులో ఒకేసారి గ్రాంటు రూపంలో ఇస్తారు. 

ఎంపిక: విద్యార్థి అకడమిక్‌ ప్రతిభ, వయసు ఆధారంగా ఉంటుంది. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు మించకూడదు. ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఎవరి కోసం: డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ డిజేెబిలిటీస్‌ గుర్తింపు పొందిన 240 కళాశాలల్లో డిగ్రీ/డిప్లొమా, డిగ్రీ/పీజీ చదువుతున్న విద్యార్థులు 

స్కాలర్‌షిప్పుల సంఖ్య: 300


నేషనల్‌ ఫెలోషిప్‌ 

మొదటి రెండేళ్లకు జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ (జేఆర్‌ఎఫ్‌) ద్వారా ఎంపికైన అభ్యర్థికి స్కాలర్‌షిప్‌ ఉంటుంది. తర్వాత పరిశోధన పురోగతి సంతృప్తికరంగా ఉంటే సీనియర్‌ రిసెర్చ్‌ ఫెలోషిప్‌ (ఎస్‌ఆర్‌ఎఫ్‌) రూపంలో మరో మూడేళ్లు ఉపకారవేతనం అందిస్తారు. జేఆర్‌ఎఫ్‌కు నెలకు రూ.31,000 ఎస్‌ఆర్‌ఎఫ్‌కు నెలకు రూ.35,000 ఉపకార వేతనం అందిస్తారు. హాస్టల్‌లో వసతి పొందనివారికి హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు. ఏటా కాంటింజెన్సీ చెల్లిస్తారు. ఒకవేళ సహాయకుడు అవసరమైతే అందుకుగాను ప్రతి నెలా రూ.2000 వారికి ఇస్తారు. 

ఎంపిక: అర్హులను యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ఎంపిక చేస్తారు. 

ఎవరి కోసం: యూనివర్సిటీల్లో ఎంఫిల్‌/ పీహెచ్‌డీ చేస్తున్నవారు. తల్లిదండ్రుల ఆదాయంతో సంబంధం లేదు. యూజీసీ/సీఎస్‌ఐఆర్‌ - నెట్‌ జేఆర్‌ఎఫ్‌కు ప్రాధాన్యం.   

ఏడాదికి స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 200+


నేషనల్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌

ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్, ప్యూర్‌ సైన్సెస్‌ అండ్‌ అప్లైడ్‌ సైన్సెస్, అగ్రికల్చర్‌ సైన్స్‌ అండ్‌ మెడిసిన్, కామర్స్, అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్, హ్యుమానిటీస్, సోషల్‌ సైన్సెస్, లా అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగాల్లో విదేశీ యూనివర్సిటీల్లో మాస్టర్స్‌ డిగ్రీ/ పీహెచ్‌డీ చేస్తున్న దివ్యాంగులకు ఉపకారవేతనం అందిస్తారు. బ్యాచిలర్స్‌/ మాస్టర్స్‌ డిగ్రీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం. వయసు 35 కంటే తక్కువ ఉండాలి. యు.కె. మినహా ఇతర దేశాల యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులకు ఏడాదికి 15400 యూఎస్‌ డాలర్లు, కంటింజెన్సీ అలవెన్స్‌ రూపంలో ఏడాదికి 1500 యూఎస్‌ డాలర్లు అందిస్తారు. యు.కె. యూనివర్సిటీల్లో చదివేవారికి ఏడాదికి 9900 జీబీపీ, కంటింజెన్సీ అలవెన్స్‌ రూపంలో ఏడాదికి 1100 జీబీపీ వస్తుంది. వీటితోపాటు వీసా ఫీజు, విమాన చార్టీలు, మెడికల్‌ ఇన్సూరెన్స్‌.. మొదలైనవాటికి అవసరమయ్యే మొత్తాన్ని చెల్లిస్తారు. పీహెచ్‌డీ విద్యార్థులకు నాలుగేళ్లు, మాస్టర్స్‌ డిగ్రీ చదివేవారికి మూడేళ్లు స్కాలర్‌షిప్‌ వస్తుంది. వెబ్‌సైట్‌ నుంచి దరఖాస్తు నింపి సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి పోస్టు చేయాలి. కుటుంబ వార్షిక ఆదాయం ఏడాదికి రూ.ఆరు లక్షలు మించకూడదు. 

ఎంపిక: మెరిట్, షార్ట్‌లిస్ట్‌ ఆధారంగా.

ఎవరి కోసం: విదేశీ యూనివర్సిటీల్లో మాస్టర్స్‌/ పీహెచ్‌డీ చేస్తున్న అభ్యర్థులు. వయసు 35 లోపు ఉండాలి.  

ఏడాదికి స్కాలర్‌షిప్పుల సంఖ్య: 20+


ఉచిత శిక్షణ, ఉపకారవేతనం 

యూపీఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్, ఆర్‌ఆర్‌బీ, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు నిర్వహించే పోటీ పరీక్షలు, ఐఐటీ-జేఈఈ, నీట్, క్లాట్, క్యాట్‌... మొదలైన ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమవుతున్నవారు పేరున్న సంస్థలో ఉచితంగా శిక్షణ పొందే అవకాశం ఉంది. దీని ద్వారా కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫీజు చెల్లించడంతో పాటు లోకల్‌ విద్యార్థికి స్కాలర్‌షిప్‌గా నెలకు రూ.2500, నాన్‌ లోకల్‌ విద్యార్థికి రూ.5000 ఇస్తారు. స్పెషల్‌ అలవెన్స్‌ కింద మరో రూ.2000 ఉపకారవేతనం అందిస్తారు. ప్రాథమికంగా ఏడాది స్కాలర్‌షిప్‌ చెల్లిస్తారు. ఆ ఏడాది ఏ ఉద్యోగం సాధించలేక పోతే తర్వాత సంవత్సరానికి విద్యార్థి రెన్యువల్‌ చేసుకోవచ్చు. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. కుటుంబ వార్షిక ఆదాయం ఏడాదికి రూ.ఆరు లక్షలు మించకూడదు.

ఎంపిక: మెరిట్‌ ఆధారంగా

ఎవరి కోసం: పోటీపరీక్షలు, ప్రవేశ పరీక్షలకు శిక్షణ తీసుకునే విద్యార్థులు

ఏడాదికి స్కాలర్‌షిప్పుల సంఖ్య: 20,000


దరఖాస్తుకు చివరి తేదీ: ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్పులకు నవంబరు 30. మిగిలిన అన్నింటికీ డిసెంబరు 31


వెబ్‌సైట్‌: https://scholarships.gov.in/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ నేరాల గుట్టు పట్టే కోర్సులు

‣ కొత్త పరిస్థితుల్లో కంగారొద్దు!

‣ సందేహాలా?.. ఐఐటియన్ల సలహాలివిగో..!

‣ దిల్లీ ఆసుపత్రుల్లో ఉద్యోగ అవకాశాలు

‣ సమస్యా పరిష్కార నైపుణ్యం.. భవిష్యత్ ప్రాధాన్యం

‣ యువత ఉపాధికి దారి.. రియల్‌ ఎస్టేట్‌!

Posted Date: 17-10-2023


 

తాజా కథనాలు

మరిన్ని