• facebook
  • whatsapp
  • telegram

సమస్యా పరిష్కార నైపుణ్యం.. భవిష్యత్ ప్రాధాన్యం

యువతకు ఈ లక్షణం కూడా అవసరంసులభంగా ఛేదిస్తారా.. సమస్యా పరిష్కార నైపుణ్యాలు కెరియర్‌ ఏదైనా.. ఉద్యోగం ఎటువంటిదైనా.. సవాళ్లు సహజం. సమస్యలను తెలివిగా, సులభంగా పరిష్కరించడం నేటి విద్యార్థులు అభ్యసించాల్సిన ఒక ప్రధాన నైపుణ్యం. మరి ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్‌ గురించి ఇంకా పూర్తిగా తెలుసుకుందామా..


‘వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌’ ఇటీవల విడుదల చేసిన ‘ఫ్యూచర్‌ ఆఫ్‌ జాబ్స్‌’ నివేదిక ప్రకారం.. సమస్యా పరిష్కార నైపుణ్యాలకు వచ్చే ఐదేళ్లలో ప్రాధాన్యం పెరగనుంది. టెక్నికల్‌ స్కిల్స్‌కి ఉన్నంత ప్రాముఖ్యం వీటికీ లభిస్తుందని ఇప్పటికే నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగార్థులు అతి ముఖ్యమైన ఈ స్కిల్‌ను నేర్చుకోవడంలో ముందుండాలని సూచిస్తున్నారు. సమస్యలను ముందుగా గుర్తించడం, వేగంగా పరిష్కరించడం ఉన్నత స్థాయి పోస్టులకే కాదు.. ప్రవేశ స్థాయి ఉద్యోగాలకూ అవసరం.


సమస్యా పరిష్కారం అనేది ఒక క్లిష్టమైన నైపుణ్యం. ఇందులో క్రిటికల్‌ థింకింగ్, డెసిషన్‌ మేకింగ్, క్రియేటివిటీ, ఇన్ఫర్మేషన్‌ ప్రాసెసింగ్‌ అనే స్కిల్స్‌ అన్నీ భాగంగా ఉంటాయి. ఒక పెద్ద సమస్యను చిన్న చిన్న భాగాలుగా విభజించడం.. ఒక్కొక్కొటీ పరిష్కరించుకుంటూ రావడం.. ఇలాంటి విభిన్నమైన ప్రక్రియలను ఇందుకోసం పాటించాలి. దీనిలో ప్రధానంగా మూడు అంచెలుంటాయి.


మొదటి దశ

సమస్యను గుర్తించడం: సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించే ముందు అసలు సరిగ్గా సమస్య ఏంటో గుర్తించడం ప్రధానం. దీనికోసం ఆ ప్రాబ్లమ్‌ వల్ల ఇబ్బంది పడుతున్న వారితో మాట్లాడటం, పూర్తి వివరాలు - కారణాలు రిసెర్చ్‌ చేయడం, ఫీల్డ్‌లో నిపుణులను సంప్రదించడం వంటివి చేయాలి. 


రెండోదశ

పరిష్కారాల జాబితా సిద్ధం చేయడం: సమస్యను పరిష్కరించేందుకు ఎటువంటి పరిష్కారాలు చేయవచ్చో ఒక జాబితా సిద్ధం చేయడం, ఏ పరిష్కారం ఎంతవరకూ  ఫలితాలనిస్తుందో అంచనా వేయడం, అన్నింటికంటే సరైన దాన్ని ఎంచుకోవడం ఇందులో భాగం.


మూడోదశ

పరిష్కారాన్ని ఆచరించడం: ఈ సమయంలో పరిష్కారం కోసం ఎటువంటి వనరులు అవసరం అవుతాయి అనే విషయాన్ని గమనించాలి. డబ్బు, నిపుణులు, టెక్నాలజీ.. ఇలా ఏది అవసరం అనే విషయాన్ని గుర్తించాలి. అంతిమంగా అతి సులభమైన వేగవంతమైన, పరిష్కార మార్గాన్ని అవలంబించడం అవసరం.


రెజ్యూమెలో కనిపించేలా.. 

రెజ్యూమెలో సమస్యా పరిష్కార నైపుణ్యాలను చూడగానే అవతలివారు గుర్తించేలా రాసుకోగలగాలి. ఆకర్షించే భాష, ముఖ్యంగా క్రియాశీలక పదాలు (యాక్షన్‌ వెర్బ్స్‌) ఉపయోగించడం ద్వారా దీన్ని సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నిర్దిష్టమైన విషయాలను వివరంగా చెప్పేలా వాక్యాలు ఉండాలి. చెప్పాలనుకునే అంశాన్ని కుదిరితే అంకెల్లో చెప్పడం ద్వారా సూటిగా వివరించవచ్చు.


ఎలా?

చాలా మంది సమస్యలను పరిష్కరించడం కంటే వాటిని చూసీచూడనట్లు వదిలేయడానికే ప్రయత్నిస్తారు. కానీ అలా కాకుండా వాటిని గుర్తించి పరిష్కరించడానికి ప్రయత్నించే ఆలోచనా ధోరణిని అలవాటు చేసుకోవాలి. ఇది కేవలం ఒక్కరోజులో నేర్చుకుంటే వచ్చేసేది కాదు.. స్థిరంగా అభివృద్ధి చేసుకోవాల్సిన లక్షణం. విభిన్నమైన  ఆలోచనలను అర్థం చేసుకునే ఓపిక, అవసరం అయితే ఇతరుల సలహాలు తీసుకోవడం, నిర్ణయం తీసుకునే ముందు పూర్తిస్థాయిలో సమాచారాన్ని దగ్గర ఉంచుకోవడం వంటివన్నీ.. ఈ లక్ష్యాన్ని సాధించే సోపానాలు.


కోర్సులు

కోర్సెరా, యుడెమీ, స్కిల్‌షేర్, ఎడ్‌ఎక్స్, లెర్నింగ్‌ ట్రీ, లింక్డిన్‌ లెర్నింగ్‌ వంటి ప్రధానమైన ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో దీనికి సంబంధించి అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ‘ఎఫెక్టివ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ స్కిల్స్, కంప్యుటేషనల్‌ థింకింగ్, క్రియేటివ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌..’ ఇలా అనేక విధాలుగా లభిస్తున్న కోర్సుల ద్వారా వీటిని నేర్చుకోవచ్చు.


ఈ లక్షణాలు కూడా అవసరం

1. సృజనాత్మకత: కొత్తగా వచ్చే సమస్యలను పరిష్కరించాలంటే.. మన ఆలోచనలు కూడా కొత్తగానే ఉండాలి. ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌కు క్రియేటివిటీ అవసరం. సృజనతోనే మనం పరిష్కారాల కోసం కొత్త దారులు వెతుకుతాం. ఇది ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచి కంపెనీలకు ఖర్చులు తగ్గించడానికి, కొత్త ఆలోచనలు ఇచ్చేందుకు, వినియోగదారునికి సంతృప్తికరమైన సేవలు అందించేందుకు.. సమాచారాన్ని విశ్లేషించి నూతన ట్రెండ్స్, అవకాశాలు గుర్తించేందుకు.. ఇలా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది.

2. పరిశోధన: క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో పరిశోధన ముఖ్యపాత్ర పోషిస్తుంది. విభిన్నమైన వనరుల ద్వారా సమాచారాన్ని సేకరించడం, విశ్లేషించడం, నిర్వహించడం వల్ల కచ్చితమైన పరిష్కారాన్ని వెతికే వీలుంటుంది. కొత్త మార్కెట్, కస్టమర్లను గుర్తించడం, పోటీదారుల గురించి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండటం, పరిశ్రమపై అవగాహన పెంచుకోవడం, గత పనితీరును అంచనా వేసుకోవడం.. ఇలా అన్నింటికీ రిసెర్చ్‌ నైపుణ్యాలు అవసరం.

3. కమ్యూనికేషన్‌: సమస్యను అర్థం చేసుకున్నాక, పరిష్కారాన్ని గుర్తించాక.. ఇతరులతో పంచుకోవడానికి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు చాలా ముఖ్యం. ఇందుకు వెర్బల్, రిటన్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌తోపాటు అవతలి వారు చెప్పేది జాగ్రత్తగా వినడం, వారి కోణాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం అభివృద్ధి చేసుకోవడం ముఖ్యం. లక్ష్యాలను నిర్దేశించుకోవడం, అందరితో కలసికట్టుగా పనిచేయడం.. వీటన్నింటిలో కమ్యూనికేషన్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంది.

4. బృందంతో పని: బృందాల్లో కలిసి పనిచేయడం ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ను ప్రభావవంతంగా నిర్వహించేందుకు ఉపయోగపడుతుంది. విభిన్నమైన పనితీరు కలిగిన వారు కలిసి సమస్యలను పరిష్కరించడంలో వినూత్నమైన మార్గాలను అన్వేషిస్తారు. దీని ద్వారా ఉత్తమమైన పరిష్కారం కనుగొనే వీలుంటుంది. ఇందుకు ధైర్యంగా మాట్లాడే వాతావరణం, ఫీడ్‌బ్యాక్‌ తీసుకునే అలవాటు ఉండాలి. సమష్టి లక్ష్యసాధనకు ఒక్కొక్కరూ తమదైన శైలిలో కష్టపడాలి.

5. నిర్ణయాలు తీసుకోవడం: సమస్యా పరిష్కారంలో డెసిషన్‌ మేకింగ్‌ మరో ప్రధానాంశం. సమస్యను గుర్తించడంలోనూ, పరిష్కరించడంలోనూ ప్రతి దశలోనూ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డెసిషన్‌ మేకింగ్‌లో వేగం, కచ్చితత్వం అవసరం. ఏది ఎంత వరకూ చేయాలో నిర్ధ‌రించుకోవ‌డంతోనే సరైన నిర్ణయాలు తీసుకోగలం.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ యువత ఉపాధికి దారి.. రియల్‌ ఎస్టేట్‌!

‣ మెరుగైన భావ ప్రకటనకు మార్గాలివిగో..

‣ జ్ఞాపకశక్తి పెంచుకునే మార్గాలివిగో..!

‣ సమన్వయం సాధిస్తేనే సక్సెస్‌!

‣ బోధనలో మేటి అవకాశాలకు మెట్టు.. నెట్‌

Posted Date: 10-10-2023


 

పరిష్కారం

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం