• facebook
  • whatsapp
  • telegram

జ్ఞాపకశక్తి పెంచుకునే మార్గాలివిగో..!

* కెరియర్‌ సక్సెస్‌కు నిపుణుల సూచనలు

చదివిన వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని.. పరీక్షల్లో రాసి మంచి మార్కులు సంపాదించాలనే విద్యార్థులందరూ కోరుకుంటారు. ఇది కొద్దిమందికి మాత్రమే సాధ్యమవుతుంది. మరికొందరు విద్యార్థులు శ్రద్ధగా ఏరోజు పాఠాలను ఆరోజే చదివేస్తుంటారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వార్షిక పరీక్షలు రాసే సమయానికి మాత్రం చదివిన పాఠ్యాంశాల్లో ఎక్కువభాగం మర్చిపోతుంటారు. ఫలితంగా తక్కువ మార్కులు తెచ్చుకుని నిరాశలో మునిగిపోతుంటారు.    ఆత్మన్యూనతకూ గురవుతుంటారు. అలా  కాకుండా జ్ఞాపకశక్తిని పెంచుకుంటే ఇలాంటి సమస్యలేవీ ఉండవు. అందుకోసం నిపుణుల సూచనలను తెలుసుకుందామా! 

కొన్ని పాఠ్యాంశాలు ఆసక్తికరంగా ఉండొచ్చు.. మరికొన్ని ఉండకపోవచ్చు. కానీ ఏదైనా సరే ఏకాగ్రతతో చదవడం ఎంతో ముఖ్యం. చేతిలో పుస్తకం ఉన్నా.. ఆలోచనలు మాత్రం ఎక్కడెక్కడో విహరిస్తూ ఉంటే చదివింది ఏమాత్రం గుర్తుండదు. అందుకే మీ దృష్టి, ధ్యాసా అంతా పుస్తకంలోని విషయాల మీదే నిమగ్నమై ఉండేలా చూసుకోవాలి. దీనికోసం అనుకూల ప్రదేశాన్ని ఎంచుకుని చదువుకోవాలి. సెల్‌ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ చేసుకోవాలి. టీవీ సౌండ్, కుటుంబ సభ్యుల మాటలు ఏవీ వినపడకుండా చుట్టుపక్కల వాతావరణమంతా నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి. 

మళ్లీ మళ్లీ: విద్యా సంవత్సరం ప్రారంభంలో చదివిన అంశం.. ఏడాది పొడవునా గుర్తుండాలని లేదు. అలాగే ఒకసారి చదవగానే అర్థమవ్వాలనీ లేదు. అర్థమయ్యేంతవరకూ ఎన్నిసార్లయినా చదవాలి. మొక్కుబడిగా కాకుండా విషయాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి. అంతేకాదు సమయం దొరికినప్పుడు పునశ్చరణ (రివిజన్‌) చేసుకుంటూనూ ఉండాలి. అయితే ఎవరు ఎన్నిసార్లు చదవాలి అనేది వారివారి గ్రహణ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. 

ఆడియో వింటే: విన్న విషయాలను ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. చిన్నతనంలో నేర్చుకున్న పద్యాలు, పాటలు పెద్దయినా కూడా గుర్తుంటాయి. అంటే చదివిన దాని కంటే విన్నదాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాఠాలను ఆడియోల ద్వారానూ వినడానికి ప్రయత్నించాలి. ఇలాచేస్తే క్రిటికల్‌ థింకింగ్‌ నైపుణ్యం, వినే సామర్థ్యం పెరుగుతుంది. వింటున్నప్పుడే దాంట్లోని ప్రధానాంశాన్ని గుర్తించి.. విశ్లేషించుకునే అవకాశం కలుగుతుంది. ఈ నైపుణ్యం విద్యార్థి దశలోనే కాదు.. ఉద్యోగాన్వేషణలోనూ.. ఆ తర్వాత ఉద్యోగం సంపాదించిన తర్వాత కూడా ఉపయోగపడుతుంది.  

పెద్దగా చదవాలి: చదవడానికి కూర్చున్నప్పుడు సాధారణంగా చేతిలో పుస్తకం ఉంటుంది. కళ్లతో ఎదురుగా ఉన్న అక్షరాలనూ చూస్తుంటారు. కానీ ఆలోచనలు మాత్రం నిన్న జరిగిపోయిన విషయాలూ, రేపు జరగబోయే సంగతుల చుట్టూ తిరుగుతుంటాయి. 

ఇలా అన్యమనస్కంగా చదవడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. పరధ్యానంతో చదివిన వాటిని అప్పటికప్పుడు మర్చిపోయే అవకాశాలే ఎక్కువ. ఇలాంటప్పుడు మనసులో కాకుండా పైకి పెద్దగా చదవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చూస్తున్నదీ, చదువుతున్నదీ, వింటున్నదీ ఒకటే కావడంతో చదివినవి ఎక్కువకాలం గుర్తుండే అవకాశం ఉంటుంది. 

స్వీయ పరీక్ష: చదివింది ఎంతవరకూ గుర్తుందనేది స్వీయ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. దీని కోసం పరీక్షల వరకూ ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఒక్కో చాప్టరూ చదివిన తర్వాత దాంట్లోని ప్రశ్నలన్నింటికీ చూడకుండా సమాధానాలు  రాయాలి. దీంతో చదివిన అంశాలు మీకు ఎంతవరకూ గుర్తున్నాయనేది స్పష్టంగా తెలుస్తుంది. కొంతవరకే గుర్తుంటే మళ్లీ చదువుకోవచ్చు. ఏమైనా పొరపాట్లు జరిగినా సరిదిద్దుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మొత్తం మీద మీ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకునే అవకాశం కలుగుతుంది. 

సాధన ముఖ్యం: సరైన సాధనలేనిదే ఏదీ సాధ్యంకాదు. విద్యార్థులను సమర్థంగా తీర్చిదిద్దగలిగే శక్తి దీనికి ఉంటుంది. ఒక లక్ష్యమంటూ లేకుండా సాధన చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. లక్ష్యాన్ని పెట్టుకుని సాధనను కొనసాగించాలి. ముందుగా బలహీనంగా ఉన్న అంశాలపై దృష్టి పెట్టాలి. అలాగే పెద్దగా ఉన్న చాప్టర్లను చిన్న భాగాలుగా విభజించుకుని చదవాలి. చదివిన దాన్ని అర్థంచేసుకుని.. దాంట్లో పరిపూర్ణత సాధించేంత వరకూ సాధన కొనసాగించాలి. 

పోషకాహారమూ అవసరమే: కొంతమంది విద్యార్థులు పోషకాహారానికంటే రుచికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. దీంతో జంక్‌ఫుడ్‌ తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. దీనివల్ల చురుకుదనం లోపిస్తుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి ఆహారం ఎంతగానో తోడ్పడుతుంది. కాయగూరలు, ఆకుకూరలు, తృణధాన్యాలు, పండ్లు, డ్రైఫూట్స్‌.. లాంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. కార్బోహైడ్రేట్లను తగ్గించి ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా ఉత్సాహంగా ఉండగలుగుతారు. యోగా, ధ్యానంతో ఒత్తిడి తగ్గడమే కాకుండా.. జ్ఞాపకశక్తీ పెరుగుతుందని కొన్ని అధ్యయనాలూ చెబుతున్నాయి. కాబట్టి వీటినీ జీవితంలో భాగం చేసుకోవాలి. 


మైండ్‌ మ్యాపింగ్‌: ఇదో శక్తిమంతమైన టెక్నిక్‌గా ఉపయోగపడుతుంది. చదివేటప్పుడు దాంట్లో ఉన్న ప్రధానాంశం ఏమిటి? దాన్ని సమర్థించే ఇతర అంశాలు ఏమిటి? అనేది కాగితమ్మీద గీతల రూపంలో మ్యాప్‌ వేసుకోవాలి. ప్రధానాంశం అనేది చెట్టు అయితే.. దానికి కొమ్మలు ఉంటాయి కదా. అలా ప్రధానాంశం చుట్టూ.. దానికి అనుబంధ విషయాలు అల్లుకుని ఉంటాయి. వాటిని శాఖోపశాఖలుగా మ్యాపులు వేసుకుని మనసులో గుర్తుంచుకోవడం వల్ల విషయాన్ని అంత త్వరగా మర్చిపోలేరు. 


వీటినీ పాటించి చూడొచ్చు...

చదవాల్సినవి ఎక్కువగా ఉండటం వల్ల వాటిని త్వరగా పూర్తిచేయాలనే ఉద్దేశంతో కొందరు.. గబగబా చదవడం పూర్తిచేసి పక్కన పెట్టేస్తుంటారు. వెనకాల ఎవరో తరుముకొస్తున్నట్టుగా ఇలా చేయడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. పాఠ్యాంశాలన్నీ పూర్తిచేసినట్టుగానే ఉంటుందిగానీ సమయానికి ఏమీ గుర్తుకురావు. చదివింది మర్చిపోకుండా ఉండాలంటే.. కనీసం ఎనిమిది సెకన్లపాటైనా ఆ అంశంపైన దృష్టిని కేంద్రీకరించాలంటున్నారు నిపుణులు. ఒక సమాచారం షార్ట్‌టర్మ్‌ మెమరీ నుంచి లాంగ్‌ టర్మ్‌ మెమరీలోకి వెళ్లాలంటే కనీసం ఎనిమిది సెకన్ల సమయమైనా పడుతుందని కొన్ని అధ్యయనాలూ చెబుతున్నాయి. కాబట్టి కాస్త నిదానంగా, అర్థమయ్యేట్టుగా చదివితే ఫలితం ఉంటుంది. 

చదువుతున్న సమాచారానికి సంబంధించిన చిత్రాన్ని మనసులో ఊహించుకోవాలి. మొక్కుబడిగా కాకుండా ఇలా ఊహించుకుంటూ చదవడం వల్ల వెంటనే మర్చిపోయే అవకాశం ఉండదు. 

ఒక్కోసారి ప్రత్యేక కారణమంటూ లేకపోయినా చాలా విసుగ్గా అనిపిస్తుంటుంది. అదే మూడ్‌లో చదవడాన్ని కొనసాగిస్తే ఏకాగ్రత ఏమాత్రం నిలవదు. దాంతో చదివినవేవీ గుర్తుండవు. ఇలాంటప్పుడు పేపర్‌ మీద చిన్నచిన్న బొమ్మలను రఫ్‌గా వేసుకోవడం వల్ల మెదడు ఉత్తేజం పొందుతుంది. ఇలా పునరుత్తేజం పొందిన తర్వాత చదివినవి ఎక్కువకాలంపాటు గుర్తుంటాయి. 

సాధారణంగా పరీక్షల ముందు రాత్రంతా మేలుకుని చదవడం చాలామంది విద్యార్థులకు అలవాటు. కానీ దీనివల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. నిద్రలేమి వల్ల చదివినవి సరిగా గుర్తుండవు కూడా. చదివిన తర్వాత తగినంత సమయం నిద్రపోవడం వల్ల మెదడుకు తగినంత విశ్రాంతి లభిస్తుంది. దీంతో చదివిన అంశాలు లాంగ్‌టర్న్‌ మెమరీలోకి వెళ్లి ఎక్కువకాలంపాటు గుర్తుంటాయి. నిద్రపోకుండా రాత్రంతా మేల్కొని ఉండటం వల్ల మెదడులో ఈ ప్రక్రియ జరగదు.

చూడకుండా పేపర్‌ మీద రాయడానికి బదులుగా సిస్టమ్‌ లేదా ల్యాపీలో కంపోజ్‌ చేస్తుంటారు కొందరు. అలాకాకుండా చేత్తో పేపర్‌ మీద రాసుకోవడం వల్ల ఎక్కువకాలంపాటు గుర్తుంటాయి. దీంతో ఎప్పటికప్పుడు నైపుణ్యాలను సమీక్షించుకునే అవకాశం కలుగుతుంది. 

ప్రతి పాఠంలోని ముఖ్యాంశాలనూ నోట్‌బుక్‌లో రాసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. సమయం ఉన్నప్పుడు వీటిని ఒకసారి పునశ్చరణ చేసుకుంటే.. వార్షిక పరీక్షల నాటికి మర్చిపోయే అవకాశం ఉండదు. 

శారీరకంగానేకాదు.. మానసికంగానూ చురుగ్గా ఉండటానికి ప్రయత్నించాలి. క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ పూరించడం, పుస్తకాలు చదవడం, ఇష్టమైన ఆటలు ఆడటం, ఏదైనా సంగీత పరికరాన్ని వాయించడం, కొత్త భాష నేర్చుకోవడం లేదా ఏదైనా కొత్త అభిరుచిని చేసుకోవడం.. ఇవన్నీ కూడా జ్ఞాపకశక్తి పెరగడానికి తోడ్పడతాయి. 

సమయాన్ని వృథా చేయకుండా చదవడం అవసరమేగానీ.. అప్పుడప్పుడూ స్నేహితులు, కుటుంబసభ్యులతో కాస్త సమయాన్నీ గడపాలి. దీనివల్ల ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా చదవగలుగుతారు. వాటిని ఎక్కువకాలం మర్చిపోకుండానూ ఉంటారు. 

శారీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో తోడ్పడుతుందనే విషయం తెలిసిందే. జ్ఞాపకశక్తిని పెంచడానికీ ఇది సహకరిస్తుందంటున్నారు నిపుణులు. వ్యాయామం వల్ల  శరీరôతోపాటు, మెదడుకూ రక్తప్రసరణ సవ్యంగా జరుగుతుంది. అంతేకాదు మెదడుకు తగినంత ఆక్సిజన్‌ అందడం వల్ల కొత్త కణాలు ఏర్పడి జ్ఞాపకశక్తి పెరిగే అవకాశమూ ఉంటుంది.  


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆ యుద్ధంతో ఆవిర్భవించిన మహా సామ్రాజ్యం!

‣ విశ్వమంతా సూక్ష్మరూపం!

‣ రెజ్యూమె రాయడంలో జాగ్రత్తలు

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

Posted Date: 06-10-2023


 

జ్ఞాపకశక్తి

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం