• facebook
  • whatsapp
  • telegram

జ్ఞాపకశక్తిని అభివృద్ధి చేయడం ఎలా?

మీరు రోజూ అనేక మందిని చూస్తూ ఉంటారు. కలుస్తారు. వారితో మాట్లాడతారు కానీ, వారు మీకు ఆ తరువాత గుర్తు ఉండరు. ప్రతీ ఒక్కరిని జ్ఞాపకం ఉంచుకోవడం కష్టం. అయినా కొన్ని సందర్భాల్లో అది చాలా అవసరం అవుతుంది. అలాగే మనం చూస్తూ ఉన్న వస్తువులు కూడా గుర్తుండవు. వాటిని గుర్తుంచుకోవడం ఎలా. కొందరికి తేదీలు, వారాలు బాగా గుర్తుంటాయి. మరికొందరికి నెంబర్లు బాగా గుర్తుంటాయి. మీరు ఉపన్యాసం కోసం రాసుకున్న పాయింట్సు గుర్తుంటాయి.

జ్ఞాపకశక్తి అభివృద్ధిలో ఆహారం పాత్ర

      మనిషికి ప్రధానమైన సంపూర్ణాహారం పాలు. పాలలో విటమిన్లతో పాటు కాల్షియం, ఫాస్ఫరస్‌లు సరైన పాళ్లలో ఉంటాయి. జున్ను కూడా విశిష్టమైనది. చేపలు మంచి మాంసకృత్తులున్న ఆహారం. గుడ్లలో అద్భుత పోషక పదార్థాలున్నాయి. గుడ్డులోని పసుపు సొనలో అవి అధికంగా ఉంటాయి. అలాగే వేరుశనగ, బాదం పప్పుల్లో మంచి పోషక విలువలున్నాయి. భోజనం మొదట్లో వీటిని తీసుకోవడం ఆచరణీయం. రాత్రిపూట తినడం అంత ఉపయుక్తంకాదు.

ఇవేగాక మెదడు బాగా పనిచేయాలంటే కాల్షియం, ఫాస్ఫరస్ వంటి వాటిని శరీర వ్యవస్థలో నుంచి బయటకు తీసుకుపోయే అధిక కొవ్వు పదార్థాలను, మోతాదు మించిన పంచదారను, యాసిడ్లు అధికంగా ఉండే ఫలరసాలను త్యజించాలి.

     కాల్షియం, ఫాస్పరస్‌ల తరువాత స్థానం మెగ్నీషియం. మనిషి మెదడు చురుగ్గా పనిచేయడానికి ఎంతో అవసరం. కాబట్టి మెగ్నీషియం అధికంగా ఉండే రొట్టె, సైంధవలవణం, పచ్చని ఆకుకూరలు, పచ్చికాయలు, కొంతవరకు చాకొలెట్ తీసుకుంటే నాడీ వ్యవస్థకు సరిపడే ఇంధనాన్నిసమకూరుస్తాయి.

మనిషి జ్ఞాపకశక్తికి సంబంధించినంత వరకు విటమిన్ 'బి కాంప్లెక్స్, విటమిన్ 'డి చాలా ఉపయోగపడతాయి. ఈ బి-కాంప్లెక్స్ విటమిన్‌లలో ఎక్కువ ప్రయోజనకారి విటమిన్ బి12. ఇది జ్ఞాపకశక్తిని వృద్ధి చేయడానికి, మెదడు చురుకుగా పనిచేయడానికి దోహదం చేస్తుంది.

ఇక విటమిన్ 'డి శరీరంలోని కాల్షియం, ఫాస్ఫరస్ మెటబాలిజంలను క్రమ బద్ధం చేస్తుంది. ఇది వెన్నలో, సూర్యరశ్మి ద్వారా శరీరంలో ఉత్పత్తి అవుతుంది.

మనం తీసుకునే కొన్ని పదార్థాల ద్వారా మన జ్ఞాపక శక్తిని అడ్డుకునే లేదా నిర్వీర్యం చేసే ప్రక్రియలను అదుపు చేయవచ్చు.

కాబట్టి మన జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ముందు మన ఆహారపుటలవాట్లను క్రమబద్ధం చేసుకోవాలి. ఆహారం మితంగానే తీసుకుంటూ పైన చెప్పిన పోషక విలువలున్న ఆహారాన్ని భుజించడం ద్వారా జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చు.

జ్ఞాపకశక్తి మెరుగుపడాలంటే?

     తెలిసిన విషయాలను సరైనక్రమంలో రూపొందించుకోవడం వల్ల తేలికగా గుర్తుపెట్టుకోవచ్చు. ఉదాహరణకి ఎక్కువ మాటలను గుర్తుపెట్టుకోవడం కష్టం. వాటినే వాక్యాలుగా రూపొందించుకుంటే తేలిగ్గా గుర్తుంటాయి. ఒకదానితో ఒకటి సంబంధం లేనివాటికి కూడా ఏదో ఒక సంబంధం కల్పించి ఈ విధంగా వాక్యాలుగా రూపొందించుకోవాలి.

చదివింది గుర్తుంచుకోవడం ఎవరికైనా అవసరమైందే. జ్ఞాపకం అనేది ఒక తాళం చెవి లాంటిది. చదవడం, నోట్సు రాసుకోవడం, పరీక్షకు తయారుకావడం వంటి మెదడుకు సంబంధించిన అభ్యాసాలకు, జ్ఞాపకశక్తికి దగ్గర సంబంధం ఉంది.

     జ్ఞాపకశక్తికి రెండు స్థాయిలున్నాయి. మొదటి స్థాయిని రిజిస్ట్రేషన్ అని అంటారు. ఈ దశలో మీరు తెలుసుకున్న విషయం ప్రాధాన్యత ఏమిటనేదీ నిర్ణయించుకుంటారు. తాత్కాలిక ప్రయోజనం కలిగిన సమాచారాన్ని ఫలానా పని ముగిసిన వెంటనే మరిచిపోతారు. దీర్ఘకాలిక ప్రయోజనం కలిగిన వాటిని ఎక్కువకాలం గుర్తుంచుకునేందుకు ప్రయత్నిస్తారు. దీనినే తెలుగులో ధారణ అంటారు.

రెండోస్థాయి స్మరణ. గుర్తుంచుకున్న విషయాన్ని అవసరమైన సమయంలో స్ఫురణకు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం ఈ దశలో ఉంటుంది.

దీర్ఘకాలం జ్ఞాపకం పెట్టుకోదగిన విషయాన్ని రాసిఉంచుకోవడం, పదేపదే పునశ్చరణ చేయడం వంటివి చేయాలి. చూడకుండా రాయడానికి ప్రయత్నించాలి. సాధారణంగా ఏడు పదాలను గుర్తుపెట్టుకోవచ్చు. అంతకంటే ఎక్కువ పదాలను గుర్తు పెట్టుకోవాలంటే గుర్తుంచుకోవాల్సిన విషయాలను విభజించుకోవాలి.

కింది అభ్యాసాన్ని చూడండి. ఇక్కడ 20 పదాలున్నాయి. వీటిని ఒకసారి చదివిన తర్వాత కనీసం సగం పదాలను మీరు తిరిగి చెప్పగలిగితే మీకు అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉన్నట్లు లెక్క.

1. గులాబీ, 2. కారు, 3. బల్ల, 4. బల్బు, 5. కలం, 6. పొద్దుతిరుగుడుపువ్వు, 7. స్కూటర్, 8. కుర్చీ, 9. ట్యూబ్‌లైట్, 10. పలక, 11. మల్లెపువ్వు, 12. జీపు, 13. మంచం, 14. దీపపు బుడ్డి, 15. కాగితం, 16. బంతిపువ్వు, 17. హెలికాప్టర్, 18. బెంచి, 19. గ్యాస్‌లైట్, 20. చాక్‌పీస్.

వీటిలో సగం పదాలు మీకు తేలికగానే గుర్తుంటాయి. మొత్తం పదాలను గుర్తుంచుకునే పద్ధతి ఉంది. ఈ పదాలన్నింటినీ 1. పువ్వులు, 2. వాహనాలు, 3. ఫర్నిచర్, 4. కాంతినిచ్చేవి, 5. స్టేషనరీ విభాగాల కింద విభజించుకుని చూడండి. ఒక్కో శీర్షిక కింద నాలుగు పదాలు వస్తాయి. మీకు తేలికగా జ్ఞాపకం ఉంటాయి.

ఈ పద్ధతిని మీ క్లాసు పుస్తకాల్లోని సాంకేతిక పదాలను గుర్తుంచుకోవడానికి అనువర్తించుకోండి.

Posted Date: 11-09-2020


 

జ్ఞాపకశక్తి

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం