• facebook
  • whatsapp
  • telegram

జ్ఞాపకశక్తి

'ఎంత చదివినా గుర్తుండటం లేదు' అనేది చాలామంది విద్యార్థులు తరచుగా చేసే ఫిర్యాదు. ఏం గుర్తుండటం లేదు? ఎన్నిసార్లు చదివితే గుర్తుండటం లేదు? ఎలా చదివితే గుర్తుండటం లేదు? అని అడిగితే మాత్రం సమాధానం ఉండదు. చాలామంది తుమ్ము, దగ్గు, గుండెకొట్టుకోవడం, ఊపిరిపీల్చడం ఇలాంటి పనుల్లాగా గుర్తుండటం, గుర్తుండకపోవడం కూడా మన నియంత్రణలో లేని సహజమైన పని అనుకుంటూ ఉంటారు.

 

అందుకే గుర్తుండటంలేదనే ఆరోపణ చేస్తూ ఉంటారు.

     నిజానికి గుర్తుపెట్టుకోవడం అనేది సహజమైన పని కాదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒకప్పుడు సహజంగా ఉండే ఈ ప్రక్రియను మనం ప్రయత్నపూర్వకంగా కృత్రిమంగా మార్చుకున్నాం. ఆదిమ మానవుడి జ్ఞాపకశక్తి జంతువుల జ్ఞాపకశక్తిలాగా సహజంగా ఉండేది. అతడు దాన్ని అభివృద్ధి చేసుకుని తాను కావాలనుకున్నది ఎంతకాలమైనా గుర్తుంచుకొనే శక్తిని సాధించాడు, నిజం చెప్పాలంటే మన చేతిలో లేనిది మనం అక్కర్లేదనుకున్నదాన్ని మర్చిపోలేకపోవడమే.

     జ్ఞాపకశక్తి అంటే మెదడులోని న్యూరాన్ల లింకులు అని నిర్వచించాడొక శాస్త్రవేత్త. దీన్ని ఇంకొంచెం వివరిస్తే మన జ్ఞాపకాలన్నీ మెదడులోని నాడీకణాల మధ్యలింకుల్లో నిల్వ ఉంటాయి. సాధారణంగా ఆరోగ్యవంతులైన మానవులందరికీ ఈ లింకుల సంఖ్య సమానంగా ఉంటుంది. కానీ ఈ లింకుల్లో ఎన్ని క్రియాశీలంగా ఉంటే మన జ్ఞాపకాలు అంత తాజాగా చురుగ్గా ఉంటాయి. ఇలా ఈ లింకులను క్రియాశీలంగా ఉంచుకొని జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి తగినంత అభ్యాసం చేయాలి. అంతే.

చదివింది గుర్తుండకపోవడానికి ముఖ్యకారణం దానిమీద మనకు తగిన శ్రద్ధ లేకపోవడం, ప్రయత్నం చేయకపోవడం, గుర్తుంచుకోవాలనే ఆలోచన కలగకపోవడం. పట్టుదల ఉంటే ఎంత కఠినమైన విషయాన్నైనా గుర్తుంచుకోవడం కష్టం కాదు.

     చాలాకాలం క్రితం చదివేసిన పసలేని విషయాలు ఇప్పుడు గుర్తుండకపోవచ్చు. అందుకే పునశ్చరణ చేయడం అవసరం. పునశ్చరణ చేసిన విషయాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తడుముకోకుండా చెప్పగలుగుతాం. అందుకే జ్ఞాపకశక్తికి ముఖ్యమైనది పునశ్చరణ. ఉదాహరణకి సినిమాలోని ఒకే డైలాగు అదే స్వరంతో, అదే స్థాయిలో అనేకసార్లు వినడం వల్ల మన హృదయఫలకంపై గుర్తుండిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత కూడా దాన్ని యథాతథంగా చెప్పగలుగుతాం. విద్యార్థుల విషయంలో కూడా ఈ సూత్రం వర్తిస్తుంది.

కొందరికి టెలిఫోన్ నెంబర్లు బాగా గుర్తుంటాయి. కొందరికి కారు నెంబర్లు, మరికొందరికి సినిమా పేర్లు ఇలా ఎవరి అభిరుచిని బట్టి వారికి జ్ఞాపకాలుంటాయి. అదే అభిరుచిని ఇతర అంశాల్లోకి ప్రవేశపెట్టి విజయం సాధించవచ్చు.

రైమ్, రిథమ్ ఉన్నవాటిని గుర్తుపెట్టుకోవటం తేలిక. ఉదాహరణకి పద్యాలు, పాటల్లాంటివి. మనం గుర్తు పెట్టుకోవాలని ప్రయత్నిస్తూ తరచుగా విఫలమవుతున్న విషయాన్ని ఒక రైమింగ్‌లో అనుకోగలిగితే కచ్చితంగా గుర్తుంటుంది.

జ్ఞాపకానికి ఒక అసోసియేషన్ ఉంటుంది. అంటే ఒక పేరు చెబితే మరికొన్ని ఇతర అంశాలు జమిలిగా గుర్తురావడం. ఉదాహరణకి తిరుపతి పేరు చెబితే వేంకటేశ్వరస్వామి గుర్తురావడం. మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అంశానికి ఇటువంటి అనుబంధాలేమైనా ఉన్నాయేమో గుర్తించండి.

మాట్లాడవలసిన లేదా రాయవలసిన అంశాల్లో ముఖ్యమైనవాటిని విభజించుకోవాలి. వ్యాసం రాసేటప్పుడు ఉపశీర్షికల మాదిరిగా రాసుకోవాలి. జాబితా పెద్దదిగా ఉన్నప్పుడు ఉపశీర్షికల్లోని మొదటి అక్షరాలను గుర్తుంచుకోవాలి. వీటిని పెగ్‌వర్డ్స్ అంటారు. అయితే చిన్న చిన్న వాటికి ఈ పద్ధతిని వాడకండి.

       మానవ మేధస్సులో లక్షల పదాలకు చోటుంది. మెదడు నిండిపోవడం అంటూ జరగదు. కాకపోతే కొత్తపదాలు మెదడులో స్థానం ఆక్రమించగానే పాతవాటిని వెనక్కి నెట్టేస్తాయి. మనకు కావాల్సిన ఫైల్ ఏ ఫోల్డర్‌లో పెట్టామో, కనీసం ఏ పేరుతో సేవ్ చేశామో కూడా గుర్తుండని పరిస్థితి ఉంటుంది. కంప్యూటర్‌లో 'డిస్క్‌క్లీన్అప్' ఆప్షన్‌ను వాడటం చాలా తేలిక. మన మెదడులో కూడా అటువంటి చర్యతోనే పాత సంగతులను గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. అంటే అనవసరమైన విషయాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం మానుకోవాలి. లేదంటే పాత జ్ఞాపకాలకు, కొత్తజ్ఞాపకాలకు మధ్య సంఘర్షణ ఏర్పడి మరపు రాక తప్పదు.

నేర్చుకునే సమయంలో శ్రద్ధ చూపకపోవడం, వినకపోవడంతోపాటు అవగాహనా లోపం వల్ల కూడా మరపు సంభవిస్తుందని సైకాలజిస్టులు చెబుతారు.

కొన్ని విషయాలు మనకు బాగా తెలిసినా.. తలుచుకున్న వెంటనే జ్ఞాపకం రావు. దీన్ని 'రిట్రీవల్‌'లోని లోపంగా భావిస్తారు. అణిచివేసిన జ్ఞాపకాలు కూడా వెంటనే స్ఫురణకు రావు.

      ఒకసారి చదివిన వాటినే మళ్లీ మళ్లీ చదవాలి. ఒక గంటసేపు విన్న పాఠాన్ని అదేరోజు ఒకసారి చదివితే బాగా జ్ఞాపకం ఉంటుంది. క్రితంరోజు విన్నదాన్ని ఈరోజు మళ్లీ పరిశీలించడం అవసరం. అలాగే వారం తర్వాత చేయడం. పరీక్షలు దగ్గర పడేకొద్దీ మీరు రివిజన్ చేయవలసిన అధ్యాయాల సంఖ్య పెరిగిపోతుంది. అయినా విసుగు చెందకండి. ప్రతిసారీ రివిజన్‌కి ఎక్కువ టైం తీసుకోదు. ఒకసారి చూడగానే విషయం అంతా మీకు అవగాహనకు వస్తుంది.

Posted Date: 11-09-2020


 

జ్ఞాపకశక్తి

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం