• facebook
  • whatsapp
  • telegram

సమన్వయం సాధిస్తేనే సక్సెస్‌!

లక్ష్య సాధనకు మెలకువలు

రాయాల్సిన అసైన్‌మెంట్లు సిద్ధంగా ఉంటాయి. చదవాల్సిన చాప్టర్లూ ఎన్నో ఉంటాయి. కానీ అందుబాటులో ఉండే సమయం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అయితే వీటన్నింటి మధ్యా సమన్వయాన్ని సాధిస్తూ మీరెలా ముందుకు వెళతారనే దాని మీదే విజయం ఆధారపడి ఉంటుంది. 

కొందరు విద్యార్థులు నిర్ణీత సమయంలోపలే అనుకున్న అసైన్‌మెంట్లు పూర్తి చేస్తారు. సకాలంలో సిలబస్‌ లక్ష్యాలను సాధిస్తారు. మరికొందరు మాత్రం ఇవి చేయకుండా వెనకబడుతుంటారు. దీనికి కారణం- తమ పనులను హేతుబద్ధంగా సమన్వయం చేసుకునే నేర్పు వారికి లేకపోవడమే. అలాకాకుండా ఉండటానికి ఏయే మార్గాలను అనుసరించాలో చూద్దామా... 


చేయాల్సిన పనులను.. వాటి ప్రాథమ్యాలను బట్టి విభజించుకోవాలి. పనుల్లో అత్యవసరమైనవీ, అత్యవసరం కానివీ ఉంటాయి. అలాగే ముఖ్యమైనవీ, ముఖ్యం కానివీ ఉంటాయి.


1 ముఖ్యమైనవీ, అత్యవసరమైనవీ అయిన పనులను ముందుగా పూర్తిచేయాలి. ఎందుకంటే వీటి ప్రభావం.. వ్యక్తిగత, విద్యార్థి జీవితంపై ఉంటుంది. 


2 తర్వాత ముఖ్యమైనవీ, అత్యవసరం కానివీ అయిన వాటిని నిర్వర్తించడానికి షెడ్యూల్‌ చేసుకోవాలి. వాటిని నిర్ణీత వ్యవధిలో పూర్తిచేసుకోవాలి.  


3 ఇక అంత ముఖ్యం కాని పనులు ఉంటాయి కదా? వాటిలో అత్యవసరంగా భావించేవాటిని ఇతరులకు అప్పగించవచ్చు. 


4 చివరిగా-ముఖ్యం కానివీ, అత్యవసరమూ కానివీ అయిన పనులు మిగులుతాయి. వాటిని పట్టించుకోకుండా నిశ్చింతగా వదిలేయవచ్చు.


పనుల మధ్య సాధించే ఈ సమన్వయంతో సమయం వృథా కాదు. ఒత్తిడి లేకుండా సానుకూల ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. 


ఆచరణాత్మకంగా...

చేయాల్సిన పనులెప్పుడూ వాస్తవానికి దగ్గరగా, ఆచరణాత్మకంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలనే నియమాన్నీ పెట్టుకోవాలి. గడువు అనేది లేకపోతే పనికి అంతమంటూ ఉండదు. అది నెలలు, సంవత్సరాల తరబడి అలా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి నిర్ణీత సమయంలోగా పూర్తిచేయాలనే నియమం పెట్టుకోవడం అవసరం. 

వ్యక్తిగత, విద్యాపరమైన దీర్ఘకాలిక లక్ష్యాలను స్వల్పకాల లక్ష్యాలుగా విభజించుకుని ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల ఒకసారి విఫలమైనా మళ్లీ ప్రయత్నించి సాధించే అవకాశం ఉంటుంది. 

తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయాలని ఆరాటపడటం వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. పనుల్లో నాణ్యత లోపించే అవకాశం ఉంటుంది. అలా కాకుండా.. ఒకదాని తర్వాత మరోటి ప్రాధాన్య క్రమంలో పూర్తిచేయడం వల్ల ఆశించిన ఫలితాలను అందుకోవచ్చు.  

ఏకాగ్రతతో మెరుగ్గా పుస్తక పఠనం సాగాలంటే.. చదివేటప్పుడు మధ్యలో చిన్న విరామం తీసుకోవాలి. అరగంటలో ఇరవైఐదు నిమిషాలసేపు చదివి.. ఐదు నిమిషాల విరామం తీసుకున్నా మంచిదే. రెండుగంటలపాటు చదివితే.. పావుగంట నుంచి ఇరవై నిమిషాల వరకూ బ్రేక్‌ తీసుకోవచ్చు. దీనివల్ల విసుగు, అలసట లేకుండా ఏకాగ్రతతో చదవగలుగుతారు. 

‣ ఏ పనికైనా ప్రణాళిక ఎంతో అవసరం. ఏ సబ్జెక్టు చదవడానికి ఎంత సమయం కేటాయించాలనేది టైమ్‌టేబుల్‌ వేసుకోవాలి. దాన్ని కచ్చితంగా పాటించడానికే ప్రయతించాలి. 

ఎలాంటి పరిస్థితుల్లోనూ చేయాల్సిన పనులను వాయిదా వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 

విద్యార్థిగా మీరు చేయాల్సిన పనులూ, సాధించాల్సిన లక్ష్యాలు ఎన్నో ఉంటాయి. ఈలోగా స్నేహితులు, బంధువుల నుంచి వివిధ వేడుకలకు ఆహ్వానాలు రావొచ్చు. సీరియస్‌గా చదువుతుండగా ఫ్రెండ్‌ వచ్చి సినిమాకు వెళదామని బలవంతం చేయొచ్చు. ఇలాంటప్పుడు రాలేనని ఎదుటివారిని నొప్పించకుండా, మర్యాదగా చెప్పగలగాలి. అంటే వివిధ పనుల మధ్య సమన్వయం సాధించడానికి ‘నో’ చెప్పడమూ తెలిసుండాలి. 

సమయాన్ని ఆదా చేసుకోవడానికి టెక్నాలజీ సాయం తీసుకోవచ్చు. ఆర్గనైజ్డ్‌గా ఉండటానికీ, లక్ష్యసాధనకూ డిజిటల్‌ క్యాలెండర్లను, టాస్క్‌ మేనేజ్‌మెంట్‌ యాప్స్‌ను, నోట్‌టేకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకోవచ్చు. సోషల్‌ మీడియాలో ఎక్కువ సమయాన్ని దుర్వినియోగం చేయకుండా నియంత్రించడానికి.. వెబ్‌సైట్‌ బ్లాకర్స్‌ లేదా యాప్‌ టైమర్లను వినియోగించుకోవచ్చు.   


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బీటెక్‌తో ఆర్మీలో ఉద్యోగాలు

‣ నాలుగేళ్ల కోర్సు.. నైపుణ్యాలతో మెరుగు!

‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!

‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

‣ రెజ్యూమె రాయడంలో జాగ్రత్తలు

‣ కొలువు సాధనకు తొలి అడుగు!

Posted Date: 06-10-2023


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం