• facebook
  • whatsapp
  • telegram

కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!

మైక్రోసాఫ్ట్‌లో రూ.52 లక్షల ప్యాకేజీకి ఎంపికైన జ్యోతిరెడ్డి‘అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటే మెరుగైన ఫలితాలు వాటంతటవే వస్తాయి’ అంటోంది హైదరాబాద్‌లోని బీవీఆర్‌ఐటీ విద్యార్థిని జ్యోతిరెడ్డి. మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఇటీవల జరిపిన నియామకాల్లో ఏడాదికి రూ.52 లక్షల ప్యాకేజీతో ఎంపికైన ఆమె.. ఇందుకోసం తనెలా సన్నద్ధమైందో మనతో ఇలా పంచుకుంటోంది..! 


మాది హైదరాబాద్‌లోని నిజాంపేట. పదోతరగతిలో 90 శాతం, ఇంటర్‌లో 95 శాతం మార్కులు సాధించాను. ఎంసెట్‌లో 4800 ర్యాంకు రావడంతో మొదటి కౌన్సెలింగ్‌లోనే బీవీఆర్‌ఐటీ విమెన్స్‌ కాలేజీలో సీఎస్‌సీ ఏఐ-ఎంఎల్‌ సీటు దొరికింది. కేవలం సీఎస్‌సీ కాకుండా ఏఐ-ఎంఎల్‌ కూడా ఉంటే మెరుగైన అవకాశాలు పొందవచ్చనే ఉద్దేశంతో అందులో చేరాను. అయితే మా బ్యాచ్‌కు మొదటి రెండు సంవత్సరాలు కొవిడ్‌ వల్ల క్లాసులు వర్చువల్‌గానే జరిగాయి. అది కొంచెం ఇబ్బందే అయినా ఆ సమయాన్నీ, సందర్భాన్నీ కెరియర్‌కు పునాది వేసుకునేలా ఉపయోగించుకున్నాను. వివిధ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజ్‌లు నేర్చుకోవడం, ఉద్యోగ ప్రకటనలు వెలువడినప్పుడు దరఖాస్తు చేయడం, ప్రొఫైల్‌ను ఇంకా మెరుగుపరుచుకోవడం.. ఇవన్నీ బీటెక్‌లో చేరిన నాటి నుంచే ప్రారంభించాను. 


ఇంజినీరింగ్‌ రెండో ఏడాదిలో ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్‌ యంగ్‌ఏజ్‌ ప్రోగ్రామ్‌ గురించి మా అధ్యాపకుల ద్వారా తెలిసింది. మంచి అవకాశం కావడంతో దానికి దరఖాస్తు చేశాను. దీని ద్వారా ఎంపిక చేసిన విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌ కంపెనీ ఉద్యోగుల మెంటర్‌షిప్‌ లభిస్తుంది. వారి ఆధ్వర్యంలో విద్యార్థులు ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాజెక్టు నచ్చితే కంపెనీ తరఫున ఇంటర్న్‌షిప్‌కి ఎంపిక చేస్తారు. అక్కడా మంచి ప్రదర్శన కనబరిస్తే నేరుగా ఉద్యోగంలోకి తీసుకుంటారు. నేను అలా మూడో ఏడాదిలో ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యాను. ఇప్పుడు ఉద్యోగం కూడా దక్కింది. 


యువతులకు ప్రోత్సాహం

సాఫ్ట్‌వేర్‌ రంగంలో యువతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో టాలెంట్‌ స్ప్రెడ్‌ అనే సంస్థ ‘విమెన్‌ ఇంజినీర్స్‌’ అనే కార్యక్రమం నిర్వహిస్తోంది. ఇందులో దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్‌ చదువుతున్న యువతులను దరఖాస్తు, ప్రాథమిక పరీక్షల తర్వాత కోర్సుకు ఎంపిక చేస్తారు. మొత్తంమీద 200 నుంచి 300 మందినే తీసుకుంటారు. టాప్‌ 50 స్టూడెంట్స్‌కు 100 శాతం స్కాలర్‌షిప్‌ సైతం లభిస్తుంది. కాలేజీ అధ్యాపకుల సూచన మేరకు దరఖాస్తు చేశాను. వెంటనే ఎంపిక కావడంతోపాటు టాప్‌గా నిలవడంతో పూర్తిగా ఉచితంగా కోర్సు పూర్తిచేశాను. రెండేళ్లపాటు డిగ్రీతో సమాంతరంగా ఈ తరగతులు ఆన్‌లైన్‌లో జరిగేవి. ఇలా బోధించేవారంతా అమెజాన్, గూగుల్‌ వంటి ఉన్నతశ్రేణి కంపెనీల్లో పనిచేసి వచ్చినవారే కావడంతో కాలేజీలో చెప్పేదానికి అదనంగా పరిశ్రమ గురించి లోతుగా ఇందులో తెలుసుకునే వీలు కలిగింది. రెండేళ్ల ఈ మెంటర్‌షిప్‌ పూర్తి చేసినట్టుగా వచ్చిన సర్టిఫికేషన్‌ రెజ్యూమెను మరింత ఆసక్తికరంగా మలచడంలో ఉపయోగపడింది. 


తొలి ఏడాది నుంచే..

మొదటి సంవత్సరం నుంచే వెబ్‌ డెవలప్‌మెంట్, డేటా సైన్స్‌ వంటి కొన్ని సర్టిఫికేషన్‌ కోర్సులు చేస్తూ వచ్చా. అకడమిక్స్, ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్, సెల్ఫ్‌ లెర్నింగ్‌.. అన్నింటినీ బ్యాలెన్స్‌ చేసుకోవాలి. చాలా మంది విద్యార్థులను చూస్తుంటా.. ఏవైనా జాబ్‌ ఓపెనింగ్స్‌ ఉన్నప్పుడు ‘మాకు పూర్తిగా స్కిల్స్‌ లేవు, సెలక్ట్‌ అవుతామో లేదో’ అని సందేహిస్తూ దరఖాస్తు చేయడానికి వెనకాడుతుంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు. మొదటి రెండేళ్లు విద్యార్థుల నుంచి కంపెనీలు కనీస నైపుణ్యాలు మాత్రమే ఆశిస్తాయి. వారు పూర్తిగా సిద్ధం కాలేదన్న విషయం వాటికీ తెలుసు. అయితే ఆ రెండేళ్లూ మంచి మార్కులు తెచ్చుకునేందుకు కచ్చితంగా ప్రయత్నించాలి. కనీసం 8- 9 మధ్య సీజీపీఏ ఉంటే.. తర్వాత రెండేళ్లు ఎటూ స్టూడెంట్స్‌ ఇంటర్న్‌షిప్స్, ఇంటర్వ్యూలతో బిజీగా ఉండటం వల్ల మార్కులు తగ్గినా కంపెనీలు పట్టించుకోవు.  కానీ మొత్తంగా 8 పైన సీజీపీఏ ఉండేలా ప్రయత్నించాలి. 


వీలైనన్ని ఎక్కువ అప్లికేషన్లు పెట్టడం చాలా అవసరం. ఒక దరఖాస్తు పెట్టడం వల్ల మహా అయితే రిజెక్ట్‌ అవుతాం అంతే.. కానీ ఆ ప్రక్రియలో మనం చాలా నేర్చుకునే వీలుంటుంది. రెజ్యూమె ఎలా ఉండాలి, ముఖాముఖిలో ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి, మనం ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నాం, ఇంకా ఏం నేర్చుకోవాలి, పోటీ ఎలా ఉంది.. ఇవన్నీ తెలిసేది అక్కడే. అందువల్ల వచ్చిన ప్రతి ఆఫర్‌కూ దరఖాస్తు చేయాలి. మనలో ఏం ఉంది, ఏం లేదు అనేది కంపెనీ చూసుకుంటుంది. ప్రతిచోటా ప్రయత్నించడం, మరింత మెరుగుపరుచుకోవడమే మన విధి. 


ఇంటర్వ్యూలో రెజ్యూమె ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఏ కంపెనీకి దరఖాస్తు చేస్తున్నా దాని అవసరాలకు తగినట్టుగా మన వద్ద ఉన్న నైపుణ్యాలను హైలైెట్‌ చేస్తూ ఉండాలి. చేసిన ప్రోగ్రామ్స్, సర్టిఫికేషన్స్, ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్స్‌ అన్నీ వివరంగా ఇవ్వాలి. అభ్యర్థికి నైపుణ్యాలతోపాటు సరైన ఆలోచనా ధోరణి ఉందా లేదా అనేది కంపెనీలు ప్రధానంగా గమనిస్తాయి.  


కెరియర్‌కు సంబంధించి కొన్ని మంచి యూట్యూబ్‌ చానెళ్లు ఉన్నాయి. వాటిని చూసి కొత్త విషయాలు నేర్చుకున్నా. డైనమిక్‌ ప్రోగ్రామింగ్‌కి ‘అబ్దుల్‌బరి’, సీ ప్లస్‌ ప్లస్‌కి ‘అప్‌నా కాలేజ్‌’, ‘గేట్‌ స్మాషర్స్‌’ వంటివన్నీ చూస్తూ వచ్చాను. 


కేవలం ఒక్క డొమైన్‌నే నేర్చుకుని ఊరుకోకుండా మొత్తం అన్ని డొమైన్స్‌ గురించి అవగాహన పెంచుకోవడం అవసరం. 


నాకు వచ్చే ఏడాది జులైలో పోస్టింగ్‌ ఇస్తారు. హైదరాబాద్, నోయిడా, బెంగళూరులో ఎక్కడైనా ఇవ్వొచ్చు. రెండేళ్లు పని చేశాక మాస్టర్స్‌ లేదా ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నా. ఎంబీఏ చేస్తే మేనేజర్‌ హోదాలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకే అలా అనుకుంటున్నా. 


ఉద్యోగం అవసరమే కానీ.. 

ఒక్కోసారి మనం అనుకున్నవి నెరవేరకపోవచ్చు. నేను కూడా గూగుల్, వీసా వంటి కంపెనీల వద్ద విఫలమయ్యా. అలా అని అదే పనిగా ఒత్తిడి తీసుకోవడం సరికాదు. రోజులో కొంత సమయాన్ని దీని కోసం కేటాయించడం ముఖ్యం. తర్వాత రిలాక్స్‌ అయ్యేందుకు నచ్చిన పని చేయాలి. కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం, వాకింగ్‌కు వెళ్లడం వంటివి చేశా. నిజానికి ఇప్పుడు బయట జాబ్‌ మార్కెట్‌ కొంచెం క్లిష్టంగా ఉన్న మాట వాస్తవమే. అయినా మన ప్రయత్నం మనం చేస్తూ మెరుగుపరుచుకుంటూ ఉంటే తప్పకుండా విజయం సాధించగలం! 


వచ్చిన ప్రతి ఆఫర్‌కూ దరఖాస్తు చేయాలి. ప్రతిచోటా ప్రయత్నించడం, మరింత మెరుగుపరుచుకోవడమే మన విధి. 


కేవలం ఒక్క డొమైన్‌నే నేర్చుకుని ఊరుకోకుండా మొత్తం అన్ని డొమైన్స్‌పైనా అవగాహన పెంచుకోవడం అవసరం. 


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

‣ రెజ్యూమె రాయడంలో జాగ్రత్తలు

‣ కొలువు సాధనకు తొలి అడుగు!

Posted Date: 03-10-2023


  • Tags :

 

ఇత‌రాలు

మరిన్ని