• facebook
  • whatsapp
  • telegram

Education: ఐఐటీ బాంబేలో సీటు సాధించిన గిరిపుత్రిక

* ప్రభుత్వ సంక్షేమ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదివిన యువతి

జేఈఈ... ప్రతిష్ఠాత్మక కళాశాలల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష. దీనికి దేశవ్యాప్తంగా లక్షల్లో పోటీపడతారు. అందుకే చాలామంది ప్రత్యేకంగా కోచింగ్‌ తీసుకుంటారు. అయినా వెనకబడే వారెందరో! అలాంటిది ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివీ... ఐఐటీ బాంబేలో సీటు సాధించింది... బానోతు నవ్య!

గిరిజన బిడ్డ... ఐఐటీ సాధించింది!

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని గంగబండ తండా నవ్యది. అమ్మానాన్నలు మోతీలాల్, సరోజ. ముగ్గురు సంతానంలో నవ్య పెద్దది. వీళ్లది వ్యవసాయంపై ఆధారపడి బతికే గిరిజన రైతు కుటుంబం. స్థానిక మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి వరకు చదివింది నవ్య. అదీ తెలుగు మాధ్యమంలో! ఉన్నత పాఠశాల కోసం 3కి.మీ. దూరంలోని మండల కేంద్రానికి వెళ్లాలి. అమ్మానాన్నలు చదువుకోలేదు. ఆర్థిక పరిస్థితీ అంతంతమాత్రమే. అయినా నవ్య ఆసక్తిని కాదనలేదు. అయితే అయిదు నుంచి ఆంగ్లమాధ్యమం. కాస్త తడబడినా పట్టుదలగా చదివి పదో తరగతిలో 9.5 గ్రేడ్‌ సాధించింది. ఆపై వికారాబాద్‌ జిల్లా పరిగిలోని గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్‌ ఎంపీసీ విభాగంలో చేరింది. ఇక్కడా 964 మార్కులు సాధించింది. అంతేకాదు ప్రతిష్ఠాత్మక జేఈఈ ప్రవేశపరీక్షలో ర్యాంకు సాధించి, ఐఐటీ బాంబేలో సీటునీ సాధించింది.
‘కళాశాలలో పాఠాలే కాదు... జేఈఈకి సంబంధించిన శిక్షణనీ ఇచ్చారు. రెండిటికీ ప్రాధాన్యమిస్తూ వచ్చా. ఇంటర్‌ పరీక్షలు అయ్యాక పూర్తిగా జేఈఈపైనే దృష్టిపెట్టా. సన్నద్ధతకే 16 గంటలు కేటాయించా. లెక్చరర్లు నేర్పిన మెలకువలూ సాయపడ్డాయి. కాబట్టే, ఎస్టీ విభాగంలో 1251వ ర్యాంకు సాధించా. ఈ క్రమంలో ప్రధానాచార్యులు సుమతి ప్రోత్సాహాన్ని మర్చిపోలేను. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) -బాంబేలో సీటొచ్చింది. మెటలర్జికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మెటీరియల్‌ సైన్స్‌ ఎంచుకున్నా. మారుమూల గిరిజన అమ్మాయిని. ఇక్కడివరకూ వెళ్లడం, నాన్న నమ్మకాన్ని నిలబెట్టడం ఆనందంగా ఉంది. అయితే నా లక్ష్యం మాత్రం ఐఏఎస్‌ అవ్వడం’ అని చెప్పుకొచ్చింది నవ్య.

- ఎండీ అబ్దుల్‌ రజాక్, కూసుమంచి
 

Posted Date: 24-06-2024


  • Tags :

 

ఇత‌రాలు

మరిన్ని