• facebook
  • whatsapp
  • telegram

ఆ ఊరి అమ్మాయికి విదేశాల్లో మొదటి మాస్టర్స్‌ డిగ్రీ!

* పట్టు పట్టి పట్టా సాధించిన పల్లెటూరి పిల్ల

విదేశాలకు వెళ్లడం... మాస్టర్స్‌ చేయడం, అక్కడే స్థిరపడటం ఇప్పుడు చాలా మామూలు అయిపోయింది కదా! అయినా ఎందుకీ అమ్మాయి ఇంత సంబరంగా చెబుతోంది అంటారా? తన కుటుంబం నుంచి ఆ పట్టా పొందిన తొలి వ్యక్తి తను. అసలు చదువుకోసం ఊరు వదిలిన మొదటి అమ్మాయి కూడా. ఇంకా తెలుసుకోవాలనుందా... అయితే ఐశ్వర్య తౌకరి గురించి చదివేయాల్సిందే!

‘అమ్మాయిలు వీధిలోకెళ్లి ఆటలాడకూడదు’ అంది అమ్మ. తనేమో బ్యాటు చేతపట్టి అబ్బాయిలతో కలిసి క్రికెట్‌ ఆడేది. ఎదురు చెప్పకూడదు, నెమ్మదిగా మాట్లాడాలి అన్నవాటికీ వ్యతిరేకం. తన అభిప్రాయాన్ని బలంగా చెప్పడానికి అస్సలు వెనకాడేది కాదు. ఐశ్వర్యది కర్ణాటకలోని చిన్న ఊరు. నలుగురు పిల్లల్లో చిన్నదామె. నచ్చింది చేయడానికీ, చదవడానికీ ఇంట్లో యుద్ధమే చేసింది. ఇంట్లోవాళ్లు బతిమాలినా, భయపెట్టినా బాల్యవివాహానికి ఒప్పుకోలేదు. తన జీవితం తన చేతుల్లోనే ఉండాలని బలంగా కోరుకుంది. తన అంతిమ లక్ష్యం ఓ మంచి అత్తారిల్లు కావొద్దు అనుకుంది. ఇంట్లోవాళ్లు వ్యతిరేకించినా స్కాలర్‌షిప్‌లతో చదువుకుంటూ వెళ్లింది. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ, డిజిటల్‌ మార్కెటింగ్, పబ్లిక్‌ రిలేషన్స్‌లో డిప్లొమా పూర్తిచేసింది. 19 ఏళ్ల వయసులో ఇంటర్న్‌షిప్‌ కోసం ఊరు దాటింది. 21కి ఒంటరిగా ముంబయి చేరుకుని, ఓ ప్రముఖ పీఆర్‌ సంస్థలో ఉద్యోగం సాధించింది. కెరియర్‌లో గుర్తింపు తెచ్చుకుంది. అలా రాణిస్తున్నప్పుడే విరామం తీసుకుంది. ఓవైపు ఫ్రీలాన్సింగ్‌ చేస్తూనే న్యూజిలాండ్‌లో మాస్టర్స్‌ చేసింది. తన ఊరి నుంచి విదేశాలకు వెళ్లిన, కుటుంబంలో మాస్టర్స్‌ పూర్తిచేసిన తొలి అమ్మాయిగా నిలిచింది 27 ఏళ్ల ఐశ్వర్య. తన ఆనందాన్నీ, ఈ క్రమంలో దాటిన సవాళ్లనూ లింక్డిన్‌లో రాసుకుంటూ వచ్చింది. ‘కొత్తగా ప్రయత్నించడం అంత సులువేమీ కాదు. ఎన్నో ప్రశ్నలు, సవాళ్లు ఎదురవుతాయి. ఎన్నో తప్పులూ చేస్తుంటాం. మన కష్టానికి విలువనిచ్చేవారు, గుర్తించేవారూ దొరకరు. అవన్నీ పక్కనపెట్టి శారీరక, మానసిక ఆరోగ్యాలను గమనించుకుంటూ కోరుకున్న లక్ష్యాన్ని చేరడం కష్టసాధ్యమే. అయినా ప్రయత్నిస్తూ వెళ్లా. నా ఆశల్లా ఏదో ఒకరోజు అనుకున్నది సాధిస్తాననే! పల్లెటూరి అమ్మాయి. కమ్యూనికేషన్‌ తెలియదు అన్న స్థాయి నుంచి ఓ ఎంఎన్‌సీలో ఉద్యోగం, విదేశంలో పీజీ చేశానంటే సాధించినట్టేగా? అయితే ఈ ప్రయాణం నాతోనే ఆగకూడదు. మరెంతోమంది ధైర్యంగా కోరుకున్న బాటలో నడవాలన్నదే నా ఆశ’ అంటోన్న ఐశ్వర్య పోస్ట్‌కు... అభినందనలతోపాటు ప్రశంసలూ దక్కుతున్నాయి. ఈమె ప్రయాణం స్ఫూర్తిదాయకమే కదూ! 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త అవకాశాలకు.. ఆన్‌లైన్‌ టీచింగ్‌!

‣ ఆశయ సాధనకు అలుపెరుగని కృషి!

‣ ఆస్ట్రోఫిజిక్స్‌తో అపార అవకాశాలు!

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

Posted Date: 24-05-2024


  • Tags :

 

ఇత‌రాలు

మరిన్ని