• facebook
  • whatsapp
  • telegram

మెరుగైన భావ ప్రకటనకు మార్గాలివిగో..

విద్యార్థులు, ఉద్యోగార్థులకు సూచనలుపాఠాలను జాగ్రత్తగా వినడంతోపాటు.. ఏవైనా సందేహాలు ఉంటే అడిగి తెలుసుకోవడం. ఆలోచనలు, అభిప్రాయాలను పైకి చెప్పగలడం, అర్థవంతంగా రాయలగడం.. ఇవన్నీ కూడా భావవ్యక్తీకరణ నైపుణ్యం కిందికే వస్తాయి. విద్యార్థులకూ, ఉద్యోగార్థులకూ ఎంతో అవసరమైన ఈ సామర్థ్యానికి ఎలా మెరుగులు దిద్దుకోవచ్చో తెలుసుకుందామా... 


తరగతిలో కొన్నిసార్లు.. వర్తమాన ఆర్థిక, సాంఘిక, రాజకీయ అంశాలపై బృంద చర్చలను నిర్వహిస్తుంటారు. వీటిల్లో చురుగ్గా పాల్గొనడం ద్వారా మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తంచేయడాన్ని నేర్చుకోగలుగుతారు. అలాగే బృంద సభ్యుల అభిప్రాయాలతో కొన్నిసార్లు మీరు ఏకీభవిస్తారు.. మరికొన్నిసార్లు విభేదిస్తారు కూడా. ఇలాంటప్పుడు.. మీ అభిప్రాయానికి బలాన్ని చేకూర్చే అంశాలను జోడించి వాదించాల్సి వస్తుంది. ఇలా మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తంచేయగలిగే నేర్పు అలవడుతుంది. 


విద్యాసంస్థల్లో కొన్ని ప్రత్యేక వేడుకల సందర్భంగా నిర్వహించే వక్తృత్వ పోటీల్లో పాల్గొనడం ద్వారా మీ అభిప్రాయాలు, ఆలోచనలను సూటిగా, స్పష్టంగా వివరించగలుగుతారు. ఈ పోటీల్లో భాగంగా అభిప్రాయాలను నిర్ణీత సమయంలోగా, నలుగురినీ ఆకట్టుకునే విధంగా వెల్లడించగలగాలి. తరచుగా వీటిలో పాల్గొనడం వల్ల భావవ్యక్తీకరణ సామర్థ్యానికి మెరుగులు దిద్దుకోవచ్చు. అలాగే వివిధ అంశాలపైన ప్రజెంటేషన్లు ఇవ్వడానికీ ఈ నైపుణ్యం తోడ్పడుతుంది. 


పాడ్‌ కాస్ట్‌లు

ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే కొన్ని ఉచిత పాడ్‌కాస్ట్‌లను వినటం వల్ల వివిధ అంశాలపై చర్చించే నేర్పు అలవడుతుంది. రేడియోలో వర్తమానాంశాలపై చర్చలు వింటూ, టీవీలో చూస్తూ కూడా భావప్రకటనకు మెరుగులు దిద్దుకోవచ్చు. వివిధ అంశాలపై నిపుణులు తమ అభిప్రాయాలను ఎలా వ్యక్తంచేస్తున్నారు.. వాటిని ఎలా సమర్థించుకుంటున్నారు, అలాగే కొన్నిసార్లు ఇతరుల అభిప్రాయాలతో ఎలా విభేదిస్తున్నారు.. మొదలైన వాటిని జాగ్రత్తగా గమనించొచ్చు. ఇంటర్వ్యూలో భాగంగా కొన్నిసార్లు బృంద చర్యల్లో పాల్గొనాల్సీ రావొచ్చు. అలాంటప్పుడు మీ వాదనను సమర్థంగా వినిపించగలుగుతారు. 

ఆసక్తి ఉంటే.. బ్లాగర్‌గా అభిప్రాయాలు పంచుకోవటమూ మంచిదే. వర్తమానాంశాలపై వ్యక్తిగత అభిప్రాయాలను ఆకట్టుకునే విధంగా రాయటం, నిత్యజీవితంలో మీకు ఎదురైన కొన్ని అనుభవాలు, ఎదుర్కొన్న సంఘటనలను ఆసక్తికరంగా వివరించటం, విహారయాత్రలు చేస్తే ఆ ప్రదేశాల్లో మీరు పొందిన ఆనందానికి అక్షరరూపం కల్పించటం.. ఇవన్నీ చేయవచ్చు. 


పబ్లిక్‌ స్పీకింగ్‌ కోర్సులు

ఆన్‌లైన్‌ వేదికల్లో అందుబాటులో ఉండే పబ్లిక్‌ స్పీకింగ్‌ కోర్సుల్లోనూ చేరొచ్చు. దీంట్లో భాగంగా.. ఒత్తిడికి గురికాకుండా ఎలా మాట్లాడాలి, ఒక అంశాన్ని గురించి చర్చించేటప్పుడు.. ప్రసంగం మొదలు పెట్టినప్పటి నుంచి చివరి వరకూ ఒకే స్థాయిలో కాకుండా.. విషయ తీవ్రతను బట్టి గొంతు పెంచడం లేదా మెల్లగా మాట్లాడటం లాంటివి చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకే స్వరస్థాయులను ఎలా నియంత్రించాలనేదీ వివరిస్తారు. అలాగే మాట్లాడేటప్పుడు శరీర భాషకూ ప్రాధాన్యం ఉంటుంది. బాడీలాంగ్వేజ్‌ ఎలా ఉండాలనేదీ బోధిస్తారు. అవకాశం ఉన్నప్పుడు వర్క్‌షాప్‌లకు హాజరుకావడం ద్వారానూ భావవ్యక్తీకరణ నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు. 

కొన్ని ప్రత్యేక సందర్భాల్లో లేదా సెలవుల్లో సినిమాలు చూసే అలవాటు చాలామంది విద్యార్థులకు ఉంటుంది కదా. భావప్రకటనాసక్తి ఉంటే.. వాటిల్లోని పాత్రల సంభాషణ తీరూ పరిశీలించొచ్చు. ఉదాహరణకు హీరో ఇంటర్వ్యూకు హాజరయ్యే సన్నివేశమే ఉందనుకుందాం. అప్పుడు అతడి హావభావాలూ, శరీరభాష, సభ్యులు అడిగే ప్రశ్నలకు అతడు స్పందించే విధానం, సమాధానాలు చెప్పే తీరు.. ఇలాంటివన్నీ పరిశీలించవచ్చు. 

ఒక్క విద్యార్థిగానే కాదు.. జీవితంలోని ప్రతి దశలోనూ ఈ నైపుణ్యంతో ఎంతో అవసరం ఉంటుంది. మీరు ఉండే ప్రదేశాన్ని బట్టి.. మీ పాత్ర కూడా మారిపోతూ ఉంటుంది. కుటుంబంతో ఉన్నప్పుడు మీరు కుటుంబసభ్యుల్లో ఒకరు. అలాగే ప్రయాణికులు, పర్యాటకులు, కొనుగోలుదారులు, అమ్మకందారులు, వినియోగదారులు, ప్రేక్షకులు, పాఠకులు.. ఇలా ఎన్నో రకాల పాత్రలనూ పోషిస్తారు. ఏ పాత్రలో ఒదిగినా.. స్వేచ్ఛగా భావాలను వెల్లడించగలిగే నేర్పు ఎంతో అవసరం. 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ జ్ఞాపకశక్తి పెంచుకునే మార్గాలివిగో..!

‣ సమన్వయం సాధిస్తేనే సక్సెస్‌!

‣ బోధనలో మేటి అవకాశాలకు మెట్టు.. నెట్‌

‣ నిరంతర సమీక్షతోనే లక్ష్య సాధన!

‣ బీటెక్‌తో ఆర్మీలో ఉద్యోగాలు

‣ నాలుగేళ్ల కోర్సు.. నైపుణ్యాలతో మెరుగు!

‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!

Posted Date: 09-10-2023


 

భావ వ్యక్తీకరణ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం