• facebook
  • whatsapp
  • telegram

నచ్చలేదా? నొచ్చుకోకుండా చెప్పండి!

సహ విద్యార్థులతో జరిగే చర్చల్లోనో, గ్రూప్‌ డిస్కషన్‌ లాంటి సందర్భాల్లోనో ఎదుటివారి అభిప్రాయంతో  ఏకీభవించలేకపోవచ్చు. అలాంటప్పుడు మన భిన్నాభిప్రాయాన్ని కఠినంగా చెప్పనక్కర్లేదు. ఎదుటివారు నొచ్చుకోకుండా మర్యాదగానూ తెలియజేయొచ్చు!అందరి అభిప్రాయాలూ, ఆలోచనలూ ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. ఇద్దరు, ముగ్గురు కలిసినచోట ఎప్పుడూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉంటాయి. నిజానికి అందరూ మనలాగే ఆలోచించాలని కోరుకోవడం వాస్తవానికి విరుద్ధం కూడా. విద్యార్థులైనా, ఉద్యోగార్థులైనా, ఉద్యోగులైనా వివిధ సందర్భాల్లో రకరకాల సంభాషణలు, చర్చల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఎదుటివారి అభిప్రాయాన్ని మర్యాదగా ఖండించి మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. అలాగే ఎదుటివారి అభిప్రాయం మనకు నచ్చకపోయినా వెంటనే తొందరపడి ఖండించకూడదు. అహాన్ని కాస్త పక్కన పెట్టి ఎదుటివారి అభిప్రాయాలనూ సహనంతో ఆలకిస్తే సమస్యకు సరికొత్త పరిష్కారాలూ దొరుకుతాయి.

సాధారణంగా ఎదుటివారు తమ కంటే ఎక్కువ హోదాలో ఉన్నవారైతే... వారి అభిప్రాయాలకు ఎదురు చెప్పడానికి కొంతమంది సంకోచిస్తుంటారు. వాళ్లేం చెప్పినా.. ‘ సరే!’ అంటే ఒక్కమాటలో పోతుందని మౌనంగా ఉండిపోతుంటారు. నిజానికి ఇలాంటి ఆలోచనా ధోరణి సమంజసం కాదు. కొన్ని పరిమితులకు లోబడి భిన్నాభిప్రాయాన్ని మర్యాదగా తెలియజేస్తే ప్రత్యేకతను చాటుకోవచ్చు. ఉపయోగించే భాషలో నొచ్చుకునే పదజాలం వాడకూడదు. చెప్పేది ఏదైనా కటువుగా కాకుండా సౌమ్యంగా చెప్పగలిగితే ఎదుటివారు అపార్థం చేసుకునే అవకాశాలు ఉండవు.

అనవసర వాదనలు వద్దు: ఏదైనా ఒక ప్రత్యేకాంశం మీద చర్చలు జరుగుతున్నప్పుడు.. కొంత సమాచారాన్ని అందించి మన వంతుగా సహకరించాలి. అంతేగానీ అనవసరపు వాదనలతో ఎదుటివారికి చిరాకు తెప్పించకూడదు. మన వాదన ఎప్పుడూ చర్చలకు అదనపు విలువను జోడించేదిలా ఉండాలి. కానీ కొంతమంది చర్చల సమయంలో కాస్త అతిగా ప్రవర్తిస్తుంటారు. ఎదుటివారు చెప్పే ప్రతి విషయాన్నీ వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంటారు. భిన్నాభిప్రాయాన్ని తెలియజేయడం వేరు... ప్రతి విషయాన్నీ వ్యతిరేకించడం వేరు. ఈ రెండింటికీ మధ్య ఉండే సున్నితమైన తేడాను గుర్తించాలి.

విద్యార్థులు: వివిధ సందర్భాల్లో జరిగే చర్చల్లో  విద్యార్థుల మధ్య భిన్నాభిప్రాయాలు తలెత్తుతూనే ఉంటాయి. ఒకరికొకరు తమ ఆలోచనలను పంచుకుంటూ పరిష్కారాలను అన్వేషించాలి. ఇతరుల అభిప్రాయాలను ఖండించకుండా ముందుగా వినడాన్ని అలవాటు చేసుకోవాలి. సరైన ఆలోచన ఎవరికి వచ్చినా మిగతా వారంతా దాన్ని ప్రోత్సహించాలి. ఎదుటివారి అభిప్రాయంతో ఏకీభవించకపోయినా ఘర్షణకు దిగకుండా సమస్యను ప్రశాంతంగా పరిష్కరించే నేర్పు అలవర్చుకోవాలి. అలాగే ఎదుటివారు పొరపాటు చేస్తే మన్నించడం, మంచిచేస్తే కృతజ్ఞతలు తెలియజేయడాన్నీ అలవరుచుకోవాలి.

ఉద్యోగార్థులు: ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా గ్రూప్‌ డిస్కషన్స్‌లో నేరుగాగానీ ఆన్‌లైన్‌లోగానీ పాల్గొనాల్సి ఉంటుంది. అలాంటప్పుడు చొరవతో మాట్లాడాలి గానీ.. ఏమీ పట్టనట్టుగా మౌనంగా ఉండకూడదు. ఎదుటివారి అభిప్రాయాలను మొండిగా వ్యతిరేకించి వాదనకూ దిగకూడదు. ఎదుటివారి అభిప్రాయాలను వ్యతిరేకించినా అదే విషయాన్ని వీలైనంత సున్నితంగా, మర్యాదగా తెలియజేయటం ముఖ్యం.

ఉద్యోగులు: కార్యాలయాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తడం అనివార్యం. వీటికి దూరంగా ఉండాలనుకోవడం కంటే సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికే ప్రయత్నించాలి. ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తినప్పుడు.. ఆ అంశాన్ని జాగ్రత్తగా విని, విశ్లేషించడం ద్వారా సులువుగా పరిష్కరించుకోవచ్చు. వీటిని వృత్తిలో భాగంగానే తీసుకోవాలిగానీ వ్యక్తిగతంగా కాదు. చర్చల వల్ల కొత్త సమస్యలేవీ ఉత్పన్నం కాకూడదనే సున్నితమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే నైపుణ్యాలను మెరుగుపరుచుకునే దిశగా సంస్థలు నిర్వహించే వర్క్‌షాపుల్లో పాల్గొనడం, వివిధ కార్యక్రమాల్లో కలిసికట్టుగా పనిచేయడం ద్వారా అభిప్రాయ భేదాలు తలెత్తినా వాటిని తేలిగ్గా తీసుకునే మనస్తత్వం ఉద్యోగులకు అలవడుతుంది.
 

Posted Date: 29-07-2021


 

భావ వ్యక్తీకరణ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం