• facebook
  • whatsapp
  • telegram

నిత్య జీవితానికి న‌గిషీ

భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను (communication skills) ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ, అభివృద్ధి చేసుకుంటూ ఉండాల్సిందే! వాటిని ఎంతగా మెరుగుపర్చుకుంటూ, నవీకరిస్తూ ఉంటే అవి అంతగా నిత్యజీవితంలో ఉపయోగపడతాయి.   

ఇద్దరు వ్యక్తులు లేదా రెండు గ్రూపులకు చెందిన వ్యక్తులు వారి మధ్య సంబంధాలు ఏర్పరుచుకోడానికి ఒకరికొకరు సంకేతాలను, సందేశాలను పంపుకోవడమే కమ్యూనికేషన్. ఇది రాతపూర్వకంగా కావచ్చు. మౌఖికంగా కూడా కావొచ్చు.

* ఒక వ్యక్తి స్వభావం, ప్రవర్తన అతడికి ఇతరులతో ఏర్పడే సంబంధాలను ప్రభావితం చేస్తుంది. అందువల్ల నిజాయితీగా, పాజిటివ్‌గా ఉండటం, సహనంతో నడుచుకోవడం తప్పనిసరి. ఎదుటివారి అభిప్రాయానికి విలువివ్వడం, వారి శక్తియుక్తులపై విశ్వాసం ఉండటం ఎంతో అవసరం. 

ముఖ్యమైన మరో విషయం- ఎదుటివారి ముఖంలోకి సూటిగా చూస్తూ మాట్లాడటం లేదా వారు చెప్పేది వినడం. ఇది ఆ వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించడమే కాక, ఎదుటివ్యక్తి (వినేవారైనా లేక చెప్పేవారైనా) మరింత ప్రతిభతో మాట్లాడేందుకు ప్రోత్సహిస్తుంది. ఎక్కువమందితో మాట్లాడేప్పుడు కూడా మార్చి మార్చి ఒక్కొక్కరి వైపు చూస్తూ మాట్లాడాలి. దానివల్ల ప్రతివ్యక్తీ దాన్ని వ్యక్తిగత సంభాషణగా భావించడానికి తగిన వాతావరణం ఏర్పడుతుంది.

* హావభావాలు, ముఖ కవళికలు (Body Language) భావ వ్యక్తీకరణపై అత్యంత ప్రభావాన్ని చూపిస్తాయి. ఒక సంభాషణ ఫలితాలెలా ఉంటాయనేది ఎదుటి వ్యక్తి హావభావాలపై ఆధారపడి తెలుసుకోవచ్చు.

* ఒక విషయాన్ని సమర్థంగా అవతలివారికి చేరవేయడానికి ముందు ఆ విషయం మీద స్పష్టత ఉండాలి. ఒక వ్యక్తి తన అభిప్రాయాలు, ఆలోచనలు, దృక్పథాలు వీటన్నిటినీ స్పష్టంగా అంచనా వేసుకోగలిగి ఉండాలి. వాటిని వివిధ పరిస్థితుల్లో ధైర్యంగా, సూటిగా వ్యక్తపరచగలిగి ఉండాలి. అతని అభిప్రాయాలు తప్పు అయి ఉండొచ్చు. అవి స్వేచ్ఛగా వ్యక్తపరిచినపుడేగా అవి సరైనవో కావో తెలుస్తుంది? వాటిని సవరించుకునే అవకాశం వస్తుంది? వ్యక్తీకరించకపోతే అవి ఎప్పటికీ బయటికి రావు.

* చెప్పదల్చుకున్న విషయాన్ని స్పష్టమైన ఉచ్చారణతో, తగు మాత్రపు కంఠస్వరంతో చెప్పాలి. ఇలా చేస్తే- మీరు చెప్పదల్చుకున్న విషయంపై మీకు పూర్తి అవగాహన ఉందని అవతలివారికి స్పష్టమవుతుంది. మీ పట్ల మీకున్న ఆత్మవిశ్వాసం అవతలివారికి అవగతమవుతుంది. అంతేకాదు, ఇలా స్పష్టంగా చెప్పడం అపార్థాలకూ, సందిగ్ధతకూ తావు లేకుండా చేస్తుంది.

* భావ వ్యక్తీకరణ నైపుణ్యం ఒక్కసారిగా ఏర్పరుచుకునేది కాదు. నెమ్మది నెమ్మదిగా అలవరుచుకోవాలి. చిన్న చిన్న సంభాషణలను ఎదుటి వ్యక్తిని ఊహించుకుంటూ అభ్యాసం చేయాలి. కొత్త కొత్త పద్ధతులను అనుసరిస్తూ వినూత్నంగా ఉండేట్లు ప్రయత్నించాలి. వినూత్నమైన భావ వ్యక్తీకరణ కొత్త అవకాశాలకు, పరిచయాలకు, బంధాలకు బాటలు వేస్తుందనే విషయం మర్చిపోకూడదు.

* ఇంతకుముందు చెప్పుకున్నట్లు- శ్రద్ధగా వినడం కమ్యూనికేషన్‌లో ముఖ్యపాత్ర వహిస్తుంది. ప్రభావశీలమైన భావ వ్యక్తీకరణకు పునాది శ్రద్ధగా వినడమే! మాట్లాడుతున్నప్పటి కంటే వింటున్నప్పుడే ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎదుటివారు ఎంత త్వరగా తమ సంభాషణ ముగిస్తారనే విషయం మీద కాక ఏం మాట్లాడుతారనేదానిపై దృష్టి కేంద్రీకరించాలి! దాని వల్ల విషయం మీద స్పష్టమైన అవగాహన ఏర్పడి సరైన సూచనలు చేయగలుగుతారు.

ప్రతిభావంతంగా, ప్రభావం చూపేలా...

భావ వ్యక్తీకరణ, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం ఈ రెండూ వయసు, అనుభవం మొదలైనవాటితో నిమిత్తం లేకుండా ఉద్యోగ జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ రోజూ ఎదురయ్యేవే! ఆత్మవిశ్వాసం, చక్కని భాషలో వ్యక్తీకరించగలిగే శక్తి ఉంటే దీన్ని సాధించడం అంత కష్టమేమీ కాదు.

1. సరైన స్థల సమయాలు : ఎక్కడ ఏమి మాట్లాడుతున్నామో గుర్తెరిగి ఉండాలి. పబ్లిక్, ప్రైవేటు స్థలాల తేడాలను గమనించి మాట్లాడాలి. 'ఒరులేయవి యొనరించిన సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే- ముందు ఎదుటి వ్యక్తి స్థానంలో మనల్ని ఊహించుకుని మన మాటలకు ఆ వ్యక్తి ఎలా స్పందిస్తాడో అంచనా వేసుకుని మాట్లాడ్డం ఉత్తమం!

2. మెదడును సన్నద్ధం చేసుకోవడం : ఎక్కువగా భావోద్వేగాలకు గురికావడం... విషయం నుంచి దృష్టి పక్కదారి పట్టడానికి దారి తీస్తుంది. అందువల్ల విషయానికి సంబంధించి నాలుగైదు అంశాలపై జాగ్రత్తగా సిద్ధమై ఉండటం మంచిది. దీనివల్ల ఒక అంశం కాకపోతే మరో అంశం మీదైనా పట్టుతో మాట్లాడే అవకాశం ఉంటుంది.

3. పక్కదారి పట్టకుండా శ్రద్ధ : ఒక్కోసారి ఇతరులు తమ అభిప్రాయాలను మధ్యలో చెబుతూ ఉండటం వల్ల టాపిక్ పక్కదారి పడుతుంటుంది. మీరు చెప్పే ఉదాహరణలు, పిట్టకథల వల్ల కూడా ఈ అవకాశం ఉండొచ్చు. కానీ ఏవి చెప్పినా తిరిగి మళ్ళీ మాట్లాడాల్సిన అంశం వద్దకే వచ్చేలా చూసుకోవాలి.

4. లక్ష్యం మీదే దృష్టి : ఒక సమాచారాన్ని అందజేయడం మీ లక్ష్యమైతే దాన్ని ముందుగా పొందటం, చర్యలు తీసుకునే దిశగా సమాచారాన్ని రూపొందించడం- ఇవన్నీ ముందుగా తెలుసుకుని ఉండాలి.

5. చక్కని భాషానైపుణ్యం : భావ వ్యక్తీకరణలో ఇది ముఖ్యపాత్ర వహిస్తుంది. స్పష్టంగా, ధారాళంగా మాట్లాడినపుడు ఆ సారాంశాన్ని ఎదుటివారు గుర్తుపెట్టుకునే అవకాశమెక్కువ. అందుకని...

* సరైన హావభావాలకు ప్రాముఖ్యమివ్వాలి. కనుబొమలు ముడివేసి చూడటం, అసహనంతో కూడిన ముఖ కవళికలూ చెరుపు చేస్తాయి.

* గుండెల నిండా శ్వాస తీసుకుని మాట్లాడ్డానికి ఉపక్రమించడం మంచిది. దీనివల్ల నిలకడగా మాట్లాడ్డం, ప్రశాంతమైన స్వరంతో మాట్లాడ్డం అలవాటు అవుతాయి. మాటల మధ్య సమతూకంతో కూడిన గ్యాప్ ఇవ్వటం కూడా చక్కని ఫలితాలనిస్తుంది. విషయంపై నొక్కి వక్కాణించడానికి ఇది అవకాశమిస్తుంది.

6. సవరించుకోవాల్సినవి : మాట్లాడేటపుడు చాలామంది చేతులపై శ్రద్ధ వహించరు. మాట్లాడేది ఎంత మంచి విషయమైనా చొక్కా చివర్లు పట్టుకోవడం, మాటిమాటికీ అవసరమున్నా లేకున్నా గొంతు సవరించుకోవడం, దగ్గడం, ఎటో చూస్తూ మాట్లాడ్డం... ఇవన్నీ విషయానికి ప్రాముఖ్యం లేకుండా చేస్తాయి. ఇవన్నీ బాడీ లాంగ్వేజ్‌లో భాగమే. వీటిపై శ్రద్ధ వహించాలి.

7. ప్రశాంతత- ఏకాగ్రత : బయటినుంచి వచ్చే శబ్దాలు, ఇతర అంతరాయాలు మీ సంభాషణకు ఆటంకం కాకుండా చూసుకోవాలి. వాటి ప్రభావం అందరి ఏకాగ్రతనూ దెబ్బతీస్తుంది.

8. ఎలా అర్థమయింది : మీరు చెప్పేది వింటున్న వ్యక్తుల్ని మధ్యమధ్యలో విషయం వారికెలా అర్థం అయిందో అడగాలి. దీనివల్ల అపోహలు, అపార్థాలుంటే వెంటనే సరి చేసుకోవడానికి వీలవుతుంది.

9. కృతజ్ఞతలు : ఒక సంభాషణ తాలూకు ఫలితం అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా సరే, ఎదుటి వ్యక్తి/వ్యక్తులకు కృతజ్ఞతలు తెలపడం మంచి సంప్రదాయం.

Posted Date: 07-09-2020


 

భావ వ్యక్తీకరణ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
 

విద్యా ఉద్యోగ సమాచారం