• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నిరంతర సమీక్షతోనే లక్ష్య సాధన!

కెరియర్‌ సక్సెస్‌కు సూచనలు



బాగా చదివి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలనుకుంటారు విద్యార్థులు. పోటీ పరీక్షల్లో విజయం కోసం ఎంతగానో కృషిచేస్తుంటారు ఉద్యోగార్థులు. అయితే అన్నీ అనుకున్నట్టుగా జరగవు కదా.. ఒక్కోసారి ఎంత కష్టపడినా ఫలితాలు అనుకూలంగా రాకపోవచ్చు. అలాంటప్పుడు అంతా అయిపోయిందంటూ కుంగిపోయి నిరాశతో బాధపడుతూ కూర్చుంటే.. ఆ ప్రభావం తర్వాత రాసే పరీక్షలపైనా, చేసే ప్రయత్నాలపైనా ప్రతికూలంగా పడుతుంది. అందుకే అప్పుడప్పుడూ మన తీరుతెన్నులనూ, కృషినీ పరిశీలించుకోవాలి. సమీక్షించుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. 


ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. వెంటనే సహవిద్యార్థులతో మిమ్మల్ని మీరు పోల్చుకుని ఇక దేనికీ పనికిరామనే తొందరపాటు నిర్ణయానికి వచ్చేయకూడదు. ఇలాంటి సమయంలోనే మీ పని తీరును ఒకసారి సమీక్షించుకోవాలి. ఎదుటివారి గెలుపు.. మీ ఓటమి.. దీని గురించి మాత్రమే ఆలోచిస్తూ కూర్చోకూడదు. మీరో టైమ్‌టేబుల్‌ వేసుకుని ఉండొచ్చు. అయితే దాన్ని పూర్తిగా ఆచరించారా లేదా? లోపం ఎక్కడ జరిగింది. ఎక్కువ గంటలపాటే చదివినా.. ఇతర విషయాల గురించి ఆలోచిస్తూ పైపైనే చదివారా? ఇష్టమైన సబ్జెక్టులనే చదువుతూ క్లిష్టంగా ఉన్నవాటిని వదిలేశారా... పొరపాటు ఎక్కడ జరిగింది... ఇలా వివిధ రకాలుగా మీ సన్నద్ధత కృషిని గమనించుకుని, సమీక్షించుకోవాలి.   


చేదు విమర్శలను ఒక పట్టాన మర్చిపోలేరు. అవి పదేపదే గుర్తొచ్చి మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. ఆకర్షణీయంగా లేరనో.. పదిమందితో కలవలేరనో.. అందరిముందూ ధైర్యంగా మాట్లాడలేరనో... ఇలాంటి కారణాలతో ఎవరైనా మిమ్మల్ని తేలిగ్గా మాట్లాడివుండొచ్చు. ‘వీటిని అసలు పట్టించుకోవద్దు..’ అని చెప్పడం చాలా తేలికే కానీ, వీటిని ఎదుర్కొన్నవారికి మనసు కాస్త కష్టంగానే ఉంటుంది. చదువుతున్నా, నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నా ఇవే గుర్తొస్తుంటాయి కూడా. ఆ విమర్శల్లో నిజానిజాలేమిటో వాస్తవికంగా ఒకసారి సమీక్షించుకోవాలి. 


‣ మన లోపాలను చూసి ఇతరులు హేళన చేయడం ఎంతో బాధ కలిగిస్తుంది. అది నిజమే కానీ.. ఉక్రోషాన్ని పక్కనపెట్టాలి. ప్రతికూల వ్యాఖ్యల్లో మనం సరిదిద్దుకోగలిగేవి ఉన్నాయేమో ఒకసారి ఆలోచించాలి. వాటిని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి. నలుగురిలోనూ కలవడం, మాట్లాడటం మీకు రాకపోవచ్చు. దీన్ని మెరుగుపరుచుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టొచ్చు. అయితే ఇక్కడో ముఖ్య విషయాన్నీ గుర్తుంచుకోవాలి. మిమ్మల్ని బాధపెట్టడమే లక్ష్యంగా విమర్శించే వాళ్లూ కొందరు ఉంటారు. అలాంటివారి గురించీ, వారి వ్యాఖ్యల గురించీ ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది. 


కుటుంబ సమస్యలు ముఖ్యంగా.. ఆర్థిక సంబంధమైనవీ, అనారోగ్యపరమైనవీ ఎవరినీ ఒక పట్టాన కుదురుగా ఉండనీయవు. తరగతిలో పాఠాలు వింటున్నా.. చదవడానికి కూర్చున్నా ఇవే గుర్తుకొస్తూ ఇబ్బంది పెట్టొచ్చు. అయితే వీటిని పరిష్కరించే అనుభవం, మానసిక పరిపక్వత మీకు లేకపోవచ్చు. అలాంటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు తీసుకుని  మీ పరిధి మేరకు పరిష్కార దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టొచ్చు. 


అనుకోని పొరపాట్లు, తప్పుల వల్ల కూడా కొన్నిసార్లు మాటపడాల్సి రావచ్చు. ఇలాంటప్పుడు కూడా సమీక్ష ఎంతో అవసరం. తప్పు చేసి మాటపడాలని ఎవరూ అనుకోరు. అన్యమనస్కంగా, ఆసక్తి లేకుండా పని చేయడం వల్ల ఇలాంటి ఇబ్బంది రావచ్చు. కాబట్టి పొరపాట్ల వెనుక ఉన్న అసలు కారణాలను గ్రహించి అవి పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం సముచితం!


-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ బీటెక్‌తో ఆర్మీలో ఉద్యోగాలు

‣ నాలుగేళ్ల కోర్సు.. నైపుణ్యాలతో మెరుగు!

‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!

‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

‣ రెజ్యూమె రాయడంలో జాగ్రత్తలు

‣ కొలువు సాధనకు తొలి అడుగు!

Posted Date : 04-10-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.