• facebook
  • whatsapp
  • telegram

పీజీ విద్యార్థులకు పది వేల స్కాలర్‌షిప్పులు

డిగ్రీ మార్కులతో ఎంపిక



యూజీ కోర్సుల్లో ప్రతిభావంతులను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) ఏటా జాతీయ పీజీ స్కాలర్‌షిప్పులు అందిస్తోంది. యూజీలో సాధించిన మార్కుల మెరిట్‌తో వీటికి ఎంపిక చేస్తారు. ప్రస్తుతం పీజీ ప్రథమ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కింద ప్రతి నెలా రూ. 15,000 చొప్పున రెండేళ్లపాటు చెల్లిస్తారు.  


దేశ అభివృద్ధిలో ఉన్నత విద్య పాత్ర చాలా కీలకం. ఈ విభాగాన్ని పటిష్ఠపరచినప్పుడే అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధ్యమవుతుంది. అయితే అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతోన్న దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో ఉన్నత విద్య చదివేవాళ్ల సంఖ్య చాలా తక్కువ. దీన్ని అధిగమించడానికి ప్రతిభావంతులైన యువతను డిగ్రీ నుంచి పీజీ దిశగా అడుగులేయించాలి. దీనికోసం వాళ్లను ప్రోత్సహించాలి. అందులో భాగంగానే ‘నేషనల్‌ స్కాలర్‌షిప్‌ ఫర్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ స్టడీస్‌’ని యూజీసీ ప్రారంభించింది. డిగ్రీ స్థాయిలో వివిధ కోర్సుల్లో మెరిట్‌ మార్కులు పొందినవారికి ఈ ప్రోత్సాహం వర్తిస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌ వ్యవధి రెండేళ్లు. రెగ్యులర్‌ విధానంలో దేశంలో పీజీ ప్రథమ సంవత్సరం చదువుతున్నవారికి వీటిని అందిస్తారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించి, వాళ్లు పీజీలో రాణించేలా చేయడమే దీని ముఖ్య లక్ష్యం. 


అర్హతలివీ..

విద్యార్థులు రెగ్యులర్‌ విధానంలో యూజీ చదివి, మెరిట్‌ మార్కులు పొంది ఉండాలి. డీమ్డ్‌ సంస్థలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, అటానమస్‌ సంస్థల్లో చదివినవారూ అర్హులే. అలాగే విద్యార్థులు ఏదైనా యూనివర్సిటీ లేదా పీజీ కాలేజీలో ప్రథమ సంవత్సరం కోర్సులో చేరి ఉండాలి. దూరవిద్య, ఆన్‌లైన్, పార్ట్‌ టైం కోర్సుల్లో చదివినవాళ్లు దీనికి అనర్హులు. వయసు 30 ఏళ్లకు మించరాదు. లైఫ్‌ సైన్సెస్, ఫిజికల్‌ సైన్సెస్, కెమికల్‌ సైన్సెస్, ఎర్త్‌ సైన్సెస్, మ్యాథమెటికల్‌ సైన్సెస్, సోషల్‌ సైన్సెస్, కామర్స్, లాంగ్వేజెస్‌ వీటిలో ఏ కోర్సైనా యూజీలో చదివి మెరిట్‌ పొందినవారు నేషనల్‌ స్కాలర్‌షిప్‌ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. 


ఎన్ని.. ఎన్నాళ్లు?

మొత్తం పదివేల స్కాలర్‌షిప్పులు ఉన్నాయి. వీటిలో 30 శాతం మహిళలకు కేటాయించారు. మిగిలినవాటిలో సగం ఆర్ట్స్, హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్, లా, మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు దక్కుతాయి. మిగతా సగం సైన్స్, ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, మెడికల్, టెక్నికల్, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ చదువుతున్నవారికి చెందుతాయి. వీటి వ్యవధి రెండేళ్లు. నెలకు రూ.15,000 చొప్పున ఏడాదిలో పది నెలల పాటు చెల్లిస్తారు. ప్రథమ సంవత్సరంలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు మాత్రమే రెండో సంవత్సరం ప్రోత్సాహం కొనసాగిస్తారు. 


నియమాలు 

విదేశాల్లో పీజీ చదివేవారికి అవకాశం లేదు.

ఇతర స్కాలర్‌షిప్పులు పొందనివారే వీటికి అర్హులు. వేరే ఏవైనా పొందినట్లైతే, వాటిని వదులుకుంటేనే ఈ ఉపకార వేతనం దక్కుతుంది. 

పీజీ ప్రథమ సంవత్సరంలో నిర్దేశిత మార్కులు సాధిస్తేనే ద్వితీయ సంవత్సరం స్కాలర్‌షిప్పు వర్తిస్తుంది.


దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 31. 


వెబ్‌సైట్‌: https://scholarships.gov.in/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!

‣ డిగ్రీ ప్రతిభావంతులకు కేంద్రం ఆసరా (చివరి తేదీ: డిసెంబరు 31, 2023)

‣ రిమోట్‌ కొలువుకు పెరుగుతున్న ఆదరణ!

‣ భవిష్యత్‌ అవకాశాలకు క్యూబర్‌నెటిస్‌!

‣ నౌకాదళంలో 224 కొలువులకు నోటిఫికేషన్‌ (చివరి తేదీ: అక్టోబరు 29, 2023)

‣ ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో 677 పోస్టులు (చివరి తేదీ: 13.11.2023)

Posted Date: 24-10-2023


 

తాజా కథనాలు

మరిన్ని