• facebook
  • whatsapp
  • telegram

ఓటమిని తట్టుకున్నారు.. విజేతగా నిలిచారు

గ్రూప్‌-1 రెండో ర్యాంకర్‌ పావని సక్సెస్‌ స్టోరీ


పోటీలో గెలవడానికి అవకాశాలు ఎన్ని ఉంటాయో.. ఓడిపోవడానికి అంతకంటే ఎక్కువ ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలిసినా.. వైఫల్యాన్ని అంత త్వరగా జీర్ణించుకోలేరు. కానీ గమనిస్తే.. ఓటమి చెప్పే పాఠాలు చాలా విలువైనవి. వాటి తర్వాత వచ్చే గెలుపు, అంతకంటే విలువైనది! ప్రస్తుతం అటువంటి విజయం ఇచ్చిన ఆనందంలోనే ఉన్నారు వైఎస్‌ఆర్‌ కడప జిల్లా మైదుకూరుకు చెందిన భూమిరెడ్డి పావని. ఎన్నో ఏళ్లుగా గ్రూప్స్‌కు  సన్నద్ధమవుతూ.. వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నా తట్టుకుని నిలబడి.. తన నాలుగో ప్రయత్నంలో విజయం సాధించారు. తాజా గ్రూప్‌-1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించిన పావని.. తన పోటీ పరీక్షల ప్రయాణం ఎలా సాగిందో ఇలా పంచుకుంటున్నారు.. 


‘2015 నుంచీ పోటీ పరీక్షల సన్నద్ధతలో ఉన్నా. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ ప్రయాణం. బీటెక్‌ తర్వాత పోటీ పరీక్షల కోసం కోచింగ్‌ తీసుకోవడం మొదలుపెట్టాను. 2016లో తొలిసారిగా గ్రూప్‌-2 నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేశాను. తొలి ప్రయత్నంలోనే మెయిన్స్‌ వరకూ వెళ్లినా చివరికి నిరాశే ఎదురైంది. తర్వాత 2017లో గ్రూప్‌-2 మెయిన్స్, 2018లో గ్రూప్‌-1 ఇంటర్వ్యూ వరకూ వెళ్లినా ఎంపిక మాత్రం కాలేదు. 2018 నియామక ప్రక్రియ రకరకాలైన కారణాలతో చాలా ఆలస్యం అయ్యింది. దాదాపు మూడేళ్లు కొనసాగడంతో చాలా ఇబ్బందిగా అనిపించింది. 


అంత ఎదురుచూసినా చివరికి ఎంపిక కాకపోవడంతో నిరాశలో కుంగిపోయా. ఇక నేను చేయగలనా అనిపించింది. మరోపక్క తమ్ముడు, చెల్లి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ‘ఇన్నాళ్లయినా ఇంకా ఇలాగేనా..’ అన్నట్లు చుట్టుపక్కల వారి సూటిపోటి మాటలు సరేసరి. అయినా నా కుటుంబం నాకు అండగా నిలబడింది. నేను సాధించగలనని నాకంటే ఎక్కువగా వారే నమ్మారు. వారిచ్చిన మనోధైర్యంతోనే 2022 నోటిఫికేషన్‌కు మళ్లీ సిద్ధం కావడం మొదలుపెట్టాను. ఈసారి మాత్రం గురితప్పే ప్రసక్తే లేదని ముందే నిర్ణయించుకున్నా. పది రకాలుగా ప్రిపేర్‌ అవ్వాల్సిన చోట వంద రకాలుగా చదివా. చివరికి అనుకున్నట్టుగానే ఎంపికయ్యా. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఇలా రెండో ర్యాంకు వస్తుందని మాత్రం ఊహించలేదు. 


సన్నద్ధత ఇలా.. 

వరుస వైఫల్యాల్లో నాకు అర్థమైంది ఏంటంటే.. పోటీ పరీక్షల్లో మనం ఎంత చదువుతున్నాం అనేది ఎంత ముఖ్యమో ఎలా చదువుతున్నామనేది కూడా అంతే ముఖ్యం. సబ్జెక్ట్‌ కంటే ముందు సిలబస్‌లోని ప్రతి వాక్యం గుర్తుంచుకున్నా. ఏది చదవాలో ఏది వదిలేయాలో బాగా అర్థం చేసుకున్నా. ప్రిలిమ్స్‌ ఆబ్జెక్టివ్‌ కాబట్టి ఒకసారి తెలుగు అకాడమీ, ఇతర ప్రామాణిక పుస్తకాలు చదివేశాక.. ఇక పూర్తిగా బిట్లు సాధన చేయడం ప్రారంభించాను. ఎన్ని రకాల పబ్లిషింగ్‌ హౌస్‌ల నుంచి సాధన చేశానో నాకే తెలియదు. చాప్టర్‌ అంతా ఒకసారి, సబ్జెక్ట్‌ అంతా ఒకసారి, మొత్తంగా అనేకసార్లు మాక్‌ టెస్టులు రాశాను. యోజన, కురుక్షేత్ర వంటి మ్యాగజీన్లు, ఈనాడు ఎడిటోరియల్స్‌ను క్రమం తప్పకుండా ఫాలో అయ్యాను. ఈనాడు ప్రతిభ వెబ్‌సైట్‌లో ఉండే జనరల్‌ ఎస్సే టాపిక్స్‌ను పూర్తిగా అధ్యయనం చేశాను. జాతీయ - అంతర్జాతీయ అంశాలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, వ్యవసాయం - వాణిజ్యం - ఇతర రంగాలు.. ఇలా అన్నీ విభాగాల వారీగా సన్నద్ధమయ్యాను.  


చిన్నప్పటి నుంచీ రాయడం అంటే చాలా ఇష్టం. ప్రతి వ్యాసరచన పోటీలోనూ బహుమతులు వచ్చేవి. అందుకే మెయిన్స్‌ పరీక్షను బాగా ఎంజాయ్‌ చేశా. ప్రిలిమ్స్‌ మాదిరిగానే సబ్జెక్టు ప్రిపేర్‌ అయ్యి, రాతను సాధన చేశా. ఏ టాపిక్‌ ఇచ్చినా కొన్ని కీలకమైన పాయింట్లు పట్టుకుని వాటి ఆధారంగా వ్యాసాన్ని అల్లడం ఎలాగో నేర్చుకున్నా. రాసిన వ్యాసాలు ఎలా ఉన్నాయో మళ్లీ సమీక్షించుకునేదాన్ని. ఇదే టెక్నిక్‌ ఇంటర్వ్యూలో కూడా పనికొచ్చింది. ప్యానెల్‌ సభ్యులు ఏ ప్రశ్న అడిగినా జవాబులు ఇచ్చేలా ప్రతి అంశం గురించి జనరల్‌ నాలెడ్జ్‌ పెంచుకున్నా. 


ఇంటర్వ్యూలో ఎన్నికల వ్యవస్థలో జరగాల్సిన మార్పులు, కొలీజియం వ్యవస్థ, నూతన విద్యావిధానం, 4జీ - 5జీ టెక్నాలజీ గురించి అడిగారు. విద్యార్థులకు మానవతా విలువలు ఎందుకు అవసరం, ఫీడ్‌బ్యాక్‌ ఎవరికైనా ఎలా ఉపయోగపడుతుంది, సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, చట్టసభలు, పంచాయతీరాజ్‌ వ్యవస్థ గురించి ప్రశ్నించారు. నేను అన్నింటికీ సమాధానాలు ఇచ్చాను. మెయిన్స్‌ ఫలితాలకు, ఇంటర్వూలకు ఎక్కువగా సమయం లేకపోవడంతో ఇంట్లోనే ఉండి సివిల్స్‌ మాక్‌ ఇంటర్వ్యూలు యూట్యూబ్‌లో చూసి ప్రిపేర్‌ అయ్యాను. అందులో గమనించిన పాయింట్లు నోట్సులా రాసుకుని సాధన చేశాను. ముఖాముఖి చాలా ఆసక్తిగా సాగింది. సభ్యులు నా జవాబుల పట్ల సంతృప్తిగా ఉన్నట్లు నాకు అప్పుడే అర్థమైంది. బయటకు వచ్చాక కచ్చితంగా ఎంపికవుతాననే నమ్మకం కలిగింది. 


అన్నింటికీ సిద్ధపడ్డాకే..

పోటీ పరీక్షలు ఓ ప్రపంచం. కొందరికి చిన్న వయసులోనే వెనువెంటనే సక్సెస్‌ వస్తుంది. కానీ కొందరికి చాలా వైఫల్యాలు ఎదురైతే కానీ విజయం లభించదు. మన అదృష్టం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి అన్నింటికీ సిద్ధపడ్డాకే చదవడానికి కూర్చోవాలి. ఇదేదో అప్పటికప్పుడు చదివి రాసే పరీక్ష కాదు. సరిగ్గా ప్రయత్నించకపోతే సమయం వృథా అయిపోతుంది, అది కెరియర్‌ను బాగా దెబ్బతీస్తుంది. అందుకే ముందు నుంచే జాగ్రత్తపడాలి. వీలైనన్ని మాక్‌టెస్టులు రాయడం, వివిధ అంశాలను తోటివారితో చర్చించుకోవడం, మళ్లీ మళ్లీ సాధన చేయడం తప్పనిసరి. ప్రాక్టీస్‌లో ఎంత కష్టపడితే.. పరీక్షలో అంత సులభంగా రాయగలుగుతాం.  


వరుసగా ఫెయిల్‌ అవుతున్నప్పుడు చాలాసార్లు వదిలేద్దాం అనిపించింది. ఆర్థిక ఇబ్బందులతో కొన్ని ఉద్యోగాలు కూడా చేశాను. కానీ ఎలా అయినా ప్రభుత్వ సర్వీసుల్లో చేరాలనే పట్టుదలతో దానికోసమే కష్టపడ్డా. మా ఇంట్లోవాళ్లు కూడా అంతే సపోర్ట్‌ చేశారు. ఇప్పుడీ విజయం చూశాక.. ఇంతటితో ఆగిపోవాలని అనిపించడం లేదు. త్వరలోనే సివిల్స్‌కు చదవడం మొదలుపెడతా. కచ్చితంగా దాన్నీ సాధించగలననే నమ్మకం ఉంది. సమాజంలో స్త్రీల పట్ల జరిగే అరాచకాలకు వ్యతిరేకంగా, వారి ఉన్నతి కోసం పాటుపడతా.. ఆ ఆలోచనతోనేగా ఇంత కష్టపడింది!


పోటీ పరీక్షల్లో మనం ఎంత చదువుతున్నాం అనేది ఎంత ముఖ్యమో ఎలా చదువుతున్నామనేది కూడా అంతే ముఖ్యం. సబ్జెక్ట్‌ కంటే ముందు సిలబస్‌లోని ప్రతి వాక్యం గుర్తుంచుకున్నా. ఏది చదవాలో ఏది వదిలేయాలో బాగా అర్థం చేసుకున్నా. ప్రిలిమ్స్‌ ఆబ్జెక్టివ్‌ కాబట్టి ఒకసారి తెలుగు అకాడమీ, ఇతర ప్రామాణిక పుస్తకాలు చదివేశాక.. ఇక పూర్తిగా బిట్లు సాధన చేయడం ప్రారంభించాను. చాప్టర్‌ అంతా ఒకసారి, సబ్జెక్ట్‌ అంతా ఒకసారి, మొత్తంగా అనేకసార్లు మాక్‌ టెస్టులు రాశా. 


ఏ టాపిక్‌ ఇచ్చినా కొన్ని కీలక పాయింట్లు పట్టుకుని వాటి ఆధారంగా వ్యాసాన్ని అల్లడం ఎలాగో నేర్చుకున్నా. రాసిన వ్యాసాలు ఎలా ఉన్నాయో మళ్లీ సమీక్షించుకునేదాన్ని. ఇదే టెక్నిక్‌ ఇంటర్వ్యూలో కూడా పనికొచ్చింది. ప్యానెల్‌ సభ్యులు ఏ ప్రశ్న అడిగినా జవాబులు ఇచ్చేలా ప్రతి అంశం గురించి జనరల్‌ నాలెడ్జ్‌ పెంచుకున్నా. 
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ వర్చువల్‌ ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే?

‣ విదేశీ భాషలు.. అదనంగా ప్రయోజనాలు

‣ 18 ఎయిమ్స్‌లలో నర్సింగ్‌ ఆఫీసర్లు

‣ పరీక్షల్లో విజయానికి మెలకువలు

Posted Date : 22-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌