• facebook
  • whatsapp
  • telegram

విదేశీ భాషలు.. అదనంగా ప్రయోజనాలు

* బహుళజాతి సంస్థల్లో ఉద్యోగావకాశానికి అవకాశం

ఎంతోమంది విద్యార్థులు తెలుగుతోపాటుగా హిందీ, ఇంగ్లిష్‌ భాషలు కూడా మాట్లాడగలుగుతారు, రాయగలుగుతారు. వీటితోపాటుగా కనీసం ఓ విదేశీ భాష కూడా తెలిసుంటే.. మరికొన్ని ప్రయోజనాలనూ అదనంగా పొందొచ్చు. 


ఇంజినీరింగ్‌ చేసిన అఖిల్, ఆకాశ్‌ ఎంఎన్‌సీ కంపెనీకి ఒకేసారి ఇంటర్వ్యూకు వెళ్లారు. ఆ ముఖాముఖిలో ఆకాశ్‌ మాత్రమే ఎంపికయ్యాడు. ఇద్దరి విద్యార్హతలూ, అనుభవం ఒకేలా ఉన్నప్పటికీ ఆకాశ్‌ మాత్రమే ఎందుకు ఎంపికయ్యాడంటే.. అతడికి అదనంగా స్పానిష్‌ తెలుసు. చదువుకుంటూనే సరదాగా నేర్చుకున్న ఫారిన్‌ లాంగ్వేజ్‌. ఇదే అదనపు అర్హతగా మారి ఇప్పుడీ ఉద్యోగాన్నీ సంపాదించిపెట్టింది. అసలు విదేశీ భాషలను నేర్చుకోవడం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో చూద్దామా...


 ఉన్నత విద్య కోసం మన విద్యార్థులు ఎంతోమంది విదేశాలకు వెళుతున్నారు. ఇంగ్లిష్‌తోపాటు విదేశీ భాషా తెలిసి ఉండటం వల్ల అక్కడి వారితే మరింతగా కలిసిపోయే అవకాశం ఉంటుంది. 


‣ ఆలోచనా పరిధీ విస్తరిస్తుంది. ఒక అంశాన్ని విశాల దృక్పథంతో భిన్న కోణాల్లో ఆలోచించే నేర్పు అలవడుతుంది. 


కొత్త సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకోవడానికి వీలవుతుంది. బహుళజాతి సంస్థలో ఉద్యోగం వచ్చినా ఈ నైపుణ్యాలు ఎంతో తోడ్పడతాయి. మీరు పనిచేసే బృందంలో వివిధ దేశాలకు చెందినవాళ్లూ ఉండొచ్చు. లేదా వివిధ దేశాలకు చెందిన వ్యక్తులున్న బృందానికి నాయకత్వం వహించే అవకాశం భవిష్యత్తులో మీకే రావొచ్చు. అలాంటప్పుడు భాష అనేది అడ్డంకిగా మారకుండా ఉంటుంది. 


కొన్ని ప్రాంతాలకు విదేశీ పర్యటకులు ఎక్కువగా వస్తుంటారు. అలాంటిచోట ఉండే స్టార్‌ హోటళ్లల్లో స్థానిక భాషలతోపాటుగా విదేశీ భాష తెలిసినవాళ్లు త్వరగా ఉద్యోగం సంపాదించొచ్చు. అంతేకాదు ఈ నైపుణ్యంతో టూరిస్ట్‌ గైడ్‌గానూ రాణించొచ్చు.


మన దేశానికి చెందిన ఎన్నో సంస్థలు విదేశాల్లో తమ శాఖలను ప్రారంభిస్తున్నాయి. అలాంటప్పుడు విదేశీ భాష తెలిసినవారికే ఉద్యోగాలు ఇస్తాయి. అప్పుడు వీళ్లు సంస్థకూ ఆ దేశంలోని ఉద్యోగులకూ మధ్య వారధిగా పనిచేస్తారు. ఇలాంటి సంస్థల్లో ఉద్యోగాల కోసం ఎంతోమంది ప్రయత్నించినా.. విదేశీ భాష తెలిసినవారినే అవకాశాలు వరిస్తాయి. 


అలాగే అంతర్జాతీయ సంస్థలెన్నో మన దేశానికీ తమ శాఖలను విస్తరిస్తున్నాయి. స్థానికులకు విదేశీ భాష కూడా తెలిసి ఉండటం వల్ల వాటిలో ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. భాషాపరమైన అడ్డంకులు లేకపోవడం వల్ల తమ ఆలోచనలను స్వేచ్ఛగా వెల్లడించగలుగుతారు. 


‣ ఉన్నత విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి.. ఇలా వివిధ కారణాలతో ఇతర దేశాలకు వెెళ్లేవారి సంఖ్యా పెరుగుతోంది. ఇలాంటివారు ఆసక్తి ఉన్న విదేశీ భాషను నేర్చుకుంటే ఎన్నో ప్రయోజనాలనూ పొందొచ్చు. అక్కడి ప్రజలతో కలిసిమెలసి పనిచేయడానికి విదేశీ భాష ఉపయోగ పడుతుంది. రోజువారీ పనుల నిమిత్తం స్థానికులతో మాట్లాడాలన్నా కొన్నిసార్లు భాష అడ్డంకిగా మారుతుంది. విద్యావంతులకు సాధారణంగా ఇంగ్లిష్‌ తెలుస్తుంది కాబట్టి వారితో సంభాషించడానికి సమస్య ఉండదు. కానీ అంతగా చదువుకోని స్థానికులతో మాట్లాడటానికి స్థానిక విదేశీ భాష సాయపడుతుంది. 


వివిధ భాషలను నేర్చుకోవడం వల్ల.. మెదడు సామర్థ్యం, జ్ఞాపకశక్తీ పెరుగుతుందనీ, మల్టీటాస్కింగ్‌ నైపుణ్యం అలవడుతుందనీ, మెదడు చురుగ్గా పనిచేస్తుందనీ కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి కూడా. 


మన దేశంలో ఇంగ్లిష్‌తో పాటు కొరియన్, స్పానిష్, మాండరిన్, జపనీస్, రష్యన్, ఇటాలియన్, జర్మన్, డచ్, ఫ్రెంచ్, అరబిక్‌ భాషలకు డిమాండ్‌ ఉంది.

కోర్సులు ఎక్కడ?

విదేశీ భాషలు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారికి ‘ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌’ ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్‌ కోర్సులను అందిస్తోంది. ఉస్మానియా, ఆంధ్రా, నాగార్జున.. మొదలైన యూనివర్సిటీల్లోనూ విదేశీ భాషా కోర్సులు నేర్చుకోవచ్చు.  

ఉద్యోగం చేసుకుంటూనే ఈ కోర్సులను నేర్చుకోవాలనుకునేవారు ‘ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఇగ్నో)’ సేవలను వినియోగించుకోవచ్చు. యుడెమీ, కోర్స్‌ ఎరా లాంటి ఆన్‌లైన్‌ వేదికల్లోనూ ఇవి అందుబాటులో ఉన్నాయి.

సంస్కృతీ సంప్రదాయాల అడ్డుగోడలను దాటుకుని. పరస్పరం అర్థంచేసుకుంటూ, సహాయసహకారాలు ఇచ్చిపుచ్చుకుంటూ జీవించడానికి విదేశీ భాషలు ఉపయోగపడుతాయి.


మరింత సమాచారం... మీ కోసం!

‣ పేదింటి బిడ్డలు.. ‘ఎస్సై’లుగా కొలువు దీరారు!

‣ ఉన్నత విద్య.. ఉద్యోగానికి ‘గేట్‌’

‣ ఉద్యోగార్థులూ.. కొత్త పరీక్షలకు సిద్ధమేనా!

‣ ఇంటర్‌తో ఉద్యోగాలెన్నో!

Posted Date: 17-08-2023


 

ఉద్యోగాన్వేష‌ణ‌

మరిన్ని