• facebook
  • twitter
  • whatsapp
  • telegram

‘నెట్‌వర్క్‌’తో లాభాలెన్నో!

* మెరుగైన కెరియర్‌కు నిపుణుల సూచనలు


కాలేజీ పూర్తవ్వడానికీ, ఉద్యోగంలో చేరడానికీ మధ్య ప్రతి విద్యార్థికీ కొంత సమయం ఉంటుంది. అయితే ఈ సమయం ఎలా గడుస్తుంది అనేది మాత్రం వారి కృషి మీద ఆధారపడి ఉంటుంది. ఎంత జాగ్రత్తగా కెరియర్‌ను ప్లాన్‌ చేసుకుని, ఎంత బాగా నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకోగలిగితే అంతటి మెరుగైన అవకాశాలు పొందవచ్చు. లేకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవు. నెట్‌వర్కింగ్‌ ఎలా చేయాలో, దీని వల్ల కలిగే లాభాలేంటో ఇంకా పరిశీలిస్తే..


మనకేం తెలుసనేది కాదు.. మనకెవరు తెలుసు అనేది ముఖ్యం’ అనే సూత్రం నెట్‌వర్కింగ్‌లో ప్రధానపాత్ర పోషిస్తుంది. నిజానికి ఇప్పుడు చాలామంది విద్యార్థులకు నెట్‌వర్కింగ్‌ ప్రాధాన్యం గురించి చివరిదాకా తెలియడం లేదు. ఇప్పుడిప్పుడే కొన్ని కాలేజీలు ఈ అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సమయాన్ని వెచ్చిస్తున్నాయి. ఉద్యోగావకాశాలు అందుకునేందుకు పోటీ అధికంగా ఉంటున్న ఈరోజుల్లో.. ప్రతి చిన్న అంశం విద్యార్థికి ఉపకరిస్తుందనే అంశాన్ని విస్మరించకూడదు. అందుకే నెట్‌వర్కింగ్‌పై తగిన శ్రద్ధ అవసరం.

(నిజానికి జాగ్రత్తగా ప్రణాళిక ప్రకారం చేయాలే కానీ ఇదేమంత కష్టమైన పని కాదు. స్థిరంగా అమలుచేయడం ద్వారా చక్కటి అవకాశాలు తయారుచేసుకోవచ్చు. అయితే నిరంతరం సమాచారాన్ని సేకరించుకోవడం, ఆలోచనలు పంచుకోవడం, కాంటాక్ట్స్‌ మెయింటెయిన్‌ చేయడం అవసరం. నెట్‌వర్కింగ్‌లో ఎదుటివారు మనల్ని గుర్తించే అవకాశం ఇవ్వడం ప్రధానం.


చేయడం ఎలా?

మనలో చాలామంది ఇదీ అని తెలియకుండానే ఇప్పటికే నెట్‌వర్కింగ్‌ మొదలుపెట్టి ఉండొచ్చు. స్నేహితులతో, అధ్యాపకులతో బలమైన బంధాలు ఏర్పురుచుకోవడం ద్వారా దీన్ని ప్రారంభించి ఇంకా ముందుకు తీసుకువెళ్తూ ఉండొచ్చు. వీటికి అదనంగా ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నప్పుడో, ప్లాంట్‌ విజిట్స్, ప్రాజెక్ట్స్‌ వంటివి చేస్తున్నప్పుడో దొరికే కాంటాక్ట్స్‌ను మెరుగుపరుచుకోవాలి. ఇక్కడ పరిశ్రమలో ముఖ్యమైన వ్యక్తులు పరిచయమయ్యే వీలుంటుంది. వీటితోపాటు హ్యాకథాన్స్, ఈవెంట్స్, ట్రేడ్‌ షోస్, కాన్ఫరెన్స్‌ల్లో పాల్గొనడం ద్వారా చేరాలనుకుంటున్న పరిశ్రమపై మరింత పట్టు సంపాదించవచ్చు.

( క్లుప్తంగా చెప్పాలంటే.. సోషల్‌ మీడియాలో ఫ్రెండ్స్, ఫాలోవర్లతో ఒక నెట్‌వర్క్‌గా ఎలా ఉంటామో ప్రొఫెషనల్‌గానూ అలాగే పరిచయాలు పెంచుకోవడాన్ని నెట్‌వర్కింగ్‌ అనవచ్చు. వీరిలో ఉద్యోగులు, నిపుణులు, పరిశోధకులు, ప్రొఫెసర్లు.. ఇలా ఎవరైనా ఉండవచ్చు. నెట్‌వర్కింగ్‌ ముఖ్య ఉద్దేశం కెరియర్‌పరంగా సాయం అందించగలిగే వారిని గుర్తించడం, వారి ద్వారా మరిన్ని పరిచయాలు, మరింత అవగాహన పెంచుకోవడం. ఇది ఎంత త్వరగా మొదలుపెడితే అంత మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఉంది. కాలేజీలో ఉండగానే, ఉద్యోగ జీవితానికి తయారు కాకముందే మొదలుపెట్టడం మరింత ఉపకరిస్తుంది. దీని ద్వారా ఇండస్ట్రీ ధోరణులు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు.


ఉపయోగాలు

నెట్‌వర్కింగ్‌ మిగిలిన విద్యార్థులకంటే ఫీల్డ్‌లో మెరుగైన ప్రారంభం లభించేలా సాయం చేయగలదు. ఇది ఉద్యోగం మొదలుపెట్టకముందే అక్కడి పరిస్థితులు, ఉద్యోగుల అనుభవాలపై అవగాహన కల్పిస్తుంది. అలాగే ఆ తర్వాత జాబ్‌కు దరఖాస్తు చేసేటప్పుడు ఈ కాంటాక్ట్స్‌ రిఫరల్స్‌గా కూడా ఉపయోగపడతాయి. ఏదో ఒకచోట దొరికిన చిన్న ఫోన్‌ నంబర్‌ రేపు మన కలలను సాకారం చేసుకోవడంలో పెద్ద అడుగు వేసేందుకు సాయం చేయవచ్చు! నిజానికి అన్ని ఉద్యోగాలనూ కంపెనీలు బహిరంగంగా ప్రకటించవు. తక్కువ సంఖ్యలో నియామకాలు చేసేటప్పుడు, ఇతర కొన్ని పోస్టులను అంతర్గతంగానూ భర్తీ చేస్తుంటాయి. అటువంటి సమయాల్లో కంపెనీలో పరిచయాలుండటం అవకాశాలను తెచ్చిపెట్టగలదు.


ఆత్మవిశ్వాసంతో..

బయటకు వెళ్లి కొత్తవారిని కలిసినప్పుడు.. కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు.. నూతన ఉత్సాహం, ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అదేసమయంలో మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అలవడతాయి. ఇది వ్యక్తిగతంగానూ మానసికంగానూ ఎదగడానికే కాదు.. వృత్తి జీవితానికి కావాల్సిన నైపుణ్యాలు అందించడంలోనూ ముఖ్యపాత్ర పోషిస్తుంది. కొన్నిసార్లు ఇలా  కలిగిన పరిచయాలు జీవితాంతం నడిచే చక్కని స్నేహబంధాలుగా కూడా వికసిస్తాయి.

( కొత్తగా డిగ్రీ పుచ్చుకున్నవారు పూర్వ విద్యార్థుల ద్వారా కూడా ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. వారు తమ విలువైన అనుభవాలను, అవకాశాలను కొత్త వారికి అందించగలరు. వివిధ గ్రూపులు, క్లబ్స్‌లో చేరడం ద్వారా.. అవసరమైనప్పుడు వాలంటీర్‌గా ఉండటం ద్వారా పరిశ్రమ విషయాలు తెలుసుకునే వీలు చిక్కుతుంది. లింక్డిన్‌ వంటి ప్రొఫెషనల్‌ సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా కూడా దీన్ని చేయవచ్చు. నిరంతరం నేర్చుకునే ఆసక్తి, కెరియర్‌లో మరింత ముందుకు వెళ్లాలన్న ఆశ ఉంటే చాలు.. నెట్‌వర్కింగ్‌తో బోలెడన్ని అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు!


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఒకే వ్యూహంతో రెండు పరీక్షలు!

‣ ఓటమిని తట్టుకున్నారు.. విజేతగా నిలిచారు

‣ వర్చువల్‌ ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే?

‣ విదేశీ భాషలు.. అదనంగా ప్రయోజనాలు

‣ 18 ఎయిమ్స్‌లలో నర్సింగ్‌ ఆఫీసర్లు

‣ పరీక్షల్లో విజయానికి మెలకువలు

Posted Date : 23-08-2023 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.