• facebook
  • whatsapp
  • telegram

డాలర్‌ పెత్తనానికి గండి?అమెరికా ఆర్థిక, వాణిజ్య ఆంక్షలతో విసిగిపోయిన రష్యా, చైనాలు డాలర్‌ ఆధిపత్యానికి గండి కొట్టాలని నిశ్చయించాయి. అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తున్న ప్రస్తుత ఏకధ్రువ ప్రపంచానికి ప్రత్యామ్నాయంగా బహుళ ధ్రువ ప్రపంచాన్ని సృష్టించదలిచాయి. ఇందుకు భారత్‌, చైనా, రష్యా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాలతో కూడిన ‘బ్రిక్స్‌’ను కీలక సాధనంగా మలుస్తున్నాయి.


అమెరికా కరెన్సీ అయిన డాలర్‌ ఆధిపత్యాన్ని నిలువరించేందుకు రష్యా, చైనాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకు బ్రిక్స్‌ కూటమి ద్వారా వ్యూహాన్ని అమలుపరచేందుకు కసరత్తు చేస్తున్నాయి. చమురు సంపన్న దేశాలైన సౌదీ అరేబియా, ఇరాన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లు కొత్తగా బ్రిక్స్‌లో చేరడంతో ఈ వ్యూహానికి మరింత దన్ను లభించినట్లయింది. డాలరుకు బదులుగా ప్రత్యామ్నాయ కరెన్సీల్లో వ్యాపార లావాదేవీలను ప్రోత్సహించాలని ఇటీవలి బ్రిక్స్‌ సమావేశం నిర్ణయించింది. ఈ నిర్ణయం అంతిమంగా చైనా కరెన్సీ అయిన యువాన్‌ బలపడటానికి దారితీస్తుందన్నది విశ్లేషకుల అంచనా. ఇప్పటికే అమెరికా, ఐరోపా సమాఖ్యల ఆంక్షలతో రష్యాకు యువాన్లను ఉపయోగించాల్సిన అగత్యం ఏర్పడింది. బ్రిక్స్‌లో 12లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో చైనా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుంటే, దాదాపు నాలుగు లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో భారత్‌ రెండో స్థానాన్ని ఆక్రమిస్తోంది. భారత్‌, పశ్చిమాసియా, చైనా, రష్యా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాల మధ్య స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం ఊపందుకొంటే డాలర్‌ పెత్తనం కోసుకుపోతుంది.


యువాన్లలో చెల్లింపులు

చైనా ఇప్పటివరకు ఇతర దేశాలతో స్థానిక కరెన్సీల్లోనే లావాదేవీలు నిర్వహిస్తూ వచ్చింది. 41 దేశాల కేంద్ర బ్యాంకులతో ద్వైపాక్షిక కరెన్సీ వినియోగ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇతర దేశాలతో వాణిజ్య చెల్లింపులకు యువాన్‌ వాడకం 2014లో సున్నా కాగా, 2021నాటికి అది 20శాతానికి పెరిగిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) వెల్లడించింది. రష్యన్‌ చమురుకు చెల్లింపులు జరపడానికి భారత్‌, ఐఎంఎఫ్‌ రుణం తీర్చడానికి అర్జెంటీనా యువాన్లను వినియోగించాయి. స్థానిక కరెన్సీలో లావాదేవీలను ప్రోత్సహించాలన్న బ్రిక్స్‌ నిర్ణయంతో యువాన్‌ పలు దేశాల మధ్య చెల్లింపులకు ఉపయోగపడనుంది. అంతర్జాతీయ వాణిజ్యంలో చైనా వాటా 15శాతం. భారత్‌ వాటా కేవలం 1.8శాతమే. దాంతో రూపాయి విస్తృత వినియోగానికి తోడ్పడదు. రష్యా మొదట్లో చమురును భారతీయ రూపాయల్లో విక్రయించినా, తన వద్ద పేరుకుపోయిన రూపాయి నిల్వలను ఏం చేసుకోవాలో తెలియని స్థితిలో ఉంది. అందుకే యూఏఈ దిర్హమ్‌, చైనీస్‌ యువాన్లలోనూ చెల్లింపులు జరపాలని ఇండియాను కోరింది. తాజాగా యూఏఈ నుంచి 10లక్షల పీపాల చమురుకు రూపాయల్లో చెల్లింపులు జరిపేందుకు భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది.


బ్రిక్స్‌ దేశాల మధ్య ఆర్థిక సహకారాభివృద్ధికి 2015లో ఏర్పడిన నూతన అభివృద్ధి బ్యాంకు (ఎన్‌డీబీ) 2022-26 మధ్య ఇచ్చే రుణాల్లో 30శాతాన్ని స్థానిక కరెన్సీల్లో మంజూరు చేస్తామని ప్రకటించింది. ఎన్‌డీబీ రుణాల్లో 67శాతం డాలర్లలో, 18శాతం యువాన్లలో ఉంటున్నాయి. మరే బ్రిక్స్‌ దేశ కరెన్సీకి ఇంత పెద్ద వాటా లేదు. జీడీపీ, అంతర్జాతీయ వాణిజ్యం పరంగా అమెరికా తరవాతి స్థానం చైనాదే కావడం యువాన్‌ బలపడటానికి దోహదపడుతోంది. 2022లో అంతర్జాతీయ వాణిజ్యంలో 21శాతం, బ్రిక్స్‌ దేశాల మధ్య వాణిజ్యంలో 50శాతం వాటా చైనాదే కాబట్టి యువాన్‌ వినియోగం పెరగడం సహజమే. చైనా ఇప్పటికే ఆఫ్రికా, దక్షిణాసియాల్లోని పలు దేశాలకు యువాన్లలో రుణాలిచ్చింది.


ఏకాభిప్రాయం కీలకం

బ్రిక్స్‌ తాజా సమావేశ నిర్ణయాలు చైనాకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చినప్పటికీ, రాజకీయంగా ఊపునిస్తుందా అన్నది అనుమానమే. అంతర్జాతీయ కూటములు, సంఘాల ఐక్యతకు భిన్న రాజకీయ దృక్పథాలే శాపాలవుతాయి. 1950 తరవాత ఒక్క ఉత్తర అట్లాంటిక్‌ కూటమి(నాటో) తప్ప మరే కూటమీ నిలబడలేదు. బ్రిక్స్‌లో భారత్‌ సభ్యదేశమే అయినప్పటికీ, డ్రాగన్‌ ఆధిపత్యాన్ని సహించే ప్రసక్తి ఉండదు. అది బ్రిక్స్‌ పునాదులను బలహీనపరచవచ్చు. ప్రస్తుతం డాలర్‌ ఉక్కు పిడికిలి నుంచి బయటపడాలన్న ఒక్క అంశమే బ్రిక్స్‌ దేశాల ఐక్యతకు పునాదిగా నిలుస్తోంది. బ్రిక్స్‌ దీర్ఘకాలం మనుగడ సాగించాలంటే నాటో కూటమికి ఉన్న ఒక విశిష్ట లక్షణాన్ని అలవరచుకోవాలి. నాటో సభ్య దేశాలు అన్ని నిర్ణయాలనూ ఏకాభిప్రాయంతోనే తీసుకుంటాయి. అందులోని సీనియర్‌ సభ్య దేశం తుర్కియే అడ్డుకొంటున్నందువల్లే స్వీడన్‌ ఇంతవరకు నాటోలో చేరలేకపోయింది. దేశాలు ఒక బృందంగా లేక కూటమిగా నిలవాలంటే ముఖ్యమైన అంశాల్లో ఏకతాటిపై నడవాలి. బ్రిక్స్‌లో కొత్తగా చేరిన సౌదీ అరేబియా, ఇరాన్‌లు తమ విభేదాలను తాత్కాలికంగా పక్కనపెట్టినప్పటికీ, భవిష్యత్తులో ఎలా వ్యవహరిస్తాయో చెప్పలేం!


- ప్రసాద్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వైమానిక సేనకు స్వయంశక్తి

‣ ‘నెట్‌వర్క్‌’తో లాభాలెన్నో!

‣ పర్యటనలే ఉద్యోగమైతే!

‣ డాలరుకు ప్రత్యామ్నాయం ఏమిటి?

Posted Date: 09-09-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం