• facebook
  • whatsapp
  • telegram

వైమానిక సేనకు స్వయంశక్తి



కాకలుతీరిన పోరాట దళంగా పేరుగాంచిన భారత వాయుసేన(ఐఏఎఫ్‌)ను కొంతకాలంగా యుద్ధ విమానాల కొరత పట్టిపీడిస్తోంది. దీన్ని అధిగమించేందుకు ఐఏఎఫ్‌ నడుం కట్టింది. దేశీయ తేజస్‌ యుద్ధ విమానాలను పెద్దయెత్తున సమకూర్చుకోవడానికి సిద్ధమైంది. విదేశీ ఫైటర్‌ జెట్లు, రవాణా విమానాల కొనుగోలుపైనా దృష్టి సారించింది. 


భారత వాయుసేన (ఐఏఎఫ్‌) 1932 అక్టోబరు ఎనిమిదిన ఆవిర్భవించినప్పటి నుంచి అద్వితీయంగా పురోగమించింది. అపార సామర్థ్యం, నైపుణ్యాలతో శత్రువును నిలువరించడంలో ఆరితేరింది. ఇటీవలి కాలంలో దేశ రక్షణకు కావాల్సిన స్థాయిలో యుద్ధవిమానాలను, సాధనసంపత్తిని సమకూర్చుకోవడంలో పలు అవరోధాలను ఎదుర్కొంటోంది. కాలం చెల్లిన ఫైటర్‌ జెట్లు సర్వీసు నుంచి వైదొలగుతుంటే, వాటి స్థానంలో కొత్త యుద్ధ విమానాలను సమకూర్చుకోలేక ఇబ్బంది పడుతోంది. భారత వాయుసేనకు ప్రధాన పోరాట బలమైన మిగ్‌-21 ఫైటర్‌ జెట్లకు 2025కల్లా ఆయుష్షు తీరిపోనుంది. జాగ్వార్‌, మిరేజ్‌-2000, మిగ్‌-29 విమానాలు 2030 నాటికి వైదొలగుతాయి. 1980ల్లో రంగప్రవేశం చేసిన మిగ్‌-29ల సర్వీసు 2027-28లో ముగుస్తుంది. సుఖోయ్‌-30 యుద్ధ విమానాల్లో మొదటి బ్యాచ్‌ ఫైటర్లు 2040 నుంచి రిటైరవుతాయి. తరవాతి తరం సుఖోయ్‌-30లు 2050-55 దాకా వాయుసేనకు పదునైన అస్త్రంగా ఉపకరిస్తాయి. తరిగిపోతున్న బలగాన్ని నిలబెట్టుకోవడానికి మిగ్‌-29, జాగ్వార్‌, మిరేజ్‌-2000లను ప్రస్తుతం ఆధునికీకరిస్తున్నారు. సమస్యకు అది శాశ్వత పరిష్కారం కాదు. తన పోరాట పటిమను నిలబెట్టుకోవడానికి వాయుసేన స్వదేశంలో తయారైన తేజస్‌ ఎంకె1ఏ యుద్ధ విమానాలను రంగంలోకి దింపనుంది. బహుళ పోరాట విధులను నిర్వహించే (ఎంఆర్‌ఎఫ్‌ఏ) విమానాలను, మధ్యతరహా రవాణా విమానాలను (ఎంటీఏ) సైతం భారత వాయుసేన సమకూర్చుకోబోతోంది.


అమ్ములపొదిలో..

చైనా, పాకిస్థాన్‌లను ఏకకాలంలో ఎదుర్కోవాలంటే భారత వాయుసేనకు 42 స్క్వాడ్రన్ల విమానాలు అవసరం. ఒక్కో స్వాడ్రన్‌లో 18 యుద్ధ విమానాలు ఉంటాయి. ప్రస్తుతం వాయుసేనకు 31 స్క్వాడ్రన్లే ఉన్నాయి. 2030కల్లా అవి 32 లేదా 33కు పెరుగుతాయి. 2040కల్లా వాయుసేన బలం 35 లేదా 36 స్క్వాడ్రన్లకు చేరుతుంది. అదీ స్వదేశీ తేజస్‌లు అనుకున్న సంఖ్యలో సమకూరితేనే! 2021లో 83 తేజస్‌ ఎంకే1ఏలకు ఆర్డరు పెట్టిన వాయుసేన, ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకం కింద అదనంగా మరో 100 ఎంకే1ఏ ఫైటర్‌ జట్లను సమకూర్చుకోవాలని నిశ్చయించింది. రాబోయే పదిహేనేళ్లలో వందల సంఖ్యలో వివిధ రకాల తేజస్‌ యుద్ధ విమానాలు వాయుసేన అమ్ముల పొదిలో చేరతాయి. వాటిలో 40 తేజస్‌ ఎంకే1, 180 తేజస్‌ ఎంకే1ఏ, 120 తేజస్‌ ఎంకే2 విమానాలు ఉంటాయి. తేజస్‌తో పాటు విదేశీ యుద్ధ విమానాలనూ భారత వాయుసేన సమకూర్చుకోనుంది. విదేశీ ఫైటర్‌ జెట్ల తయారీ పరిజ్ఞానాన్ని పూర్తిగా భారత్‌కు బదిలీ చేసే షరతుపై వాటిని కొనుగోలు చేస్తుంది. ఫ్రాన్స్‌ నుంచి వాయుసేన కోసం ఇప్పటికే 36 రఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన భారత్‌- నౌకాదళం కోసమూ రానున్న రెండు మూడేళ్లలో 26 రఫేల్‌-ఎం(మెరైన్‌) ఫైటర్‌ జెట్లను సమకూర్చుకోనుంది. వాటిని విమాన వాహక యుద్ధ నౌక విక్రాంత్‌పై మోహరిస్తారు. దీంతో భారత అమ్ముల పొదిలో మొత్తం 62 రఫేల్‌ యుద్ధ విమానాలు సమకూరతాయి.


భారత్‌ మొత్తం 114 బహుళ పోరాట విధుల (ఎంఆర్‌ఎఫ్‌ఏ) యుద్ధ విమానాలను సమకూర్చుకోదలచింది. వాటికి సంబంధించిన సమాచారాన్ని తెలపాలని 2018 ఏప్రిల్‌లో విదేశీ సంస్థలను కోరింది. దానికి స్పందించిన వాటిలో ఫ్రాన్స్‌కు చెందిన రఫేల్‌ ఉత్పత్తిదారైన డస్సో, యూరోఫైటర్‌ టైఫూన్‌, స్వీడన్‌కు చెందిన సాబ్‌, రష్యాకు చెందిన యునైటెడ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కార్పొరేషన్‌, సుఖోయ్‌ కార్పొరేషన్‌, అమెరికాకు చెందిన బొయింగ్‌, లాఖీడ్‌ మార్టిన్‌ ఉన్నాయి. రఫేల్‌ను ఇప్పటికే వినియోగిస్తున్నందువల్ల దానికే ఎక్కువ మార్కులు పడవచ్చు. మరోవైపు హెచ్‌ఏఎల్‌తో కలిసి జనరల్‌ ఎలెక్ట్రిక్‌ సంస్థ భారత్‌లోనే ఎఫ్‌414 యుద్ధ విమాన ఇంజిన్లను తయారు చేయాలన్న ప్రతిపాదనకు అమెరికా కాంగ్రెస్‌ తాజాగా ఆమోదం తెలిపింది. ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. దీంతో తేజస్‌ ఎంకే2కు అవసరమైన ఇంజిన్ల తయారీ సులువవుతుంది.


సదా సన్నద్ధంగా..

ఫైటర్‌, రవాణా విమానాలకు తోడు సైబర్‌, అంతరిక్ష పోరాట పటిమనూ భారత వాయుసేన సంతరించుకొంటోంది. రేపటి యుద్ధాల్లో గెలవడానికి ఇది చాలా ముఖ్యం. తదనుగుణంగా భారత వాయుసేనను వైమానిక-అంతరిక్ష బలగంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాసియాకే పరిమితమైన భారత వాయుసేన ప్రపంచ శక్తిగా ఎదగడానికి కృషి చేస్తోంది. మలాకా జలసంధి నుంచి ఏడెన్‌ సింధుశాఖ వరకు గగనతలంలో మోహరించే సత్తాను సాధించింది. మరోవైపు టిబెట్‌ భూభాగంలో చైనా మరిన్ని యుద్ధ విమానాలను నియోగించింది. అవి దిగడానికి అదనంగా రన్‌వేలు నిర్మించింది. చైనా నుంచి ముప్పును ఎదుర్కోవడానికి భారత వాయుసేన సదా సన్నద్ధంగా ఉండాలి. 


రవాణా విమానాలు

ఇటీవల చైనాతో సరిహద్దు ఘర్షణల సమయంలో రవాణా విమానాల ఆవశ్యకత భారత్‌కు తెలిసివచ్చింది. భారత వాయుసేన అమెరికన్‌ సీ-17, రష్యన్‌ ఇల్యూషిన్‌-76 విమానాల్లో సైనికులు, సాయుధ కవచ శకటాలు, ట్యాంకులు, క్షిపణులు తదితరాలను గత మూడేళ్లలో తూర్పు లద్దాఖ్‌కు తరలించింది. అక్కడి పర్వతాలకు 25 టన్నుల బరువుండే తేలికపాటి యుద్ధ ట్యాంకులను పంపాలని భారత సైన్యం తలపెట్టింది. అందుకోసం మధ్యతరహా రవాణా విమానాలను (ఎంటీఏ) సమకూర్చుకోవాలి. వాటిని అందించగల దేశమేదైనా సరే భారత్‌లోనే ఎంటీఏలను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఈ కాంట్రాక్టు కోసం లాఖీడ్‌ మార్టిన్‌కు చెందిన 20 టన్నుల సీ-130 రవాణా విమానం, ఎంబ్రేర్‌ (బ్రెజిల్‌)కు చెందిన 26 టన్నుల విమానం, ఐరోపాకు చెందిన 37 టన్నుల ఏ400ఎం విమానం పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం వాయుసేనలో యావ్రో రవాణా విమానాలను వినియోగిస్తున్నారు. వీటి స్థానంలో 56 సీ-295 కొత్త రవాణా విమానాల కొనుగోలుకు 2021 సెప్టెంబరులో భారత రక్షణ శాఖ- ఎయిర్‌ బస్‌, స్పెయిన్‌కు చెందిన స్పేస్‌ ఎస్‌ఏ సంస్థలతో రూ.21,935 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో 16 విమానాలు త్వరలో భారత్‌కు చేరతాయి. మిగిలిన 40 విమానాలను భారత గడ్డపైనే కూర్పుచేస్తారు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ‘నెట్‌వర్క్‌’తో లాభాలెన్నో!

‣ పర్యటనలే ఉద్యోగమైతే!

‣ డాలరుకు ప్రత్యామ్నాయం ఏమిటి?

‣ బెంబేలెత్తిస్తున్న వాయు కాలుష్యం

‣ లాభసాటి సేద్యం కోసం..

‣ మాతృభాషతోనే బలమైన పునాది

‣ సైన్యం గుప్పిట్లో ఆఫ్రికా దేశాలు

Posted Date: 09-09-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం