• facebook
  • whatsapp
  • telegram

మాతృభాషతోనే బలమైన పునాది



మానవ ప్రగతిలో భాష కీలక పాత్ర పోషిస్తుంది. అభివృద్ధి చెందిన దేశాలు మాతృభాష ఆధారిత బహుభాషా విద్యావిధానం ద్వారా పురోగతి సాధించాయి. ఐరోపా ఖండంలో చాలా దేశాలు స్థానిక భాషలనే వినియోగిస్తున్నాయి. పిల్లలు సౌకర్యంగా, సులభంగా అభ్యసించగలిగే మాధ్యమంలో విద్యాబోధన ఉత్తమం. ఈ క్రమంలో దేశీయంగా సీబీఎస్‌ఈ పాఠశాలల్లో రాజ్యాంగంలో పేర్కొన్న 22 భాషల్లో విద్యను బోధించాలని లక్షించారు.


ప్రపంచవ్యాప్తంగా బహుభాషా విద్య ప్రాధాన్యం సంతరించుకొంటోంది. ఐరాస, యునెస్కో, ప్రపంచబ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు ప్రాథమిక స్థాయి వరకు మాతృభాష మాధ్యమంగానే విద్యాబోధన జరగాలని చెబుతున్నాయి. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం - 2023 కూడా బహుభాషా విద్య అవసరాన్ని గుర్తించింది. మాతృభాషలో జ్ఞానాన్ని పొందలేని వారిలో అభివృద్ధి పరిమితంగా ఉంటుందని, వ్యక్తిత్వ వికాసం, మేధాపరమైన ప్రగతి తదితరాలు మందగిస్తాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇంటిలో ఒక భాష, పాఠశాలలో మరొక భాష వాడటం వల్ల పిల్లలపై మానసికంగా అధిక ఒత్తిడి ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అభివృద్ధి చెందుతున్న చాలా దేశాలు సామాజికంగా బహుళ భాషలను కలిగి ఉన్నప్పటికీ చారిత్రక నేపథ్యం కారణంగా విద్యారంగంలో ఆంగ్ల భాష ఆధిపత్యం కొనసాగుతోంది.


సమ్మిళిత విద్య

ప్రాంతీయ భాషల్లో బోధన ద్వారా విద్యార్థులకు నాణ్యమైన, సమ్మిళిత విద్య లభిస్తుంది. ఈ తరహా బోధన విద్యార్థుల అధ్యయన సామర్థ్యాన్ని, అభ్యసన ఫలితాలను మెరుగు పరుస్తుంది. మాతృభాషపై బలమైన పట్టు సాధిస్తే అదనపు భాషలను అభ్యసించడం తేలికవుతుంది. విద్యారంగ నిపుణుల విశ్లేషణ ప్రకారం ప్రాథమిక స్థాయిలో పిల్లలకు తెలియని భాషలో బోధించడం వల్ల గ్రహణ శక్తి తగ్గి, బట్టీ విధానం, చూచిరాత వంటి పద్ధతుల వైపు మొగ్గు చూపుతారు. ప్రాంతీయ భాషల మాధ్యమ బోధన- పిల్లలు తరగతి గదిలో బెరుకు లేకుండా, క్రియాశీలకంగా పాల్గొనే అవకాశం కల్పిస్తుంది. ఇది చదువు పట్ల ఆసక్తి పెంచి, మధ్యలో బడి మానేయకుండా నిరోధిస్తుంది. ప్రాథమిక విద్యాస్థాయిలో ప్రాంతీయ భాష మాధ్యమంగా విద్యాబోధన చేపట్టాలని దేశంలో దశాబ్దాలుగా చర్చ జరుగుతోంది. రాజ్యాంగం ప్రకారం భాషాపరమైన అల్పసంఖ్యాకుల పిల్లలకు వారి మాతృభాషలో విద్యాబోధనకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. త్రిభాషా సూత్రం, కొఠారియా కమిషన్‌, జాతీయ పాఠ్యాంశాల ప్రణాళిక చట్రం, నూతన విద్యా విధానం - 2020 నివేదికలు పిల్లలకు ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలోనే చదువు చెప్పాలని సిఫారసు చేశాయి. దేశంలోని పాఠశాలలన్నీ అయిదో తరగతి వరకు అవకాశం ఉంటే ఎనిమిదో తరగతిదాకా ప్రాంతీయ భాషలో బోధన చేయాలని నూతన విద్యా విధానం ప్రతిపాదించింది. ప్రాంతీయ భాషలో విద్యాబోధన కేవలం విద్యార్థుల అభ్యాస ఫలితాలను మెరుగు పరచడమే కాకుండా- దేశంపట్ల గౌరవాన్ని, విశ్వాసాన్ని, సమగ్రతను పెంపొందిస్తుందని విద్యా విధానం పేర్కొంది. అత్యున్నత నాణ్యత ప్రమాణాలు కలిగిన అధ్యయన సమాచారాన్ని ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేయడానికి ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లేషన్‌, ఇంటర్‌ప్రెటేషన్‌ సంస్థను ఏర్పాటు చేయాలని కూడా సూచించింది. రాజ్యాంగంలో పేర్కొన్న 22 ప్రాంతీయ భాషల మాధ్యమంగా సీబీఎస్‌ఈ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యను అందించాలని చర్యలు చేపడుతున్నారు. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఒడిశా రాష్ట్రం 2007 నుంచి గిరిజన ప్రాంతాల్లో బహుభాషా విద్యను అందిస్తోంది. గిరిజన భాషపై పట్టు కలిగిన వారిని ఉపాధ్యాయులుగా నియమిస్తోంది. ద్విభాషా నిఘంటువులను, పాఠ్యపుస్తకాలను, భాష హ్యాండ్‌బుక్‌లను ప్రభుత్వం రూపొందించింది. దేశంలో మూడోగ్రేడ్‌ చదివే పిల్లలందరికీ భాషా, గణిత నైపుణ్యాల్లో 2027 నాటికి బలమైన పునాది వేయడానికి జాతీయ స్థాయిలో ప్రారంభించిన ‘నిపుణ్‌ భారత్‌ మిషన్‌’ మాతృభాష బోధనను ప్రోత్సహిస్తోంది. ప్రాంతీయ భాషలను ప్రోత్సహిస్తూ నూతన విద్యా విధానం ప్రతిపాదనలు చేసినా, వాటి అమలుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక, నిధుల లభ్యత మార్గాల గురించి వివరించలేదు. ప్రతిపాదనల అమలుకు రాజకీయ, సామాజిక, సాంకేతిక మద్దతు లభించినా ఆర్థిక మద్దతు కష్టం. బహుభాషా బోధనను దేశవ్యాప్తంగా అమలుపరచేందుకు ప్రభుత్వాలు భారీగా నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక అంచనా ప్రకారం ప్రాంతీయ భాషల్లో బోధన సామగ్రిని తయారు చేయడానికి విద్యా   బడ్జెట్లో ఒక శాతం ఖర్చు చేయాలి. వార్షిక బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించే నిధులు ఏటా తెగ్గోసుకు పోతున్నాయి. బోధన సామగ్రితో పాటుగా మానవ వనరుల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు అధిక నిధులు అవసరం అవుతాయి.


సమాజం చిన్నచూపు

ఒకవైపు, మాతృభాష మాధ్యమం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు చేకూరతాయని పాఠశాల విద్యపై జరిపిన పరిశోధనలు నొక్కి చెబుతుండగా... విద్యావ్యవస్థ భిన్నదిశలో పయనిస్తోంది. విద్యావ్యవస్థలో ఆంగ్ల మాధ్యమ ఆధిపత్యమే కొనసాగుతోంది. మాతృభాష మాధ్యమంలో చదివే విద్యార్థులను సమాజం చిన్నచూపు చూస్తోంది. విద్యార్థుల సామర్థ్యాన్ని ఆంగ్లంలో ప్రతిభ ఆధారంగా నిర్ధారిస్తున్నారు. ప్రాంతీయ భాషలో చదువులతో యువ ప్రతిభకు సరైన న్యాయం జరుగుతుందనే వాస్తవాన్ని గుర్తించడం లేదు. ప్రభుత్వాలు సైతం మాతృభాష మాధ్యమ అమలుపై వివిధ కమిషన్లు, కమిటీలు, విధాన పత్రాల సిఫారసులను పక్కనపెడుతున్నాయి. ఇంగ్లిష్‌ చదువులతోనే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులూ విశ్వసిస్తూ ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. దాంతో ప్రభుత్వాలు సైతం సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నాయి. ప్రాథమిక విద్య పిల్లల భవితను నిర్ధారిస్తుందనే అపోహను వీడాలి. ప్రాథమిక దశలో ప్రాంతీయ భాషలో చదివినంత మాత్రాన పిల్లలకు నష్టమేమీ ఉండదు. దీనివల్ల పై చదువులకు బలమైన సైద్ధాంతిక పునాది ఏర్పడుతుంది. విద్య ఉమ్మడి జాబితాలోని అంశం కావడం వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దేశవ్యాప్తంగా ప్రాథమిక స్థాయి పాఠశాల విద్యను ప్రాంతీయ భాషల్లోనే బోధించేలా చర్యలు తీసుకోవాలి. ఇది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతగానో ఉపకరిస్తుంది.


అభ్యసనలో రాజీ

ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో 40శాతం విద్యార్థులకు వారు మాట్లాడే లేదా వారికి తెలిసిన భాషలో విద్యాబోధన జరగడం లేదు. ఇతర భాషా మాధ్యమంలో అధ్యయనం చేయడం వల్ల జ్ఞాన సమగ్రత లోపించి అభ్యసనలో రాజీ పడుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ కారణంగా విద్యార్థులకు అభ్యాసంపై ఆసక్తి తగ్గి విద్యలో విఫలమవుతున్నారు లేదా చదువును మధ్యలోనే ఆపేస్తున్నారు.


- డాక్టర్‌ సీహెచ్‌సీ ప్రసాద్‌ (విద్యారంగ నిపుణులు)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ వర్చువల్‌ ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే?

‣ విదేశీ భాషలు.. అదనంగా ప్రయోజనాలు

‣ 18 ఎయిమ్స్‌లలో నర్సింగ్‌ ఆఫీసర్లు

‣ పరీక్షల్లో విజయానికి మెలకువలు

Posted Date: 21-08-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం