• facebook
  • whatsapp
  • telegram

డాలరుకు ప్రత్యామ్నాయం ఏమిటి?అంతర్జాతీయ వాణిజ్యం ప్రస్తుతం ప్రధానంగా డాలర్లలో సాగుతోంది. డాలరు విలువ అమాంతం పెరుగుతుండటం ఆయా దేశాలకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో స్థానిక కరెన్సీలో వాణిజ్య లావాదేవీలు ఊపందుకొంటున్నాయి.


ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో అమెరికా, ఐరోపా సమాఖ్య(ఈయూ)లు తమ దేశాల్లోని రష్యా ఆస్తులను స్తంభింపజేశాయి. దానికి డాలర్లు అందకుండా కట్టడి చేశాయి. ఇది ప్రపంచ దేశాలను ఆలోచనలోకి నెట్టింది. మరోవైపు అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచడంతో డాలర్‌ విలువ అమాంతం పెరిగి ప్రపంచ దేశాలకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. అంతర్జాతీయ వాణిజ్యం ప్రధానంగా డాలర్లలో జరగడమే దీనికి కారణం. డాలర్లలోనే చమురు విక్రయాలు జరిపేలా 1970ల్లో సౌదీ అరేబియాను అమెరికా ఒప్పించింది. అందువల్లే నేడు డాలర్‌ అంతర్జాతీయ కరెన్సీగా చలామణీ అవుతోంది. మారిన పరిస్థితుల్లో డాలరుకు ప్రత్యామ్నాయం కనుగొనాల్సిందేనని రష్యా, చైనాలు కంకణం కట్టుకున్నాయి. మొదట డాలరుకు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్‌ ఉమ్మడి కరెన్సీని తీసుకురావాలనే ప్రతిపాదన వచ్చింది. దానికన్నా ముందు స్థానిక కరెన్సీల్లో లావాదేవీలను జరపాలని అంగీకారం కుదిరింది. దీన్ని స్థానిక కరెన్సీ పరిష్కార (ఎల్‌సీఎస్‌) ఒప్పందంగా వ్యవహరిస్తున్నారు.


జూన్‌లో దక్షిణాఫ్రికాలో సమావేశమైన బ్రిక్స్‌ దేశాల ఆర్థిక మంత్రులు అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థిక లావాదేవీలకు ఎల్‌సీఎస్‌ ప్రక్రియను ఉపయోగించాలని తీర్మానించారు. మొదట చమురు, గ్యాస్‌ లావాదేవీలను స్థానిక కరెన్సీలలో జరపడం ద్వారా డాలర్‌ ఆధిపత్యానికి గండి కొట్టాలని బ్రిక్స్‌ కూటమి నిశ్చయించింది. ప్రధాన చమురు ఉత్పత్తిదారులైన సౌదీ అరేబియా, ఇరాన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లు దీనితో కలిసి నడుస్తున్నాయి. ఈ మూడింటితో పాటు మొత్తం 22 దేశాలు బ్రిక్స్‌లో భాగస్వామ్యం కావడానికి అధికారికంగా సన్నద్ధత తెలిపాయి. మరో 22 దేశాలు అనధికారంగా సుముఖత వ్యక్తం చేశాయి. తొలుత రష్యా నుంచి దిగుమతి అయిన చమురుకు భారత్‌ రూపాయల్లో చెల్లింపులు జరిపింది. ఆ తరవాత 10శాతం చెల్లింపులను యువాన్లలో జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల యూఏఈ నుంచి 10 లక్షల పీపాల చమురు దిగుమతికి ఎల్‌సీఎస్‌ పద్ధతి కింద భారత్‌ రూపాయల్లో, దిర్హమ్‌లలో చెల్లింపులు జరిపింది. ద్వైపాక్షిక వాణిజ్యానికి డాలర్‌ బదులు జాతీయ కరెన్సీలను ఉపయోగించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, యూఏఈ అధ్యక్షుడు షేక్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌లు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ఇలా అమలులోకి వచ్చింది. ఫ్రాన్స్‌ సైతం యూఏఈ నుంచి కొన్న 65,000 టన్నుల ఎన్‌ఎన్‌జీ గ్యాస్‌కు యువాన్లలో చెల్లింపులు జరిపింది. చైనా, సౌదీ అరేబియాలకు విక్రయించిన చమురుకు రష్యా కూడా యువాన్లను స్వీకరిస్తోంది. సౌదీ అరేబియా సైతం చమురు అమ్మకాలకు చైనీస్‌ యువాన్లను స్వీకరించాలని యోచిస్తోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో చమురు, గ్యాస్‌లదే అత్యధిక వాటా. ఈ విపణిలో స్థానిక కరెన్సీల వినియోగం పెరిగితే డాలర్‌ పెత్తనానికి గండి పడటం ఖాయం. దీన్ని దృష్టిలో ఉంచుకుని సౌదీ డాలర్లలోనే చమురు అమ్మకాలు కొనసాగించాలంటూ అమెరికా ఒత్తిడి తెస్తోంది.


భవిష్యత్తులో వచ్చే బ్రిక్స్‌ ఉమ్మడి కరెన్సీ రూపం ఎలా ఉంటుందనేది మరోవైపు ఆసక్తికరమైన ప్రశ్న. అది బ్రిక్స్‌లోని అయిదు సభ్య దేశాల జాతీయ కరెన్సీల సమాహారంగా ఉంటుందా లేక బంగారు నిల్వలపై ఆధారపడిన ఉమ్మడి కరెన్సీగా ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది. బంగారం విలువ ఎప్పటికప్పుడు మారుతుంది. దాన్ని పునాదిగా చేసుకుని ఉమ్మడి కరెన్సీ తేవడం మంచిదేనా అనే సందేహం తలెత్తుతోంది. బ్రిక్స్‌ దేశాలు ఈ మధ్య బంగారం కొనుగోళ్లను అధికం చేసినా- ఇప్పటికీ బంగారు నిల్వల్లో అమెరికా, ఐరోపా దేశాలదే పైచేయి. బ్రిక్స్‌ సభ్య దేశాలైన భారత్‌, రష్యా, చైనా, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాల వద్ద మొత్తం 5,270 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. ఒక్క అమెరికా వద్దే 8,133 టన్నుల బంగారం పోగుపడింది. ఇక జర్మనీ, ఫ్రాన్స్‌, జపాన్‌, ఇటలీ, బ్రిటన్‌ల వద్ద 9,400 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. అందువల్ల, బ్రిక్స్‌ ఉమ్మడి కరెన్సీ బంగారం విలువ పరంగా డాలర్‌, యూరోలతో సరితూగలేదు. పైగా భారత్‌, చైనాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఉమ్మడి కరెన్సీకి అడ్డువచ్చే అవకాశం ఉంది. నేటి నుంచి దక్షిణాఫ్రికాలోని జొహానెస్‌బర్గ్‌లో జరిగే బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో డాలర్‌ ప్రత్యామ్నాయ అన్వేషణలో తీసుకోబోయే నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది.


- ఆర్య
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బెంబేలెత్తిస్తున్న వాయు కాలుష్యం

‣ లాభసాటి సేద్యం కోసం..

‣ మాతృభాషతోనే బలమైన పునాది

‣ సైన్యం గుప్పిట్లో ఆఫ్రికా దేశాలు

Posted Date: 22-08-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం