భౌగోళిక రాజకీయ శక్తుల ప్రచ్ఛన్న యుద్ధానికి ఆఫ్రికా వేదికగా మారింది. గత నెలాఖరులో నైగర్‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి సైన్యం అధికారం చేజిక్కించుకొంది. తాజా అస్థిరతలో రష్యాకు చెందిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ హస్తం ఉండటం అమెరికా సహా పశ్చిమ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
ఆఫ్రికాలో ఇప్పటికే బుర్కినాఫాసో, మాలి, చాడ్, సూడాన్‌లు సైనిక పాలనలోకి జారిపోయాయి. వీటికి రష్యా ఆశీస్సులు దండిగా ఉన్నాయి. ఇప్పటిదాకా ప్రజాస్వామ్య పాలనలో ఉన్న నైగర్- అమెరికా, ఫ్రాన్స్‌లకు నమ్మకమైన మిత్రదేశంగా కొనసాగింది. ఈ ప్రాంతంలో ఐసిస్, అల్‌ఖైదా, బోకోహరాం వంటి ఉగ్రసంస్థలతో పోరాడేందుకు కీలక స్థావరంగా ఉపకరించింది. ఇక్కడ అమెరికా అతిపెద్ద డ్రోన్ స్థావరం సైతం ఏర్పాటు చేసింది. ఫ్రాన్స్‌కు చెందిన సైనిక స్థావరాలు నెలకొన్నాయి. అయినా, నైగర్‌లో ఉగ్రదాడులు ఏ మాత్రం తగ్గుముఖం పట్టకపోవడం స్థానికుల్లో ఆక్రోశాన్ని పెంచింది. దీనికి వాగ్నర్ గ్రూప్‌నకు చెందిన సైబర్ యుద్ధతంత్ర బృందాలు ఆజ్యం పోసి ప్రజాభిప్రాయాన్ని రష్యాకు అనుకూలంగా మార్చాయి. ఫలితంగా తిరుగుబాటు తరవాత చాలాచోట్ల ప్రజలు రష్యా పతాకాలు ప్రదర్శిస్తూ వాగ్నర్ పేరిట నినాదాలు చేయడం కనిపించింది. మాస్కో నుంచి సైనిక మద్దతు లభిస్తుందని, ఉగ్రవాదంపై వాగ్నర్ గ్రూప్ మెరుగ్గా పోరాడుతుందని అక్కడి వారు నమ్ముతున్నట్లుంది.
తిరుగుబాటుకు కారణాలెన్నో..
నైగర్‌లో చోటుచేసుకున్న తిరుగుబాటుకు వాగ్నర్ గ్రూప్ వ్యూహాలు, జాతి విభేదాలు, సైనిక అసంతృప్తి వంటివి కారణాలుగా కనిపిస్తున్నాయి. అధ్యక్షుడు బజూమ్ అరబ్ అల్పసంఖ్యాక వర్గానికి చెందిన వ్యక్తి కావడం మరో కీలక కారణం. నైగర్‌లో వారిని విదేశీయులుగా పరిగణిస్తారు. దీనికితోడు ఒకప్పటి ఆక్రమణదారైన ఫ్రాన్స్‌తో ఆయన సన్నిహితంగా మెలగడం ప్రజల్లో అసంతృప్తిని ఎగదోసింది. సైనిక నాయకత్వంలో మార్పులకు పూనుకోవడం తిరుగుబాటుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. సైనిక నాయకత్వాన్ని ప్రక్షాళన చేయడంలో భాగంగా కీలకమైన ఆరుగురు జనరళ్లకు బజూమ్ విశ్రాంతి కల్పించారు. తన అంగరక్షక బృందం అధిపతి జనరల్ అబ్దురహమానే టియానీతోపాటు, సైనికదళాల అధిపతినీ తప్పించే చర్యలు మొదలుపెట్టారు. దీంతో టియానీ బృందం బజూమ్‌పై తిరుగుబాటు చేసి అధికారం హస్తగతం చేసుకొంది. నాణ్యమైన యురేనియం ఉత్పత్తికి నైగర్ ప్రసిద్ధి. ఐరోపా సమాఖ్యలోని ప్రధాన అణు రియాక్టర్లకు ఇక్కడి యురేనియమే కీలకం. ఫ్రాన్స్‌లో అణు విద్యుత్తునే అధికంగా వినియోగిస్తుండటంతో పారిస్‌కు యురేనియం ఎగుమతి చేయబోమంటూ తాజాగా నైగర్‌లో అధికారం చేపట్టిన సైనిక ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో పశ్చిమ ఆఫ్రికా ఆర్థిక సమూహం (ఎకోవాస్) రంగంలోకి దిగి తక్షణమే నైగర్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలంటూ హుకుం జారీ చేసింది. మరోవైపు అమెరికా, ఫ్రాన్స్, పశ్చిమ దేశాలు నైగర్‌కు సహాయ నిరాకరణ ప్రకటించాయి. కానీ, నైగర్ సైనిక నాయకత్వం ఇవేమీ లెక్కచేయకుండా గగనతల సరిహద్దులను మూసివేసింది. అధ్యక్షుడు బజూమ్‌ను బంధించింది. దేశాన్ని బలహీనపరుస్తున్నారనే ఆరోపణలపై విచారణ చేపట్టనుంది. కొత్త సైనిక పాలనకు మాలి, బుర్కినా ఫాసో, రష్యా మద్దతుగా నిలిచాయి. ఆఫ్రికా దేశాల్లో సైనిక ప్రభుత్వాలు వచ్చే కొద్దీ రష్యా పట్టు పెరుగుతోంది. పశ్చిమాఫ్రికాలో ఎకోవాస్ కూటమి నైగర్‌ల మధ్య యుద్ధం మొదలైతే ఐరోపాకు ఇంధన వనరుల కటకట ఏర్పడుతుంది. నాటో కూటమిపై ఒత్తిడి పెరుగుతుంది. ఉక్రెయిన్‌కు తరలించాల్సిన ఆయుధాల్లో కొంత ఇటు మళ్ళించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అప్పుడు కీవ్‌పై పట్టు బిగించడం మాస్కోకు తేలికవుతుందన్నది వ్యూహం.
తటస్థ వైఖరి
ఇటువంటి సైనిక తిరుగుబాట్ల సమయంలో ఎలా వ్యవహరించాలనేది మయన్మార్ అనుభవం ద్వారా భారత్ అవగతం చేసుకొంది. నైగర్‌లో తిరుగుబాటును ఆ దేశ అంతర్గత వ్యవహారంగా భావిస్తూ తటస్థ వైఖరిని అనుసరిస్తోంది. అక్కడున్న దాదాపు 250 మందికిపైగా భారతీయులను తరలించే ఏర్పాట్లను విదేశీ వ్యవహారాల శాఖ చేపట్టింది. 2009లో నైగర్ రాజధాని నియామేలో భారత్ దౌత్య కార్యాలయం తెరిచింది. బియ్యం, చక్కెర, పత్తి, ఔషధాలను భారత్ ఆ దేశానికి ఎగుమతి చేస్తోంది. ద్వైపాక్షిక సంబంధాలపై ఈ తిరుగుబాటు ప్రభావం పడే అవకాశాలు నామమాత్రమే. కాకపోతే, ఆఫ్రికాలో చోటుచేసుకొనే పరిణామాలపై భారత్ అనుక్షణం అప్రమత్తంగా ఉండటం మేలు.
- పి.ఫణికిరణ్
-----------------------------------------------------------------------------------------------------------
మరింత సమాచారం ... మీ కోసం!
‣ కర్బన ఉద్గారాలకు కళ్ళెం.. లిథియం!