• facebook
  • whatsapp
  • telegram

కాలయాపనే చైనా వ్యూహమా?



కీలకమైన బ్రిక్స్‌, జీ-20 శిఖరాగ్ర సదస్సులు త్వరలోనే జరగనున్నాయి. ఈ తరుణంలో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడంపై ఇండియా, చైనా దృష్టి సారించాయి. తూర్పు లద్దాఖ్‌లో ఇంకా ఘర్షణాత్మకంగా మిగిలి ఉన్న కొన్ని ప్రాంతాల నుంచి బలగాలను త్వరితగతిన ఉపసంహరించుకోవడంపై తాజాగా విస్తృత స్థాయిలో సమాలోచనలు జరిపాయి. 


వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి పరిస్థితులను తిరిగి గల్వాన్‌ ఘర్షణల పూర్వపు స్థితికి చేర్చేందుకు ఇండియా చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన వేగంతో ఫలించడం లేదు. శాంతిస్థాపనకు తాము సుముఖమేనంటూ ఎప్పటికప్పుడు దౌత్య, సైనిక చర్చల్లో చైనా నీతి వచనాలు పలుకుతోంది. చేతల్లో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కి తీసుకోవడంపై మీనమేషాలు లెక్కిస్తోంది. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో 2020 జూన్‌లో ఇండియా, చైనా బలగాల మధ్య చెలరేగిన ఘర్షణ ఇరు దేశాల సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది. సరిహద్దుల్లో ఇరు పక్షాలూ భారీగా ఆయుధ, బలగాల మోహరింపు చేపట్టడంతో నాడు యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్లు కనిపించాయి. అదృష్టవశాత్తు రణభేరి మోగకపోయినా- ఎల్‌ఏసీ వెంబడి చాలా ప్రాంతాల్లో ఎన్నో రోజుల పాటు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. దౌత్య, సైనిక మార్గాల్లో పలు దఫాలుగా జరిగిన చర్చల ఫలితంగా గల్వాన్‌ లోయ, పాంగోంగ్‌ త్సొ ఉత్తర-దక్షిణ ప్రదేశాలు, గోగ్రా పోస్ట్‌, హాట్‌స్ప్రింగ్స్‌ వంటి ప్రాంతాల నుంచి ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకున్నాయి. పలుచోట్ల బఫర్‌ జోన్లను ఏర్పాటు చేసుకున్నాయి. దెప్సాంగ్‌, డెమ్చోక్‌ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.


ప్రశాంత వాతావరణమే లక్ష్యంగా..

డ్రాగన్‌ బలగాలు దెప్సాంగ్‌లో సరిహద్దును దాటి వచ్చి భారత భూభాగంలో తిష్ఠ వేశాయి. అక్కడ పలు గస్తీ కేంద్రాల వద్దకు భారత సైనికులు రాకుండా అడ్డుకుంటున్నాయి. డెమ్చోక్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. అక్కడ బలగాలను ఉపసంహరించుకోవాల్సిన ఆవశ్యకతను ప్రతి భేటీలో ఇండియా నొక్కి చెబుతున్నా, చైనా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. అదే సమయంలో ఎల్‌సీఏ వెంబడి మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరచుకుంటోంది. సరిహద్దుల్లో కొత్త గ్రామాలను నిర్మిస్తోంది. గల్వాన్‌ ఘర్షణలకు ముందు, తరవాత- వాస్తవాధీన రేఖ వెంబడి చైనా భూభాగంలో చెక్‌ పాయింట్లు, సైనిక స్థావరాలు, గ్రామాలు, హెలిప్యాడ్ల వంటివి భారీగా పెరిగినట్లు ఉపగ్రహ చిత్రాలతో స్పష్టమవుతోంది. దెప్సాంగ్‌, డెమ్చోక్‌ల నుంచి బలగాల ఉపసంహరణపై బీజింగ్‌ వ్యూహాత్మకంగానే కాలయాపన చేస్తున్నట్లు కనిపిస్తోంది. తమ సైనికులు దీర్ఘకాలంపాటు అక్కడ కొనసాగితే- కొన్నాళ్లయ్యాక దిల్లీ మౌనం వహిస్తుందని, చేసేదేమీ లేక అక్కడి వరకూ ఎల్‌సీఏ ఉన్నట్లు అంగీకరిస్తుందని అది ఆశిస్తూ ఉండవచ్చు.


సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా ఇండియా, చైనాల మధ్య ఇటీవల 19వ విడత సైనిక చర్చలు జరిగాయి. అవి ఒకింత సానుకూల ఫలితాలను ఇచ్చినట్లే కనిపిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 18వ దఫా సంప్రతింపుల తరవాత ఇరు పక్షాలు కనీసం ఉమ్మడి ప్రకటన విడుదలకూ ముందుకు రాలేదు. వేర్వేరు ప్రకటనలతో సరిపెట్టాయి. ఇప్పుడు మాత్రం సంయుక్త ప్రకటనను వెలువరించాయి. సరిహద్దుల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వేగంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు అందులో తెలిపాయి. బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు కోసం ప్రధాని మోదీ వచ్చే వారం దక్షిణాఫ్రికాకు వెళ్ళనున్నారు. అక్కడ చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో ఆయన భేటీ అయ్యే అవకాశాలున్నాయి. వచ్చే నెలలో జీ-20 సదస్సు కోసం జిన్‌పింగ్‌ ఇండియాకు రానున్నారు. అప్పుడూ వారిద్దరు సమావేశమవడం దాదాపు ఖాయమే. 19వ విడత సైనిక చర్చల్లో సానుకూల పవనాలతో- వారి ద్వైపాక్షిక భేటీలకు రంగం సిద్ధమైనట్లయింది.


సరైన అవకాశం

ఈ ఏడాది జూన్‌లో మోదీ అమెరికా పర్యటనలో దిల్లీ-వాషింగ్టన్‌ల మధ్య రక్షణ, సాంకేతిక రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరాయి. అమెరికాతోపాటు ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో కీలకమైన పలు దేశాలతో సంబంధాల మెరుగుదలకు ఇండియా కొన్నేళ్లుగా ప్రాధాన్యమిస్తోంది. ఈ పరిణామాలు బీజింగ్‌కు ఎంతమాత్రమూ రుచించడం లేదు. సరిహద్దు వివాదాన్ని పక్కనపెట్టి, మిగతా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిద్దామన్న తమ పిలుపునకు భారత్‌ ససేమిరా అంటుండటమూ మింగుడుపడటం లేదు. మరోవైపు- తైవాన్‌ ఆక్రమణకు చైనా ఉవ్విళ్లూరుతోంది. ఈ పరిస్థితుల్లో ఇండియాతో ఘర్షణ తమకు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని బీజింగ్‌ భావిస్తూ ఉండవచ్చు. అందుకే, వాస్తవాధీన రేఖ విషయంలో ప్రస్తుతానికి అది దూకుడు తగ్గించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితిని దిల్లీ పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. సరిహద్దుల్లో ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి డ్రాగన్‌ తన బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేసి, భారత సార్వభౌమత్వాన్ని పరిరక్షించాలి.


- ఎం.నవీన్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సమాచార నిరాకరణ అస్త్రం!

‣ జీవవైవిధ్యానికి చిరునామా.. దక్కన్‌ పీఠభూమి

‣ బీమా ఆదుకొంటేనే రైతుకు ధీమా

‣ చైనా ప్రాజెక్టుకు బీటలు

‣ సమ సమాజమే ప్రగతి మార్గం!

‣ పత్రికా స్వేచ్ఛకు ముప్పు

Posted Date: 18-08-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం