• facebook
  • whatsapp
  • telegram

చైనా ప్రాజెక్టుకు బీటలు



ప్రపంచంపై ఆధిపత్యం కోసం చైనా పదేళ్ల కిందట మొదలుపెట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ (బీఆర్‌ఐ) అటకెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెద్దసంఖ్యలో రహదారులు, హైవేలు, పైప్‌లైన్లు నిర్మించాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టులో దాదాపు 150 దేశాలు, 30 అంతర్జాతీయ సంస్థలు భాగమయ్యాయి. సామ్రాజ్యవాద కాంక్షతోనే డ్రాగన్‌ బీఆర్‌ఐ తీసుకొచ్చిందని చాలా దేశాలు గ్రహించాయి. ఈ ప్రాజెక్టు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాయి.


చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ 2013లో బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ (బీఆర్‌ఐ)ను తెరపైకి తెచ్చారు. ఈ ప్రాజెక్టులో పాల్గొనే ప్రతి దేశానికి ఆర్థికంగా, మౌలిక సదుపాయాలపరంగా బీఆర్‌ఐ ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. వివిధ దేశాల మధ్య అనుసంధాన వ్యవస్థను, ఆర్థిక సంబంధాలను, వాణిజ్యాన్ని పెంపొందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యాలు. అయితే, దీనిపై తాజాగా ఇటలీ అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ ప్రాజెక్టులోని డొల్లతనం బయటపడింది. 2019లో జిన్‌పింగ్‌ రోమ్‌ పర్యటన సందర్భంగా అమెరికా, ఐరోపా దేశాలను ఆశ్చర్యపరుస్తూ ఇటలీ బీఆర్‌ఐలో చేరింది. మార్చి 2024 నాటికి ఈ ఒప్పంద గడువు ముగుస్తుంది. అయితే, ఇటలీ రక్షణమంత్రి గుయిడో క్రొసెత్తో ఇటీవల ఈ ప్రాజెక్టును తీవ్రంగా విమర్శించారు. బీఆర్‌ఐలో చేరాలని తమ దేశం తీసుకున్న నిర్ణయాన్ని తొందరపాటు చర్యగా ఆయన అభివర్ణించారు. బీజింగ్‌తో సంబంధాలు దెబ్బతినకుండా బీఆర్‌ఐ నుంచి బయటపడేందుకు తమ దేశం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.


బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌పై మొదట ఉత్సాహం చూపించిన అనేక దేశాలు ఇప్పుడు దీన్నుంచి బయటపడే మార్గాలను అన్వేషిస్తున్నాయి. పారదర్శకత లోపించడం, పర్యావరణ నష్టాల కారణంగా- బీఆర్‌ఐ కింద లోగడ అంగీకరించిన ప్రాజెక్టులను పునఃపరిశీలించి ఉపసంహరించుకోవాలని బంగ్లాదేశ్‌, మయన్మార్‌, మలేసియా, సియెర్రా లియోన్‌ తదితర దేశాలు నిర్ణయించాయి. కొవిడ్‌-19 కారణంగా ప్రపంచ ఆర్థికవ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. చైనా అనుసరించిన జీరో కొవిడ్‌ విధానం ఆ దేశ ఆర్థికవ్యవస్థను దెబ్బతీసింది. దాంతో బీఆర్‌ఐ ప్రాజెక్టుల్లో బీజింగ్‌ పెట్టుబడులకు అవకాశాలు దెబ్బతిన్నాయి. బీఆర్‌ఐ చైనాకు మాత్రమే మేలు చేస్తుందని, చిన్న దేశాలను అప్పుల ఊబిలో ముంచేస్తుందని ఈ ప్రాజెక్టు మొదలైనప్పుడే భారత్‌ ప్రపంచదేశాలను హెచ్చరించింది. చెప్పినట్టుగానే మన దేశం ఈ ప్రాజెక్టులో పాలుపంచుకోలేదు. ఇందులో చేరిన అనేక దేశాలు ఇప్పుడు అప్పుల్లో చిక్కుకుపోయాయి. బీఆర్‌ఐలో చేరే దేశాల్లో మౌలిక సదుపాయాల కల్పన, వాణిజ్య కార్యకలాపాల కోసం పెట్టుబడులు పెట్టేందుకు, రుణాలు అందించేందుకు చైనా సంసిద్ధత వ్యక్తం చేసింది. దాంతో పలు చిన్న దేశాలు ఈ ప్రాజెక్టులో చేరేందుకు అప్పట్లో ఆసక్తి చూపాయి.


ఇటలీ బీఆర్‌ఐలో చేరిన తరవాత దాని ఎగుమతులు 1450 కోట్ల యూరోల నుంచి 1850 కోట్ల యూరోలకు మాత్రమే పెరిగాయి. అదే సమయంలో చైనా నుంచి ఇటలీకి ఎగుమతులు 3350 కోట్ల యూరోల నుంచి 5090 కోట్ల యూరోలకు ఎగబాకాయి! ఇటలీ ఆశించిన పెట్టుబడులు చైనా నుంచి రాలేదు. శ్రీలంక, పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థలకు ఈ ప్రాజెక్టు గుదిబండలా మారింది. బీఆర్‌ఐలో భాగమైన చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌ (సీపీఈసీ)లో కారకోరం హైవేను పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో నిర్మించాలన్న ప్రతిపాదనను భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. అయినప్పటికీ, చైనా ఈ అంశాన్ని పట్టించుకోలేదు. సీపీఈసీపై సంతకం చేసినపుడు ఈ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేసే గ్వాదర్‌ రేవును తమ దేశ ఆర్థిక భవిష్యత్తుగా పాకిస్థాన్‌ నాయకులు అభివర్ణించారు. మరో దుబాయ్‌గా బలూచిస్థాన్‌ మారనుందని పేర్కొన్నారు. ఇప్పుడా అంచనాలు తప్పాయి. స్థానిక వనరులు చైనా చేతిలోకి వెళ్ళిపోవడం తప్ప బలూచీలకు ఈ ప్రాజెక్టువల్ల ఒరిగిందేమీ లేదు. ఆర్థికంగా కుదేలైన పాకిస్థాన్‌ చైనా ఇచ్చిన రుణాలను తిరిగి చెల్లించే స్థితిలో లేదు. శ్రీలంకలోని హంబన్‌తోట ఓడరేవును 99 ఏళ్ల లీజు పేరుతో చేజిక్కించుకున్నట్లు గ్వాదర్‌ను త్వరలో చైనా ఒడిసిపట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.


బీఆర్‌ఐ అనేది భారత్‌ చుట్టూ చైనా పన్నిన చక్రవ్యూహంలో ఒక భాగమని మన దేశం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు పేరుతో వివిధ దేశాలకు పెట్టుబడులు, రుణాలు సమకూర్చడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఆధిపత్యం సాధించాలన్నది చైనా వ్యూహం. దీన్ని గ్రహించిన చిన్న దేశాలు బీఆర్‌ఐ నుంచి బయటకు వచ్చేస్తే- చైనా ఎత్తుగడలు చిత్తవడం ఖాయం.


- గొడవర్తి శ్రీనివాసు
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ బీమా ఆదుకొంటేనే రైతుకు ధీమా

‣ సమ సమాజమే ప్రగతి మార్గం!

‣ పత్రికా స్వేచ్ఛకు ముప్పు

‣ కృత్రిమ మేధా.. భస్మాసుర హస్తమా?

‣ పోక్సో కేసులపై మీమాంస

‣ ఏమవుతుంది.. అవిశ్వాసం?

‣ జీవవైవిధ్య రక్షణలో జనభాగస్వామ్యం

Posted Date: 16-08-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం