• facebook
  • whatsapp
  • telegram

పోక్సో కేసులపై మీమాంస


లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే- పోక్సో చట్టం ప్రకారం 18 ఏళ్లు నిండని బాలికలతో లైంగిక కార్యకలాపాలు జరపడం తీవ్ర నేరం. బాలిక అంగీకారంతో జరిపినా అది చట్టవిరుద్ధమే. అయితే, ఇటీవల వివిధ రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాలు వెలువరించిన తీర్పులు చర్చనీయాంశంగా మారాయి.


పోక్సో చట్టం కింద నమోదైన చాలా కేసులు ఇటీవల ఉన్నత న్యాయస్థానాల్లో వీగిపోతున్నాయి. పరస్పర అంగీకారంతో జరిపే లైంగిక కార్యకలాపాలకు అవసరమైన కనీస వయసుపై ఉన్నత న్యాయస్థానాల ఆలోచనల్లో మార్పు రావడమే దీనికి కారణం. గత నెల 12న దిల్లీ హైకోర్టు పోక్సో కేసులో పాతికేళ్ల నిందితుడిని విడుదల చేసింది. ఆ కేసులో బాలిక తన అంగీకారంతోనే నిందితుడితో వెళ్ళిపోయినట్లు కోర్టు గుర్తించింది. జులై 10న బాంబే హైకోర్టు మరో పాతికేళ్ల వ్యక్తికి కింది కోర్టు విధించిన జైలు శిక్షను రద్దు చేసింది. మైనరు బాలిక, ముద్దాయి పరస్పర అంగీకారంతోనే లైంగికంగా దగ్గరైనట్లు కోర్టు గుర్తించింది. జులై నెలలోనే మద్రాసు హైకోర్టు ఒక పోక్సో కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను, దాని అనుబంధ నేర ప్రక్రియను మొత్తంగా కొట్టేసింది. ఇలాంటి ఎన్ని కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయో నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించింది. ఈ ఏడాది జూన్‌లో మధ్యప్రదేశ్‌ హైకోర్టు సైతం పరస్పర అంగీకారంతోనే లైంగిక చర్య జరిపినట్లు గుర్తించి, పోక్సో చట్టం కింద నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేసింది. బాలికలు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి అంగీకారం తెలిపే కనీస వయసును 18 సంవత్సరాల నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది.


విభిన్న ఆచారాలు

మహిళల అంగీకారం లేకుండా జరిపే లైంగిక కార్యకలాపాలను చట్టంలో మానభంగంగా నిర్వచించారు. లైంగిక కార్యకలాపాలకు అంగీకారం తెలిపేందుకు మహిళలకు కావాల్సిన కనీస వయసు 18 ఏళ్లు అని భారత శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 375 చెబుతోంది. 18 ఏళ్లు నిండని అమ్మాయితో ఆమె అంగీకారంతోనే లైంగిక కార్యకలాపాలు జరిపినా అది మానభంగం కిందకే వస్తుంది. పైగా, పోక్సో చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వారంతా ‘పిల్లలు’ నిర్వచనంలోకి వస్తారు. ఈ చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు వారితో లైంగిక కార్యకలాపాలు జరిపితే అది తీవ్ర నేరమవుతుంది. అయితే, ఐపీసీలోని సెక్షన్‌ 375లో పొందుపరచిన రెండో మినహాయింపు ప్రకారం 15 ఏళ్లు నిండిన భార్యతో జరిపే లైంగిక చర్యలను మానభంగంగా పరిగణించకూడదు. సాధారణ చట్టాల ప్రకారం పెళ్ళికి ఆడవారికి 18 ఏళ్లు, మగవారికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ముస్లిం లా ప్రకారం ఆడపిల్లకు పెళ్ళి చేయడానికి కనీస వయసు 15 ఏళ్లు. పోక్సో చట్టంలోని సాంకేతిక అంశాల వల్ల 18 ఏళ్లు నిండని ఆడపిల్లల్ని పెళ్ళిచేసుకున్న మగవారిపై కేసులు నమోదు చేస్తున్నారు. భారత్‌లో వివిధ ప్రాంతాల్లో వివిధ ఆచారాలు, సంస్కృతులు ఉన్నాయి. చట్టంపై సరైన అవగాహన లేక బాలికలను పెళ్ళిచేసుకున్న ఎంతోమంది ఊచలు లెక్కించాల్సి వస్తోంది. ఇలాంటి కేసుల్లో చాలామందికి దిగువ న్యాయస్థానాలు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన ఉదంతాలూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ హైకోర్టులు వాస్తవిక పరిస్థితులను బేరీజు వేసి తీర్పులు ఇస్తున్నాయి.


వారి విషయంలో నేరంగా...

ఇటీవలి తీర్పుల్లో పలు పోక్సో కేసులను కొట్టేసిన ఉన్నత న్యాయస్థానాలు, ఆ చట్టంతో పాటు భారత శిక్షాస్మృతిలోని పలు నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని మాత్రం చెప్పలేదు. దాంతో, మైనరు అమ్మాయి స్వయంగా ఇష్టపడి పెళ్ళి చేసుకున్నట్లు తేలినా పోలీసులు పురుషుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కటకటాల వెనక్కు పంపుతున్నారు. దాంతో వివాహం చేసుకున్న ఇద్దరూ తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. దేశీయంగా చాలా చోట్ల 18 ఏళ్లు నిండక ముందే తల్లిదండ్రులు తమ ఆడబిడ్డలకు పెళ్ళిళ్లు చేస్తున్నారు. అప్పుడు ఎలాంటి ఫిర్యాదు లేకపోవడంతో కేసులు నమోదు కావడం లేదు. ఇలా తల్లిదండ్రులు ఇష్టపడి చేస్తే పెళ్ళి అవుతోంది. పరస్పరం ఇష్టపడి మైనర్‌ బాలికను పెళ్ళి చేసుకున్న పురుషుడి విషయంలో మాత్రం అది తీవ్ర నేరంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం స్పందించి అసమంజస నిబంధనలను సవరించాల్సిన అవసరం ఉంది. దేశీయంగా వెనకబాటుతనం, పేదరికమే చిన్నవయసులో పెళ్ళిళ్లకు కారణమవుతున్నాయి. వాటిని రూపుమాపడంపై ప్రభుత్వాలు సరైన దృష్టి సారించాలి. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నత చదువులు అభ్యసించి జీవితంలో మంచి స్థాయికి వెళ్ళేలా వారికి సరైన చేయూతను అందించాలి.


- పఠాన్‌ అక్బర్‌ఖాన్‌ (న్యాయ నిపుణులు)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఏమవుతుంది.. అవిశ్వాసం?

‣ జీవవైవిధ్య రక్షణలో జనభాగస్వామ్యం

‣ అణు విద్యుదుత్పత్తి వైపు అడుగులు

‣ ఇరాక్‌తో ఇండియా చమురు బంధం

‣ జనవిశ్వాస్‌.. తగ్గనున్న కేసుల భారం

‣ ఆక్రమణలు తొలగితే.. నదులకు పునరుజ్జీవం!

Posted Date: 15-08-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం