• facebook
  • whatsapp
  • telegram

ఇరాక్‌తో ఇండియా చమురు బంధం



రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధంతో అంతర్జాతీయ ఇంధన విపణిలో చోటుచేసుకున్న పరిణామాలు భారత్‌కు కలిసి వచ్చాయి. నిరుడు మార్చి నుంచి భారత్‌కు రష్యా తగ్గింపు ధరపై పెద్దయెత్తున చమురు సరఫరా చేస్తూ వచ్చింది. ఇటీవలి కాలంలో ఆ రాయితీ తగ్గుతుండటంతో భారత్‌ అప్రమత్తమైంది. రష్యాకు ప్రత్యామ్నాయంగా ఇరాక్‌ వైపు ఇండియా మొగ్గు చూపుతోంది.


ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగేదాకా ఇరాక్‌- భారత్‌కు ప్రధాన ఇంధన సరఫరాదారు. ఆ దేశ మొత్తం ఉత్పత్తిలో 25శాతం ఇండియాకే వచ్చేది. గతేడాది రాయితీ ధరతో ముందుకొచ్చిన రష్యా అకస్మాత్తుగా అతిపెద్ద సరఫరాదారుగా అవతరించింది. అయితే, ఈ ఏడాది జూన్‌ నుంచి రష్యా ఇంధన కొనుగోళ్లను భారత్‌ తగ్గించేసింది. రష్యా ఇస్తున్న రాయితీ క్రమంగా సన్నగిల్లడమే దీనికి కారణం. ప్రస్తుతం పీపాపై రష్యా ఇస్తున్న రాయితీ అంతర్జాతీయ ధరతో పోలిస్తే 3-3.5 డాలర్ల లోపే ఉంది. పశ్చిమాసియాతో పోలిస్తే రష్యా నుంచి భారత్‌కు ఇంధన సరఫరాకు రవాణా, బీమా ఖర్చులు అధికంగా ఉంటున్నాయి. చెల్లింపు సమస్యలూ ఉన్నాయి. రాయితీ కంటే ఖర్చే ఎక్కువ అవుతుండటంతో భారత రిఫైనరీలు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నాయి. భారత్‌కు రాయితీపై ఇంధన సరఫరాకు ఇరాన్‌ సిద్ధంగా ఉన్నా, అక్కడి నుంచి పెద్దమొత్తంలో కొనుగోలు చేసేందుకు అనేక అవాంతరాలున్నాయి. దాంతో భారత ఇంధన భద్రత, అవసరాలకు ఇరాకే మేలైన ఎంపికగా కనిపిస్తోంది.


చైనా నుంచి పోటీ

చమురు, సహజవాయువు అపారంగా ఉన్న దేశాల్లో ఇరాక్‌ ఒకటి. వాటి వెలికితీత, రిఫైనింగ్‌ సామర్థ్యాలు ఆ దేశానికి తక్కువ. ఎగుమతులకు కీలకమైన ఓడరేవుల అభివృద్ధికి నిధులు, ఇంజినీరింగ్‌ నైపుణ్యాలూ అంతంతమాత్రమే. ఇప్పుడున్న భూతల, సముద్రతల ఇంధన, గ్యాస్‌ క్షేత్రాల పైపులు సైతం పాతవయ్యాయి. ఈ సరఫరా వ్యవస్థను ఆధునికీకరించడంతో పాటు పంపింగ్‌ స్టేషన్లు, గిడ్డంగుల నిర్మాణం పెద్దయెత్తున చేపట్టాలన్న భారీ ప్రణాళికల్ని ఇరాక్‌ రూపొందించింది. అందుకోసం ఇటీవల పలు పశ్చిమ దేశాల సంస్థలతో ఒప్పందాలు సైతం కుదుర్చుకుంది. ఇరాక్‌లో రాజకీయ పరిస్థితులు, భద్రతా సమస్యల దృష్ట్యా టోటల్‌, బిపి, షెల్‌ కంపెనీలు తప్ప మిగతా పాశ్చాత్య సంస్థలన్నీ వైదొలగాయి. ఈ పరిణామం భారతీయ కంపెనీలకు అవకాశంగా మారింది.


ఇరాక్‌తో వాణిజ్య బంధం భారత్‌కు కొత్తేమీ కాదు. గతంలో భారతీయ కంపెనీలు ఇరాక్‌లో అనేక ప్రాజెక్టులు చేపట్టాయి. 2003లో ఇరాక్‌పై అమెరికా యుద్ధం వల్ల అవన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. ఇటీవల ఇండియా-ఇరాక్‌ ఉమ్మడి కమిషన్‌ సమావేశాల్లో ఆ ప్రాజెక్టుల పునరుద్ధరణపై చర్చలు జరుగుతున్నాయి. ఓఎన్‌జీసీ విదేశ్‌ గతంలో అక్కడ భారీస్థాయిలో చేపట్టిన చమురు వెలికితీత ప్రాజెక్టు సైతం వాటిలో ఉంది. పాత ప్రాజెక్టుల పునరుద్ధరణతో పాటు మౌలిక సదుపాయాలు, ఇంజినీరింగ్‌ పనులకు సంబంధించి ఒప్పందాలు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్‌ సహకారంతో ఒక ద్రవీకృత సహజవాయు (ఎల్‌ఎన్‌జీ) టెర్మినల్‌ నిర్మాణం ప్రతిపాదనా ఉంది. మరోవైపు కుర్దిస్థాన్‌ ప్రాంతీయ ప్రభుత్వం (కేఆర్‌జీ) ఆధీనంలోని ఖోర్‌మోర్‌ గ్యాస్‌ క్షేత్రం విస్తరణ అవకాశాలనూ భారత్‌ పరిశీలిస్తోంది. ఇరాక్‌లోని బెజీ రిఫైనరీకి పరికరాల సరఫరా ఇటీవల భారత్‌ హెవీ ఎలెక్ట్రికల్స్‌ లిమిటెడ్‌(బీహెచ్‌ఈఎల్‌)కు దక్కింది.


ఇరాక్‌లో అవకాశాలను ఒడిసిపట్టడంలో భారత్‌కు చైనా నుంచే పోటీ ఎదురవుతోంది. ఇరాక్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్‌ మార్కెట్లలో వ్యూహాత్మక ఆధిపత్యం కోసం చైనా చాలా కాలంగా దూకుడుగా ముందుకెళ్తోంది. నేడు ఇరాక్‌ చమురు ఉత్పత్తిలో దాదాపు సగం చైనా కంపెనీలు, ఆపరేటర్లు భాగస్వాములుగా ఉన్న క్షేత్రాల నుంచే వస్తోంది. గత రెండేళ్లలో ఇరాక్‌ ప్రభుత్వం ఇచ్చిన ఇంధన కాంట్రాక్టుల్లో 80శాతానికి పైగా చైనాయే దక్కించుకుంది. అయితే, ఇరాక్‌ పూర్తిగా డ్రాగన్‌ దేశంపై ఆధారపడకుండా ఇతర దేశాల భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది. ఫ్రెంచ్‌ కంపెనీ ‘టోటల్‌’తో కుదుర్చుకున్న భారీ ఒప్పందాలే ఇందుకు నిదర్శనం.


అవకాశాలు పుష్కలం

ఇండియా ఇంధన భద్రతకు ఇరాక్‌ అవసరం. దౌత్య ప్రయత్నాల ద్వారా ఇంధన విపణిలో ఇరాక్‌ను ప్రధాన, శాశ్వత భాగస్వామిగా మార్చుకొనే అవకాశాలు ఇండియాకు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇరు దేశాల మధ్య జరిగిన మూడు విడతల చర్చలు ఫలప్రదమయ్యాయి. జూన్‌లో ఇరాక్‌ ఇంధన శాఖ మంత్రి అబ్దుల్‌ జహ్రా అల్‌ సవాద్‌ దిల్లీ పర్యటన అందులో భాగమే. చైనా తరహాలో ఇరాక్‌ కేంద్ర ప్రభుత్వంతో పాటు కుర్దిస్థాన్‌ ప్రాంతీయ సర్కారు, ఇరాన్‌ మద్దతుతో అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు సాయుధ గ్రూపులతో సమన్వయం నెరిపే సామర్థ్యం భారత్‌కూ ఉంది. ఆ వైపు కేంద్రం సరైన చర్యలు తీసుకోవాలి.


- మదన్‌ మోహన్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ జనవిశ్వాస్‌.. తగ్గనున్న కేసుల భారం

‣ ఆక్రమణలు తొలగితే.. నదులకు పునరుజ్జీవం!

‣ రైతుకు మేలు చేసేదే సరైన విధానం

‣ అన్నదాతకు అండగా కిసాన్‌ కేంద్రాలు

‣ భావి తరాలకు బంగారు భవిష్యత్తు

‣ తాత్కాలిక ఉద్యోగులకు సామాజిక భద్రత

Posted Date: 12-08-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం