• facebook
  • whatsapp
  • telegram

తాత్కాలిక ఉద్యోగులకు సామాజిక భద్రతఅందివస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉద్యోగాల తీరును మార్చేస్తోంది. ఈ క్రమంలో తాత్కాలిక ప్రాతిపదికన కొలువులు అందించే గిగ్‌ ఆర్థిక వ్యవస్థ నానాటికీ విస్తృతమవుతోంది. ఇందులో ఉద్యోగులకు సామాజిక భద్రత కొరవడింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాజస్థాన్‌ ప్రభుత్వం ఇటీవల నడుంకట్టింది.


దేశంలోనే తొలిసారిగా ఆన్‌లైన్‌ ఆధారిత గిగ్‌ వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రత కోసం ప్రత్యేక బిల్లును రాజస్థాన్‌ శాసనసభ ఇటీవల ఆమోదించింది. ఇందులో భాగంగా గిగ్‌ వర్కర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును కొలువు తీర్చనున్నారు. గిగ్‌ వర్కర్లు, ఆయా సంస్థలు ఇందులో పేర్లు నమోదు చేసుకోవాలి. ఈ సమాచార నిధి ఆధారంగా రాష్ట్ర సర్కారు ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు అందిస్తుంది. గిగ్‌ వర్కర్ల కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తుంది. వారి సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలన్నదీ ఈ బిల్లులో మరో ప్రధాన అంశం. ఆయా లావాదేవీల ఆధారంగా సంస్థల నుంచి ఈ నిధికోసం రుసుమును వసూలు చేస్తారు. సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఈ నిధిని ప్రభుత్వమే సమకూరిస్తే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


కొరవడిన రక్షణ

సంప్రదాయ ఉద్యోగాలకు భిన్నంగా నిర్ణీత కాలానికి సంబంధించిన తాత్కాలిక కొలువులతో కూడిందే గిగ్‌ ఆర్థిక వ్యవస్థ. ఆహార సరఫరా, ఈ కామర్స్‌ వెబ్‌సైట్ల డెలివరీ ఏజెంట్లు, ఓలా, ఉబెర్‌ తదితర క్యాబ్‌ డ్రైవర్లు, రచయితలు, ఫొటోగ్రాఫర్లు, అకౌంటెంట్లు, ట్యూటర్లు, కళాకారులు, ఫ్రీలాన్సర్లు... స్థిర వేతనంతో సంబంధం లేకుండా తాత్కాలికంగా పనిచేసేవారంతా గిగ్‌ వర్కర్ల కిందకు వస్తారు. గిగ్‌ విధానంలో ఉద్యోగులు తమ వెసులుబాటు, అవసరాలకు అనుగుణంగా పని చేసుకోవచ్చు. అయితే, సాధారణ ఉద్యోగులతో పోలిస్తే వీరికి ఉద్యోగ భద్రత, నిర్ణీత పని గంటలు, సెలవులు లాంటివి ఉండవు. చాలా మందికి తక్కువ వేతనాలే లభిస్తాయి. జీవిత బీమా, ఉద్యోగ విరమణ సమయంలో ప్రయోజనాలు లాంటివి ఏమీ ఉండవు. ఈ క్రమంలో వారికి సరైన సామాజిక భద్రత కొరవడింది. కేంద్రం మూడేళ్ల క్రితం రూపొందించిన సామాజిక భద్రతా నియమావళి గిగ్‌ వర్కర్ల సంక్షేమం గురించి పేర్కొంది. దాని ప్రకారం వారికి కనీస వేతనాలు, ఈపీఎఫ్‌, బీమా సదుపాయాలు తదితరాలు కల్పించాలి. సామాజిక భద్రతా నిధిని సైతం ఏర్పాటు చేయాలి. నేటికీ ఆ నిబంధనలు అమలులోకి రాలేదు.


నీతి ఆయోగ్‌ నిరుడు విడుదల చేసిన నివేదిక ప్రకారం 2019-20లో దేశీయంగా గిగ్‌ వర్కర్లు 68 లక్షలు. 2020-21 నాటికి వారి సంఖ్య 77 లక్షలకు చేరింది. ఇండియా మొత్తం శ్రామిక శక్తిలో ఇది 1.5శాతం. వీరిలో 20శాతానికి పైగా అత్యుత్తమ నైపుణ్యాలు కలిగినవారు. 31శాతం గిగ్‌ కొలువులు తక్కువ నైపుణ్యాలకు సంబంధించినవి. మిగిలిన 47శాతం మాధ్యమిక నైపుణ్య కొలువులు. భారత గిగ్‌ ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి 2.35 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తుందని నీతి ఆయోగ్‌ అంచనా వేసింది. అప్పటికి మొత్తం శ్రామిక శక్తిలో ఇది 4.1శాతం. ఇండియాలో అత్యధికంగా 27 లక్షల గిగ్‌ వర్కర్లు చిల్లర వ్యాపారం, విక్రయాలలో కొనసాగుతున్నారు. రవాణా విభాగంలో 13 లక్షల మంది పనిచేస్తున్నారు. ఆరు లక్షల మంది ఆర్థికం, ఇన్సూరెన్స్‌ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నారు. మరో ఆరు లక్షల మంది తయారీ రంగంలో ఉన్నారు. రాబోయే రోజుల్లో గిగ్‌ ఆర్థిక వ్యవస్థ మరింత విస్తరించనుండటం వల్ల ప్రభుత్వాలు అందులో పనిచేసేవారి సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.


బీమా కరవు

భారత గిగ్‌ ఆర్థిక వ్యవస్థ విలువ 2024 నాటికి దాదాపు 45 వేల కోట్ల డాలర్లకు చేరుతుందని అయిదేళ్ల క్రితం అసోచామ్‌ అంచనా వేసింది. దేశీయంగా 40శాతం గిగ్‌ వర్కర్లకు ఎలాంటి బీమా సదుపాయం లేదు. 20శాతం వర్కర్లకు ఆయా సంస్థలు అందిస్తున్నాయి. మిగిలిన వారు సొంతంగా భరించాల్సి వస్తోంది. అరకొర వేతనాలతో కుటుంబాలను పోషించుకునే వారికి ఇది తీవ్ర భారమే. అందువల్ల ప్రభుత్వాలే గిగ్‌ వర్కర్లకు బీమా సౌక్యర్యం కల్పించాలి. రాజస్థాన్‌లో నాలుగు లక్షల మంది దాకా గిగ్‌ వర్కర్లు ఉన్నారని, పెద్ద సంస్థలు వారి భద్రత గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని బిల్లును ప్రవేశపెట్టే సమయంలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ ఆవేదన వెలిబుచ్చారు. కర్ణాటక సైతం రాజస్థాన్‌ తరహాలో గిగ్‌ వర్కర్లకు సంక్షేమ బోర్డును ప్రకటించింది. ఇతర రాష్ట్రాలూ ఇలాంటి చొరవను అందిపుచ్చుకోవాలి. అయితే, కేవలం ఆర్భాటపు ప్రకటనలు, శాసనాల రూపకల్పనతోనే సరిపుచ్చకుండా వాటిని సమర్థంగా అమలు చేస్తేనే గిగ్‌ వర్కర్ల జీవితాల్లో అసలైన ఆనందం తొంగి చూస్తుంది.


- ఎం.వేణు
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ డ్రాగన్‌తో సయోధ్య సాధ్యమేనా?

‣ లొసుగులు సరిదిద్దితే దండిగా రాబడి

‣ నల్లసముద్రంపై సంక్షోభ మేఘం

‣ పేదరికం తెగ్గోసుకుపోయిందా?

Posted Date: 11-08-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని