• facebook
  • whatsapp
  • telegram

లొసుగులు సరిదిద్దితే దండిగా రాబడివస్తుసేవల పన్ను (జీఎస్టీ) ప్రవేశపెట్టి ఆరేళ్లు దాటింది. ఇన్నేళ్లలో చెల్లింపుదారుల సంఖ్యతోపాటు వసూళ్లూ పెరిగాయి. కోటీ నలభై లక్షలకుపైగా పన్ను చెల్లింపుదారులతో, 2023 జూన్‌లో లక్షా అరవైవేల కోట్ల రూపాయలకుపైగా వసూళ్లు నమోదయ్యాయి. ఎగవేత కూడా అంతేస్థాయిలో పెరుగుతుండటం గమనార్హం.


సరళమైన పరోక్ష పన్నుల విధానంగా పేరొందిన జీఎస్టీలో పలురకాల ఎగవేతలకు పాల్పడుతున్నారు. వీటిలో నకిలీ రిజిస్ట్రేషన్లు, మోసపూరిత ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్లెయిములతో జరుగుతున్న మోసాల సంఖ్య అన్నింటికన్నా ఎక్కువ. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పేర్కొన్న వివరాల ప్రకారం- ఈ రెండు మార్గాల ద్వారా పన్ను ఎగవేత అత్యంత ఆందోళనకర స్థాయిలో జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.  2018-19 నుంచి 2022-23 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 25,449 నకిలీ రిజిస్ట్రేషన్లను గుర్తించాయని, వీటితో రూ.3,33,501 కోట్ల పన్ను ఎగవేత జరిగిందని, అందులో రూ.1,08,696 కోట్లు తిరిగి వసూలు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రాల వారీగా నకిలీ రిజిష్ట్రేషన్లలో దిల్లీ అగ్రస్థానంలో ఉండగా- తమిళనాడు, గుజరాత్‌, పంజాబ్‌, మహారాష్ట్ర తరవాతి స్థానాల్లో ఉన్నాయి. 2018-19 నుంచి 2022-23 మధ్యకాలంలో వ్యాపారులు నకిలీ బిల్లుల ద్వారా రూ.1,15,457 కోట్లమేర మోసపూరిత ఇన్‌పుట్‌ పన్ను క్రెడిట్‌ను క్లెయిమ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నకిలీ రిజిస్ట్రేషన్లు, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ క్లెయిమ్‌లు జీఎస్టీ వ్యవస్థలోకి ఎలాంటి లొసుగులతో ప్రవేశించాయనేది గుర్తించాలి. వీటికి అడ్డుకట్ట వేసే మార్గాలను కనుక్కోవడమూ ముఖ్యమే. ఇలాగే పన్ను ఎగవేతలు పెచ్చరిల్లిపోతే వసూళ్లు తగ్గుతాయి. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి పన్నులు పెంచే యోచన చేస్తుంది. దానివల్ల నిజాయతీగా పన్ను చెల్లించేవారికి తీవ్రనష్టం వాటిల్లుతుంది.


పెరిగిన ఎగవేతదారులు

కొనుగోలుదారులు, అమ్మకందారుల కొనుగోళ్లు, అమ్మకాల ఇన్వాయిస్‌లను సరిపోల్చిన తరవాతే ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను అనుమతించాలనే నిబంధన చట్టంలో ఉంది. అయితే, పలు కారణాలతోఈ నిబంధన అమలుకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా రోజూ వ్యాపారులు ఇచ్చే లక్షలాది ఇన్వాయిస్‌లను సరిపోల్చడానికి కావలసిన డిజిటల్‌ వ్యవస్థను జీఎస్‌టీ నెట్‌వర్క్‌ సమకూర్చుకోలే కపోయింది. వ్యాపారుల సౌలభ్యానికి రూపొందించిన సరళమైన నిబంధనలు పన్ను ఎగవేతదారులకు వరంగా మారాయి. ఫలితంగా వస్తుసేవలు సరఫరా చేయకుండానే కేవలం ఇన్వాయిస్‌లు మాత్రమే అమ్మడానికి దేశమంతటా వేలకొద్దీ నకిలీ రిజిస్ట్రేషన్లు పుట్టుకొచ్చాయి. దాంతో మోసపూరిత ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను క్లెయిమ్‌ చేసే ఎగవేతదారులు పెరిగిపోయారు. నకిలీ రిజిస్ట్రేషన్లు, ఇన్వాయిస్‌లు జీఎస్టీ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నాయి.


ఈ క్రమంలో నకిలీ రిజిస్ట్రేషన్లు, ఇన్వాయిస్‌లతో పన్ను ఎగవేత పద్ధతులకు కళ్లెం వేయడానికి జీఎస్టీ మండలి, ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. మొదటగా, చట్ట నిబంధనల్ని కఠినతరం చేశారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి ముప్పు అంచనాల ద్వారా నిర్ధారించిన కేసుల్లో బయోమెట్రిక్‌ ఆధారిత పద్ధతిని ప్రవేశపెట్టారు. మరికొన్ని కేసుల్లో రిజిస్ట్రేషన్‌ కేటాయించే ముందు వ్యాపారం చేసే చోటును భౌతికంగా సందర్శించి నిర్ధారిస్తున్నారు. బ్యాంకు ఖాతా, పాన్‌ కార్డులోని పేర్లను సరిపోల్చుతున్నారు. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌లకు సంబంధించి వస్తుసేవలు సరఫరా చేసిన వ్యాపారి, తన ఆదాయపన్ను వివరాల్లో పేర్కొన్న పన్ను చెల్లించిన అమ్మకాల వరకే కొనుగోలుదారు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను క్లెయిమ్‌ చేయాలనే నిబంధన చేర్చారు. అలాగే తప్పనిసరిగా ఈ-ఇన్వాయిస్‌ సమర్పించాల్సిన వార్షిక టర్నోవర్‌ పది కోట్ల నుంచి అయిదు కోట్ల రూపాయలకు తగ్గించారు. సక్రమంగా రిటర్నులు సమర్పించని, పన్నులు చెల్లించని వ్యాపారులకు సంబంధించి వస్తువుల రవాణాకు వాడే ఈ-వే బిల్లులపై పరిమితులు విధించారు. నకిలీ ఇన్వాయిస్‌లతో ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ క్లెయిమ్‌ చేసి లాభపడిన వ్యాపారి నుంచి ఇన్‌పుట్‌ ట్యాక్సుతోపాటు మొత్తం పన్ను వసూలు చేయనున్నారు. డేటా ఎనలిటిక్స్‌ విధానంలో పైనుంచి కిందిదాకా మొత్తం వ్యవస్థలో మొదటి నుంచి చివరిదాకా జరిగే అమ్మకాలు, కొనుగోళ్లను విశ్లేషించి ఎక్కడైనా పన్ను చెల్లింపుల్లో ఎగవేతల్లాంటి తేడాలు ఉన్నాయా అనేది నిర్ధారించడానికి వాణిజ్య నిఘా, మోసాల విశ్లేషణ (బీఐఎఫ్‌ఏ) పద్ధతిని ఉపయోగిస్తున్నారు. అంతేకాదు- జీఎస్‌టీఎన్‌తో ఈడీ, ఆదాయపన్ను శాఖల్ని అనుసంధానించారు. దీనివల్ల వాటి వద్ద ఉండే సమాచారాన్ని సమర్థంగా ఉపయోగించుకోవచ్చు. వ్యాపార స్థలాల భౌగోళిక అనుసంధానత వల్ల నిరంతర పర్యవేక్షణా సాధ్యమవుతుంది. ప్రస్తుతానికిది దిల్లీ, హరియాణాల్లోనే అమలు చేస్తున్నారు. ఫలితాలను బట్టి మున్ముందు అన్ని రాష్ట్రాలకూ విస్తరించే అవకాశం ఉంది.


కఠినంగా నిబంధనల అమలు

ఇప్పటికీ లక్షల కోట్ల రూపాయల మేర పన్ను ఎగవేత జరుగుతోందంటే, నిబంధనల అమలులో మరింత కఠినంగా ఉండక తప్పదు. పచ్చని వృక్షంలాంటి జీఎస్టీకి పట్టిన నకిలీ రిజిస్ట్రేషన్లు, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ వంటి రెండు చీడలను వదిలించకపోతే, జీఎస్టీ ఫలాలు భారత ఆర్థిక వ్యవస్థకు అందవు. పన్నుల ఎగవేత పెరిగితే అందరిపైనా భారం పడుతుందన్న సంగతి మరవద్దు. ముఖ్యంగా నిజాయతీగా పన్ను చెల్లించే వారికి వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్ని నివారించడం అత్యవసరం. ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఈ దిశగా మరింత నిబద్ధతతో కృషి చేయాల్సిన అవసరం ఉంది.


సరళమైన ప్రక్రియ

జీఎస్టీ చట్ట నిబంధనల ప్రకారం- వస్తువుల వార్షిక టర్నోవర్‌ రూ.40 లక్షలు, సేవల వార్షిక టర్నోవర్‌ రూ.20 లక్షలు దాటిన ప్రతి వ్యాపారవేత్తా జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ తీసుకొని పన్ను చెల్లించాలి. జీఎస్టీ అనేది తయారీ నుంచి, వినియోగదారుడి వరకు ప్రతి దశలో జోడించిన విలువపై విధించే పన్ను. అందుకని అమ్మకాలపై కట్టాల్సిన పన్ను నుంచి కొనుగోళ్లపై కట్టిన పన్నును మినహాయించి వ్యాపారస్తుడు నికరంగా కట్టాల్సిన పన్నును లెక్కిస్తారు. మినహాయించే కొనుగోళ్లపై కట్టిన పన్నును ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌గా వ్యవహరిస్తారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ నమోదు, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను క్లెయిమ్‌ చేయడానికి సంబంధించిన నిబంధనలు, ప్రక్రియ సరళంగానే ఉంటాయి. రిజిస్ట్రేషన్‌ను పాన్‌, ఆధార్‌, ఈ-మెయిల్‌ ఐడీ, వ్యాపారం చేసే గృహానికి సంబంధించిన ఆస్తి పన్ను రశీదులు లేదా అద్దె ఖరారు పత్రం, బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించి మూడు రోజుల్లో పొందవచ్చు. ఏవైనా వివరణలు అవసరమైతే, వాటిని సమర్పించిన వారం వ్యవధిలో రిజిస్ట్రేషన్‌ ఇస్తారు. ఇక ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను క్లెయిమ్‌ చేయడానికి అమ్మకందారు ఇచ్చిన ఇన్వాయిస్‌, వస్తువులు తనకు చేరినట్లు రుజువుతో వ్యాపారి పొందవచ్చు.


- డి.వెంకటేశ్వరరావు 

(విశ్రాంత సంయుక్త కమిషనర్‌, వాణిజ్య పన్నుల శాఖ)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నల్లసముద్రంపై సంక్షోభ మేఘం

‣ పేదరికం తెగ్గోసుకుపోయిందా?

‣ న్యాయ సంస్కరణల రగడ

‣ పులులే అడవులకు రక్ష

‣ భారత్‌ - ఫ్రాన్స్‌ చెట్టపట్టాల్‌

‣ ప్రకృతి పరిరక్షణ.. అందరి బాధ్యత

Posted Date: 11-08-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని