• facebook
  • whatsapp
  • telegram

నల్లసముద్రంపై సంక్షోభ మేఘం


నల్ల సముద్రాన్ని రష్యా అష్టదిగ్బంధనం చేయనుందన్న విశ్లేషణలు తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. దానివల్ల ఆహార ధాన్యాల సరఫరాలు నిలిచిపోయి ఆయా దేశాల్లో కోట్ల మందిపై ప్రభావం పడనుంది. భారత్‌కు సైతం పలు ఇక్కట్లు తప్పవు.


ఇటీవల లిథువేనియాలో నాటో కూటమి సమావేశం ముగిసిన తరవాతి నుంచి నల్లసముద్రంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఫిన్లాండ్‌, స్వీడన్‌ నాటో కూటమిలో చేరడంతో బాల్టిక్‌ సముద్రంలో రష్యా ప్రాబల్యానికి గండిపడింది. ఆ తరవాత నల్లసముద్రంపై నాటో కూటమి దృష్టిపెట్టింది. మరోవైపు రష్యాపై ఎదురు దాడులను ఉక్రెయిన్‌ తీవ్రతరం చేసింది. క్రెమ్లిన్‌ సైతం నల్లసముద్రంలో అమీతుమీ తేల్చుకోవాలని నిర్ణయించుకుంది. ఈ జల మార్గాన్ని పూర్తిగా మూసివేయడానికి అది సిద్ధమైపోయింది. ఇప్పటికే చమురు, ఆహార సరఫరాలో సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రపంచ దేశాలను ఈ పరిణామాలు మరింతగా కలవరపెడుతున్నాయి.


ప్రత్యామ్నాయ మార్గాలు

మాస్కోకు పసిఫిక్‌, బాల్టిక్‌, ఆర్కిటిక్‌ సముద్రాల్లో ఉన్న నౌకాశ్రయాలు మంచు కారణంగా నెలల తరబడి మూతపడతాయి. దాంతో నల్లసముద్రంలో ఏడాది మొత్తం తెరచి ఉండే ఉష్ణ జల నౌకాశ్రయాలే దాని వాణిజ్యానికి ప్రధాన ఆధారం. నల్లసముద్ర ప్రాంతంలోని రొమేనియా, బల్గేరియా, తుర్కియే నాటో సభ్యదేశాలే. నల్లసముద్ర ప్రాంతంలో తన కూటమి సభ్య దేశాలను బలోపేతం చేస్తామని, స్వేచ్ఛా నౌకాయానం ఉండేలా చూస్తామని నాటో తాజాగా ప్రకటించింది. తద్వారా స్వేచ్ఛా నౌకాయానం పేరిట అమెరికా యుద్ధనౌకలు నల్లసముద్రంలోకి వస్తాయని, తుర్కియే ఆధీనంలోని బాస్పోరస్‌, డార్డ్‌నెల్స్‌ జలసంధుల్లో రష్యా నౌకలను నియంత్రిస్తామని అది పరోక్షంగా చెప్పినట్లయింది. ఇప్పటికే ఉక్రెయిన్‌కు నాటో సైనిక సాయంపై గుర్రుగా ఉన్న రష్యా ఈ పరిణామాలతో ఒక్కసారిగా అప్రమత్తమైంది. గతేడాది మాస్క్వా యుద్ధ నౌక మునక దాని కళ్ల ముందు మెదిలింది. మరోవైపు ధాన్య ఒప్పందం గడువు ముగిసిన వెంటనే గతంలో కెర్చ్‌ వంతెనపై దాడి జరిగింది. దాంతో ధాన్య ఒప్పందం పునరుద్ధరణకు రష్యా నిరాకరించింది. ఆ మరునాడే రొమేనియా జలాల నుంచి సరికొత్త సముద్ర నడవా ఏర్పాటు చేయాలని ఉక్రెయిన్‌ ఐరాసకు చెందిన అంతర్జాతీయ సముద్ర సంస్థకు లేఖ రాసింది. దాంతో ఉక్రెయిన్‌కు చెందిన యుజ్నీ, ఒడెసా తదితర నౌకాశ్రయాలపై రష్యా క్షిపణుల వర్షం కురిపించడం మొదలుపెట్టింది.


ఉక్రెయిన్‌ ధాన్యం సరఫరాకు ప్రధాన ప్రత్యామ్నాయ మార్గమైన రేనీ రేవుపైనా మాస్కో దాడులు చేసింది. ఇది రొమేనియాకు కొన్ని వందల మీటర్ల దూరంలోనే ఉంటుంది. దాంతో రోడ్డు, రైలు మార్గాల్లో ధాన్యాన్ని ఐరోపా దేశాలకు తరలించి అక్కడి నుంచి నౌకల ద్వారా ఎగుమతి చేయడమే ఉక్రెయిన్‌ ఎదుట ఉన్న మార్గం. ఈ క్రమంలో పోలాండ్‌ మీదుగా బాల్టిక్‌ దేశాలైన లిథువేనియా, లాత్వియా, ఎస్తోనియాల్లోని అయిదు రేవులకు తరలించాలనే ప్రతిపాదన వచ్చింది. దానికి ఉక్రెయిన్‌ సానుకూలంగా స్పందించి ఐరోపా సమాఖ్య వాణిజ్య కమిషనర్‌కు లేఖ రాసింది. ఈ బాల్టిక్‌ పోర్టులతోపాటు జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్‌, క్రొయేషియా, స్లొవేనియాలలోని ఓడరేవులను కేటాయించాలని కోరింది. వాస్తవానికి ఇప్పుడున్న మౌలిక వసతులతో ఈ పోర్టులకు ధాన్యం తరలింపు అంత సులువుకాదు. ఉక్రెయిన్‌ నుంచి బాల్టిక్‌ దేశాల పోర్టులకు తరలించేందుకు టన్నుకు 40 యూరోల దాకా అదనంగా ఖర్చవుతుంది. 2022 మే నుంచి 2023 జూన్‌ వరకు ఉక్రెయిన్‌ 4.1 కోట్ల టన్నుల ధాన్యాన్ని ఎగుమతి చేసింది. అందులో నల్లసముద్ర మార్గంలోనే 3.2 కోట్ల టన్నులు తరలించింది. బాల్టిక్‌ దేశాల అయిదు రేవుల మొత్తం వార్షిక సామర్థ్యమే 2.5 కోట్ల టన్నులు. ఆయా ఓడరేవుల్లో సరైన మౌలిక వసతులు సైతం కరవయ్యాయి.


ముగింపు ఎన్నడో?

ధాన్య ఒప్పందం నుంచి రష్యా బయటకు రాగానే భారత్‌లో పొద్దుతిరుగుడు నూనెల ధరలు పెరుగుతున్నాయి. ఇండియాలో ఈ ఏడాది సుమారు 30 లక్షల టన్నుల పొద్దుతిరుగుడు నూనె అవసరమవుతుందని అంచనా. నల్ల సముద్రంలో చోటు చేసుకొంటున్న పరిణామాలు 79 దేశాల్లోని 35 కోట్ల ప్రజలపై ప్రభావం చూపనున్నాయి. యుద్ధం తొలినాళ్లలో రష్యాను ఉక్రెయిన్‌ తీవ్రంగా దెబ్బతీసింది. ప్రస్తుతం కోల్పోయిన భూభాగాలను విడిపించుకునే ప్రయత్నంలో కీవ్‌ తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. మిత్రదేశాల నుంచి తగిన ఆయుధ సాయం అందడంలేదని ఉక్రెయిన్‌ అధినేత జెలెన్‌స్కీ పలు మార్లు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. పుతిన్‌ అధికారానికి ఇబ్బంది లేకపోతే ఈ పోరు ఇంతటితో ముగిసిపోదు. ఈ క్రమంలో ప్రపంచానికి రాబోయే రోజుల్లో మరిన్ని ఇక్కట్లు తప్పవని అర్థమవుతోంది.


- పి.ఫణికిరణ్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పేదరికం తెగ్గోసుకుపోయిందా?

‣ న్యాయ సంస్కరణల రగడ

‣ పులులే అడవులకు రక్ష

‣ భారత్‌ - ఫ్రాన్స్‌ చెట్టపట్టాల్‌

‣ ప్రకృతి పరిరక్షణ.. అందరి బాధ్యత

Posted Date: 11-08-2023గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని