• facebook
  • whatsapp
  • telegram

పేదరికం తెగ్గోసుకుపోయిందా?



భారత్‌లో 2015-21 మధ్య కాలంలో కోట్ల సంఖ్యలో ప్రజలు బహుముఖీన పేదరికం నుంచి బయటపడినట్లు ఇటీవల నీతి ఆయోగ్‌ నివేదిక వెల్లడించింది. అయితే, దారిద్య్ర నిర్మూలనతో ఇండియా ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా, పేదల సంఖ్యను కచ్చితంగా అంచనా వేసి, వారికి తగిన చేయూత అందించడం కీలక అంశం.


ఆధునిక కాలంలో ఒక దేశం ఆర్థికంగా పురోగమించిందని నిర్ధారించడానికి రెండు ప్రమాణాలను పాటిస్తారు. ఒకటి- జీడీపీ లేదా ఆర్థికాభివృద్ధి రేటు. రెండోది దారిద్య్ర తగ్గింపు రేటు. మొదటిది దేశ ఆర్థిక ప్రగతిని గణిస్తుంది. రెండోది ఆర్థికాభివృద్ధి ఫలాలు జనాభాలో అట్టడుగువారికి ఏ మేరకు అందాయో నిర్ధారిస్తుంది. సంపద పంపిణీ అయిన తీరును ఇది తెలుపుతుంది. ఆర్థిక అసమానతలు ఏ మేరకు తగ్గాయో తేలుస్తుంది. పేదరిక నిర్మూలన అనేది రాజకీయంగా కీలక ప్రాధాన్యం కలిగిన అంశం. అసలు పేదరికం తగ్గిందనడానికి కొలమానాలు, నిర్వచనాలేమిటనే అంశంపై వాదోపవాదాలు సాగుతాయి. ప్రభుత్వాలు చేపట్టిన పేదరిక నిర్మూలన కార్యక్రమాల సాఫల్య వైఫల్యాలు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంటాయి.


లోపాలను సరిదిద్ది..

ఇటీవల ‘జాతీయ బహుముఖీన పేదరిక సూచీ (ఎంపీఐ): ప్రగతిశీల సమీక్ష’ పేరిట నీతి ఆయోగ్‌ విడుదల చేసిన నివేదిక దారిద్య్ర నిర్మూలనకు సంబంధించి కొన్ని ముఖ్యమైన గణాంకాలను వెల్లడించింది. విద్య, వైద్యం, జీవన ప్రమాణాలకు సంబంధించి ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన ప్రమాణాలను అందుకున్నవారిని పేదరికం నుంచి బయటపడినవారిగా నీతి ఆయోగ్‌ నివేదిక పరిగణించింది. ఈ ప్రమాణాల ప్రకారం 2015-21 మధ్య కాలంలో 13.5 కోట్ల మంది భారతీయులు బహుముఖీన పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపింది. గడచిన 15 ఏళ్లలో బహుముఖీన పేదరికాన్ని సగానికి సగం తగ్గించిన 25 దేశాల్లో భారత్‌ ఒకటని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి సంస్థ (యూఎన్‌డీపీ) ఇటీవలి నివేదిక వెల్లడించింది.


బహుముఖీన పేదరికం నిర్ధారణకు ఆదాయాన్ని మాత్రమే కొలమానంగా తీసుకోరు. విద్యావైద్యాలు, జీవన ప్రమాణాల్లో వెనకబాటుతనాన్ని బహుముఖీన పేదరికంగా పరిగణిస్తారు. పోషకాహారం, పారిశుద్ధ్యం, సురక్షిత నీటి సరఫరా అందకపోవడాన్ని బహుముఖీన పేదరికంగా వర్గీకరిస్తారు. ఎంపీఐ ప్రమాణాల్లో కనీసం మూడో వంతును అందుకోలేనివారు బహుముఖంగా పేదరికం అనుభవిస్తున్నట్లు లెక్క. భారత్‌లో బహుముఖీన పేదరికాన్ని అనుభవించిన వారు 2015-16లో 24.85శాతం. 2019-21లో వారు 14.96శాతానికి తగ్గారని అంటున్నారు. తలపెట్టిన సంస్కరణలను సమర్థంగా అమలుచేయడం ద్వారా భారత్‌ ఈ విజయం సాధించగలిగిందని చెబుతున్నారు. అందుకోసం ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  అయితే, బహుముఖీన దారిద్య్ర నిర్మూలనలో భారత్‌ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా, దారిద్య్రానికి మనం ఇస్తున్న నిర్వచనం కచ్చితమైనదేనా అన్నది మొదట సమీక్షించాల్సిన అవసరం ఉంది. అసలు పేదల సంఖ్యపైనా రకరకాల అంచనాలు వెలువడుతున్నాయి. పేదరిక అంచనా అనేది రకరకాల సంక్లిష్ట అంశాలపై ఆధారపడి ఉండటం సమస్యకు కారణమవుతోంది. విధానకర్తలు ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకొని పేదరికం స్థాయులను, పేదల సంఖ్యను కచ్చితంగా అంచనా వేయాలి. వారి స్థితిగతుల మెరుగుదలకు పథకాలను చేపట్టి సమర్థంగా అమలు చేయాలి. సాధారణంగా అరకొర ఆదాయాలను లేదా ఆదాయ లేమిని దారిద్య్రానికి కొలమానంగా ఆర్థికవేత్తలు, విధానకర్తలు పరిగణిస్తుంటారు. రాష్ట్రాల స్థూల ఆదాయాలను, తద్వారా రాష్ట్ర ప్రజలు తలసరి ఆదాయాలను పెంచడానికి ప్రాధాన్యమిస్తారు. మెరుగైన ఆదాయాలతో పేదరికం సమసిపోతుందని భావిస్తారు. సంపదను సమానంగా పంపిణీ చేయాలని నొక్కిచెబుతారు. అల్పాదాయాలనేవి పేదరికానికి ఒక కొలమానం మాత్రమే. అదే సార్వత్రిక కొలమానం కాదు. అంటే, జీడీపీ వృద్ధి కోసం పాటుపడకూడదని, అభివృద్ధి ఫలాలను సమానంగా పంపిణీ చేయకూడదని దీనర్థం కాదు. ఆదాయంతోపాటు మెరుగుపరచాల్సిన అంశాలు అనేకం ఉన్నాయని, బహుముఖ పేదరిక నిర్మూలనతోనే సర్వతోముఖ అభివృద్ధి సాధ్యమని గుర్తించాలి. వ్యవస్థలోని లోపాలే పేదరికానికి కారణమని గ్రహించి, వాటిని సరిదిద్దాలి. నీతి ఆయోగ్‌ ఈ వాస్తవాన్ని గుర్తించినందువల్లే జాతీయ బహుముఖీన పేదరిక (ఎంపీఐ) సూచీని విడుదల చేయడంతోపాటు జిల్లాల వారీగానూ ఎంపీఐని రూపొందించి పేదరికాన్ని నిర్మూలించాలని సూచిస్తోంది. జిల్లా నుంచి జాతీయ స్థాయి వరకు బహుముఖీన పేదరికాన్ని నిర్మూలించినప్పుడు సమ్మిళిత అభివృద్ధి సుసాధ్యమవుతుంది. కేంద్రం, రాష్ట్రాలు చేయీచేయీ కలిపి కృషిచేసినప్పుడు అట్టడుగున ఉన్న నిరుపేదలను సైతం ఉద్ధరించడం సాధ్యమవుతుంది.


ఉద్యోగాల లేమి

వ్యవసాయ అభివృద్ధి రేటును వేగవంతం చేస్తే గ్రామీణ పేదరికం గణనీయంగా తగ్గుతుంది. ఏటా భారత జనాభా 1.7 కోట్ల చొప్పున పెరుగుతోంది. ఇది దిగివచ్చేలా చేయడం ద్వారా పేదరికాన్ని తగ్గించగలం. యువత అర్హతలకు తగిన ఉద్యోగాలు లభించకపోవడమూ పేదరికానికి కారణమే. ఈ క్రమంలో నాణ్యమైన నైపుణ్యాలు అందించి యువతను మేలిమి మానవ వనరులుగా తీర్చిదిద్దాలి. 3.3 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిన భారత్‌ పట్టుదలగా కృషి చేస్తే బహుముఖ పేదరికాన్ని తగ్గించడం సుసాధ్యమని నీతి ఆయోగ్‌ తాజా గణాంకాలు నిరూపిస్తున్నాయి. దాన్ని వాస్తవ రూపంలోకి తేవడం పాలకుల కర్తవ్యం.


బాధ్యతలను నెరవేరిస్తేనే..

భారత రాజ్యాంగం కేంద్రం, రాష్ట్రాలకు విడివిడి అధికారాలను కట్టబెడుతోంది. కొన్ని రంగాల్లో ఉమ్మడి కృషికీ వీలుకల్పిస్తోంది. రాజ్యాంగం నిర్దేశించిన పరిధుల్లో కేంద్రం, రాష్ట్రాలు తమ అధికారాలను, బాధ్యతలను సక్రమంగా నెరవేరిస్తే పేదలను సమ్మిళిత అభివృద్ధిలో భాగస్వాములను చేయవచ్చు. పేదరికాన్ని తగ్గించడంలో దేశంలోని ఉత్తర, తూర్పు రాష్ట్రాల కన్నా దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలు ఎంతో ముందున్నాయని అంటున్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్‌, మేఘాలయల్లో బహుముఖ పేదలు అత్యధికంగా ఉన్నారు. అదే సమయంలో అనేక పేద రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో బహుముఖీన పేదరికం గణనీయంగా తగ్గినట్లు చెబుతున్నారు. అందుకే జాతీయ స్థాయిలో గ్రామీణ పేదరికం 32.59శాతం నుంచి 19.28శాతానికి తగ్గినట్లు కనిపిస్తోంది. కేంద్రం సరైన సహకారం అందిస్తే బహుముఖీన పేదరికాన్ని తగ్గించడంలో రాష్ట్రాలు సఫలీకృతం అవుతాయి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ న్యాయ సంస్కరణల రగడ

‣ పులులే అడవులకు రక్ష

‣ భారత్‌ - ఫ్రాన్స్‌ చెట్టపట్టాల్‌

‣ ప్రకృతి పరిరక్షణ.. అందరి బాధ్యత

Posted Date: 11-08-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం