• facebook
  • whatsapp
  • telegram

న్యాయ సంస్కరణల రగడ



సుప్రీంకోర్టు అధికారాలకు కోతపెట్టేలా నెతన్యాహు సర్కారు చేసిన వివాదాస్పద ప్రతిపాదనలు ఇజ్రాయెల్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దేశంలో ప్రజాస్వామ్య మనుగడకు అవి శరాఘాతంగా మారే ముప్పుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇండియా తరహాలో న్యాయవ్యవస్థ పూర్తి స్వతంత్రంగా ఉండాల్సిన ఆవశ్యకతను వారు నొక్కిచెబుతున్నారు.


ఇజ్రాయెల్‌లో న్యాయవ్యవస్థ సంస్కరణల పేరిట ప్రక్షాళన ప్రణాళికను నెతన్యాహు ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. అందులో భాగంగా అవసరమైనప్పుడు ప్రభుత్వ/కేబినెట్‌ నిర్ణయాలను రద్దు చేసేలా సుప్రీంకోర్టుకు ఉన్న అధికారాలను తొలగించేందుకు ఉద్దేశించిన కీలక బిల్లును పార్లమెంటు(కనెసెట్‌)లో ఆమోదింపజేసుకుంది. దాంతో దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు పెల్లుబికాయి. విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు, వైద్యులు... ఇలా లక్షల మంది ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ నిరసనల బాట పట్టారు. నెతన్యాహు సర్కారు తన నిర్ణయాలను పక్కనపెట్టకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘమైన హిస్టడట్‌ సమ్మె హెచ్చరికను జారీ చేసింది.  


అధికారాలకు కత్తెర

ఇజ్రాయెల్‌లో లిఖిత రాజ్యాంగం లేదు. అక్కడ పౌరహక్కులు, చట్టాలకు న్యాయవ్యవస్థే ప్రధాన రక్షణఛత్రం. నిరుటి ఎన్నికల్లో విజయం సాధించి ఆరోసారి ఇజ్రాయెల్‌ ప్రధానిగా నెతన్యాహు పాలన పగ్గాలు చేపట్టారు. ఈ ఏడాది ఆరంభంలో న్యాయ వ్యవస్థ ప్రక్షాళనకు వివాదాస్పద ప్రణాళికను ఆయన తెచ్చారు. సుప్రీంకోర్టుకు ప్రస్తుతం నియంత్రణలు లేవని, ఈ క్రమంలో సంస్కరణలు అవసరమని అధికారపక్ష నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. వారి వాదనను విమర్శకులతోపాటు దేశవ్యాప్తంగా పలు వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ధనిక మిత్రుల నుంచి బహుమతులు స్వీకరించడం, తనకు విస్తృతస్థాయి కవరేజీ కల్పించిన కొందరు మీడియా పెద్దల కోసం సిఫార్సులు చేయడం వంటి ఆరోపణలను నెతన్యాహు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనపై 2019లో మోసం, విశ్వాస ఉల్లంఘన, ముడుపుల స్వీకరణ అభియోగాలు నమోదయ్యాయి. మరోవైపు- సుప్రీంకోర్టు మరీ శక్తిమంతంగా ఉందని, అది వామపక్ష అనుకూల ధోరణితో వ్యవహరిస్తోందని ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంలోని నేతలు ఎప్పటినుంచో వ్యాఖ్యానిస్తున్నారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌, తూర్పు జెరూసలెమ్‌లలోని తమ స్థావరాల్లో ప్రస్తుతం 60-75 వేలుగా ఉన్న ఇజ్రాయెలీల సంఖ్యను మరింత పెంచాలనీ చూస్తున్నారు. సుప్రీంకోర్టు శక్తిమంతంగా ఉంటే ఇవన్నీ అసాధ్యం. అందుకే, తనపై కేసులను కొట్టివేయించుకోవడంతో పాటు సంకీర్ణ సర్కారులోని ఇతర నాయకుల ప్రణాళికలను అమలు చేసేందుకు న్యాయవ్యవస్థ ప్రక్షాళనకు నెతన్యాహు పూనుకొన్నారని విశ్లేషకులు చెబుతున్నారు.


ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలన్నీ చట్టరూపం దాలిస్తే- ఇజ్రాయెల్‌ న్యాయవ్యవస్థ బలహీనపడుతుంది. పార్లమెంటులో సాధారణ మెజారిటీతో చేసే తీర్మానాల ద్వారా సుప్రీంకోర్టు తీర్పులను పక్కనపెట్టడం వీలవుతుంది. న్యాయ వ్యవస్థకు సంబంధించిన నియామకాలపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమవుతుంది. కేబినెట్లో నియామకాలపై సర్వోన్నత న్యాయస్థానం పర్యవేక్షణ అధికారాన్ని కోల్పోతుంది. ప్రభుత్వానికి అపరిమిత అధికారాలు దఖలుపడతాయి. ఈ పరిణామాలన్నీ మైనారిటీల రక్షణకు, ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదకరంగా మారతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు ఏడు నెలల క్రితం ప్రక్షాళన ప్రణాళికను సర్కారు వెల్లడించిన వెంటనే ప్రజలు భారీగా నిరసనలకు దిగారు. పరిస్థితి విషమిస్తుండటంతో నెతన్యాహు కాస్త వెనక్కి తగ్గారు. తాజాగా సంస్కరణల ప్రణాళికలోని కీలక బిల్లుకు పార్లమెంటులో ఆమోదముద్ర పడటంతో- మరోసారి నిరసన జ్వాలలు చెలరేగాయి. గత నిరసనల వల్ల ఇప్పటికే ఇజ్రాయెల్‌ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో హిస్టడట్‌ సమ్మెకు దిగితే ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది.


రిజర్వు దళాల హెచ్చరిక

అవసరమైతే రాజ్యాంగ సవరణలను సైతం సమీక్షించే అధికారాలు భారత సర్వోన్నత న్యాయస్థానానికి ఉన్నాయి. పౌరుల ప్రాథమిక హక్కులకు ముప్పు ఏర్పడినప్పుడల్లా ఇక్కడి కోర్టులు జోక్యం చేసుకొని పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నాయి. న్యాయ నియామకాల్లో రాజకీయ నాయకుల జోక్యం లేకపోవడమే మంచిది. ఉంటే, కోర్టులపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది. నెతన్యాహు ప్రక్షాళన ప్రణాళికను వ్యతిరేకిస్తూ ఇజ్రాయెలీ అత్యున్నత న్యాయస్థానంలో ప్రస్తుతం పిటిషన్లు దాఖలయ్యాయి. ఇజ్రాయెల్‌ సైన్యానికి వెన్నెముక వంటి రిజర్వు దళాల సభ్యుల్లో పలువురు సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారు. వాటిని ఉపసంహరించుకోకపోతే- అవసరమైనప్పుడు తమను విధులకు పిలిచినా వెళ్ళబోమని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వివాదాస్పద నిర్ణయాలను నెతన్యాహు సర్కారు ఉపసంహరించుకోవడం దేశానికి క్షేమదాయకం.


- శ్రీయాన్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పులులే అడవులకు రక్ష

‣ భారత్‌ - ఫ్రాన్స్‌ చెట్టపట్టాల్‌

‣ ప్రకృతి పరిరక్షణ.. అందరి బాధ్యత

‣ హరిత భాగ్యానికి విత్తనబంతి

‣ హక్కులు దక్కని గిరిజన పల్లెలు

‣ భారత్‌ - శ్రీలంక మైత్రిలో నూతన ఒరవడి

‣ మడ అడవులు.. జీవవైవిధ్య ప్రతీకలు!

Posted Date: 11-08-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం