• facebook
  • whatsapp
  • telegram

హక్కులు దక్కని గిరిజన పల్లెలు


తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలోని 23 గ్రామాలు అయిదో షెడ్యూలు ప్రాంతాల పరిధిలోకే వస్తాయని ఇటీవల ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఆ గ్రామాలు రాజ్యాంగం ద్వారా గుర్తించిన రక్షణ హక్కులు పొందేందుకు ఇన్నేళ్లు పట్టింది. గిరిజనులకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దడంలో వ్యవస్థల వైఫల్యానికి ఈ ఉదంతమే నిదర్శనం.


పూర్తిగా గిరిజన జనాభా కలిగిన గ్రామాలను అయిదో షెడ్యూలు జాబితాలో చేర్చాలని వివిధ రాష్ట్రాల్లో గిరిజనులు దశాబ్దాలుగా డిమాండు చేస్తున్నారు. వారి వేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. అటు రాజ్యాంగ హక్కులు దక్కక, ఇటు పాలన యంత్రాంగాలకు తమ   గోడు పట్టక గిరిజనులు సామాజిక, ఆర్థిక, మౌలిక వసతులు కొరవడి దుర్భర జీవనం సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు జిల్లాల పరిధిలోని 554 గ్రామాలను అయిదో షెడ్యూల్‌ జాబితాలో చేర్చాలని 2019 నవంబర్‌లో గిరిజన సలహా మండలి తీర్మానం చేసి కేంద్రానికి నివేదించింది. నాలుగేళ్లు గడుస్తున్నా ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చకపోవడం విచారకరం.


చారిత్రక అన్యాయం

ఆదివాసులు అధికంగా నివసించే అటవీ, పర్వత ప్రాంతాల్లో కలప, ఫలసాయం, వన్యప్రాణులు, ఖనిజ, జల వనరుల వంటి విలువైన సంపద ఉంది. అనాదిగా ఈ వనరులను ఇతరులు చేజిక్కించుకునే ప్రయత్నాల్లో ఘర్షణలు అనివార్యంగా మారాయి. బ్రిటిష్‌ పరిపాలన కాలంలో ఆదివాసీ ప్రాంతాలపై జమీందార్ల ఆధిపత్యాన్ని నియంత్రించేందుకు, ఘర్షణలు నివారించేందుకు జిల్లా అధికారులను ఏజెంట్లుగా నియమించారు. ఏజెన్సీ చట్టాలను సైతం తీసుకొచ్చారు. ఇలాంటివెన్నో పాలనపరమైన కట్టుబాట్లు తీసుకొచ్చినా ఆదివాసులకు ఒరిగిందేమీ లేదు. స్వాతంత్య్రం వచ్చాక ఆదివాసుల సంస్కృతి, జీవన విధానం, సంప్రదాయ పరిపాలన, న్యాయ పద్ధతులను పరిరక్షించే ప్రయత్నాలు జరిగాయి. ఆ క్రమంలో రాజ్యాంగ చర్యల్లో భాగంగా అటవీ ప్రాంతాల్లోని గిరిజనులు నివసించే ప్రాంతాలను అయిదో షెడ్యూలులో చేర్చి ‘షెడ్యూలు ప్రాంతాలు’గా గుర్తించారు. అక్షరాస్యత కొరవడి, అన్ని రంగాల్లో వెనకబాటుకు గురవుతున్న గిరిజనులకు జరిగిన చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దాలని రాజ్యాంగ రూపకర్తలు లక్షించారు. ప్రగతి పథంలో నడిపించాలనే దూరదృష్టితో రాజ్యాంగం అయిదో షెడ్యూలులో కొన్ని ప్రత్యేక హక్కులు, సంక్షేమ నమూనాలను పొందుపరిచారు. ఈ క్రమంలో షెడ్యూలు ప్రాంతాలపై రాష్ట్రపతి, గవర్నర్లకు ప్రత్యేక హక్కులు ఉంటాయి. వారి అనుమతి లేకుండా చట్టాలు చేసే అధికారం శాసన వ్యవస్థలకు లేదు. గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంటు సభ్యులదాకా ఎన్నికయ్యే అన్ని పదవుల్నీ షెడ్యూల్‌ ప్రాంతంలో గిరిజనులకు రిజర్వు చేశారు. షెడ్యూలు ప్రాంతంలో గిరిజనేతరులు భూములు కొనకుండా భూబదలాయింపు నిషేధ  చట్టం (1/70), వడ్డీ నియంత్రణ చట్టం వంటివి ఆదివాసులకు రక్షణగా నిలుస్తున్నాయి. ఉద్యోగాలను గిరిజనులకు ప్రత్యేకించారు. పీసా చట్టం గ్రామసభ, పంచాయతీలకు విశేష అధికారాలను కల్పించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌ ద్వారా కేటాయించే నిధులను షెడ్యూలు ప్రాంతాల అభివృద్ధికి విడుదల చేస్తారు. సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)ల ద్వారా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తరవాత భారత రాష్ట్రపతి వివిధ రాష్ట్రాల్లోని షెడ్యూలు ప్రాంతాలను నోటిఫై చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ తరవాత దశలవారీగా ఆంధ్రప్రదేశ్‌ (తెలంగాణ సహా) ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్‌ రాష్ట్రాల పరిధిలో అటవీ ప్రాంతాల గిరిజన గ్రామాలను గుర్తించి నోటిఫై చేశారు. ఈ ఆదేశాల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మునుపటి ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, వరంగల్‌, పశ్చిమ, తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 5,400 గిరిజన గ్రామాలను అయిదో షెడ్యూలు జాబితాలో చేర్చారు. షెడ్యూలు ప్రాంత ఆదేశాలకు సవరణ తీసుకొచ్చిన సందర్భంగా గతంలో కేంద్ర ప్రభుత్వం మిగిలిపోయిన గ్రామాల వివరాలను పంపాలంటూ వివిధ రాష్ట్రాలను కోరింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది జిల్లాల్లో సర్వే జరిపి 753 గిరిజన గ్రామాలను షెడ్యూలు జాబితాలో చేర్చాలంటూ కేంద్రానికి నివేదించారు. దశాబ్దాలు గడిచిపోయినా ఆ ప్రతిపాదనలకు మోక్షం దక్కలేదు.


చిత్తశుద్ధితో కృషి

ప్రస్తుతం అనేక గిరిజన గ్రామాల్లో విద్య, వైద్య, విద్యుత్తు, రవాణా వంటి మౌలిక వసతుల కొరత నెలకొంది. ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు ఎండమావిగా మారాయి. గిరిజనుల నిరక్షరాస్యత ఆసరాగా భూపరాయీకరణ వేగంగా సాగుతోంది. షెడ్యూలు హోదా దక్కక, రాజ్యాంగ హక్కులను పొందలేకపోతున్న గిరిజన గ్రామాల విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు సహా గిరిజనులు అధికంగా ఉన్న రాష్ట్రాలన్నీ ఇకనైనా చిత్తశుద్ధితో దృష్టి సారించాలి. జాతీయ, రాష్ట్రాల స్థాయుల్లో గిరిజన సాంస్కృతిక, పరిశోధన సంస్థల సహాయంతో షెడ్యూలు హోదా దక్కని గ్రామాల స్థితిగతులపై సమగ్ర అధ్యయనం జరిపి దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. షెడ్యూలు ప్రాంతాలను సరిహద్దులతో పాటు నోటిఫై చేసి గిరిజనుల హక్కుల రక్షణకు అండగా నిలవాలి. ఏడు దశాబ్దాలుగా షెడ్యూలు హోదా కోసం ఎదురుచూస్తున్న గిరిజనుల ఆశలు నెరవేర్చాలి. ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి జరిపితేనే గిరిపుత్రుల్లో గూడు కట్టుకున్న అసంతృప్తి తొలగిపోయే అవకాశం ఉంటుంది.


అవగాహన కరవు

రాజ్యాంగం అయిదో షెడ్యూలులో పొందుపరిచిన విశేష హక్కులను అధికార యంత్రాంగాలు సమగ్రంగా అవగాహన చేసుకోలేదనే చెప్పాలి. పలు రాష్ట్రాల్లో అర్హత కలిగిన వేల గిరిజన గ్రామాలను షెడ్యూలు జాబితాలో చేర్చేందుకు సిఫారసు చేయలేదు. ఇలాంటి గ్రామాల్లో గిరిజనులే ఎక్కువగా ఉన్నా హక్కులు, సంక్షేమ ఫలాలు దక్కడం లేదు. ఇప్పటికీ హోదా దక్కని గిరిజన గ్రామాలు గణనీయంగా ఉన్నాయి. అటు ఐటీడీఏలు, షెడ్యూలు ప్రాంత ప్రజా ప్రతినిధులు, ఇటు పాలన యంత్రాంగాలు తమ అభివృద్ధి ప్రణాళికల్లో ఈ గ్రామాలకు చోటు కల్పించేందుకు యత్నించలేదు. షెడ్యూలు హోదా దక్కని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఐటీడీఏల ద్వారా ఉపప్రణాళిక నిధులను ఖర్చు చేయాలంటూ కొంతమంది అధికారులు చేసిన ప్రతిపాదనలూ అమలుకు నోచుకోలేదు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భారత్‌ - శ్రీలంక మైత్రిలో నూతన ఒరవడి

‣ మడ అడవులు.. జీవవైవిధ్య ప్రతీకలు!

‣ న్యాయ దీపికలు.. నారీ అదాలత్‌లు!

‣ ప్లాస్టిక్‌ కట్టడికి సమష్టి భాగస్వామ్యం

‣ అంతర్జాతీయ జలాల్లో జీవవైవిధ్యం

‣ పక్కా ప్రణాళికతో... వరదా వరమే!

Posted Date: 11-08-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం