• facebook
  • whatsapp
  • telegram

పక్కా ప్రణాళికతో... వరదా వరమే!


ఇటీవలి భారీ రుతుపవన వర్షాలు, వరదలకు హిమాచల్‌ ప్రదేశ్‌, హరియాణా, దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌, అస్సామ్‌లలో పెద్దయెత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. నెల రోజుల క్రితం, పెను తుపాను కారణంగా రాజస్థాన్‌, గుజరాత్‌ ఎడారి ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలో వరద ముప్పు నివారణకు దీర్ఘకాలిక ఏర్పాట్లపై దృష్టి సారించడం అత్యవసరం.


భారీ వర్షాలతో పలు నగరాలు, పంట పొలాలను వరదలు ముంచెత్తాయి. ఇందుకు వాతావరణాన్ని గాని, పర్యావరణ మార్పులను గాని నిందించి ప్రయోజనం లేదు. ప్రకృతి తన పని తాను చేస్తుంది. మనం ప్రకృతిని శాసించలేం. ప్రకృతితో సమన్వయం ద్వారా ఉత్పాతాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడంపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మన పట్టణ ఆవాసాలు నీటి వనరులు, వరద నీటి పారుదల వ్యవస్థల గురించి లోతుగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.


పట్టణాల్లో అస్తవ్యస్తం

వచ్చే మూడు దశాబ్దాల్లో దాదాపు 50 కోట్ల మందికి పైగా మన నగరాలు, పట్టణాల్లో ఉండబోతున్నారు. పట్టణ జనాభా భారీగా పెరగనుంది. పట్టణీకరణ అనివార్యం, అవసరం. పట్టణ ప్రాంతాలకు వలసల్ని, వ్యవసాయేతర ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందడాన్ని నిలువరించలేం. మన నగరాలు, పట్టణాలు ఇప్పటికీ ప్రతి వానాకాలంలో వరదలతో అస్తవ్యస్తంగా మారుతుంటే, రాబోయే కాలంలో పట్టణాల్లో జనాభా రెట్టింపైతే ఎంత విధ్వంసం, వైపరీత్యం జరుగుతాయో ఊహించగలమా! ఈ నేపథ్యంలో మనం చేయాల్సింది ఏమిటి?


మొదటిది: అన్ని పట్టణ ప్రాంతాల్లో సహజ నీటి ప్రవాహాలు, వరద నీటి కాలువలకు ఉన్న అవరోధాలను తొలగించాలి. అడ్డగోలు ప్రణాళికలు, వాటి అసమర్థ అమలు, భూములపై ఒత్తిడి వల్ల చాలా నగరాల్లో సహజ వరద మార్గాలు, నీటి వనరులు కుదించుకుపోయాయి. దీనివల్ల సాధారణ వర్షానికే భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షపు నీరు భూమి వాలును అనుసరించి వెళ్తుండాలి. సహజ నీటి కాలువలు, నదుల్లోకి ప్రవహించాలి. ఈ నీటి ప్రవాహాల్ని అడ్డుకోవడం వల్ల వరదలతో పాటు రోడ్లు, నివాస భవనాలు, మానవ ఆవాసాల ముంపు అనివార్యమవుతుంది. సహజ ప్రవాహ మార్గాలకు అడ్డంగా ఉండే అవరోధాలను తొలగించడానికి భారీయెత్తున ప్రచార కార్యక్రమాలు ప్రారంభించాలి. వరద నీటి కాలువల్లో పూడిక తొలగించి నీరు సాఫీగా ప్రవహించేలా పక్కా చర్యలు తీసుకోవాలి. ఎంత వర్షపాతం పడుతుంది, భారీ వర్షాలు పడితే కాలువలు, ప్రవాహ మార్గాల ద్వారా ఎంత నీరు బయటికెళ్లే అవకాశముందో ప్రతి పట్టణ ప్రాంతానికి సంబంధించి తగినంత సమాచారం ఉంది. ఏ ఒక్క అవరోధం, ఇరుకు మార్గం ఉన్నా వరద నీటి ప్రవాహం పొంగి పొర్లుతుంది. కాబట్టి రాబోయే అవసరాల్ని కూడా దృష్టిలో పెట్టుకుని వరద నీటి కాలువలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలి. ఏమాత్రం పొరపాట్లకు చోటివ్వకూడదు. లేకుంటే మన నగరాల్ని వరదలు ముంచెత్తడం ఏటా అనివార్య పరిణామంగా మారుతుంది.


రెండోది: అస్తవ్యస్త పట్టణీకరణ నుంచి ఇప్పటిదాకా నేర్చుకున్న పాఠాల్ని అమలు చేయడం ముఖ్యం. తద్వారా, పెరుగుతున్న పట్టణ నివాసాల వల్ల భవిష్యత్తులో వరదలు రాకుండా నివారించడం కీలకం. పట్టణీకరణలో మనం ఇప్పటికీ దిగువ స్థాయిలోనే ఉన్నాం. రెట్టింపు కానున్న పట్టణ జనాభాకు తగినట్లుగా సన్నద్ధమవ్వాలి. ప్రపంచంలోని గొప్ప నగరాలన్నీ భౌగోళిక కాంటూర్లను (మిట్టపల్లాల రేఖాచిత్రాల్ని), భూమి వాలును పరిగణనలోకి తీసుకుని ప్రణాళికాబద్ధంగా నిర్మించినవే. లండన్‌, పారిస్‌, రోమ్‌, బెర్లిన్‌, న్యూయార్క్‌, షికాగో, టోక్యో... ఇలా మహానగరాలన్నింటినీ నీటివాలును బట్టి నిర్మాణం చేశారు. భారతీయ నగరాలకు పూర్తిస్థాయి కాంటూర్‌ పటాలు లేవు. మన మౌలిక వసతులు, పట్టణ ప్రణాళిక, మానవ ఆవాసాలు వంటి వాటన్నింటికీ సహజ కాంటూర్లను, భూమి పల్లాన్ని అవసరమైన మేర పరిగణనలోకి తీసుకోలేదు. అస్తవ్యస్త, అశాస్త్రీయ పట్టణ ప్రణాళికల వల్ల వరదలొచ్చే లోతట్టు ప్రాంతాల్లో నివాస భవనాలు, కాలనీలు చట్టబద్ధ అనుమతులతోనే వెలశాయి. వరద నీరు చట్టబద్ధ సరిహద్దుల్ని, నిర్మాణ అనుమతుల్ని పట్టించుకోదు. కేవలం వాలును బట్టి సాగుతుంది. భూమ్యాకర్షణ సూత్రాన్ని అనుసరిస్తుంది. మన పట్టణ ప్రణాళికలు ప్రకృతిని గౌరవించాలి. నగరాలు, పట్టణాల్లోని ప్రతి ప్రాంతానికీ కాంటూర్‌ పటాల్ని రూపొందించాలి. నీటి ప్రవాహాలకున్న అన్ని అవరోధాల్ని తొలగించడంలో, కొత్త మౌలిక సదుపాయాల్ని నిర్మించడంలో, భవిష్యత్తులో మొత్తం పట్టణ ప్రణాళిక, నిర్మాణాల అనుమతుల్లో కాంటూర్‌ మ్యాపులు మనకు దిశానిర్దేశం కావాలి.


మూడోది: తక్కువ నైపుణ్యాలున్న గ్రామీణ పేదలు పెద్ద నగరాలకు వలస వెళ్ళాల్సిన అవసరం లేకుండా గ్రామాల మధ్య చిన్నస్థాయి పట్టణాల అభివృద్ధిని ప్రోత్సహించాలి. ప్రత్యేక నైపుణ్యాలున్న ఆర్థిక కార్యకలాపాల కోసం పెద్ద నగరాలు అవసరం. మిగిలిన అత్యధిక శాతం ప్రజలు పట్టణ ప్రాంతాల్లో సౌకర్యంగా జీవించడానికి, ఉపాధి అవకాశాలు పొందడానికి మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్యం అందుబాటులో ఉండాలి. కాబట్టి చిన్న పట్టణాల్ని ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువులుగా తీర్చిదిద్దాలి. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసల్ని ఆకర్షించగలిగేలా అభివృద్ధి చేయాలి. దీనివల్ల ప్రజల జీవితాల్లో నాణ్యత పెరుగుతుంది. పట్టణ ప్రణాళికలు, వరదల నియంత్రణ సులభతరమవుతుంది. సరైన, అవసరమైన స్థాయి వరద నీటి డ్రైనేజీల ఏర్పాటుకు చిన్న పట్టణాలు కూడా ఇదే రకమైన సూత్రాలను అనుసరించాలి.


సమర్థ అమలు ముఖ్యం

మన కష్టాల్లో చాలా వాటికి ప్రకృతిని నిందించలేం. ప్రకృతికి అనుగుణంగా మారే సామర్థ్యం మానవ సమాజానికి సహజ లక్షణం. భూతాపం అనివార్యం. అందుకని, గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలను తగ్గించడానికి సాధ్యమైనంత మేర కృషి చేయాలి. అసాధారణ రీతిలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల తలెత్తే వరదల్ని కూడా నియంత్రించాలి. సరైన ప్రణాళికల రూపకల్పన, సమర్థ అమలు జరిగితే- మనలాగా నీటి కొరతగల, రుతుపవనాల మీద ఆధారపడిన దేశంలో అధిక వర్షపాతం వరమే అవుతుంది. మెరుగైన పట్టణ ప్రణాళికలను రూపొందించడం, సరిగ్గా అమలు చేయడం ద్వారా ప్రతికూలతలనూ అవకాశంగా మార్చుకోగలగాలి.


అసాధారణ వర్షపాతం

దేశంలో తరచూ అతి భారీ వర్షాలు క్రమపద్ధతి లేకుండా కురుస్తున్నాయి. భూతాపం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. గడచిన రెండు దశాబ్దాల్లో, భారత ఉపఖండంలోని చాలాచోట్ల సగటు వర్షపాతం సాధారణంకంటే ఎక్కువగా ఉంది. వర్షపాతం క్రమపద్ధతి లేకుండా అసాధారణ రీతిలో ఉంటోంది. వానాకాలంలో కూడా ఒకపక్క కుండపోత, ఆ వెంటనే మండుటెండలు వేధిస్తున్నాయి. మనది రుతుపవన ఆధారిత దేశం కాబట్టి అధిక వర్షపాతం మంచిదే. కానీ భారీ వర్షం వల్ల వరదలు రాకుండా నష్టం, అంతరాయం నామమాత్రంగా ఉండేలా చర్యలు తీసుకోవడం తప్పనిసరి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సౌర విద్యుత్తుకు పెద్దపీట

‣ అటవీ సంరక్షణ చట్టానికి తూట్లు

‣ ఎగుమతులకు చెల్లింపుల ఇక్కట్లు

‣ వైమానిక రవాణా.. అవకాశాల ఖజానా!

Posted Date: 24-07-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం