• facebook
  • whatsapp
  • telegram

అటవీ సంరక్షణ చట్టానికి తూట్లు




 

ప్రభుత్వాల అంతులేని నిర్లక్ష్యంతో అటవీ వనరులు, జీవవైవిధ్యం విధ్వంసానికి గురవుతున్నాయి. పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటోంది. ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టులకు అటవీ భూములను బదలాయించడంపై ఇప్పటికే ఎన్నో విమర్శలు ఉన్నాయి. వీటన్నింటినీ విస్మరించి అటవీ సంరక్షణ చట్టానికి సవరణలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.


అటవీ చట్టానికి సవరణ బిల్లును ఈ ఏడాది మార్చిలో లోక్‌సభలో ప్రవేశ పెట్టినప్పటి నుంచీ వివాదాలు చుట్టుముట్టాయి. బిల్లును సమగ్రంగా సమీక్షించేందుకు పర్యావరణ మంత్రిత్వశాఖ పరిధిలోని పార్లమెంటరీ స్థాయీసంఘానికి పంపాల్సి ఉండగా, ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి అప్పగించింది. ముసాయిదా బిల్లులోని వివాదాస్పద అంశాలకు ఆ కమిటీ యథాతథంగా ఆమోదం తెలపడంపై తాజాగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆదివాసుల సంప్రదాయ హక్కులను విస్మరించడం ఆందోళన కలిగిస్తోంది. చట్టం పేరును ‘వన (సంరక్షణ్‌ ఏవమ్‌ సంవర్ధన్‌) అధినియమ్‌’గా మార్చాలనే ప్రతిపాదనపై దక్షిణాది రాష్ట్రాల్లో అభ్యంతరం వ్యక్తమవుతోంది. 2070 నాటికి భారత్‌ను సున్నా ఉద్గారాల స్థాయికి చేర్చాలనే లక్ష్య సాధనకు ‘అటవీ పరిరక్షణ చట్టం సవరణ బిల్లు-2023’ దోహదపడుతుందని ముసాయిదాలో పేర్కొన్నారు. అందుకు దోహదపడే నిబంధనలు మాత్రం బిల్లులో లేవు. దేశవ్యాప్తంగా పరిశ్రమలు, గనుల తవ్వకాలు, అభివృద్ధి ప్రాజెక్టుల పేరుతో సాగుతున్న అడవుల కోతను నియంత్రించాలనే లక్ష్యంతో ‘అటవీ సంరక్షణ చట్టం-1980’ని అమలులోకి తీసుకొచ్చారు. నాలుగు దశాబ్దాల క్రితం వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాలు స్పష్టంగా కనిపించకపోయినా, అడవుల కోత నియంత్రణకు అవసరమైన వ్యవస్థలను అందులో పొందుపరచారు. కొన్నేళ్లుగా అడవుల క్షీణత పెరగడంతో వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాలు ఇప్పటికే అనుభవంలోకి వచ్చాయి. ఇప్పుడు ఉత్తర భారతదేశాన్ని ముంచెత్తుతున్న వరదలే అందుకు నిదర్శనం.


స్వేచ్ఛగా బదలాయింపు

తాజా బిల్లు రక్షిత ప్రాంతాలు మినహాయించి మిగతా అటవీ భూములను అనేక అటవీయేతర ప్రయోజనాల కోసం స్వేచ్ఛగా బదలాయించేందుకు అవకాశం కల్పిస్తుండటం ఆందోళనకరం. జాతీయ భద్రత, ఇతర వ్యూహాత్మక అవసరాల కోసం దేశ సరిహద్దుల్లో వంద కిలోమీటర్లలోపు అటవీ భూముల బదలాయింపునకు స్వేచ్ఛ కల్పించారు. ఇది ఈశాన్యంతో పాటు ఉత్తరాఖండ్‌ తదితర రాష్ట్రాల్లో విలువైన జీవవైవిధ్య సంపద ఉన్న అడవులపై పెను ప్రభావం చూపే అవకాశం ఉంది. వామపక్ష తీవ్రవాదం నెలకొన్న ప్రాంతాల్లో భద్రతావసరాల పేరిట అటవీ భూములకూ మినహాయింపు ఇచ్చారు. దీంతో పశ్చిమ, తూర్పు కనుమల్లో అత్యంత దట్టమైన అటవీ ప్రదేశాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. జంతు ప్రదర్శనశాలలు, సఫారీలు, ఎకో టూరిజం ప్రాజెక్టులు, వనాల వృద్ధి కోసం చేపట్టే కార్యకలాపాలకూ మినహాయింపులు ఇచ్చారు. అయిదోక్లాజులో కేంద్ర ప్రభుత్వం ఆదేశించే ఏదైనా ఇతర ప్రయోజనాలకు అడవిని బదిలీ చేసుకోవడానికి వీలుగా మినహాయింపు కల్పించడం అత్యంత ఆందోళన కలిగించే అంశం. 1927 నాటి అటవీ చట్టం ప్రకారం నోటిఫై చేసిన అడవులు, 1980 అక్టోబర్‌ తరవాత ప్రభుత్వం వద్ద రికార్డయిన భూములకు మాత్రమే చట్టం వర్తిస్తుందని తాజా బిల్లులో పేర్కొన్నారు. అయితే, యాజమాన్యంతో సంబంధం లేకుండా ప్రభుత్వ రికార్డులో అటవీప్రాంతంగా పేర్కొన్న ఏ ప్రాంతాన్నయినా అడవిగానే పరిగణించాలన్న సుప్రీంకోర్టు తీర్పును విస్మరించారు. దీనివల్ల ఇప్పటికీ సరిహద్దులు నిర్ణయించకుండా, రిజర్వు అడవులుగా ప్రకటించకుండా మిగిలిపోయిన వనాలకు పెద్దయెత్తున నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అడవులపై ఆధారపడి జీవించే ఆదివాసుల హక్కులను పునరుద్ధరించే క్రమంలో అమలులోకి వచ్చిన పీసా చట్టం-1996, అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006లను కూడా తాజా బిల్లు విస్మరించింది. సామాజిక, పర్యావరణ ప్రయోజనాలు కలిగించడం ద్వారా అటవీ ఆధారిత సమూహాల జీవనోపాధులను మెరుగుపరచేందుకు బిల్లు దోహదపడుతుందని లక్ష్యాల్లో పేర్కొన్నా, క్లాజుల్లో ఎక్కడా అది ప్రతిబింబించలేదు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం ద్వారా గిరిజనులకు వారు ఆధారపడి బతికే అడవులపై సాముదాయిక హక్కులు దఖలుపడాలి. కానీ బిల్లులో ఈ హక్కులకు రక్షణ కల్పించే భరోసా లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఇప్పటికే ఉన్న రక్షణ నిబంధనలకు తూట్లు పొడుస్తూ, రాజ్యాంగ లక్ష్యాలను విస్మరించడం సమంజసం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


సమగ్ర సమీక్ష అవసరం

కర్బన ఉద్గారాలను నియంత్రించేందుకు వీలుగా అటవీ విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచేందుకు సవరణలు దోహదపడతాయని బిల్లు ఉపోద్ఘాతంలో పేర్కొన్నారు. కానీ, బదలాయించిన అడవులకు ప్రత్యామ్నాయంగా చేపడుతున్న వనీకరణ ప్రక్రియ అమలు తీరులో లోపాలు ఇలాంటి హామీలను విశ్వసించే అవకాశం లేకుండా చేస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం, అటవీ సంరక్షణ చట్టం అమలులోకి వచ్చిన తరవాత పెద్దయెత్తున అటవీ భూములను ఇతరత్రా అవసరాలకు బదలాయించారు. అయితే, గత నాలుగు దశాబ్దాల్లో ప్రత్యామ్నాయంగా పెంచిన వనాలకు సంబంధించిన గణాంకాలు పారదర్శక రీతిలో అందుబాటులో లేకపోవడం గమనార్హం. వనాల విధ్వంసానికి తావివ్వకుండా లైసెన్స్‌రాజ్‌ వ్యవస్థ ప్రక్షాళనకు చర్యలు చేపడతామంటూ ప్రభుత్వాలు ఇచ్చే హామీలు నీటి మూటలవుతున్నాయి. మహోన్నత లక్ష్యాలతో చట్టసభలు ఆమోదించిన నిబంధనల నిర్వీర్యానికి యత్నించడం విచారకరం. ఇలాంటి పరిస్థితుల్లో- పర్యావరణ మంత్రిత్వ శాఖ పరిధిలోని పార్లమెంటరీ స్థాయీసంఘం ద్వారా సవరణ బిల్లును సమగ్రంగా సమీక్షించడం అవసరం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు, సూచనలనూ పరిగణనలోకి తీసుకోవాలి. ప్రత్యామ్నాయ అడవుల పెంపకంలో పారదర్శకతను పెంచాలి. ప్రస్తుతం అమలులో ఉన్న చట్ట నిబంధనలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలకు స్వస్తి పలకడం మంచిది. అడవుల సంరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేసేలా, ఆదివాసుల సంప్రదాయ హక్కులకు భరోసా కల్పించే రీతిలో చట్టాన్ని మెరుగుపరచడం శ్రేయస్కరం.


సిఫార్సులకు చోటేది?

పర్యావరణ, అటవీ చట్టాలపై 2014లో అత్యున్నత స్థాయి కమిటీ సమగ్ర అధ్యయనం జరిపి కొన్ని కీలక సిఫార్సులు చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న పర్యావరణ, అటవీ చట్టాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సూచించింది. అటవీ, పర్యావరణ అనుమతుల ప్రక్రియలో పారదర్శకత పెంచాలని తెలిపింది. అనుమతుల ప్రక్రియతో పాటు నిర్వహణలో పరిశ్రమలు, ప్రాజెక్టుల యాజమాన్యాలు హరిత చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్ర నేరంగా పరిగణించి శిక్షలు వేసే మార్పులు తీసుకురావాలని స్పష్టంచేసింది. కీలకమైన ఈ సూచనలను, సిఫార్సులను పక్కనపెట్టి- అటవీ సంరక్షణ చట్టానికి సవరణల పేరిట తూట్లు పొడవడం ఆందోళనకరం.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఎగుమతులకు చెల్లింపుల ఇక్కట్లు

‣ వైమానిక రవాణా.. అవకాశాల ఖజానా!

‣ భారత్‌ వ్యూహం.. ఉభయతారకం

‣ మలేసియాతో రక్షణ మైత్రి

‣ మానవతా దీప్తిశిఖ

‣ అణు ఇంధనంతో అంతరిక్ష యాత్రలు

Posted Date: 24-07-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం