• facebook
  • whatsapp
  • telegram

మానవతా దీప్తిశిఖ

అంతర్జాతీయ న్యాయ దినోత్సవం. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, మితిమీరిన విస్తరణ వాదం, నేతల నియంతృత్వం, తిరుగుబాటు మూకల దాష్టీకాల కారణంగా ప్రజలపై ఘోరమైన దమనకాండ కొనసాగుతోంది. చాలాచోట్ల మానవత్వం మంటగలుస్తోంది. వీటికి కారణమైన నేరగాళ్లను శిక్షించేందుకు అంతర్జాతీయ నేర న్యాయస్థానం(ఐసీసీ) కృషి చేస్తోంది.

రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరవాత, జర్మనీలోని నూన్‌బర్గ్‌లో అంతర్జాతీయ సైనిక ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసి నాజీ నేరగాళ్లను శిక్షించారు. అప్పుడే అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ) ఏర్పాటుకు అంకురారోపణ జరిగింది. 1998లో ఇదే రోజున 120 దేశాలు రోమ్‌ ఒడంబడికతో అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఏర్పాటుకు అంగీకారం తెలిపాయి. దాన్ని రూపొందించే కమిటీల్లో భారత్‌ చురుగ్గా పాల్గొంది. అయితే, ఇండియాతో పాటు అమెరికా, చైనాలు దానిపై సంతకం చేయలేదు. ఆ ఒడంబడికను 2002 జులై ఒకటిన 60 దేశాలు ఆమోదించడంతో ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రూర నేరాలకు పాల్పడిన వారిని శిక్షించడానికి అంతర్జాతీయ నేర న్యాయస్థానం పనిచేయడం ప్రారంభించింది. 2010 జూన్‌ ఒకటిన ఉగాండా రాజధాని కంపాలాలో జరిగిన సమావేశంలో జులై 17ను అంతర్జాతీయ న్యాయ దినోత్సవంగా పాటించాలని నిర్ణయించారు. ప్రస్తుతం 123 దేశాలు రోమ్‌ ఒడంబడికపై సంతకాలు చేశాయి.

యుద్ధ నేరాలకు బలైన వారికి న్యాయం చేయాలని, జాతి, మతం పేరుతో మనుషులపై జరిగే దమనకాండను నిలువ రించాలని అంతర్జాతీయ న్యాయ దినోత్సవం పిలుపి స్తోంది. ఇతర దేశాలపై సైనిక చర్యలనూ ఇది ఖండిస్తోంది. మానవ హక్కుల్ని హరించే వారిని శిక్షించడానికి ఏర్పడిన మొదటి స్వతంత్ర న్యాయ వ్యవస్థగా అంతర్జాతీయ నేర న్యాయస్థానాన్ని అభివర్ణించవచ్చు. ఇది కాంగోలో యుద్ధ నేరాలకు పాల్పడిన థామస్‌ లుబంగాకు  2012 జూలై 10న 14 ఏళ్ళ కారాగార శిక్ష విధించింది. ఉత్తర ఉగాండాలో లార్డ్స్‌ రెసిస్టెన్స్‌ తిరుగుబాటు దళం అధిపతిగా డొమినిక్‌    ఓన్‌గ్వెన్‌ పాల్పడిన నేరాలకు అతణ్ని దోషిగా తేల్చింది. బోస్నియన్‌ సెర్బ్‌ సైనిక కమాండర్‌ రాట్కో మ్లాడిచ్‌ యుగోస్లావియాలో 1990వ దశకంలో సాగించిన దమనకాండకు దోషిగా నిలబెట్టింది. సూడాన్‌ పూర్వ అధ్యక్షుడు ఒమర్‌ అహ్మద్‌ అల్‌ బషీర్‌ సహా 14 మంది నిందితులు అంతర్జాతీయ నేర న్యాయస్థానం అరెస్టు వారెంట్ల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారు. ఉక్రెయిన్‌లో తీవ్ర యుద్ధనేరాలకు పాల్పడినందుకు రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌పైనా అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఇటీవల అరెస్టు వారెంటు జారీ చేసింది.

అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఐక్యరాజ్య సమితిలో భాగం కాదు. స్థానికంగా మానవ హక్కులకు భంగం కలిగించే వారిని శిక్షించలేని, చర్యలు తీసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆయా దేశాలు అంతర్జాతీయ నేర న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాయి. ఇందులో 18 మంది న్యాయమూర్తులను తొమ్మిదేళ్ల కాలానికి ఎన్నుకొంటారు. స్వతంత్రంగా వ్యవహరించే ప్రాసిక్యూటర్‌ను తొమ్మిదేళ్ల కాలానికి నియమిస్తారు. అమానుష క్రూర చర్యలకు పాల్పడిన వారి నేరాలను నిరూపించే సాక్ష్యాధారాలను పరిశోధించి ప్రవేశపెట్టే బాధ్యత ప్రాసిక్యూటర్‌దే. అంతర్జాతీయ నేర న్యాయస్థానం అధ్యక్షుడిగా ప్రస్తుతం పోలాండ్‌కు చెందిన ప్యోటర్‌ హాఫ్‌మాన్‌స్కి పనిచేస్తున్నారు. కరీం ఎ.ఎ.ఖాన్‌ ప్రస్తుత ప్రాసిక్యూటర్‌. క్రూర నేరాల బారిన పడిన బాధితులకు సహాయపడటానికి వివిధ కార్యక్రమాలనూ ఈ న్యాయస్థానం చేపడుతోంది.

శాంతి భద్రతలకు ముప్పు కలిగించే వారికి ఒక హెచ్చరికగా, మానవ హక్కులపై ప్రపంచ దేశాల ప్రజలకు అవగాహన కల్పించడానికి ఒక అవకాశంగా ఏటా అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. మయన్మార్‌, దక్షిణ సూడాన్‌, ఇథియోపియా, యెమెన్‌ తదితర దేశాల ప్రజలు తమపై సాగిన, సాగుతున్న దమనకాండకు న్యాయం కోసం నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయ నేర న్యాయస్థానం మరింత సమర్థంగా పనిచేయడానికి సభ్య దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాలి. మానవత్వానికి ఎక్కడ హాని వాటిల్లినా అన్ని దేశాలు ముక్తకంఠంతో ఖండించాలి. దోషులకు సరైన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి. మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు నిరపరాధులై దురదృష్టంతో చెరసాలల్లో చిక్కేవాళ్లు, లోహ రాక్షసుల పదఘట్టనతో కొన ప్రాణంతో     కనలే వాళ్లందరికీ న్యాయం జరిగి, స్వాతంత్య్రం, సమభావం, సౌభ్రాతృత్వం జగమంతా నిండాలి. దారుణ ద్వేషాగ్ని పెంచే దానవత్వం నశించాలి. అందుకు ఈ రోజు స్ఫూర్తి నింపాలి. ఘోర నేరాల బాధితులకు అంతర్జాతీయ నేర న్యాయస్థానం మరింత ఆదరువుగా నిలవాలి.

- హరీశ్‌ కుమార్‌ కొలిచాల (న్యాయ నిపుణులు)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ రైతులు రెట్టింపు ధరలు పొందే వ్యూహం

‣ జీఎస్టీ మండలి సంస్కరణల పథం

‣ అంతరిక్ష అన్వేషణకు చంద్రయానం

‣ ప్రజలే సార్వభౌములు!

Posted Date: 17-07-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఇతరాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం