• facebook
  • whatsapp
  • telegram

ప్రజలే సార్వభౌములు!

‘భారత ప్రజలమైన మేము..’ అనే వాక్యంతో మన రాజ్యాంగ పీఠిక మొదలవుతుంది. పౌరులే ఈ దేశానికి సార్వభౌములనే రాజ్యాంగ సూత్రీకరణను ఇన్నేళ్ల స్వతంత్రంలోనూ పాలకులు ఒంటపట్టించుకోలేదు. పౌరులు సార్వభౌములు కాకపోతే రాజ్యాంగానికి అర్థమేముంది? రాజ్యాంగం ప్రహసనంగా మిగిలినట్లు కాదా?

భారత్‌లో మన ప్రజాప్రతినిధుల్లో ఎంతమంది తమను ఎన్నుకున్న ప్రజలకు అసలు సిసలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. ఎవరైనా పౌరుడు తన సమస్యను చెప్పుకొంటే దాన్ని పరిష్కరించడానికి ఎంతమంది ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో కృషిచేస్తున్నారు.. పౌరుడు కోరింది నెరవేర్చాలనే చట్టపరమైన బాధ్యతను ఎంతమంది ప్రజాప్రతినిధులు, అధికారులు నెరవేరుస్తున్నారు? అలాంటివారెవరూ దాదాపు లేరన్నదే ఈ ప్రశ్నలకు సమాధానం. నిజానికి, మన వద్ద ఉన్నది అసలైన ప్రజాస్వామ్యం కాదు- దాని పేరిట నడుస్తున్న నాటకం మాత్రమే! పౌరులు అడిగినదానికి లేదు, కాదు అని సమాధానం చెప్పడం ద్వారానే ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు అధికారం చలాయించగలుగుతున్నారు. పౌరుల వినతులను మొరటుగానో, మర్యాదగానో తోసిపుచ్చడం వారి సహజ స్వభావంగా మారింది. పౌరుల రాజ్యాంగబద్ధ అధికారాలను వారు అలా కాలరాస్తున్నారు.

ప్రజాసేవ గాలికి..

ప్రజలు, సమాచార సాధనాలు పూర్తి మద్దతు ఇచ్చినా తమ ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయించడానికి మహిళా మల్లయోధులు ఎన్ని తంటాలు పడాల్సి వచ్చిందో చూశాం. ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడానికి పోలీసులకు ఇంత సమయం ఎందుకు పట్టిందో ఎవరూ పట్టించుకోలేదు. పౌరుడే సార్వభౌముడని, అతడు లేక ఆమె ఏదైనా సమస్యను ప్రస్తావిస్తే వెంటనే దాని పరిష్కారానికి పూనుకోవాలని పాలకులు, ప్రభుత్వాధికారులు ఏ మాత్రం అనుకోవడం లేదు. ఈ బాధ్యతారాహిత్యం వారి నరనరాల్లో జీర్ణించుకుపోయింది. రోగానికి మందు వేయకుండా రోగ లక్షణాల నుంచి తాత్కాలికంగా ఉపశమనం కల్పించడమే ఒక ఘనకార్యంగా పాలకులు, అధికారులు చాటింపు వేసుకుంటున్నారు. ప్రత్యామ్నాయ పరిష్కారాలంటూ ఏవైనా ఉంటే, అవి నిజంగా ప్రజలకు అందుబాటులోకి రావాలి. అంతే తప్ప ప్రజాప్రతినిధులు, అధికారులు తమ బాధ్యతను ఎగ్గొట్టడానికి ఉపకరించే సాధనాలుగా అవి మారకూడదు.

ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో మీరు దరఖాస్తు పత్రాన్ని ఎర్ర సిరాతో రాసి ఇస్తే, అక్కడి సిబ్బంది దాన్ని అస్సలు అంగీకరించరు. మీరు ఏ సిరాతో రాసినా దరఖాస్తును ప్రభుత్వ సిబ్బంది ఆమోదించాల్సిందే. ప్రభుత్వ గుమాస్తా దృష్టిలో పై అధికారులు మాత్రమే ఎర్ర సిరాతో రాయాలి. సంతకం పెట్టాలి. అందుకే నిజమైన సార్వభౌములైన సామాన్య పౌరులు ఎర్ర సిరాతో నింపిన దరఖాస్తు పత్రాన్ని వెంటనే తోసిపుచ్చుతారు. ఏతావతా భారత సార్వభౌములైన ప్రజలు తమకు సేవ చేయాల్సినవారి అడుగులకు మడుగులొత్తాల్సిన దుర్భర స్థితి దేశీయంగా నెలకొంది. దీనిపై ఎవరైనా సంబంధిత కార్యాలయం వద్ద నిరసన తెలిపితే, బయటకు గెంటేస్తారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరినవారికి ఎదురైన అనుభవమిది. ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను నిలదీసే హక్కును ఇచ్చిన ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసే మార్గాలను మన ఉద్యోగులు, అధికారులు కనుగొన్నారు. పౌరుల చట్టబద్ధమైన కోర్కెలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉంది. వారిద్దరూ చేతులు కలిపి పౌరుల మాట సాగనీయకుండా చేస్తున్నారు. పౌరులు అడిగింది చేయకుండా మొరాయిస్తున్నారు. గట్టిగా నిలదీస్తే వేధిస్తున్నారు.

మనకు 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి స్వాతంత్య్రం వచ్చింది. ఆ పైన రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకున్నాం. 1952లో తొలి లోక్‌సభ సమావేశమైంది. ఇంకేముంది... బ్రిటిష్‌వారి నుంచి అధికారం మన చేతికి బదిలీ అయిందని మురిసిపోయాం. అది వట్టి భ్రమ అని త్వరలోనే తేలిపోయింది. భారత్‌లో అధికారం తెల్లవాడి చేతి నుంచి నల్లదొరల చేతికి బదిలీ అయిందే తప్ప సామాన్య పౌరులకు కాదు. ఒకప్పుడు రాజులు, మహారాజులు దేశాలను ఏలితే, ఇప్పుడు వారికి ఏమాత్రం తీసిపోని దర్పంతో ప్రజాప్రతినిధులమని చెప్పుకొనేవారు రాజ్యం చేస్తున్నారు. ప్రభుత్వోద్యోగులు వారి సేవలో తరిస్తూ, ప్రజా సేవను గాలికి వదిలేశారు.

మార్చే అవకాశం ఏదీ?

భారత్‌లో అయిదేళ్లకు ఒకసారి ఎన్నికల తంతు జరుగుతుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు చట్టాలు చేస్తే, వాటిని అమలు చేసే బాధ్యత ఉద్యోగ, అధికార గణానిది. ప్రభుత్వాలు మారినా చిరుత    పులికి ఉండే మచ్చల్లాగా వీరు మాత్రం మారడంలేదు. వీరితో పని చేయించాలంటే ఒక వ్యక్తి వల్ల కాదు. కొందరు పౌరులు బృందంగా ఏర్పడి గట్టిగా దబాయిస్తూ, ధర్నాలు నిరసనలు చేస్తే తప్ప అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోరు. నిజమైన న్యాయపాలన ఉన్నచోట సాధారణ పౌరుడు సైతం తన సమస్యను వ్యక్తిగతంగానే పరిష్కరించుకోగలుగుతాడు. ప్రజలకు తాము ఎన్నుకున్న ప్రతినిధులను అయిదేళ్లకు ఒకసారి మార్చే అధికారం ఉంది. అయితే, అధికారులను మార్చే అవకాశం లేదు. దాంతో ప్రజాభీష్టాన్ని పాటించాలన్న ఒత్తిడి  ప్రజాస్వామ్యంలోని మూల స్తంభమైన ప్రభుత్వ యంత్రాంగంపై ఉండటం లేదు. పౌరులకు, ప్రజాప్రతినిధులకు మధ్య వారధిలా ఉండాల్సిన రాజకీయ పార్టీలు అధికార దళారులుగా మిగిలిపోతున్నాయి. భారత రాజ్యాంగానికి సంరక్షకులు ఎవరంటే న్యాయ వ్యవస్థ అనే జవాబు వస్తుంది తప్ప, ఈ దేశ సార్వభౌములైన ప్రజలు అనే సమాధానం రాదు. ఆ స్ఫూర్తి మనసా వాచా కర్మణా అమలైతే తప్ప ఈ దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం నెలకొనదు.

అసాధ్యమైన విషయం

భారత్‌లో ప్రభుత్వాధికారితో వాదనకు దిగితే అతడు మీకు మరిన్ని సమస్యలు సృష్టిస్తాడనేది అందరికీ తెలిసిందే. ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇంతలా పెత్తనం చలాయించడానికి కారణం, మనం వారి ముందు అణిగిమణిగి ఉండటం కాదా? ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడానికి ఉన్నతాధికారుల వద్దకు వెళ్ళగలగడం భారత్‌లో నేడు అసాధ్యమైన విషయంగా మారింది. పై అంచెలో ఉన్న అధికారిని కలవాలంటే మొదట సచివాలయంలోకి అడుగు పెట్టడమే అసాధారణ అంశంగా పరిణమించింది. సదరు అధికారి తన సిబ్బంది ద్వారా భద్రతా విభాగానికి చెబితే తప్ప ఫిర్యాదుదారు లోనికి వెళ్ళడానికి అనుమతి(పాస్‌) ఇవ్వరు. ఉన్నతాధికారితో మొదటే సంబంధాలున్నవారికైతే సులువుగా అనుమతి లభిస్తుంది. పలుకుబడి కలిగిన ఘరానా మనుషులు స్వేచ్ఛగా అధికారులను కలిసి వస్తుంటారు. నిజమైన సార్వభౌములైన సామాన్య ప్రజలకు మాత్రం ఆ భాగ్యం లభించడం లేదు.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ జనశక్తే ఆర్థిక వృద్ధికి బలిమిగా..

‣ జనశక్తే ఆర్థిక వృద్ధికి బలిమిగా..

‣ సమతా భారత్‌కు ఉమ్మడి పౌరస్మృతి

‣ వ్యర్థాలతో అర్థం.. దేశానికి సౌభాగ్యం

Posted Date: 17-07-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం