• facebook
  • whatsapp
  • telegram

సమతా భారత్‌కు ఉమ్మడి పౌరస్మృతి

భారతదేశం భిన్న సంస్కృతులు, మతాలకు నిలయం. వివాహం, విడాకులు, దత్తత, వారసత్వం తదితర అంశాలకు సంబంధించి ప్రతి మతానికీ సొంత చట్టాలు ఉన్నాయి. భిన్నత్వంతో ప్రకాశించే మన దేశంలో అందరికీ ఒకే న్యాయాన్ని అందించడానికి వీలు కల్పించే ఉమ్మడి పౌరస్మృతి లేదు. దాంతో అసమానతలు శాశ్వతంగా పాతుకుపోతున్నాయి. ఉమ్మడి పౌరస్మృతి లేకపోవడం- సామాజిక సౌభ్రాతృత్వానికి ఆర్థిక, స్త్రీ-పురుష సమానత్వ సాధనకు పెద్ద అవరోధం.

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల- వివిధ వర్గాల పౌరులకు వేర్వేరు చట్టాలను అమలు చేయడాన్ని ఆక్షేపిస్తూ, ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని నొక్కి చెప్పారు. దీని ఆవశ్యకతపై రాజ్యాంగ సభలోనే చర్చలు జరిగాయి. వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు సైతం ఉమ్మడి పౌరస్మృతి ఆవశ్యకత గురించి వ్యాఖ్యానించింది. ఉమ్మడి పౌరస్మృతి మనకు ఎంతో అవసరమని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగ సభలో బలంగా వాదించారు. సాంఘిక దురాచారాలను అరికట్టడానికి, స్త్రీ-పురుష సమానత్వ సాధనకు ఇది ఎంతో ముఖ్యమని ఆయన స్పష్టీకరించారు.

సుదీర్ఘ చర్చ..

రాజ్యాంగ సభలో కొంతమంది సభ్యులు ఉమ్మడి పౌరస్మృతి యోచనను వ్యతిరేకించినప్పుడు బాబాసాహెబ్‌ సమాధానం చెబుతూ- ‘జీవితంలోని ప్రతి అంశాన్నీ ఆక్రమించేంతటి విస్తృత అధికారం మతానికి ఎందుకు ఇవ్వాలో నాకు అర్థం కాలేదు. దాని స్థానంలో శాసనాధికారం ఎందుకు ఉండకూడదు? అసలు మనకు సంక్రమించిన ఈ స్వేచ్ఛ ఎందుకు? మన ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్న అసమానతలను, దుర్విచక్షణతో నిండిపోయిన మన సాంఘిక వ్యవస్థను సంస్కరించుకునేందుకే ఈ స్వేచ్ఛ’ అని స్పష్టం చేశారు. రాజ్యాంగ సభలో అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌, కె.ఎం.మున్షీ వంటి ప్రముఖ కోవిదులు కూడా ఉమ్మడి పౌరస్మృతి ఆవశ్యకతను సమర్థించారు. దీన్ని తీసుకురావాలని సూచిస్తున్న ముసాయిదా అధికరణపై రాజ్యాంగ సభలో చర్చ సందర్భంగా కొందరు సభ్యులు వ్యతిరేకించగా దానిపై అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌ స్పందించారు. ‘వాస్తవానికి ఈ అధికరణ లక్ష్యమే సౌభ్రాతృత్వం. ఈ వ్యవహారాల్లో అందరికీ వర్తించేలా ఉమ్మడి అంగీకార సూత్రం తీసుకురావడానికి ప్రయత్నించడమే ఈ అధికరణ లక్ష్యం’ అని ఆయన స్పష్టం చేశారు.   కె.ఎం.మున్షీ సైతం ఉమ్మడి పౌరస్మృతిని సమర్థిస్తూ- ‘కాలక్రమంలో దేశం యావత్తు జీవితాన్ని ఏకరూపంలోకి మార్చేలా, లౌకికంగా ఉండేలా చేయడానికి వ్యక్తిగత చట్టాలను ఏకీకృతం చేస్తామా అన్నదే ముఖ్యమైన అంశం. అసలు జీవితానికి సంబంధించిన అంశాలకూ మతానికీ సంబంధం ఏమిటో నాకు అర్థం కావడం లేదు’ అని ఆయన అన్నారు. అయితే, ఉమ్మడి పౌరస్మృతిపై రాజ్యాంగ సభ ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. దాంతో ఈ అంశాన్ని ఆదేశిక సూత్రాల్లోని 44వ అధికరణ కింద చేర్చారు. మత విశ్వాసాలు, ఆచారాలు, మతచట్టాలకు అతీతంగా దేశంలోని పౌరులందరికీ వర్తించేలా ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావాలని ఈ అధికరణ స్పష్టం చేస్తోంది. సర్వోన్నత న్యాయస్థానం కూడా పలు సందర్భాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించింది. 44వ అధికరణ నిరుపయోగంగా పడి ఉందని షాబానో కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశ సమైక్యతకు ఉమ్మడి పౌరస్మృతి ఉపయోగపడగలదని అభిప్రాయపడింది. ‘రాజ్యాంగ ప్రాధాన్యక్రమాన్ని అనుసరించి మతస్వేచ్ఛ హక్కును పార్ట్‌-3 (ప్రాథమిక హక్కులు)లోని నిబంధనల ఉద్దేశానికి అనుగుణంగా మాత్రమే ఉపయోగించుకోవాలి’ అని ద యంగ్‌లాయర్స్‌ అసోసియేషన్‌ కేసు(2018) తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది. పలు కేసుల్లో ఈ అంశంపై సుప్రీంకోర్టు తన అభిప్రాయాలను స్పష్టంగా వెలిబుచ్చినప్పటికీ, శాసనాధికారం పార్లమెంటుకే ఉన్న సంగతిని గమనంలోకి తీసుకుని ప్రభుత్వానికి ఎటువంటి ఆదేశాలూ జారీ చేయలేదు. పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడానికి, సాంఘిక అసమానతలు, స్త్రీ-పురుష అసమానత్వాన్ని తగ్గించడానికి ఉమ్మడి పౌరస్మృతి ఎప్పటినుంచో ప్రతిపాదనగానే ఉండిపోయింది. దాన్ని అమలులోకి తీసుకురావాలనుకోవడం సరైన ముందడుగు.

డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌, రాజ్యాంగ పరిషత్‌లోని ఇతర కోవిదులు ప్రతిపాదించినట్లుగా- మహిళలకు సాధికారత కల్పించడానికి, వివాహం, విడాకులు, వారసత్వ విషయాల్లో స్త్రీ-పురుష సమానత్వ సాధనకు... వ్యక్తిగత విషయాలను స్పృశించే చట్టాల్లో ఏకరూపత అత్యంత అవసరం. మహిళల హక్కులకు భంగం కలిగించే చర్యలను ఉమ్మడి పౌరస్మృతి అరికడుతుంది. వారికి సమాన అవకాశాలు, రక్షణ కల్పిస్తుంది. సామాజిక ఐక్యతను, జాతీయ సమగ్రతను పెంపొందించడానికి, భిన్న సంస్కృతులతో కూడిన మన సమాజానికి ఏకీకృత చట్ట పరిధి అవసరం.

రాజ్యాంగమే ధ్రువతార

దేశంలో నెలకొన్న సవాళ్లను రాజ్యాంగ నిర్మాతలు గుర్తించి, అంతరాలను పూడ్చడానికి, భిన్న వర్గాల మధ్య ఏకత్వ సాధనకు ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని నొక్కి చెప్పారు. మతాలకు అనుబంధంగా ఉన్న వ్యక్తిగత చట్టాలకు రెండు విధాల ఆమోదయోగ్యత ఉండాలి. ఒకటి: అవి రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉండాలి. రెండు: స్త్రీ-పురుష సమానత్వ నిబంధనలు, గౌరవప్రదంగా జీవించే హక్కుకు అనుగుణంగా ఉండాలి. ఈ విషయంలో మార్గదర్శనం చేసే రాజ్యాంగమే మనకు ధ్రువతార. న్యాయం, స్త్రీ-పురుష సమానత్వం, లౌకికత్వ సూత్రాలపై రాజ్యాంగం స్పష్టతనిచ్చింది. వీటన్నింటి సమాహారమే ఉమ్మడి పౌరస్మృతికి పునాది. చివరగా నేను దేశ ప్రజలకు, వివిధ పార్టీలకు మత వర్గాలకు విజ్ఞప్తి చేసేదేమిటంటే- విభేదాలకు అతీతంగా అందరూ ఉమ్మడి పౌరస్మృతి అమలుకు మద్దతు తెలపాలి. మానవ హక్కుల సమానత్వానికి భరోసా కల్పించే ఈ అభ్యుదయ చట్టాన్ని అమలులోకి తీసుకురావడానికి పౌరులందరి భాగస్వామ్యం అవసరం. మన జాతి నిర్మాతల దార్శనికతకు స్పష్టమైన రూపాన్ని ఇచ్చే ఉమ్మడి పౌరస్మృతిని... సామాజిక సంస్కరణ సాధనంగా, రాజ్యాంగం నిర్దేశించినట్లు న్యాయ-సమానత్వ సూత్రాలకు పూర్తి అనుగుణంగా ఉండే చట్టపరమైన పరిధిగా మలచడానికి పౌరులు కృషి చేయాలి. మనమందరం కోరుకుంటున్న కొత్త సమతా, సమ్మిళత భారత్‌ నిర్మాణంలో ఉమ్మడి పౌరస్మృతి ఒక గొప్ప ముందడుగు అవుతుంది.

భయాందోళనలను పోగొట్టాలి

రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా, సుప్రీంకోర్టు తీర్పులను ప్రతిఫలించే విధంగా ఒక ఏకీకృత చట్టపరిధిని తీసుకొచ్చే ప్రయత్నంగానే ఉమ్మడి పౌరస్మృతిని చూడాలి. ఈ అంశంపై కొందరిలో సందేహాలు, నిరాధార భయాందోళనలు నెలకొన్నాయి. ఆ కారణంగా వ్యక్తమవుతున్న వ్యతిరేకతను విజ్ఞానదాయకమైన చర్చ, నిర్మాణాత్మక భాగస్వామ్యం ద్వారా పోగొట్టాలి. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను ప్రతి ఒక్కరూ అనుభవించగలగడం, స్త్రీ-పురుష అసమానతలు లేకుండా చూడటం, పౌరులందరికీ చట్టాలు ఏకరూపంలో ఉండేలా చేయడమే- ఉమ్మడి పౌరస్మృతి అసలు లక్ష్యం. దేశ ప్రజలందరికీ సమానత్వం, న్యాయం అందించడానికి ఒక శక్తిమంతమైన సాధనంగా ఇది పనిచేస్తుంది. అందుకే పౌరులందరూ ఉమ్మడి పౌరస్మృతిని స్వాగతించాలి.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వ్యర్థాలతో అర్థం.. దేశానికి సౌభాగ్యం

‣ రూపాయి బలపడితేనే..

‣ పోషణ కొరవడుతున్న భారతం

‣ అగ్రరాజ్యంతో బంధం బలోపేతం

‣ కైరోతో వ్యూహాత్మక భాగస్వామ్యం

Posted Date: 07-07-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం