• facebook
  • whatsapp
  • telegram

కైరోతో వ్యూహాత్మక భాగస్వామ్యం

భారత్‌, ఈజిప్టులది సుదీర్ఘ స్నేహబంధం. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా, రష్యాల్లో ఏదో ఒకదానివైపు మొగ్గుచూపక తప్పని పరిస్థితుల్లో అలీన విధానంతో ప్రపంచ దేశాలకు దారిచూపాయి. తమ స్నేహబంధాన్ని మరింత పరిపుష్టం చేసుకునే దిశగా దిల్లీ కైరోలు ఇప్పుడు సరికొత్త అడుగులు వేస్తున్నాయి.

అరబ్‌ ప్రపంచంలో ఇండియాకు విశ్వసనీయ మిత్రదేశాల్లో ఈజిప్టు ఒకటి. స్వాతంత్య్రం సిద్ధించిన వెంటనే మనదేశం కైరోతో దౌత్య సంబంధాలు నెలకొల్పుకొంది. 1955లో మైత్రీ ఒడంబడిక ద్వారా ఇరుదేశాలు పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో అలీనోద్యమానికి నాయకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్నాయి. తరవాతి కాలంలో క్రమంగా దూరం పెరిగింది. సరళీకరణ తరవాత భారత్‌ తన విదేశాంగ విధానాల్లో కైరోకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. 2014లో ఈజిప్టులో అబ్దెల్‌ ఫతా అల్‌-సిసి, ఇండియాలో మోదీ అధికార పగ్గాలు దక్కించుకున్న తరవాత పరిస్థితులు మెరుగుపడ్డాయి. పాత స్నేహ బంధానికి తిరిగి జీవం పోశారు. రెండేళ్లుగా ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో గణనీయ పురోగతి కనిపిస్తోంది. ఈజిప్టు నుంచి ఇండియా ముడిచమురు, ద్రవీకృత సహజవాయువు, నూనెగింజలను ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. కైరోకు దిల్లీ ప్రధానంగా నూలు, కాఫీ, పొగాకు, వాహనాల విడిభాగాలు, నౌకలు, పడవలు, విద్యుత్తు యంత్రాలను ఎగుమతి చేస్తోంది. ఈ ఏడాది భారత గణతంత్ర వేడుకలకు అల్‌-సిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భారత్‌-ఈజిప్టు బంధాన్ని ‘వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచుకోవాలని అప్పట్లో నిర్ణయించారు. తాజాగా ప్రధాని మోదీ ఈజిప్టు పర్యటనలో సంబంధిత ఒప్పందంపై సంతకాల ప్రక్రియ పూర్తయింది. 1997 తరవాత భారత ప్రధానమంత్రి ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. సర్వత్రా ఆసక్తి రేకెత్తించిన ఈ పర్యటనలో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని మోదీకి అందజేయడం ద్వారా దిల్లీతో మెరుగైన మైత్రిని బలంగా కోరుకుంటున్నట్లు అల్‌-సిసి చాటిచెప్పారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, పునరుత్పాదక ఇంధనం, సాంస్కృతిక రంగాల్లో పరస్పర సహకారం పెంపుపై విస్తృతంగా చర్చించారు. వ్యవసాయం తదితర రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదిరాయి. తాజా పర్యటనలో మోదీ ఈజిప్టులోని ప్రఖ్యాత అల్‌-హకీం మసీదును సందర్శించారు. ఆ దేశ గ్రాండ్‌ ముఫ్తీతో భేటీ జరపడం ద్వారా ముస్లిం మెజారిటీ దేశాలకు బలమైన సందేశాన్ని పంపినట్లయింది.

ఈజిప్టులో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం నెలకొంది. విదేశమారకద్రవ్య నిల్వలు భారీగా పడిపోయాయి. ద్రవ్యోల్బణం చుక్కలనంటుతోంది. కొవిడ్‌ మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా సరఫరా గొలుసులు తెగిపోవడంతో ఆ దేశ ప్రజలు అల్లాడారు. కైరో దిగుమతి చేసుకునే ధాన్యంలో దాదాపు 80 శాతం రష్యా, ఉక్రెయిన్‌ల నుంచే వస్తుంది. యుద్ధం వల్ల సరఫరా నిలిచిపోవడంతో దేశ ఆహార భద్రత ప్రమాదంలో పడింది. ఆ సమయంలో ఇండియా ఆపన్నహస్తం అందించింది. నిరుడు ఎగుమతులపై ఆంక్షలను పక్కనపెట్టి కైరోకు గోధుమలు పంపించింది. ప్రస్తుత ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడంలో దిల్లీ సహకరిస్తుందని, తమ దేశంలో పెట్టుబడులు పెంచుతుందని కైరో ఆశిస్తోంది. ‘సూయజ్‌ కాలువ ఆర్థిక మండలి’ కోసం భారత పారిశ్రామిక పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. శక్తిమంతమైన బ్రిక్స్‌ కూటమిలో సభ్యత్వం కోసం ఇండియా సహకారాన్ని కోరుకుంటోంది.

ప్రపంచ రోజువారీ వాణిజ్య రవాణాలో 12శాతం ఈజిప్టు నియంత్రణలోని సూయెజ్‌ కాలువ ద్వారానే జరుగుతుంటుంది. అందుకని కైరోతో దిల్లీకి బలమైన స్నేహం అవసరం. ఐరోపా, ఆఫ్రికా మార్కెట్లకు దాన్ని ప్రవేశమార్గంగా ఇండియా ఉపయోగించుకోవచ్చు. మరోవైపు- అభివృద్ధి చెందని దేశాలకు నాయకత్వం వహించాలని, అంతర్జాతీయ వేదికలపై వాటి వాణిని బలంగా వినిపించాలని భారత్‌ కోరుకుంటోంది. అందుకు ఈజిప్టు సహకారం అవసరం. పశ్చిమాసియా- ఉత్తరాఫ్రికా ప్రాంతంలో పట్టు పెంచుకునేందుకూ దాని స్నేహం దోహదపడుతుంది. భారత్‌ అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధవిమానం ‘తేజస్‌’ కొనుగోలుకు కైరో ఆసక్తిగా ఉంది. ప్రస్తుతం ఈజిప్టుపై ఇండియాతో పోలిస్తే చైనా ప్రభావమే ఎక్కువ. ఇస్లామిక్‌ సహకార సంస్థ(ఓఐసీ) వంటి వేదికల్లో పాకిస్థాన్‌ను నిలువరించేందుకూ ఈజిప్టు మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో ఇండియా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. పరస్పర సహకారంతో ముందుకు సాగడం ఇరుదేశాలకూ ఉపయుక్తం.

- శ్రీయాన్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఏవీ నాటి పార్లమెంటరీ ప్రమాణాలు?

‣ ఆరావళిని దోచేస్తున్నారు!

‣ అభివృద్ధి కార్యక్రమాలకు జనగణనే పునాది

‣ భారత అమ్ములపొదిలో డ్రోన్ల సంపత్తి

Posted Date: 03-07-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం