• facebook
  • whatsapp
  • telegram

అభివృద్ధి కార్యక్రమాలకు జనగణనే పునాది

జాతీయ గణాంక దినోత్సవం. భారత్‌లో దశాబ్దానికి ఒకసారి బృహత్తర జనగణన నిర్వహిస్తున్నారు. 2021లో జరగాల్సిన జనగణన మాత్రం పదేపదే వాయిదా పడుతోంది. కొవిడ్‌ కారణంగా భారత్‌లో జనగణన వాయిదా పడిందని చెబుతున్నా- అమెరికా, చైనా, బ్రిటన్‌, బంగ్లాదేశ్‌, నేపాల్‌ వంటివి మహమ్మారికి వెరవకుండా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాయి. ఇండియాలో 2024 లోక్‌సభ ఎన్నికల తరవాతే జనగణన చేపట్టవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికలు ముగిసేదాకా వెనకబడిన కులాల గణనను వాయిదా వేయాలని ప్రభుత్వం భావించడమే జనగణనలో అసాధారణ జాప్యానికి కారణమనే వాదన వినిపిస్తోంది. ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందడంలేదనే అంశాలు బయటపడతాయేమోనన్న ఆందోళనా జనగణన వాయిదాకు కారణం కావచ్చునని అంటున్నారు. ఈ వాదనలు, ఆరోపణల మధ్య అసలు నిజం ఏమిటనేది ప్రభుత్వమూ వెల్లడించడం లేదు. గణాంక సమాచారంలో రాజకీయ జోక్యాన్ని కట్టిపెట్టాలని కోరుతూ 2019లో 108 మంది ఆర్థిక, సామాజికవేత్తలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 2017-18లో కార్మిక బలగం సర్వే సమాచారాన్ని విడుదల చేయడానికి కేంద్రం నిరాకరించినందుకు నిరసనగా జాతీయ గణాంక కమిషన్‌ సభ్యులిద్దరు రాజీనామా చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తరవాతే ఆ సర్వే నివేదిక విడుదలైంది. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్ర స్థాయికి చేరిందని ఆ సర్వే వెల్లడించింది. 2017-18లో గ్రామాల్లో వస్తుసేవలకు గిరాకీ పడిపోయినట్లు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) సర్వే బయటపెట్టడంతో ఆ నివేదికను కేంద్రం తోసిపుచ్చింది.

శాస్త్రీయ పద్ధతిలో సర్వేలు

జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) తన నివేదికను మూడేళ్లు ఆలస్యంగా 2016లో విడుదల చేసినా, తాను సేకరించిన మొత్తం సమాచారాన్ని అందులో పొందుపరచలేదు. మూకల చేతిలో హత్యలు, ఖాప్‌ పంచాయతీల ఉత్తర్వులపై జరిగిన పరువు హత్యల గణాంకాలను అది వెల్లడించలేదు. అదేవిధంగా రైతుల ఆత్మహత్యల గణాంకాలను ఎన్‌సీఆర్‌బీ మూడేళ్లు ఆలస్యంగా ప్రచురించినా, ఆత్మహత్యలకు కారణాలను మాత్రం తెలియజెప్పలేదు. మరోవైపు, వెనకబడిన తరగతుల సంక్షేమ కార్యక్రమాలకు కులగణన సమాచారం ఎంతో తోడ్పడుతుందన్న విషయాన్ని విస్మరించకూడదు.

కేంద్ర గణాంక కార్యాలయం 2015లో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణనకు ప్రాతిపదిక సంవత్సరాన్ని 2004-05 నుంచి 2011-12కు మార్చింది. అందువల్లే జీడీపీ వృద్ధిరేటు ఉన్న దానికన్నా ఎక్కువగా కనిపిస్తోందనే విమర్శలు వచ్చాయి. ఈ మార్పు వల్ల యూపీఏ ప్రభుత్వంలోకన్నా ఎన్‌డీఏ ప్రభుత్వంలో ఎక్కువ అభివృద్ధి సాధించినట్లు చూపడం వీలైంది. ప్రభుత్వం జీడీపీ వృద్ధిరేటును ఏడు శాతంగా చూపుతున్నా, నిజానికి అది 4.5శాతమేనని విమర్శలు వెలు వడ్డాయి. యూపీఏ హయాములో స్థూల పెట్టుబడులు, జీడీపీ నిష్పత్తి అత్యధికంగా 38శాతంగా ఉంది. ఎన్‌డీఏ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరవాత నాలుగేళ్లలో ఈ నిష్పత్తి 30.3శాతానికి పడిపోయింది. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ వల్లనే ఈ నిష్పత్తి దెబ్బతిన్నదని ఆర్థికవేత్తలు వివరించారు. ఎన్‌డీఏ-2 హయాములో బ్యాంకుల నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) పెరుగుదలకూ ఇదే కారణం. కేంద్ర గణాంక కార్యాలయ సమాచారంలో నీతి ఆయోగ్‌ జోక్యం చేసుకోవడంపై నిరసన వ్యక్తమైంది.

జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) 1950లో ఏర్పాటైంది. భారత్‌లో గణాంక శాస్త్ర పితామహుడు పీసీ మహలనోబిస్‌ సూచన మేరకు ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ నెలకొల్పిన ఈ సంస్థ దశాబ్దాల పర్యంతం ప్రభుత్వ అజమాయిషీతో నిమిత్తం లేకుండా స్వతంత్రంగా విధులు నిర్వర్తిస్తూ వచ్చింది. శాస్త్రీయ పద్ధతిలో నమూనా సర్వేలు నిర్వహించింది. 1999లో ఎన్‌ఎస్‌ఎస్‌ఓను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల నిర్వహణ మంత్రిత్వ శాఖ పరిధిలోకి తెచ్చినా, కార్యనిర్వహణ స్వేచ్ఛను అట్టిపెట్టుకుంది. ఎన్‌ఎస్‌ఎస్‌ఓ అందించే విశ్వసనీయ సమాచారం అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనకు, కొత్త సమస్యలను గుర్తించి పరిష్కారం కనుగొనడానికి విధానకర్తలకు, ఆర్థికవేత్తలకు ఎంతో ఉపకరించేది. 2015 నుంచి పరిస్థితి మారింది. ప్రభుత్వ పరిధిలో పనిచేయాల్సిన పరిస్థితి ఎన్‌ఎస్‌ఎస్‌ఓకు ఏర్పడింది. అది వివిధ గణాంక సంస్థలపై, అవి ఇచ్చే సమాచారంపై నమ్మకం సడలడానికి దారితీసింది. 2019 మే 23న ప్రభుత్వం రెండు జాతీయ గణాంక సంస్థలను విలీనం చేసింది. ఎన్‌ఎస్‌ఎస్‌ఓను కేంద్ర గణాంక కార్యాలయం (సీఎస్‌ఓ)తో విలీనం చేసి జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) అనే కొత్త సమగ్ర సంస్థను ఏర్పాటు చేసింది.

విశ్వసనీయత కీలకం

ఆధునిక డిజిటల్‌ ప్రపంచంలో కృత్రిమ మేధకు, మరేదైనా నవీన సాంకేతికతకు సమాచారమే (డేటా) ఊపిరి. గణాంక సమాచారం డేటాలో అతి కీలక భాగం. కాబట్టి జాతీయ గణాంక యంత్రాంగం విశ్వసనీయతను పెంచడం అవసరం. భారత్‌కు సంబంధించిన గణాంక సమాచారాన్ని స్వతంత్ర సంస్థలు సేకరించాలని, అవి ఏదైనా మంత్రిత్వ శాఖ కార్యదర్శికి కాకుండా నేరుగా పార్లమెంటుకే జవాబుదారీగా ఉండాలని 2001లో రంగరాజన్‌ కమిషన్‌ సిఫార్సు చేసింది. దీన్ని తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉంది. జాతీయ గణాంక కమిషన్‌ (ఎన్‌ఎస్‌సీ)కి చట్టబద్ధ ప్రతిపత్తినిచ్చి పూర్తికాలం పటిష్ఠంగా పనిచేసే సంస్థగా రూపుదిద్దాలి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌సీ తాత్కాలిక అధ్యక్షుడు, సభ్యులతో పరిమిత కాల కమిషన్‌గా ఉంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. జనగణనను, అధికార కుటుంబ వ్యయ సర్వేను నిర్ణీత కాలవ్యవధిలో నిర్వహించి ఫలితాలను ప్రజలకు విడుదల చేయాలి. సకాలంలో జనగణన నిర్వహించి తాజా సమాచారాన్ని సేకరించకపోతే పేదలకు సంక్షేమ ఫలాలను అందించడం కష్టతరమవుతుంది.

వనరుల కేటాయింపులు

జనగణన సమాచారం ఆధారంగా బడ్జెట్‌ నిధులు, ఇతర వనరుల కేటాయింపులు, నియోజకవర్గాల హద్దుల నిర్ణయం, రాజకీయ ప్రాతినిధ్యం, అభివృద్ధి ప్రణాళికల రచన జరుగుతాయి. గ్రామ, పట్టణ, వార్డు స్థాయుల్లో ప్రాథమిక సమాచారాన్ని జనగణన అందిస్తుంది. 1990ల్లో భారత్‌లో లింగ నిష్పత్తి దెబ్బతింటోందని జనగణన ద్వారానే తెలిసివచ్చింది. ఫలితంగా గర్భంలోనే ఆడ శిశువుల హననాన్ని ప్రభుత్వం నిషేధించింది. బేటీ బచావో, బేటీ పఢావో వంటి కార్యక్రమాలకు జనగణనే ప్రేరణనిచ్చింది. ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌)కు, ఆహార భద్రతా చట్టానికి జనగణన సమాచారమే ప్రాతిపదిక.
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ భారత అమ్ములపొదిలో డ్రోన్ల సంపత్తి

‣ కీలక అంశాలపై ప్రతిష్టంభన

‣ ఉపాధికి ఊతం.. ఎఫ్‌డీఐలు!

‣ విద్యుత్‌ వాహనాలదే నవ శకం

‣ స్థిరాస్తి కొనుగోలుదారులకు రక్షాకవచం

Posted Date: 02-07-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం