• facebook
  • whatsapp
  • telegram

ఉపాధికి ఊతం.. ఎఫ్‌డీఐలు!

పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలకు అవసరమైన మూలధనం వివిధ రూపాల్లో సమకూరుతుంది. వీటన్నింటిలోకీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకే అధిక ప్రాధాన్యం. దశాబ్ద కాలంలో తొలిసారిగా 2022-23లో దేశంలోకి విదేశీ పెట్టుబడుల రాక మందగించినట్లు ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఒక దేశానికి చెందిన సంస్థలు శాశ్వత ప్రయోజనాలను కాంక్షించి మరో దేశానికి చెందిన సంస్థలకు మూలధనాన్ని సమకూరుస్తాయి. ఇలాంటి మదుపునే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ)గా పిలుస్తారు. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులవల్ల గత పదేళ్లలోనే తొలిసారిగా భారత్‌కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహంలో కోతపడింది. రిజర్వ్‌ బ్యాంక్‌ గణాంకాల ప్రకారం, 2021-22లో స్థూల ఎఫ్‌డీఐల విలువ రూ.6.68లక్షల కోట్లు. 2022-23లో అది రూ.5.85లక్షల కోట్లకు తగ్గింది. ప్రపంచ ఆర్థికం బలహీనపడటం, కొవిడ్‌-19 లాక్‌డౌన్ల కారణంగా అంకుర సంస్థలు తీవ్ర ఒడుదొడుకులకు గురికావడం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో కోతకు ప్రధాన కారణాలుగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అంకుర సంస్థల్లోకే..

భారత్‌కు వచ్చిన ఎఫ్‌డీఐలలో సింహభాగం అంకుర సంస్థల్లోకి పెట్టుబడుల రూపంలో వచ్చినవే. అమెరికాతో పాటు ఐరోపా దేశాలకు చెందిన పెట్టుబడిదారులు నష్టభయం కారణంగా మన అంకుర సంస్థల్లో మదుపు చేసేందుకు వెనకాడుతున్నారు. ఈ పరిణామం- పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావంతో కొట్టుమిట్టాడుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు తాజా ప్రమాద ఘంటిక. దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రస్తుతం ఆర్థిక మాంద్యం వంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎఫ్‌డీఐల్లో తగ్గుదల కారణంగా ఈ పరిస్థితులు మరింత సమస్యాత్మకంగా మారవచ్చు. దీన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు తక్షణం చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. ఎఫ్‌డీఐలను ప్రోత్సహించేందుకు అవకాశమున్న రక్షణ, నిర్మాణ, చిల్లర వ్యాపారం వంటి రంగాల్లో సంస్థాగత మార్పులు అనివార్యం. విదేశీ పెట్టుబడులు దేశ సాంకేతిక పురోగతికి, వివిధ రంగాల్లో ఉద్యోగ కల్పనకు ఇతోధికంగా తోడ్పడతాయి. ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ’ తాజా గణాంకాల ప్రకారం- భారత్‌లో నిరుద్యోగిత రేటు ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి 8.11శాతంగా ఉంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పెంచుకోవడం ద్వారా ఈ సమస్యను నియంత్రించవచ్చు.

విదేశీ పెట్టుబడులు తగ్గడం రూపాయి పతనానికి దారితీస్తుంది. పర్యవసానంగా విదేశ మారకద్రవ్య నిల్వలు గణనీయంగా తగ్గి, కరెంటు ఖాతాలో లోటు ఏర్పడుతుంది. దేశంలో ద్రవ్య సరఫరా మందగించి వడ్డీ రేట్లు ఎగబాకుతాయి. ఇది పెట్టుబడులు మరింతగా కుంచించుకుపోవడానికి దారితీస్తుంది. వెరసి, దేశ ఆర్థికాభివృద్ధి కుంటువడుతుంది. ఈ ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే- ప్రభుత్వ యంత్రాంగం అలసత్వాన్ని వదిలించుకుని, దేశంలో వ్యాపార కార్యకలాపాలను జోరెత్తించేలా పటిష్ఠమైన పారదర్శక వాతావరణాన్ని సృష్టించాలి. అప్పుడే, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఇండియా గణనీయంగా ఆకర్షించగలుగుతుంది. ఆర్థిక పునరుజ్జీవానికి, సుస్థిరాభివృద్ధికి దారులు తెరచుకుంటాయి.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన భారత్‌లో తయారీ, ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం వంటివి ఎఫ్‌డీఐలను ఆకట్టుకోగలిగాయి. అయితే, దేశాన్ని ప్రపంచస్థాయి ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. ముఖ్యంగా సులభతర వాణిజ్య విధానాలను ప్రోత్సహించాలి. పరిశ్రమలకు చట్టపరంగా ఎదురవుతున్న అడ్డంకులను తొలగించాలి. ఎలెక్ట్రానిక్స్‌ వంటి రంగాల్లో సుంకాలను తగ్గించాలి. భారత్‌ కొన్ని సంవత్సరాలుగా పలు కీలక రంగాల్లో సుంకాలను నిరంతరం పెంచుతూ వస్తోంది. ఇలా చేయడం- ప్రపంచ విదేశీ పెట్టుబడుల మార్కెట్‌లో దేశ భాగస్వామ్యాన్ని నిరోధిస్తుంది. 1992లో స్థూల దేశీయోత్పత్తిలో  0.1శాతంగా ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నేడు 2.41 శాతానికి చేరుకున్నాయి. ఎఫ్‌డీఐలను ఆకర్షించడంలో చైనా మొదటి స్థానంలో, ఇండియా మూడో స్థానంలో నిలిచాయి. ఇతర దేశాలతో పోటీపడి విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకట్టుకోవడానికి స్థిరంగా కొనసాగే తక్కువ టారిఫ్‌ విధానం ఎంతో కీలకం.

రాష్ట్రాలూ సహకరించాలి..

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకట్టుకోవడానికి కేంద్రం స్థాయిలో బలమైన మద్దతు లభిస్తున్నప్పటికీ, రాష్ట్రాల స్థాయిలో వైరుధ్యాలు నెలకొన్నాయి. ఏప్రిల్‌ 2018- జూన్‌ 2021 మధ్య కొన్ని రాష్ట్రాలకు వచ్చిన విదేశీ పెట్టుబడుల ప్రవాహంలో స్పష్టమైన తేడాలున్నాయి. మహారాష్ట్ర, దిల్లీలు ఎఫ్‌డీఐలను అధికంగా ఆకర్షించాయి. దేశంలోకి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడుల్లో సగం ఈ రెండు రాష్ట్రాలకే వచ్చాయి. తమిళనాడు, కర్ణాటక, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌ వంటివి ఓ మోస్తరుగానే ఈ నిధులను ఆకర్షించగలిగాయి. పశ్చిమ్‌ బెంగాల్‌, ఒడిశాల్లోకి వీటి రాక అత్యల్పం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను విజయవంతంగా ఒడిసిపట్టడం ఒక్క కేంద్ర ప్రభుత్వంతోనే కుదరదు. ఇందుకు రాష్ట్రాల సహకారమూ ఎంతో అవసరం.

మూడు దశల్లో రూపాంతరం..

భారత్‌లో నేడున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం మూడు కీలక దశలను దాటి వచ్చింది.

* స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్‌ వారి దోపిడి విధానాల కారణంగా విదేశీ మూలధనం పట్ల భారత ప్రభుత్వంలో భయం,అపనమ్మకం ఉండేవి. అందుకే 1948-75 మధ్య దిగుమతులకు దేశీయంగా ప్రత్యామ్నాయాలను వెతకడానికి, విదేశీ పెట్టుబడులను నిరోధించడానికి ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. ఆ దిశగా గుత్తాధిపత్యం, నిర్బంధ వాణిజ్య విధానాల చట్టం-1969, బ్యాంకుల జాతీయీకరణ, విదేశ మారకద్రవ్య నియంత్రణ చట్టం-1973 వంటివి తీసుకొచ్చింది. ఈ చట్ట నిబంధనల కారణంగా, దేశంలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం అవసరమైన స్థాయిలో లేదు.

* 1975-91 కాలంలో కొన్ని ఎంపిక చేసిన రంగాల్లోనే విదేశీ పెట్టుబడులను అనుమతించింది. 1980 మొదట్లో చమురు ధరల పెంపు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ప్రగతి మందగించింది. నాటి రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం విదేశీ పెట్టుబడుల ఆవశ్యకతను గుర్తించింది. కొన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులను అనుమతించేందుకు నిబంధనలను సరళతరం చేసింది. దాంతో ఎఫ్‌డీఐ విధానంలో మార్పు మొదలైంది.

* 1990లో తీవ్ర ఆర్థిక సవాళ్లు ఎదురయ్యాయి. వాటిని ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం 1991లో నూతన ఆర్థిక విధానాలకు నాంది పలికింది. ఇందులో భాగంగా అధిక సాంకేతికత, పెట్టుబడి ప్రాధాన్యం కలిగిన పరిశ్రమల జాబితాను ప్రకటించింది. వాటిలో 51శాతం వరకు విదేశీ పెట్టుబడులను అనుమతించింది. అనంతరం ఈ పరిమితిని 74శాతానికి, 100 శాతానికి పెంచింది.

- డాక్టర్‌ దొగ్గ సత్యనారాయణమూర్తి

(రాజస్థాన్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులు)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ విద్యుత్‌ వాహనాలదే నవ శకం

‣ స్థిరాస్తి కొనుగోలుదారులకు రక్షాకవచం

‣ సరిహద్దుల్లో కీలక గ్రామాలు

‣ ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం

‣ ప్రపంచానికి కొత్త ముప్పు

‣ ఆన్‌లైన్‌ వాణిజ్యంలో సర్కారీ సేవలు

Posted Date: 21-06-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

ఆర్థిక రంగం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం