• facebook
  • whatsapp
  • telegram

ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం

అభివృద్ధి పేరిట జరుగుతున్న మానవ కార్యకలాపాలు వాతావరణ వైపరీత్యాలకు దారితీస్తున్నాయి. పారిశ్రామిక విప్లవం ముందునాళ్లతో పోలిస్తే రాబోయే అయిదేళ్లలో భూ ఉష్ణోగ్రత 1.5 సెల్సియస్‌ డిగ్రీల మేర పెరగవచ్చని ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ హెచ్చరించింది. వాతావరణ మార్పుల ఫలితంగా పలు దేశాలు ఇప్పటికే ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ విపరిణామాన్ని గుర్తుచేస్తూ ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ నేడు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం నిర్వహిస్తోంది.

ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా వాతావరణంలో అనేక ప్రతికూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఏ దేశానికి ఆ దేశం స్వప్రయోజనాలకే పట్టం కట్టడం, వనరుల కోసం పోటీపడటం, భద్రత పేరిట యుద్ధాలకు దిగడం- పరిస్థితిని మరింత విషమింపజేస్తున్నాయి. వాతావరణ మార్పుల కారణంగా నిరుడు ఐరోపా, అమెరికా, చైనాల్లోని నదులు ఎండిపోయాయి. స్పెయిన్‌, మొరాకో దేశాల్లో కూరగాయల ఎగుమతి దెబ్బతినడంతో బ్రిటిష్‌ సూపర్‌ మార్కెట్లు వెలవెలపోయాయి. ఈ ఏడాదీ అదే దుస్థితి నెలకొంది!

ప్రపంచ ఆర్థికానికి దెబ్బ

భూతాపం పెరుగుతున్న కొద్దీ ఎల్‌నినో పరిస్థితులు తీవ్రతరమై వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తులు దెబ్బతింటాయి. ఎల్‌నినో వల్ల ప్రపంచ ఆర్థికానికి 1982-83లో 4.1లక్షల కోట్ల డాలర్లు, 1997-98లో  5.7లక్షల కోట్ల డాలర్ల మేరకు నష్టం సంభవించింది. ఈ ఏడాది ఎల్‌నినో కలిగించే నష్టం మూడు లక్షల కోట్ల డాలర్లు (సుమారు రూ.248 లక్షల కోట్లు)గా ఉంటుందని అంచనా. భూతాపాన్ని కట్టడి చేయకపోతే 21వ శతాబ్దిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 84లక్షల కోట్ల డాలర్ల నష్టాన్ని చవిచూడవలసి వస్తుందని అమెరికా వాతావరణ పరిశోధకులు హెచ్చరించారు. వాతావరణ మార్పులకు తోడు ఉక్రెయిన్‌ యుద్ధం తెచ్చిపెట్టిన ఎరువుల కొరత ఆహారోత్పత్తిని దెబ్బతీస్తోంది. దేశాల వద్దనున్న ఎరువుల నిల్వలు 2022లో ఆహారోత్పత్తి విపరీతంగా పడిపోకుండా ఆపినా 2023లో పరిస్థితి వేరుగా ఉండబోతోంది. పంటల దిగుబడిని పెంచేందుకు నత్రజని, ఫాస్ఫరస్‌, పొటాసియం అవసరం. ముఖ్యంగా వరి పంటకు ఫాస్ఫరస్‌ చాలా అవసరం. 2021 వరకు ప్రపంచ ఫాస్ఫేట్‌ అవసరాల్లో 30శాతాన్ని చైనాయే తీరుస్తూ వచ్చింది. స్వదేశంలో పెరిగిన బియ్యం ధరలను తగ్గించడానికి 2021లో ఫాస్పేట్‌ ఎగుమతులపై చైనా పరిమితులు విధించింది. దాంతో అంతర్జాతీయ విపణిలో ఫాస్పరస్‌కు కొరత ఏర్పడింది.

ఆఫ్రికన్‌ స్వైన్‌ఫ్లూ వల్ల చైనాలో పందులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నాయి. పంది మాంసం కొరత వల్ల బియ్యం వాడకం మరింత పెరుగుతుంది. వరి ఉత్పత్తిని పెంచడానికే చైనా ఫాస్ఫేట్‌ ఎగుమతులను సగానికి సగం తగ్గించింది. ప్రపంచంలో అతిపెద్ద బియ్యం ఎగుమతిదారైన భారతదేశం ఫాస్ఫేట్‌ దిగుమతుల్లో రెండో స్థానం ఆక్రమిస్తోంది. చైనా నుంచి దిగుమతులు తగ్గిపోవడంతో భారత్‌ మొరాకో నుంచి 17లక్షల టన్నుల ఫాస్ఫేట్‌ దిగుమతికి ఒప్పందం కుదుర్చుకొంది. ప్రపంచ ఫాస్ఫేట్‌ నిక్షేపాల్లో 70శాతం మొరాకోలోనే ఉన్నాయి. చైనా నుంచి ఎగుమతులు నిలిచిపోవడంతో ప్రపంచ విపణిలో ఫాస్ఫేట్‌ ధరలు పెరగడం ఖాయం. ఫాస్ఫరస్‌కు కొరత ఏర్పడితే- భారత్‌లో వరి దిగుబడి కోసుకుపోయి బియ్యం ధరలు ఎగబాకుతాయి. ప్రపంచంలో సగం జనాభాకు బియ్యమే ప్రధాన ఆహారం. ఫాస్ఫేట్‌ కొరతతో ఇండియా నుంచి బియ్యం ఎగుమతులు మందగించి మిగతా ప్రపంచానికి ఆహార సంక్షోభం ఎదురుకానున్నది. నిరుడు జలప్రళయం వల్ల పాకిస్థాన్‌లోనూ వరి పంట దెబ్బతినడం బియ్యం కొరతను తీవ్రం చేయనుంది.

ప్రపంచంలో అతిపెద్ద ఎరువుల ఎగుమతిదారు రష్యాయే. అమోనియా, యూరియా, ఫాస్ఫేట్‌, నత్రజని ఎరువులను ఆ దేశం ఎగుమతి చేస్తోంది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా, ఈయూ దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించి, స్విఫ్ట్‌ యంత్రాంగం నుంచి ఆ దేశాన్ని వెలివేశాయి. దాంతో ఎరువుల ఎగుమతికి రష్యా డాలర్లలో చెల్లింపులు స్వీకరించలేని పరిస్థితి ఏర్పడింది. రష్యా నుంచి నౌకల ద్వారా ఎరువుల రవాణాకు బీమా కల్పించేందుకు ఇన్సూరెన్స్‌ కంపెనీలు తిరస్కరిస్తున్నాయి. ఐరోపా దేశాల గుండా సాగే రష్యా ఎరువుల రవాణా మార్గాలూ మూతపడిపోయాయి. రసాయన ఎరువుల ఉత్పత్తికి చమురు, సహజ వాయువులే ముడి సరకులు. రష్యా చమురు, గ్యాస్‌ ఎగుమతులపై ఆర్థిక ఆంక్షలవల్ల ఐరోపా దేశాల్లో ఎరువుల ఉత్పత్తి తగ్గిపోయి ప్రపంచ విపణిలో వాటి ధరలు చుక్కలను తాకుతున్నాయి. 2020 మే- 2022 డిసెంబరు మధ్య ఎరువుల ధరలు 199శాతం పెరిగాయి. ప్రపంచం ఎరువుల కోసం కొన్ని దేశాలపైనే ఆధారపడాల్సి రావడం కొరతకు, ధరల పెరుగుదలకు దారితీస్తోంది. ఐరోపా, బ్రిటన్‌లలో కూరగాయల కొరతకు కారణమిదే.

పేద దేశాల్లో ఆకలి కేకలు..

అమెరికా, చైనా, రష్యా వంటి ప్రధాన రాజ్యాల మధ్య పెరుగుతున్న రాజకీయ వైరం ప్రపంచీకరణకు నెమ్మదిగా తెరదించుతూ ఆహార సంక్షోభాన్ని కొనితెస్తోంది. సంపన్న పాశ్చాత్య దేశాలు ఎక్కువ ధర పోసి ఆహార ధాన్యాలు, కూరగాయలను కొనుగోలు చేస్తున్నాయి. ఆఫ్రికా, ఆగ్నేయాసియా, దక్షిణ అమెరికాల్లోని పేద దేశాలకు ఆ స్థోమత లేదు. దాంతో ఆ దేశాల్లో 2023లో ఆకలి కేకలు మార్మోగనున్నాయి. శ్రీలంక, ఘనాల్లో ఏర్పడిన ఆహార కొరతే దీనికి ఉదాహరణ. ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) ప్రకారం ప్రపంచంలో ఇప్పటికే 82.8 కోట్ల మంది క్షుద్బాధతో అల్లాడుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది 49 దేశాల్లో కరవుకాటకాలు ఏర్పడవచ్చని డబ్ల్యూఎఫ్‌పీ హెచ్చరించింది. అనేక ప్రపంచ దేశాలు కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారీగా నిధులు వెచ్చించి అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఎరువులు, ఆహార ధరలు పెరిగిన నేపథ్యంలో వాటి దిగుమతికి చెల్లింపులు జరపలేని దుస్థితిలోకి జారిపోయాయి. అనివార్యంగా వచ్చిపడనున్న ఆహార కొరతను దీటుగా ఎదుర్కోవడానికి ప్రపంచం కలిసికట్టుగా ముందుకు సాగాలి.

దిగుబడుల్లో కోత

వాతావరణ మార్పులు, ఎరువుల కొరత కారణంగా ఈ ఏడాది పలు దేశాల్లో పంటల దిగుబడులు తగ్గిపోనున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా మొక్కజొన్న ఉత్పత్తి చేసే దేశాల్లో ఉక్రెయిన్‌ ఒకటి. యుద్ధంవల్ల అక్కడ దీని సాగు విస్తీర్ణం కుంచించుకుపోయింది. దాంతో అమెరికాకు ఎగుమతులు తగ్గి మొక్క  జొన్న చిప్స్‌, సలాడ్‌ డ్రెస్సింగ్స్‌, కార్న్‌ సిరప్‌ ఉత్పత్తులు క్షీణిస్తాయి. మొత్తం గోధుమ ఉత్పత్తిలో 20శాతం రష్యా, ఉక్రెయిన్‌లలోనే జరుగుతోంది. యుద్ధం గోధుమ ఎగుమతులను దెబ్బతీసి రొట్టెల లభ్యతకు కోతపెడుతోంది. పొద్దుతిరుగుడు నూనె ఎగుమతుల్లో ఉక్రెయిన్‌ వాటా 47శాతం. మరోవైపు ఇండొనేసియా పామాయిల్‌ ఎగుమతులను నిలిపేసింది. వర్షాభావం కారణంగా ఇతర దేశాల్లో కెనోలా, సోయాబీన్‌ నూనెల దిగుబడులు తగ్గిపోయాయి. పర్యవసానంగా సమీప భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా వంట నూనెల కొరత తీవ్రం కానుంది.

- వరప్రసాద్‌
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రపంచానికి కొత్త ముప్పు

‣ ఆన్‌లైన్‌ వాణిజ్యంలో సర్కారీ సేవలు

‣ పర్యావరణానికి ప్లాస్టిక్‌ కాటు

‣ రూపాయి అంతర్జాతీయీకరణ

‣ పప్పులే నిప్పులైన వేళ..

‣ సత్వర ఉపాధికి డిప్లొమా మార్గం

‣ టీహెచ్‌డీసీఐఎల్‌లో 181 జూనియర్‌ ఇంజినీర్‌ కొలువులు

Posted Date: 17-06-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

అంతర్జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం