• facebook
  • whatsapp
  • telegram

ప్రపంచానికి కొత్త ముప్పు

భూతాపానికి తోడు ప్రపంచానికి పెను సవాలుగా భావిస్తున్న మరో కొత్త సమస్య వెలుగుచూసింది. భూ ఉపరితలం నెమ్మదిగా భూమిలోకి కుంగిపోతున్నట్లు అమెరికా జియలాజికల్‌ సర్వే పరిశోధనలో వెల్లడైంది.  పట్టణీకరణ విస్తృతమవుతున్న నేపథ్యంలో ఈ సమస్య తీవ్రమవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు   శరవేగంగా విస్తరిస్తున్నాయి. మహా నగరాల్లోని ఇళ్లు, అపార్టుమెంట్ల స్థానంలో ఆకాశహర్మ్యాలు వెలుస్తున్నాయి. ఇలాంటి నిర్మాణాలతో పాటు వాహనాలు, అధిక జనాభా వంటి అనేక కారణాలతో భూ ఉపరితలంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ కారణంగానే పలు ప్రాంతాలు భూమిలోకి కుంగిపోతున్నట్లు అమెరికా జియలాజికల్‌ సర్వే తాజా పరిశోధన వెల్లడించింది. న్యూయార్క్‌లోని కొన్ని ప్రాంతాల్లో భూమి కుంగుతున్నట్లు హెచ్చరించింది.

న్యూయార్క్‌ నగరంలోని భూ ఉపరితలంలో ప్రధానంగా షిస్ట్‌, పాలరాయి, గ్రానైట్‌ వంటి రకాలకు చెందిన రాళ్లు ఉన్నాయి. వీటిలో మొదటి రెండు రకాలు చాలా బలహీనమైనవి. ఎక్కువ ప్రాంతాల్లో ఇవే విస్తరించి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. గ్రానైట్‌ చాలా దృఢమైనదే అయినా, వీటి విస్తీర్ణం తక్కువ. ప్రస్తుతం ఈ నగరంలో పది లక్షలకుపైగా భవంతులు నిర్మితమయ్యాయి. వీటి కోసం వినియోగించిన కాంక్రీటు, లోహాల బరువు సుమారు 17లక్షల కోట్ల టన్నులు. దీనికితోడు అక్కడి జనాభా దాదాపు 80 లక్షలు. వెరసి ఈ బరువంతా బలహీనమైన రాతి పొరలమీద తీవ్ర ఒత్తిడిని కలిగించి భూమి లోపలకు కుంగడానికి దారితీసింది. న్యూయార్క్‌ నగరం ఏటా 1-2 మిల్లీ మీటర్ల చొప్పున భూమిలోకి కుంగిపోతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. చేతి పంపును కొట్టినప్పుడు భూమిలోని నీటి పొరలపై ఒత్తిడి పెరిగి నీరు పైకి వస్తుంది. అదే మాదిరిగా భూఉపరితలం కుంగిపోయిన చోట్ల భూమి లోపలి పొరల్లోంచి నీరు పైకి వస్తుంది. ఈ రెండు ప్రక్రియలు ఎక్కడైనా సమాంతరంగానే జరుగుతాయి. న్యూయార్క్‌లోని మాన్‌హాటన్‌, బ్రూక్లిన్‌, క్వీన్స్‌ తదితర ప్రాంతాలకు తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. సగటున ఇవి సముద్ర మట్టానికి 1-2 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. భూమి కుంగిపోవడం వల్ల ఈ ప్రాంతాలు కాలక్రమంలో సముద్ర జలాల్లో మునిగిపోయే ప్రమాదముంది.

భూ ఉపరితలం లోపలకు కుదించుకుపోవడమన్నది సహజంగా జరిగే ప్రక్రియ. ఈ కుదింపు రేటు ఒక్కోచోట ఒక్కోలా ఉంటుంది. నేల మృదుత్వం, రాళ్ల కాఠిన్యత, బరువును మోయగల సామర్థ్యం వంటి అనేక అంశాలు కుదింపు రేటును నిర్ణయిస్తాయి. మట్టి అధికంగా నీటితో తడిసి ఉండే ప్రాంతాల్లో నిర్మించే భవంతులు సులభంగా భూమిలోకి కుంగిపోతాయి. షిస్ట్‌, సిల్ట్‌ వంటి రాళ్లు పెళుసుగా, చాలా బలహీనంగా ఉంటాయి. ఇవి విస్తరించి ఉన్న ప్రాంతాల్లో కట్టడాలు, జనాభా బరువుకు భూమి సులభంగా కుంగిపోతుంది. ఇసుకరాయి, సున్నపురాయి, పాలరాయి వంటివి పెళుసుగా ఉంటాయి. భవనాల నిర్మాణంతో ఇవి ఉండే ప్రదేశాలు సైతం వేగంగా భూమిలోకి కుంగిపోతాయి. అదే గ్రానైట్‌, బసాల్ట్‌ రకాల రాళ్లు ఉండే ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టినా, వాటి బరువు ప్రభావం భూమిలోపలి పొరలపై అంతగా ఉండదు.

అమెరికా జియలాజికల్‌ సర్వే చేపట్టిన పరిశోధన ముమ్మాటికీ ప్రపంచానికి ఒక హెచ్చరికే! భూమి కుంగిపోవడమన్నది ఒక్క న్యూయార్క్‌ నగరానికే పరిమితం కాదు. దీన్ని ప్రపంచ సమస్యగానే భావించాలి. నిశితంగా పరిశీలిస్తే ప్రతిచోటా ఈ సమస్య కనిపిస్తుంది. నిర్మాణ రంగం శరవేగంగా పుంజుకొంటున్న మన దేశంలోనూ ఇలాంటి పరిశోధనలు చేపట్టాల్సిన అవసరముంది. ముఖ్యంగా స్థిరాస్తి రంగం పుంజుకొంటున్న వివిధ నగరాలు, పట్టణాల్లో భూమి కుంగుతోందా అన్నది శాస్త్రీయంగా పరిశీలించి, యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టాలి. భారీ భవంతులను నిర్మించడానికి ముందే ఆయా చోట్ల భూమిలోపలి రాళ్ల స్థితిగతులను శాస్త్రీయంగా విశ్లేషించాలి. ఇలాంటి సర్వేల ఆధారంగా పట్టణ ప్రణాళికలను, పటాలను తయారు చేసుకోవాలి. తద్వారా ఏయే ప్రాంతాలు భారీ భవంతుల నిర్మాణానికి అనువుగా ఉంటాయన్నది స్పష్టంగా తెలుస్తుంది. భూమిలోపల గట్టి రాళ్లు ఉన్నప్పటికీ, ఒకేచోట నిలువుగా భారీ భవంతులను నిర్మించడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. పట్టణ ప్రణాళికలు వికేంద్రీకరణ దిశగా ఉండాలే తప్ప, ఒకేచోట కేంద్రీకరించి ఉండకూడదు. లేనిపక్షంలో భవిష్యత్తులో భూఉపరితలం కుంగి, ముంపు సమస్య తలెత్తుతుంది.

- ఆచార్య నందిపాటి సుబ్బారావు

(ఆంధ్ర విశ్వవిద్యాలయ భూవిజ్ఞాన శాస్త్ర విశ్రాంత ఆచార్యులు)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఆన్‌లైన్‌ వాణిజ్యంలో సర్కారీ సేవలు

‣ పర్యావరణానికి ప్లాస్టిక్‌ కాటు

‣ రూపాయి అంతర్జాతీయీకరణ

‣ పప్పులే నిప్పులైన వేళ..

‣ సత్వర ఉపాధికి డిప్లొమా మార్గం

‣ టీహెచ్‌డీసీఐఎల్‌లో 181 జూనియర్‌ ఇంజినీర్‌ కొలువులు

Posted Date: 17-06-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

పర్యావరణం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం