• facebook
  • whatsapp
  • telegram

విద్యుత్‌ వాహనాలదే నవ శకం

విద్యుత్‌ వాహనాల(ఈవీల) వినియోగం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది. ఈవీల విక్రయాలను పెంచేందుకే కేంద్రం కొన్నాళ్లుగా వాటి కొనుగోళ్లపై రాయితీలను అందిస్తోంది. అయితే, ఇటీవల విద్యుత్‌ ద్విచక్ర వాహనాలపై సబ్సిడీలను తగ్గించింది. దీనివల్ల వాటి అమ్మకాలు ప్రభావితమవుతాయా?

భారత్‌లో విద్యుత్‌ వాహనాల (ఈవీల) వినియోగాన్ని ఇతోధికం చేసేందుకు కేంద్రం ఫేమ్‌-2 పథకాన్ని తెచ్చింది. అందులో భాగంగా ఈవీల కొనుగోళ్లపై రాయితీలను అందించాలని నిర్ణయించారు. విద్యుత్‌ ద్విచక్ర(ఈ2డబ్ల్యూ) వాహనాలపై ఆ సబ్సిడీలను తగ్గిస్తూ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ ఏడాది జూన్‌ ఒకటి, ఆ తరవాత రిజిస్టరయ్యే ఈ2డబ్ల్యూ వాహనాలకు ఇది వర్తిస్తుంది. ఒక కిలోవాట్‌ అవర్‌ (కేడబ్ల్యూహెచ్‌) బ్యాటరీ సామర్థ్యంగల విద్యుత్‌ ద్విచక్ర వాహనానికి రూ.15,000 చొప్పున ఇస్తున్న సబ్సిడీని రూ.10,000కు తగ్గించారు. ఇప్పటిదాకా వాటి ఎక్స్‌ ఫ్యాక్టరీ ధరలో 40శాతాన్ని రాయితీగా ఇచ్చేవారు. దాన్ని 15శాతానికి తగ్గించారు. ఫలితంగా విద్యుత్‌ ద్విచక్ర వాహనాల ధరలు రూ.10,000 నుంచి రూ.40,000 దాకా పెరగనున్నాయి. ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం గల వాహనాల ధరలు మరింత అధికమవుతాయి.

మొదట్లో తగ్గినా..

భారత్‌లో గతంలో తక్కువ వేగంతో నడిచే ఎలెక్ట్రిక్‌ స్కూటర్ల కొనుగోళ్లే అధికంగా ఉండేవి. ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం కలిగిన విద్యుత్‌ ద్విచక్ర వాహనాల విక్రయాలను పెంచడానికి కేంద్రం ఫేమ్‌-2 పథకాన్ని తీసుకొచ్చింది. 2019 ఏప్రిల్‌ నుంచి మూడేళ్ల దాకా అమలులో ఉండేలా ఆ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ తరవాత దాన్ని 2024 మార్చి 31 వరకు పొడిగించారు. ఫేమ్‌-2 పథకానికి రూ.10,000 కోట్లు కేటాయించారు. మొత్తం 10 లక్షల ఎలెక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు, అయిదు లక్షల త్రిచక్ర వాహనాలు, 55,000 కార్లు, 7,000 విద్యుత్‌ బస్సులకు ఈ నిధుల నుంచి ప్రోత్సాహకాలు అందిస్తారు. వాటిలో రూ.2,000 కోట్లను ఎలెక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలపై రాయితీకి కేటాయించారు. దేశీయంగా ఇప్పటిదాకా 5.63 లక్షల ఎలెక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలకు రాయితీలు అందించినట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ పోర్టల్‌ తెలుపుతోంది. 2024 మార్చి 31 నాటికి ఫేమ్‌-2 నిర్దేశించిన ప్రకారం 10 లక్షల విద్యుత్‌ వాహనాలకు రాయితీలు ఇస్తామని కేంద్రం హామీ ఇస్తోంది.

భారత్‌లో అత్యధిక నెలవారీ ఎలెక్ట్రిక్‌ ద్విచక్ర వాహన రిజిస్ట్రేషన్లు (1,04,920) ఈ ఏడాది మే నెలలో జరిగాయి. ఇది అంతకు ముందు నెలకన్నా 63శాతం ఎక్కువ. ప్రభుత్వం సబ్సిడీలను తగ్గించబోతోందని గ్రహించి మే నెలలో ఎక్కువ మంది విద్యుత్‌ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేశారు. ఇండియాలో పండుగ సీజనులో ఎలెక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలను కొనాలని ఆశించినవారు కేంద్రం నిర్ణయంతో ఆశాభంగానికి లోనవుతారు. దీనివల్ల రాబోయే నెలల్లో రిజిస్ట్రేషన్లు తగ్గే అవకాశం ఉంది. అయితే, ఆ పై మళ్ళీ విక్రయాలు పుంజుకొంటాయి. ఎలెక్ట్రిక్‌ వాహనాల విక్రయాలను పెంచడానికి మొదట్లో రాయితీలు ఇచ్చి, వాటి అమ్మకాలు గరిష్ఠ స్థాయికి పెరిగిన తరవాత వాటిని తగ్గించి క్రమంగా సబ్సిడీలను ఎత్తివేయడం ఇతర దేశాల్లోనూ కనిపిస్తోంది. చైనా 2018 నుంచి ఈవీలకు సబ్సిడీలను తగ్గిస్తూ వచ్చి 2023లో పూర్తిగా తొలగించింది. దానివల్ల మొదట్లో అమ్మకాలు తగ్గినా, రెండు మూడు నెలల్లో మళ్ళీ పెరిగాయి. సబ్సిడీల తగ్గింపు తరవాత భారతీయ మార్కెట్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంటుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

నవీకరణ కీలకం

ప్రస్తుతం పెట్రోలు ధరలు మండిపోతున్నాయి. వాయు కాలుష్య నియంత్రణకు ఈవీలు ఎంతగానో తోడ్పడతాయన్న అవగాహన ప్రజల్లో పెరిగింది. నేడు సరికొత్త ఈ2డబ్ల్యూ మోడళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఆహారం, కిరాణా సరకుల బట్వాడా సేవలకు, బైక్‌ ట్యాక్సీలకు ఎలెక్ట్రిక్‌ ద్విచక్ర వాహన వినియోగం అధికమైంది. వీటన్నింటి వల్లా రాబోయే కాలంలో ఈ2డబ్ల్యూలకు గిరాకీ పెరిగే అవకాశం ఉంది. సబ్సిడీలు తగ్గినా వాహన విక్రయాలు దిగిరాకూడదంటే ఉత్పత్తిదారులు నవీకరణకు ప్రాధాన్యమివ్వాలి. వినియోగదారులు వెచ్చించే ధరకు మించిన ప్రయోజనాలను అందించే ఈవీలను అందుబాటులోకి తేవాలి. తక్కువ ధరకే వాటిని అందించేలా బ్యాటరీలు, ఇతర సాంకేతికతలపై విస్తృతంగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. తయారీదారులు నూతన మోడళ్లపై దృష్టి సారించాలి. వాటికి ప్రభుత్వం నుంచి సత్వర అనుమతి లభించేలా కృషి చేయాలి. సరఫరా పరమైన ఆలస్యాలను నివారించి సకాలంలో వాహనాన్ని అందించడమూ మరో కీలకమైన అంశం. ముఖ్యంగా సాధారణ మోటారు వాహనాలతో పోటీ పడగలిగేలా ఎలెక్ట్రిక్‌ వాహనాలను రూపొందించాలి. బ్యాటరీల మన్నిక, భద్రత, ఉత్తమ పని తీరుపై ప్రజల్లో విశ్వాసం నింపాలి. చార్జింగ్‌ కేంద్రాల పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించడమూ తప్పనిసరి. 

- ప్రదీప్‌ కరుటూరి

(విద్యుత్తు వాహన రంగ నిపుణులు)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ స్థిరాస్తి కొనుగోలుదారులకు రక్షాకవచం

‣ సరిహద్దుల్లో కీలక గ్రామాలు

‣ ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం

‣ ప్రపంచానికి కొత్త ముప్పు

‣ ఆన్‌లైన్‌ వాణిజ్యంలో సర్కారీ సేవలు

Posted Date: 21-06-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

సైన్స్ & టెక్నాలజీ

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం