• facebook
  • whatsapp
  • telegram

సరిహద్దుల్లో కీలక గ్రామాలు

దేశ రక్షణలో సరిహద్దుల పాత్ర ఎనలేనిది. ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురవుతూ అభివృద్ధికి దూరంగా ఉండే సరిహద్దు గ్రామాలు సహజంగానే శత్రువుల చొరబాట్లకు, అక్రమ రవాణాకు, సమాచార చేరవేతకు నెలవులు అవుతాయి. చైనావైపు సరిహద్దుల్లోని అలాంటి 2,967 గ్రామాల సమగ్రాభివృద్ధికి భారత్‌ నడుం బిగించింది. ఇందుకు ప్రత్యేకంగా ‘వైబ్రంట్‌ విలేజెస్‌ ప్రోగ్రామ్‌’ను ఇటీవల చేపట్టింది.

భారత్‌-చైనా సరిహద్దులోని తూర్పు లద్దాఖ్‌లో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఉభయ దేశాల సైనికులు మోహరించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్‌ప్రదేశ్‌ తనదేనంటూ డ్రాగన్‌ వితండ వాదనకు దిగుతోంది. అక్కడి ప్రాంతాల పేర్లను మారుస్తూ వివాదాలకు తెర తీస్తోంది. విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న ఆ దేశం సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక, సైనిక వసతుల కల్పనకు పెద్దయెత్తున నిధులు గుమ్మరిస్తోంది. ఆక్రమిత అక్సాయ్‌చిన్‌లో చైనా సైన్యం భారీగా నిర్మాణాలు చేపడుతున్నట్లు బ్రిటన్‌కు చెందిన రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ అఫైర్స్‌ తాజాగా వెల్లడించింది. సైనికుల మోహరింపునకు వీలుగా అక్కడ రహదారుల విస్తరణ, అవుట్‌పోస్టుల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొంది. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు భారత్‌ దౌత్య మార్గాల్లో ప్రయత్నిస్తున్నా- చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేయడం ద్వారా డ్రాగన్‌ దూకుడుకు ముకుతాడు వేయవచ్చని ఇండియా బలంగా విశ్వసిస్తోంది.

వసతులకు దూరంగా..

లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతంతో పాటు హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు చైనాతో సరిహద్దును పంచుకుంటున్నాయి. వీటి పరిధిలోని మొత్తం 19 జిల్లాల్లో సరిహద్దుల వెంబడి 2,967 గ్రామాలు ఉన్నాయి. స్వాతంత్య్రం తరవాత విద్య, వైద్యం, పరిశ్రమలు, సాంకేతికత వంటి ఎన్నో అంశాల్లో దేశం గణనీయమైన పురోగతి సాధించింది. అయినప్పటికీ, ఈ ఫలాలేవీ సరిహద్దు గ్రామాలకు అందలేదు. చైనాతో ఘర్షణల నేపథ్యంలో సరిహద్దు గ్రామాల స్థితిగతులమీద పార్లమెంటరీ స్థాయీ సంఘం అధ్యయనం చేసింది. తీవ్ర వెనకబాటుతనం, నిరక్షరాస్యత, మౌలిక వసతుల లేమి తాండవిస్తున్న సరిహద్దు గ్రామాల దీనావస్థను ఆ సంఘం 2018 నాటి నివేదికలో కళ్లకు కట్టింది. ఆ చేదు వాస్తవాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం- సరిహద్దు గ్రామాల సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని మొదటిసారిగా 2022 బడ్జెట్‌లో ప్రస్తావించింది. తదనుగుణంగా రూపుదిద్దుకొన్న ‘వైబ్రంట్‌ విలేజెస్‌ ప్రోగ్రామ్‌(వీవీపీ)’ను పట్టాలెక్కించేందుకు రూ.4,800 కోట్లు ప్రత్యేకిస్తూ కేంద్ర మంత్రివర్గం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది. సరిహద్దు ప్రాంత అభివృద్ధి కార్యక్రమ(బీఏడీపీ) నిధులకు ఇవి అదనం. వీటితో తొలిదశలో 662 సరిహద్దు గ్రామాలను ప్రాధాన్య క్రమంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లోని కిబితూ గ్రామంలో వీవీపీ పనులను ప్రారంభించారు. తొలిదశలో భాగంగా సుమారు 1.42లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమాలు చేపడతారు. వీవీపీకి కేటాయించిన నిధుల్లో రూ.2,500కోట్లను రహదారుల నిర్మాణానికి వెచ్చిస్తారు. ఇప్పటికే లద్దాఖ్‌-హిమాచల్‌ ప్రదేశ్‌లను కలిపే 4.1 కిలోమీటర్ల పొడవైన షింకులా సొరంగ మార్గ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. మిగతా నిధులతో ‘హబ్‌ అండ్‌ స్పోక్‌’ నమూనాలో (హైదరాబాద్‌, దాని చుట్టూ రింగు రోడ్డుపై అనేక కూడళ్లు ఉన్నట్లుగా) అభివృద్ధికి బాటలు పరుస్తారు. ముఖ్యంగా యువత, మహిళలకు వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తారు. ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంతో పాటు స్థానిక సహజ వనరులతో ఉత్పత్తుల తయారీ చేపట్టేలా తోడ్పాటు అందిస్తారు. సరిహద్దు ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాచుర్యం కల్పించడం ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహిస్తారు. తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగై వలసలకు అడ్డుకట్ట పడుతుంది.

ఇంటింటికీ పథకాలు

వైబ్రంట్‌ విలేజెస్‌ ప్రోగ్రామ్‌ కింద ‘ఒక గ్రామం-ఒక ఉత్పత్తి’కి తోడ్పాటు అందించాలని లక్షించారు. స్వచ్ఛంద, సహకార సంస్థలూ స్వయం సహాయక బృందాల ఆధ్వర్యాన సరిహద్దు గ్రామాల్లో పర్యావరణహితకర విధానాల్లో పంటలను సాగు చేయాలని యోచించారు. ఈ ఉత్పత్తులకు విశేష ప్రాచుర్యం, మార్కెట్‌ వసతి కల్పిస్తారంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ఇంటింటికి చేరవేస్తామంటున్నారు. ఇందుకు ప్రణాళికలు రూపొందించి, అమలు చేయాల్సిన బాధ్యత ఆయా జిల్లా యంత్రాంగాలదే. సరిహద్దు గ్రామాలకు నిరంతర విద్యుత్‌, వంట గ్యాస్‌, ఇంటర్నెట్‌ వంటి సదుపాయాలను చేరువ చేయాలని కేంద్రం సంకల్పించింది. అక్కడి ప్రజలకు మెరుగైన చదువులు, నాణ్యమైన వైద్యసేవలు, ఆరోగ్య బీమా అందించనున్నారు. ఇవన్నీ సాకారమైతే- దేశాభివృద్ధిలో సరిహద్దు గ్రామాలూ మమేకమవుతాయి.

- తమ్మిశెట్టి రఘుబాబు
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం

‣ ప్రపంచానికి కొత్త ముప్పు

‣ ఆన్‌లైన్‌ వాణిజ్యంలో సర్కారీ సేవలు

‣ పర్యావరణానికి ప్లాస్టిక్‌ కాటు

‣ రూపాయి అంతర్జాతీయీకరణ

‣ పప్పులే నిప్పులైన వేళ..

‣ అసంబద్ధ విధానాలతో వ్యర్థాల మేట

Posted Date: 17-06-2023



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం