• facebook
  • whatsapp
  • telegram

పౌరస్వేచ్ఛకు సంకెళ్లు



భారత్‌లో నేటికీ బ్రిటిష్‌ హయాంనాటి నేర శిక్షాస్మృతి అమలవుతోంది. ఇది నేరాలను నిర్వచించి, వాటికి శిక్షలు నిర్దేశిస్తుంది. న్యాయస్థానాల్లో నేర నిరూపణకు అనుసరించాల్సిన పద్ధతిని 1973 నాటి క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ) విశదీకరిస్తుంది. కేంద్రం వీటి స్థానంలో భారత న్యాయ సంహిత-2023, నాగరిక సురక్ష సంహిత-2023లను ఈ ఏడాది జులై 1 నుంచి అమలుపరచనుంది.


భారతీయ నేర శిక్షాస్మృతి ప్రకారం నేరాలను వాటి తీవ్రత, స్వభావాన్ని బట్టి నాలుగు రకాలుగా వర్గీకరించారు. అవి: 1) న్యాయస్థానాల నుంచి ఎటువంటి అనుమతి లేకుండానే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్టు చేయదగ్గవి (కాగ్నిజబుల్‌), 2) న్యాయస్థానాల అనుమతితోనే నేరస్థుడిని అరెస్టు చేయదగ్గవి (నాన్‌-కాగ్నిజబుల్‌), 3) బెయిల్‌కు అర్హమైనవి, 4 బెయిల్‌కు అనర్హమైనవి. కాగ్నిజబుల్‌, నాన్‌-బెయిలబుల్‌ నేరాలు తీవ్రమైనవి కాబట్టి, ఈ కేసుల్లో పోలీసులు న్యాయస్థానాల నుంచి అనుమతి తీసుకోకుండానే నిందితులను అరెస్టు చేయడం కుదరదు. సహజ న్యాయసూత్రాల ప్రకారం, నేరం రుజువయ్యేవరకు నిందితులను నేరస్థులుగా పరిగణించకూడదు.


బెయిల్‌ ఇలా..

నేరం నిరూపణ అయ్యేవరకు కొన్ని షరతులతో నిందితులను నిర్బంధం నుంచి విడిచిపెట్టడాన్ని బెయిల్‌ అంటారు. బెయిలబుల్‌ కేసుల్లో పోలీసు అధికారే నిందితులకు బెయిల్‌ ఇవ్వవచ్చు. దీన్నే స్టేషన్‌ బెయిల్‌ అంటారు. 2009 వరకు ఆరోపణలు రాగానే నిందితులను అరెస్టుచేసే అధికారాలు పోలీసులకు ఉండేవి. కొందరు వాటిని దుర్వినియోగంచేసి చిన్నపాటి నేరాలకు సైతం అరెస్టులు చేసేవారు. స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌ వర్సెస్‌ బాల్‌చంద్‌ కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ కృష్ణ అయ్యర్‌ తీర్పిస్తూ- వ్యక్తి స్వేచ్ఛకు ప్రాధాన్యమివ్వాలని, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే నిందితులను కారాగారానికి పంపాలని వ్యాఖ్యానించారు. సర్వోన్నత న్యాయస్థానం పలు కేసుల్లో ఇటువంటి తీర్పులే వెలువరించినా పోలీసులు, దిగువ న్యాయస్థానాలు సరిగ్గా పాటించలేదు. అందుకు ప్రధాన కారణం- క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీఆర్‌పీసీ)లోని 41వ నిబంధన. దాంతో న్యాయ కమిషన్‌- ఏడేళ్లు, అంతకంటే తక్కువకాలం శిక్ష పడే నేరాల్లో అత్యవసరమైతే తప్ప నిందితులను అరెస్టు చేయకుండా సెక్షన్‌-41కి సవరణలు చేపట్టాలని 2001లో సూచించింది. తదనుగుణంగా 2009లో సవరణలు చేపట్టారు. అయినాసరే, కొన్ని కింది కోర్టులు ఈ బెయిలు నియమాన్ని సరిగ్గా పాటించడంలేదు. పోలీసులు, విచారణాధికారులు అడగ్గానే నిందితులకు పోలీసు కస్టడీ, న్యాయ నిర్బంధం (జ్యుడీషియల్‌ కస్టడీ) విధిస్తున్నాయి. ఇటీవల గుజరాత్‌లో జరిగిన అఖిల భారత జిల్లా న్యాయమూర్తుల సదస్సులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. నిందితులకు బెయిల్‌ నిరాకరించడమంటే వ్యక్తిస్వేచ్ఛను హరించడమేనని వ్యాఖ్యానించారు. మరణశిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశమున్న కేసుల్లో 90రోజులు, ఇతర కేసుల్లో 60రోజులు దాటిన తరవాత కూడా పోలీసులు విచారణ పూర్తిచేసి, ఛార్జిషీట్‌ దాఖలు చేయకపోతే- నిర్బంధంలో ఉన్న నిందితులకు ‘డిఫాల్ట్‌ బెయిల్‌’ వర్తిస్తుంది. రీతూ చాబ్రియా వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో- ఇది చట్టపరమైన హక్కుతో పాటు ప్రాథమిక హక్కు కూడా అని సుప్రీం స్పష్టీకరించింది. అయితే, ఆర్థిక నేరాలకు ఈ నిబంధన వర్తించదని నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం-2022 చెబుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న దిల్లీ మద్యం కుంభకోణంలో నిందితులు ఈ చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.


కొత్త చట్టంలో సరళీకరణ..

ఒక వ్యక్తిని అనవసరంగా అరెస్టు చేసి, బాధపెట్టి, అవహేళనకు గురిచేయకుండా ఉండటానికి ‘ముందస్తు బెయిల్‌’ అవసరమని లా కమిషన్‌ 1969లో సిఫారసు చేసింది. పార్లమెంటు దానిపై సమీక్షించి సీఆర్‌పీసీ-1973లోని 438వ నిబంధన కింద ముందస్తు బెయిల్‌ను ప్రవేశపెట్టింది. నూతన చట్టంలో దాన్ని సెక్షన్‌-482గా పేర్కొన్నారు. నేర తీవ్రత, నిందితుడి నేరచరిత్ర, ముందస్తు బెయిల్‌ ఇస్తే నిందితుడు తప్పించుకుపోయే అవకాశం వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని హైకోర్టు, జిల్లా న్యాయస్థానం ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడం పరిపాటి. నూతన చట్టంలో కోర్టులు వాటిని పరిగణనలోకి తీసుకోవాలని చెప్పలేదు. సీఆర్‌పీసీ-1973 సెక్షన్‌ 438(1) ప్రకారం, కోర్టులు ముందస్తు బెయిల్‌ అభ్యర్థనను తోసిపుచ్చితే- పోలీసు అధికారి ఎటువంటి అనుమతి లేకుండానే నిందితుడిని అరెస్టు చేయవచ్చు. భారతీయ నాగరిక సురక్ష సంహిత-2023 మాత్రం ఇటువంటి అధికారాన్ని పోలీసులకు ఇవ్వలేదు. ముందస్తు బెయిల్‌పై విచారణ సందర్భంగా నిందితుడిని తప్పనిసరిగా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచాలి. ఈ షరతు నూతన చట్టంలో లేదు. కాబట్టి ముందస్తు బెయిల్‌ నిబంధనలను నూతన చట్టంలో కొంతవరకు సరళీకరించారనే భావించాలి!


- హరీశ్‌ కొలిచాల (న్యాయ నిపుణులు)
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం ... మీ కోసం!

‣ దేశ ఆర్థికానికి వెన్నుదన్ను

‣ మన ఎన్నికలపై డ్రాగన్‌ కుతంత్రాలు

‣ ఆయువు తోడేస్తున్న వాయువు

‣ బంగ్లాలో ప్రబలుతున్న భారత్‌ వ్యతిరేకత

Posted Date: 15-04-2024



గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 

జాతీయం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 

విద్యా ఉద్యోగ సమాచారం